Vijayagopal's Home Page

33 -Part III

Home
Audio - Ag Univ Lecture
Biodata
My Accomplishments
Telugu Science Primer
Books Published
My story
Telugu Articles - 1
Telugu Articles - 2
Telugu Stories and Articles-3
Marana Tarangam - A collection of Stories
Childrens stories
Poetry
English Collection
Translated Telugu Stories
Kahlil Gibran
Points to ponder Archives
Book Reviews
Science
TV Progs., Scripts

This is the third instalment of the work.
Interestingly this part alone was published in Andhra Prabha, Weekly because of an elderly friend!
He considered this as poetry!

33 మూడవ భాగం
 

నేనెవరిని?

 నన్నుసిద్ధం చేసిన ప్రజలనే కాదంటున్న నేనెవరిని?

 నా శరీరంలో దాగి ఉన్న నామెదడు నా కన్నా మోసకారి!

 ఈ మెదడుతో ఎదురు పడడం సాధ్యం కాకుండా ఉంది!

 నేనాలోచించేది ఏదీ నాకు పట్టిలేదు, ఆలోచనలన్నీ అరువు తెచ్చుకున్నవే, నన్ను కదిలించిన సంగతుల గురించి, నన్ను కదిలించని సంగతులను గురించీ, ఆలోచించలేకుండా ఉన్నాను -------

నేనాలోచిస్తున్నాను

రాజకీయంగా సాంఘికంగా ఇంకోరకంగా మరో రకంగా ----

అప్పుడప్పుడు అర్థం లేకుండా ----

అయినా నా ఈ ఆటకు, ఎప్పుడో రాసి పెట్టిన రూల్సున్నాయి

నేను రూల్సు మార్చినా , ఆటమాత్రం మార్చదలుచుకోను,

 

నేను

ఊహలూ ఉద్రేకాల పుట్టను

చరిత్ర మిగుళ్లు తిని బలిసిన నేను,

ప్రేరణలూ, పూరణల కట్టను,

ఒకకాలు ఆటవికయుగంలో, ఇంకోకాలు అంతులేని నాగరికతాపథంలో,

 

నేను నిర్భేద్యుణ్ణి,

సమస్త సామగ్రి కలబోసి చేసిన మాయబొమ్మని

నేను నిశ్శబ్దాన్ని,

ఈ మత్తులో నన్ను నేను చిత్తుచేసుకోవాలనీ,

ఈమత్తులో నా ఆశలగుత్తులను ఎత్తుగా పేర్చుకోవాలనుకుంటూ నేనీ,

          కాలమంతా వృథా చేశానుగదా,

ఏనాడో మాత్రమే, శృతిలో కొన్ని స్వరాలు పలికిన,

ఈనాడు మాత్రం పనికిరాక మూలపడిన,

వాయిద్యాన్నా నేను

ఆనాటి శృతుల్లో అక్షరాలను

నా సంతకాన్ని వెతుక్కుంటున్నాను,

 

నా సంతకం ఎవరికి కావాలి నా సంతకం

మెరుపు మెరిసి మొక్కలు ముక్కలయినాయి,

మనుషులంటే పిచ్చెత్తి, మధ్యలోకి విరిచేసింది,

మిడతలదండు పొలాలను మింగేసింది,

వరదలు కొండలనుకూడా ముంచేశాయి,

భూకంపాలింకా ఆగనేలేదు,

ఇవి నా సంతకాలు

ఇవే నా సంతకాలు

 

నేను

ఈ పుస్తకాల్లో, ఈ కథల్లో, ఈ కావ్యాల్లో, ఈ పత్రికల్లో, ఈ ప్రసంగాల్లో, మునిగి ఉండకపోతే

ఈ సమాచార ప్రపంచంలో కరిగి ఉండకపోతే,

అనామకుణ్ణి అయ్యుండే వాణ్ణా?

అస్తవ్యస్తమైన అక్షరాలలాగ మిగిలి ఉండేవాణ్ణా?

అప్పుడే బాగుండేదేమో

ఇంకేదయినా మంచి ఆలోచనన్నా వచ్చి ఉండేది,

నా కళ్లకు నా చెవులకు నేనర్హుణ్ణి

నా ఊహలు మాత్రం, ఈ ఏటి పక్క కొంగలూ, రాత్రిపూట దొంగలూ, ఆకలిగొన్న సివంగులూ, నా ఎదనే రహదారిగా వస్తున్న -----

 

నా ఊహలు మాత్రం- నావే నేననర్హుణ్ణే ---

 

తమ అత్యుత్తమ మేధస్సులను, ఆలోచనల కరుకు నోట్లను,

నమ్మేవాళ్లను పిలవాలనుంది,

అమ్మేవాళ్లను అదిలించాలని ఉంది,

నమ్మండి బాబూ

మీరు నమ్ముకున్న ఈ చిల్లర నాణాలు,

ఈనాడు చెల్లవు

మీకింకా తెలియనే తెలియదు పాపం

మీ బొమ్మలనూ, మీ బొరుసులనూ, ఫూడ్ ఫర్ ఆల్, పులిబొమ్మలతో సహా తిరిగి తీసుకోండి

జేబుల్లో దాచుకోండి

ఆ మాయలన్నీ, మీ మాయలన్నీ, ఆనాడే అయిపోయినయి,

ఒప్పుకోండి తాతలొదిలిన దేశంలో అరువు తెచ్చుకున్న దృశ్యాల్లో, అడుక్కొచ్చుకున్న బొమ్మల్లో బతుకుతున్నామనీ,

వీటన్నిటికీ మీరు వెల చెల్లిస్తే,

మీ ప్రాణాలతో

ఆవలి గట్టున ఆ మైదానం ఆ రహదారీ అన్నీ వదిలేసి మీ మార్గాన

ఊహా గమ్యంనుండి ఊహా గమ్యానికి అంతులేని ప్రయాణం

అప్పుడర్థమవుతుంది.

 

నీడలాంటి నిద్ర

రెక్కలొచ్చి అగాధంలోంచి ఆకాశానికి ఎగిరిపోయి

ఒక మనిషి ఇంకొకణ్ణి కరవకపోతే

అరవకుండా వదిలేస్తే -----

తన అరవయి ఆరు చేతులతో పక్కవాణ్ణి పట్టేయకపోతే

ఓ మానవతా ----

అదుగో అంతంత దూరం ----

అసింటా ---- అంతంత దూరం ---

నేను ఛస్తా నిన్ను చంపుతా ---

నన్ను నేనే చంపుకుంటా ----

ప్లీజ్! అసింటా! అంతంత దూరం ----

 

నాకు కోపం ఆదీలేని అంతంలేని కోపం

అనాటి హిమయుగంనాటి నా కోపం

ఈనాటి హిమయుగానికి ఎదురొడ్డి ----

ఈ యుగం అంతమైతే --- అందరూ అన్నట్లు ----నమ్మినవాళ్లు

నమ్మనవాళ్లు --- శాస్త్రజ్ఞుడూ , స్వామివారూ ----అందరూ అన్నట్లు ---

ఈ యుగం అంతమైతే ---

ఇప్పుడే ఎందుకు కాకూడదు?

ఈ చలనం ఆగకముందే

ఆ జ్వలనం సాగకముందే

తుదితీర్పు రాకముందే

ఇప్పుడే ఎందుకు ఆగకూడదు?

అభ్యంతరం ఉంటుందా ఎవరికైనా?

 

 

ఇంకా ఉంది

The last part

Go to the last part