Vijayagopal's Home Page

Suryudu Maraniste?

Home
Audio - Ag Univ Lecture
Biodata
My Accomplishments
Telugu Science Primer
Books Published
My story
Telugu Articles - 1
Telugu Articles - 2
Telugu Stories and Articles-3
Marana Tarangam - A collection of Stories
Childrens stories
Poetry
English Collection
Translated Telugu Stories
Kahlil Gibran
Points to ponder Archives
Book Reviews
Science
TV Progs., Scripts

On the death of Sun!

సూర్యుడు మరణిస్తే....

 

భారతీయుల దృష్టిలో సూర్యుడంటే దేవుడు. ఏడు గుర్రాల రథం మీద ఆకాశవీధిలో అటూ ఇటూ తిరుగుతుంటాడు. దేవతలకు అంతం లేదు. మరణంలేదు. అయితే యథార్థంగా మనకు కనిపించే సూర్యునికి డు, ము, వులు చెల్లవు. అన్ని నక్షత్రాలలాగే  అదీ  ఒక నక్షత్రం. దాన్ని గౌరవంగా సూర్యగోళం అనిపిలవాలి. అప్పుడది ఆడ కాదు. మగకాదు. అచ్చం నక్షత్రం. కాబట్టి ఏదో ఒక నాడు మరణిస్తుంది. అప్పుడు ఒక ప్రశ్న పుడుతుంది. ``సూర్యుడు మరణిస్తే ఏమవుతందీ?'' అని.

మనం ఉన్నాం. భూమి ఉంది గనుక మనం ఉన్నాం. సూర్యుడున్నాడు గనుక భూమి ఉంది. ఒక దాని కొకటి ఆధారంగా ఏర్పడిన క్రమం ఇది. మూలం సూర్యుడు. మూలమేపోతే? అమ్మో! ఇంకేమయినా ఉందా?

 ఒక వేళ సూర్యుడు పోయినా? అదిప్పట్లో  జరిగేపనికాదు కాబట్టి మనం భయపడాల్సిన పనిలేదు. మనం ఉన్నాం. భూమి ఉంది గనుక మనం ఉన్నాం. భూమి మీద ఉండడానికి మనం ఉన్నాం. మనకిక్కడ పీల్చుకోవడానికి గాలి ఉంది. మరో చోటికి వెడితే గాలి ఉండదు. మనకు నీళ్లు కావాలి. అవి భూమి మీదనే ఉన్నాయి. మరోచోట లేవు. ఈ గాలీ, నీరూ లేకపోతే మనం ఎండుటాకుల్లా అల్లాడిపోతాం. కాబట్టి మనం ఈభూమ్మేదే ఉండాలి. దీన్ని  వదిలి మరో చోటికి పోకూడదు అంటాడో రచయిత.

  ఓ కథ ఉంది. ఇందులో మళ్ళీ దేవుడు వస్తాడు. మనిషిని తయారు చేసిన దేవుడు ఆ మనిషి తన బతుకు తీరు నిర్ణయించే అవకాశం ఇచ్చాడట. ఒక అరటి చెట్టునూ, చంద్రుడినీ చూపించాడట. అరటి చెట్టు పెరిగి పిలకలు వేస్తుంది. తాను మాత్రం చస్తుంది. చంద్రుడు, ఆచంద్రుడే పెరుగుతూ, తరుగుతూ ఉంటాడు.  ఈ రెంటిలో ఏ పద్ధతి కావాలి అన్నాడట. మనిషి అరటి చెట్టును ఎంచుకున్నాడు. అందుకే మరణిస్తున్నాడు. ఈలోగా  పిల్లల్ని కంటున్నాడు. సత్యం తెలిసినా చావంటే భయం మాత్రం పోలేదు. చీకటంటే భయం పోలేదు. మనజాతి, మన రూపం, వర్ధయా! అంటూ కలకాలం నిలబడాలని కోరిక. అరటి చెట్టు చావాలి. మనం మాత్రం చావకూడదు. అందుకే పిల్లల్ని కనాలి. ఆ పిల్లలు మళ్ళీ పిల్లల్ని కనాలి. పిలకల్ని నాటాలి చెట్లను పెంచాలి. అలా తామరతంపర సాగాలి. అయితే ఈ లోగా ఒక విషయం మరిచిపోయాం. భూమి పుట్టిననాడు మనుషులు లేరు.  అదున్నంతకాలం ఉంటారన్న నమ్మకం లేదు. భూమి చనిపోతుంది. ఇప్పటికే చనిపోతోంది అంటారు. పర్యావరణ వాదులు. సూర్యుడు బుడగలా పేలిపోతాడు. దీపంలా ఆరిపోతాడు. అప్పుడు భూమి పేలిపోతుంది. చిట్లిపోతుంది. ఇందాకా జరిగిన చరిత్రంతా ఆ క్షణాన సమసిపోతుంది.  రాజులుండరు. కథలుండవు. అసలింకేదీ ఉండదు. మనం ఉన్నాం. గతం గురించి ఆలోచిస్తున్నాం. మనం పోతాం. మనతో బాటు గతమూ పోతుంది. అదంతా మనతోబాటే గతంలో కలిసిపోతుంది. ఆ గతాన్ని మననం చేసుకోవడానికి మనుషులుండరు. అసలు గతమే ఉండదు.  వర్తమానం ఉంటేగా గతం? గతాన్ని మనం కాపాడుకోవాలి. వర్తమానం ఉండాలంటే గతమూ ఉండాలి. భూమి ఉండదు. అయినా మనం ఉండాలి. అంటే మరోచోటికి, గతంతో సహా పారిపోవాలి. అక్కడ వర్తమానం కట్టుకోవాలి.

మనకు చావంటే భయం. చీకటంటే భయం. ఈ రెండు భయాలు ఒక చోట కుదరవు. చావు వద్దంటే చీకటితో పోరాడాలి. తిమిరంతో సమరం. వేడితో తలపడాలి. చలిపులి కోరలు పట్టుకోవాలి. నీళ్లు లేకుండా బతకాలి. గాలి లేకుండా బతకాలి. మానవులం భూమిమీద! మరో గ్రహం మీద యానవులం, రానవులం కావాలి.  ఆగ్రహమూ చస్తే మరో గ్రహం మీద సానవులం, దానవులం కావాలి. అక్కడా తుదికొస్తే  మరో నక్షత్రం మీదకు దారితీయాలి. అంత జరిగే లోపల గతాన్నిమరిచి  పోతామేమో? సూర్యుడిని, ఇక్కడి వేడిని ఈ పుడమిని, ఈపచ్చదనాన్ని మరిచిపోతామేమో, మన వెచ్చదనాన్నీ, మనమంచితనాన్నీ పోగొట్టుకోవాలి! పురుగులవుతాం, బరుగులవుతాం, నిప్పులవుతాం. మంచుకుప్పలవుతాం, ఏదయితేనేం. మనజాతి నిలబడుతుంది. అదేగా        కావలసింది. అయితే గతం మాత్రం మరిచి పోకూడదు. మనం చేసిందీ, చూచిందీ అంతా గుర్తుండాలి. మననం చేసుకోగలిగిందంతా ఉండాలి.  రాజులుండాలి. కవులుండాలి. కథలుండాలి. మన గతం, మనగతులు, మనగంతులు అన్నీ ఉండాలి. అదుగో అప్పుడే ఈ  జీవం కొనసాగినట్లు లెక్క! అరటి చెట్టు పోతుంది. ఒక సారెప్పుడో పిలకలు మిగల్చకుండా పోతుంది.  అలాగని అది మరో రూపాన్ని, మరోపద్ధతిని ఆశ్రయించదు. ఉన్నంతకాలం పచ్చగా ఉంటుంది.

భూమి పుట్టిననాడు మానవుల్లేరు. సూర్యుడు భూమి పోయే నాటికి మనుషులుంటారనే గ్యారంటీలేదు.  ఉన్నంతకాలం పచ్చగా గౌరవంగా ఉంటే చాలదూ?

 

 

 

Ypur opinion please!