ప్రీతీష్
నందీ కథ
తిరిగి
రాలేదు
‘ఏమండీ! మీకు
ఫోను!’
జయశ్రీ రోడ్డుదాటి ఆ
చిన్న మెడికల్ షాపులోకి
వెళ్లింది.
‘హలో!’
‘మీ తమ్ముడింట్లో
ఉన్నాడా?’
‘లేడు’
‘ఎక్కడ దొరుకుతాడో
ఏమయినా తెలుసా?’
‘ఏమోనండీ. మీరెవరో
చెపితే వాడు రాగానే కలుసుకొమ్మంటాను.’
‘అతను ఇంట్లోంచి
ఎప్పుడు వెళ్లాడు?’
‘మీరెవరండీ?’
‘ఓ ఫ్రెండునిలే! అవునూ.
అర్జున్ ఎప్పటినుంచి
ఇంట్లో లేడు?’
జయశ్రీ కాస్త జంకింది.
‘ఏమో! తెలియదండీ!’
‘మీ తమ్ముడు ఎప్పుడు
వెళ్లాడో నీకు తెలవదు!’
‘ఉహూ’ ఆమె నెమ్మదిగా
రిసీవర్ పెట్టేసింది.
ఫోను వెంబడే మళ్లీ మోగింది.
జయశ్రీ తిరిగి ఫోను తీసింది.
హలో మళ్లీ అదే గొంతు.
ఫోను పెట్టేసి జయశ్రీ
యింటికి వెళ్లి పోయింది.
ఏమిటో విచిత్రమయిన ఫోన్లు,
మనుషులూనూ. నిజానికి
అర్జున్ పనులన్నీ విచిత్రంగానే
ఉంటాయి. వాడి ఫ్రెండ్స్.
వారాలపాటు మాయమవడాలు,
తిరిగొచ్చింతర్వాత ప్రశ్నలకు
వాడి నిశ్శబ్ద సమాధానాలూ.
అందుకని వాణ్ణెవరూ పట్టించుకోవడమే
మానేశారు.
“జయా!”
“ఏంటమ్మా?”
“ఎవరూ--- అర్జున్
ఫోన్ చేశాడా?”
“కాదమ్మా!”
గదిలో పాలిపోయిన పసుపురంగు
గోడలు చాలా చోట్ల పెచ్చులూడిపోయి
ఉన్నాయి. గోడమాద అటు టాగోర్
ది ఇటు రామకృష్ణుడిది
ఫోటోలున్నాయి. ఒక బల్బు
గదిలోని చీకటిని పారదోలడానికి
ప్రయత్నాలు చేస్తున్నది.
అసలప్పుడు ఉదయం తొమ్మిది
గంటలవుతోంది. ఆ గదిలోకి
వెలుతురు ఇంకెక్కడినుంచీ
రావడం లేదు. గోడలకు మరకలు,
బయటికి కనిపిస్తున్న
ఇటుకలు, వంటింట్లో చుట్టుకున్న
పొగ, గదిలో ఈ మూలనుంచి
ఆ మూలకు కట్టిన తాటిపై
వేలాడుతున్న గుడ్డలు.
“మరెవరే?”
“ఏమోనమ్మా!”
ఓ మారు తలెత్తి కూతురు
వైపు ప్రశ్నార్థకంగా
చూచి మళ్లీ నేల తుడవడంలో
మునిగిపోయింది అమ్మ.
“వీడెప్పుడొస్తాడో....” మాట మధ్యలోనే ఆగిపోయింది.
పెద్దావిడ తనపని మానలేదు.
జయశ్రీ జడవేసుకోవడం మొదలు
పెట్టింది.
ఆ అమ్మాయికి ఇరవై నాలుగేళ్లున్నాయి.
నలుపు. సాధారణమయిన అందం.
సాదా నూలుచీర కట్టుకుంది.
టేబుల్ ముందు కూచుని
అద్దంలో చూస్తూ జడ అల్లుకుంటోంది.
ఆ టేబులే తమ్ముడికి రైటింగ్
టేబుల్ కూడానూ.
నలిగిపోయిన పాత హ్యాండ్
బ్యాగొకటి టేబుల్ పైన
ఉంది.
త్వరగా వెళ్లాలి. లేడీస్
స్పెషల్ వచ్చే టైమయింది.
తలుపు మీద నెమ్మదిగా
తట్టిన చప్పుడు.
మాటలాగి పోయినయి. యిద్దరూ
ముఖాలు చూచుకున్నారు.
జయశ్రీ త్వరగా నడిచి
వెళ్లి తలుపు తీసింది.
ఎవరో ఇద్దరు మనుషులు.
ఒకాయన భారీ శరీరం. కాస్త
నెమ్మదస్తుడుగా ఉన్నాడు.
యింకొకాయన కాస్త పెద్ద
మనిషి. యిద్దరూ తెలిసిన
వాళ్లు కారు. సందు మొదట్లో
పాత జీపొకటి నిలబడుంది.
“వీరేంద్ర ఇల్లు
ఇదేనా?”
“అవును”
“ఉన్నాడా ఆయన
ఇంట్లో?”
“ఆయనకు కొన్ని
సంవత్సరాలుగా ఒంట్లో
బాగుండడం లేదు.”
“మేం లోపలికి
రావచ్చా?”
“యింటిలో ఎవరూ
లేరండీ. నేనేమో వెళ్లి
పోతున్నాను. అమ్మ పనిలో
ఉంది.”
“నీతోనే మాట్లాడాలి.”
“నాతోనా!” ఆశ్చర్యంగా
అడిగింది తను. ఎవరు వీళ్లు?
“రెండు నిమిషాలు
మాత్రమేనమ్మా” పెద్దాయన
చిరు నవ్వుతూ అన్నాడు.
ఆయన గొంతులో ఏదో ప్రశాంతత.
దర్జా--- ఏదో ఒక రకమైన బాధ
కూడా ధ్వనిస్తుంది.
సంకోచిస్తూనే వెనక్కు
జరిగి తలుపు పూర్తిగా
తెరిచింది.
“ఎవరే?”
“వీళ్లెవరో నాతో
మాట్లాడతారటమ్మా”
“ఏమిటటా?”
“ఏమో?”
వాళ్లు లోపలికి వచ్చేశారు.
ఉన్న ఒకే కుర్చీలో ఒకాయన
కూచున్నాడు. యింకొకతను
మంచం మీద కూచున్నాడు.
“మేము అర్జున్
కోసం చూస్తున్నాం!” పెద్దాయన
అన్నాడు.
“వాడింటిలో లేడండీ!”
“ఎక్కడికెళ్లాడూ?” యింకొకతని ప్రశ్న. ఆ
చిరునవ్వులో ఏదో అర్థం
తోచింది జయశ్రీకి చూచాయగా.
“నాకు తెలవదండీ - నేను వెళ్లాలండీ
టైమైపోతోందీ.....”.
పెద్దావిడ వంటింటి తలుపు
దగ్గర నిలబడి ఉంది.
“తను మాక్కావాలి.
అర్జంటు పని ఉంది.”
“ఏ! ఏదన్నా జరిగిందా?”
“అబ్బే! అలాటిదేమీ
లేదు.” జవాబు కాస్త
అదోలాగుంది.
“మీ పేరేమిటో
చెప్పండి. వాడు రాగానే
కలవమని చెపుతాను. యిక
నేను వెళతానండీ. లేడీస్
స్పెషల్ పట్టుకోకపోతే
ఆఫీసుకెళ్లలేను. అప్పుడే
తొమ్మిదిన్నర అయింది
కూడా!” చర్చ యింకా ముందుకు
సాగకుండానే తాను వెళ్లి
పోవాలనుకుంది. అర్జున్
ఎక్కడున్నాడో నిజంగా
తెలవదు. వాడెప్పుడూ ఇలాగే
చేస్తుంటాడు. ఉన్నట్టుండి
మాయమయిపోతాడు. ఏమిటీ
చెప్పడు. అడిగితే నవ్వుతాడు.
పల్లెల్లో ఏదో పని ఉందంటాడు.
“ఎప్పుడొస్తాడో
ఏమన్నా తెలుసునా?”
“లేదండీ”
“అమ్మగారికేమన్నా
చెప్పాడేమో?”
“లేదండీ”
“మీ తమ్ముడు ఎప్పుడు
వెళ్లాడో నీకు తెలవదు!” అన్నాడు భారీ మనిషి.
ప్రశ్నలో ఏదో అర్థంకాని
భావం వినిపించింది జయశ్రీకి.
ఉన్నట్టుండి జ్ఞాపకం
వచ్చింది. అదే ప్రశ్న.
అదే గొంతు. అవును అదే. ఫోన్లో
కాస్త ఇంకోలాగ వినిపిస్తుంది.
ఆమె మెదడులో మెరుపు. అతను
చిరునవ్వుతూనే ఉన్నాడు.
గుర్తు పట్టినట్టున్నాడు
తన భావాలను. అతను మళ్లీ
ప్రశ్న వేశాడు.
“ఊహూ!” ఈ ప్రపంచంలోకి
వచ్చిందామె మళ్లీ.
“ఎక్కడికెళుతున్నాడో
ఎవరికీ చెప్పడా?”
“కుర్రవాడు కదండీ.
వాడి కాలేజీ ఫ్రెండ్సుతో
వెళుతుంటాడు.” జవాబు అంతగా
అతకలేదని తనకు తెలుసు.
అతనికా విషయం అర్థమయిందని
కూడా తెలుసు.
“అసలెప్పుడెళ్లాడు?”
“రెండ్రోజులయ్యిందనుకుంటా!” నిజానికి వాడు పోయి వారమయ్యింది.
వాతావరణం ఎందుకో రాను
రాను భారంగా అనిపించ
సాగింది. జయశ్రీ బయటికి
వెళ్లిపోవాలనుకుంది.
అమ్మ వంటింట్లోకి వెళ్లిపోయింది.
గిన్నెలు కడుగుతున్న
చప్పుడు వస్తున్నది.
పెద్దాయన ఒక్కసారి ఇటు
తిరిగాడు. “యింట్లో
యింకా ఎవరున్నారు?”
“మా నాన్న! చెప్పానుగా
ఆయనకి ఒంట్లో బాగోలేదని,
మంచం లోంచి లేవలేడు. బస్సు
అక్సిడెంటయి .....” చెప్పబోయి
ఆగింది.
వాళ్లిద్దరూ వింటున్నారు.
“అక్సిడెంటయి?”
“ఉద్యోగం పోయింది.
అప్పట్నుంచి ఇదే పరిస్థితి!” వంటింటి పక్కగదికేసి
చూపింది. గదికి ఓ పాత చీర
కర్టెన్ గా వేలాడుతోంది.
“మేం ఆయన్ని చూడొచ్చా?”
“నాకు టైమైపోతోంది.
నేను పోతానండీ!”
“నువ్వెళ్లు.
మేమాయనతో ఒక మాట మాట్లాడి
వెళ్లిపోతాం!”
అమ్మయ్య – సంతోషంగా టేబుల్
వేపు సాగి, తన బ్యాగ్ అందుకుంది.
తన కాగితాలు కొన్నేవో
ఉంటే సర్దుకుంటోంది.
వాళ్లిద్దరూ నాన్నగారున్న
గది వేపు వెళుతున్నారు.
విచిత్రంగా ఉన్నారీ మనుషులు.
నాన్నగారిని ఏమడిగారో
తరువాత తెలుసుకోవచ్చుననుకుంది.
“అమ్మా నే పోతున్నాను.”
“సరే జాగ్రత్తమ్మా!” అమ్మ జవాబు గిన్నెల చప్పుళ్ల
మధ్యన.
వెళ్లిపోతున్న మనిషి
ఆగి, మునివేళ్లపై నిశ్శబ్దంగా
నడిచివెనక్కి వచ్చింది.
నాన్న గది దాకా వెళ్లక
ముందే ఒక్క కేక. భయంకరమైన
కేక.
జయశ్రీ గదిలోకి పరుగెత్తింది.
పెద్దాయన నాన్నను పడుకోబెడుతున్నాడు.
నాన్న చాలా బలహీనంగా
ఉన్నాడు. కళ్లలో నీళ్లున్నాయి.
ఎందుకో ఆయన వణికిపోతున్నాడు.
చాలా భయపడ్డట్టుగా కూడా
ఉన్నాడు.
“ఏం జరిగింది?” అరిచింది జయశ్రీ. అమ్మ
కూడా వచ్చేసిందక్కడికి.
“ఏమీ లేదు. లేవబోయి
జారి పడ్డాడు అంతే!” పెద్దాయన
జవాబిచ్చాడు.
నాన్న కళ్లు మూసుకుని
ఉన్నాడు.
ఆయన ఎప్పుడూ లేచే ప్రయత్నం
చేయడు. అది వాళ్లకు తెలుసు.
తండ్రి దగ్గరికి నడిచింది
జయశ్రీ. “నాన్నా!” ఆయన
జవాబివ్వలేదు.
చాలా ఆలస్యమయిపోయింది.
అందరూ బయటి గదిలోకి వచ్చేశారు.
“యింతకూ మీరొచ్చిన
పని అయినట్లేనా?” కోపంగా
అడిగింది తను.
“చూడూ. మేము మీకు
సాయం చేయాలని వచ్చాం.
మీ తమ్ముడు తప్పపోయినట్లున్నాడు.
ఎవరికీ చెప్పా పెట్టకుండా
వారం రోజులు వెళ్లిపోతాడా...”.
“ఓహ్” అంటే వీళ్లకు
తెలుసన్నమాట. లేక నాన్న
చెప్పారేమో. చెప్పారా
వీళ్లు బలవంతంగా చెప్పించారా
తను అబద్ధం చెప్పిందని
మొహం మీద చెపుతున్నట్లనిపించింది
జయశ్రీకి. నీ దగ్గర్నుంచి
కూడా నిజం రాబట్ట గలమంటున్నట్లు
ఉన్నారు – ఎవరు వీళ్లు?
“మీవాడి ఫ్రెండ్సెవరో
తెలుసునా?”
“నాకేమీ తెలియదు.”
“గదిలోకి వెలుతురు
బొత్తిగా రావడంలేదు.
కాస్త కర్టెన్ తెరవనా?” అంటూ పెద్దమనిషిలా ఉన్నాయన
కిటికీ వేపు కదిలాడు.
ఆ కదలికలో ఆయన బూట్లు
ఆ అమ్మాయి కాలి వేళ్లను
బలంగా, ప్రయత్నంగానే
నలిపేశాయి. జయశ్రీ గట్టిగా
కేక వేసింది.
“సారీ” బాధలోనుంచే
చూచిన జయశ్రీ కళ్లకు
ఆయన కళ్లలో ఒక బెదిరింపు
కనిపించింది.
“సారీ చూళ్లేదు.
వెళ్లే ముందు ఒక ప్రశ్న.
మీ తమ్ముడి సాధారణంగా
ఎవరితో వెళుతుంటాడో చెప్పగలవా?”
జయశ్రీకి అర్థమయింది.
“నాకు తెలవదు” నిక్కచ్చిగా
జవాబిచ్చింది.
“మీ తమ్ముడి ఫొటో
ఏదయినా ఇంట్లో ఉందా?”
“లేదు!”
“అదేమిటి?” పెద్దమనిషి
టేబుల్ వేపు నడిచి, దాని
పైనున్న ఫొటో ఫ్రేం అందుకున్నాడు.
అర్జున్ తనూ కలిసి ఉన్న
ఫొటో ఉంది దాంట్లో. చాలా
పాత ఫొటో. పదేళ్లయి ఉంటుంది.
“అతను నా కజిన్!”
“అచ్చు నీలాగే
ఉన్నాడే”
తను జవాబివ్వలేదు. బయట
రిక్షా చప్పుడు.
“సరే. ఇక అడగడానికి
ఏమీ లేనట్టే!” ఫొటో ఫ్రేం
టేబుల్ మీద పెట్టబోయాడతను.
అది కింద పడి అద్దం ముక్కలయ్యింది.
“అయ్యో సారీ” అతను
ఫ్రేముని ఎత్తి టేబుల్
మీద ఉంచాడు.
అందులో ఇంకా రెండుమూడు
గాజు ముక్కలు యిరుక్కుని
ఉన్నాయి. ఫొటో మాత్రం
లేదు. జయశ్రీ గమనించింది.
అయినా చప్పుడు చేయలేదు.
తను గమనించిందని వాళ్లకు
తెలుసని తను గ్రహించింది
గనుక.
వాళ్లు వెళ్లిపోతుంటే
ఇంతకూ మీరెవరని అడిగింది
తను.
భారీ మనిషి ఆరు బయట ఉమ్మేశాడు.
పెద్దాయన ఒక చిరునవ్వు
నవ్వాడు. తరువాత దూరంగా
జీపు స్టార్టయిన శబ్దం.
పోలీసులెప్పుడూ తిరిగి
రాలేదు.
అర్జున్ కూడా రాలేదు.
అనువాదం - డా.కె.బి.
గోపాలమ్