Vijayagopal's Home Page

Taram - Tamam

Home
Audio - Ag Univ Lecture
Biodata
My Accomplishments
Telugu Science Primer
Books Published
My story
Telugu Articles - 1
Telugu Articles - 2
Telugu Stories and Articles-3
Marana Tarangam - A collection of Stories
Childrens stories
Poetry
English Collection
Translated Telugu Stories
Kahlil Gibran
Points to ponder Archives
Book Reviews
Science
TV Progs., Scripts

On comparision 

తరం - తమం

గుడ్, బెటర్, బెస్ట్ అని ఇంగిలీషులో మూడు మాటలున్నాయి. తెలుగులో చెప్పుకోవాలంటే, బాగు, మరోదానికంటే బాగు, అన్నిటికంటే బాగు అనుకోవాలి. మనకు అంటే మనుషులకు  ప్రతి విషయంలో అన్నిటికంటే బాగుగా ఉండాలని , అనిపించుకోవాలని బాధ.  అది నరకానికయినా  సరే అందరికంటే ముందు చేరుకోవాలి. దొంగతనమూ, అన్యాయమూ సర్వోత్తమ పద్ధతిలో చేయాలి.  ఇక మంచి పనులు బాగా, అందరి కంటే బాగా చేయాలనుకోవడం సామాన్యం, అత్యంత సామాన్యం. మరోలా చెప్పాలంటే సామాన్యం, సామాన్యతరం, సామాన్యతమం! తరతమ బేధం తెలియదు, తారతమ్యం తెలియదు అని అంటూ ఉంటారు.  అంటే తేడా తెలియలేదని అర్ధం. సుఖతరం అంటే మరో దాని కంటే సుఖకరమని, సుఖతమం అంటే అన్నింటికంటే సుఖకరమని అర్ధం. తారతమ్యం తెలియదంటే ఉత్తమానికి, దానికిందమెట్టుకూ తేడా తెలియదని అర్ధం.  ఉత్తమం అనే మాటలో తమం ఉంది. అంటే అన్నింటికంటే ` ఉద్' ఉన్నతమయిందని అర్ధం! ఈ ఉత్తమానికి చేరుకోవాలనే ప్రయత్నం కారణంగానే ఈ ప్రపంచంలో పోటీలు మొదలయినయి.

హర్షవర్ధన్ నవాతే అనే యువకుడు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు సరిగా చెప్పి కోటి రూపాయలు గెలుచుకున్నాడు.  తెలివిని పణంగా పెట్టి ఇంత ఎత్తున, ఇంతత్వరగా, ఇంత సులభంగా పైసా సంపాయించిన వారు లేరు. అంటే అందులో అతను బెస్ట్. తమం! అలాగని ఈ భారతంబను అఖండ భూమండలములో  అతని కన్నా తెలివిగలవారు లేరని  అర్ధమా! అన్నది అసలు ప్రశ్న! ఎంత మాత్రము కాదని ఆ ప్రశ్నకు జవాబు. ఆ ఆటలో , ఆ నాడు పాల్గొన్న  వారిలో  మిగతా వారి కంటే, ఆయన తెలివయిన మనిషి. అందరికంటే కొన్ని  సంగతులు ఎక్కువగా తెలిసిన మనిషి హర్షవర్ధనుడు. అసలా ప్రోగ్రాంలో మరొకరికి కోటి రూపాయలు రానేలేదు. ప్రశ్నలడిగే వారికి జవాబులు చెప్పేవారు ఎప్పుడూ లోకువే! అందునా క్విజ్లో  ప్రశ్నలు అడిగే వారు తమ తెలివి ఆధారంగా   ఆప్రశ్నలను అడిగే ప్రసక్తి లేదు. అంతకు ముందురోజు వరకు ఆ పృచ్ఛకునికీ ఆ ప్రశ్న, దాని జవాబు తెలిసి ఉండక పోవచ్చు.

 

 రకరకాల  పరీక్షలు జరుగుతుంటాయి. ఉదాహరణకు మహా ఘనత వహించిన మన రాష్ట్ర ప్రభుత్వము  వారు నిర్ణయించే  ఇంటర్మీడియేట్ పరీక్ష ఒకటి. ఆడుతూ, పాడుతూ హాయిగా చదువుకోవలసిన ఆ తరగతులను `క్రూషియల్ పీరియడ్గా ' మార్చి ` ఎయిమ్'లు సాధించడానికి పిల్లలను  తరుముతున్నారు. ఈపరిస్థితి చూస్తే జాతరలో ఎద్దులు బండలు లాగే పోటీ గుర్తుకు వస్తుంది.  అక్కడిదాకా ఆప్యాయంగా లారీలో  ఎక్కించుకు వచ్చిన కోడెను బండ కట్టిన తర్వాత `బాదే'' తీరును చూస్తే  అమానుషం అనిపిస్తుంది.  అది మరి పోటీ లక్షణం. మరొకరి కంటే గొప్ప, అందరి కంటే గొప్ప అనిపించుకోవడంలో  అమాయకపు పశువుకు ఆనందం లేదు గానీ, దాని స్వంతదారుకు  మాత్రం అదే జీవిత లక్ష్యం. ఇంటర్మీడియేట్ పరీక్షలనే  బండలు లాగే కోడెదూడలకు  రెండు అంచెలుంటాయి.  ఒకటి బోర్డు పరీక్ష. రెండవది ఎంసెట్. వింత ఏమిటంటే మొదటి పరీక్షను  జేగీయమానంగా గెలిచిన  పిల్లలను పత్రికల వారూ, టీవీలవారు ఆకాశానికి ఎత్తుతారు. అంటే ఆ సంవత్సరానికి వారే బృహస్పతులుగా లెక్క. కానీ విచిత్రంగా  ఈ బృహస్పతులు ఎంసెట్లో మాత్రం చతికిలబడతారు.  ఆఫలితాలు వచ్చిన తర్వాత  మరో బృహస్పతుల బృందం తయారవుతుంది.  ఇంతకూ ఈ రెండు బృందాలలో ఎవరు అందరికంటే తెలివగలవారు? తేల్చుకోవలసిన ప్రశ్న ఇది! ఎంసెట్లో ఎన్నో ర్యాంకు వచ్చినా దొరికేది ఒక సీటే! ఆ తర్వాత చాలా దూరంలో  నిలబడిన వారూ అదే తరగతిలో వచ్చి చదువుకుంటారు.  చదువు కొన దలుచుకున్న వారికి, నిజానికి ర్యాంకులతో పని లేదు. బ్యాంకులుంటే చాలు. ఇక్కడి రెండు పరీక్షల్లోనూ బృహస్పతి ర్యాంకు సంపాయించుకున్న  వారు తరువాతి చదువుల్లో  ఎలా ఉంటున్నారని  ఎవరయినా  ఒక సర్వే చేయించాలి.  పోటీతో చదువు బాగుపడుతుంది.  కానీ ఆ పోటీకే పరిమితమయి  ప్రపంచాన్ని  పట్టించుకోకుండా ఉంటే, మంచి ఇంజనీర్లు మిగులుతారు గానీ, మంచి `మానవుల' తక్కువవుతారేమోనని భయం. ఆటలు, కళలు మిగతా జీవితానికి అవసరమయిన  అంశాలలోనూ ఇంత పోటీ ఉంటే బాగుండు!

 ఒలింపిక్స్ ఆటల పోటీల వారికి ఒక మోటో ఉంది. అందులో ఉంటే మూడు మాటలకు మరింత ఎత్తుకు, మరింత వేగంగా, మరింత బలంగా అనో లేక అటువంటి అర్ధమే వచ్చే మరొక మాటో అర్ధం! ఇక్కడి పోటీ కొంచెం విచిత్రంగా ఉంటుంది. వంద మీటర్ల పరుగు, లేగామారతాన్ పరుగు ఏదయినాసరే, అందుకు పట్టేకాలం రాను రాను తక్కువవుతున్నట్లు కనబడుతుంది. వెనుకటి ఒకరెవరో సాధించిన రికార్డు పేకమేడలా పడిపోతుంది. మరుసటిసారి  ఈ రికార్డు బద్దలవుతుంది. అంటే వెనుకటి పతకాలు గెలుచుకున్నవారు ఇప్పటి వారి కంటే తక్కువ రకం అనిపించే అవకాశం ఉంది. కానీ, అసలు సంగతి అది కానేకాదు. వెనుకటి ఆయనెవరో కాళ్ళకు జోళ్లు కూడా లేకుండా పరుగెత్తి పతకం సాధించాడట. ఇప్పుడు పతకాలకోసం వేసే పధకాలు ఆశ్చర్యం కలిగించేవిగా ఉంటున్నాయి.  పరిశోధనలు,  పరికరాలు, ప్రయత్నాలు మొదలయినవన్నీ  ఎప్పటికప్పుడు  పరిస్ధితిని మారుస్తుండే వరకు పాత రికార్డులు కూలిపోతున్నాయి. మందులూ మాకులూ తిని ఏమార్చే పద్ధతులు కూడా ప్రయత్నాలలో  భాగంగా ఉంటున్నాయి.  ఇక్కడ కూడా పోటీలో గెలిచిన వారు ` ఆసారికి పోటీ చేసిన వారిలో' అంటే కొందరి కంటే గొప్పవారు తప్పితే, అందరికంటే గొప్పవారు మాత్రం కానే కారు. కుక్క, మరో కౄరమృగం వెంటబడినప్పుడు లఘువు వేసిన మనిషి ఒలింపిక్స్  రికార్డ్ కన్నా వేగంగా దౌడాయించాడేమో! ఇక్కడ వేగం లెక్క గట్టే ఏర్పాటు లేదు గదా! అందుకనే తమ గురించి మాట్లాడడం అన్నిటికన్నా దండుగ. ఇంతకన్నా దండుగ పని ఇంకొకటి ఉంటే ఇదీ వీగిపోతుంది.

పోటీ కావాలి. రోజురోజుకు ప్రతి పనిని మరింత బాగా చేసే ప్రయత్నాలూ జరగాలి. అంటే పరిశోధనలూ, పద్ధతులూ, ప్రయత్నాలు, పరిస్థితులు ముందుకు, మరింత వేగంగా, మరింత బలంగా, మరింత బాగా సాగాలి. ఈ ప్రయత్నంలో అసలు పోటీ రూపమే మారి పోతున్నదని కూడా గమనించాలి. బాగు అనేది పద్ధతికా, ఫలితానికా? ఫలితం బాగుండి, పద్ధతి మాత్రం మారిపోతే అసలు విషయానికే మోసం వచ్చినట్లు కాదా?

 

 

Read my other articles also.