మరణతరంగం
మొదటి
కథ
ఆమోదం
పోయినవాళ్లు
పోతే మిగిలిన వాళ్లకే
దుఃఖం. మిగిలినవారికి
ఇది ఒకరకంగా దుఃఖించడానికి
కారణమయితే, సంతోషించడానికి
కూడా ఇదే కారణమంటుంది
టావో సిద్ధాంతం. తమవాళ్లు
పోతే ఆబాధకు గురికానవసరం
లేకుండా, పోయినవాళ్లు
సుఖపడ్డారని భావం. మనవారికి
అలాంటి అవకాశం దొరకడం
మనకు సంతోషకరమే గదా.
టావో
పండితుడొకాయన గురించి
కథ ఒకటి చెబుతారు. ఆయనగారి
భార్య పోయింది. బంధువులు,
మిత్రులూ సంతాపం తెలియజేయడానికని
వచ్చారు. పండితుడు మాత్రం
హాయిగా పాడుతూ మద్దెల
వాయిస్తున్నాడట.
“ఏమిటిది? ఇన్ని సంవత్సరాలు నీతో
బతికిన నీ భార్య పోతే,
నీవు సంతోషంగా పాడుతున్నావేమిటి?” అడిగారు
బంధువులు. దానికాయనగారి
జవాబు “నాకు
భార్యంటే అమితమైన ప్రేమ.
తను పోతే ముందు నాకు బాధే
కలిగింది. కానీ ఆలోచించిన
మీదట జీవితమంటే ఇంతేననిపించింది.
అయితే తనకంటే ముందు నేనే
పోతే ఏమయ్యుండేది. ఆవిడకు
దుఃఖం. మళ్లీ పెళ్లి. ఏమో
ఎలాంటివాడు దొరుకుతాడో? నా పిల్లల
గతి ఏమయ్యుండేదో?”
“కన్నీళ్లు జీవితగతులను
మార్చలేవు. ఇప్పుడు నా
భార్య ప్రశాంతంగా ఉంది.
నేను ఎడిచి పెడబొబ్బలు
పెట్టి అల్లరి చేయడం
భావ్యం కాదు. నేనే గనుక
అలా చేస్తే నాకు జీవితం
గురించి మరణం గురించి
అర్థం కానట్లే గదా!”
మరణ
తరంగం
రెండవ
కథ
మృత్యువంటే?
“జాతస్యహి ధృవం మృత్యుః” – పుట్టినవానికి మరణం
తప్పదు. బాగానే ఉంది. అందరికీ
తెలిసిన విషయమే. “ధృవం జన్మ మృతస్యచ” – చచ్చినవాడు చచ్చినట్టు
తిరిగి పుడతాడు. నమ్మకమేనా? అయినా తిరిగి
పుడతావు లేవోయ్! అని భరోసా ఇచ్చినా
చావడానికి సిద్ధంగా ఉన్నవాళ్లు
ఎవరయినా ఉన్నారా? ఓసారి వెన్నుతట్టి
మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి.
అసలు చావును గురించి
మాట్లాడడానికే ఇష్టపడరు
చాలా మంది.
తానున్న
సమాజం, తన పరిస్థితి మొదలయిన
ఎన్నో విషయాల వల్ల చావు
పట్ల మనిషి అవగాహన మారుతూ
ఉంటుంది. కవులూ, రచయితలూ
ఎందరెందరో తమ రచనల్లో
మరణాన్ని అందంగా, ఆశ్చర్యకరంగా,
అసహ్యంగా, ఆకర్షణీయంగా
రకరకాలుగా వర్ణించారు.
ఎవరెవరు ఎన్ని రకాల నిర్వచించినా,
భావించినా, అర్థం చేసుకున్నా
మరణం మాత్రం అతి సహజమయిన
విషయం. ఎవరూ మృత్యువు
బారినుండి తప్పించుకోలేరు.
ఇది ఒక విచిత్రమయిన పరిస్థితిని
కల్పిస్తుంది. నూటికి
నూరు పాళ్లు నిజమని తెలిసినా
నమ్మకూడదనిపిస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఈ
విషయం గురించి బోలెడంత
సాహిత్యం దొరుకుతుంది.
బుద్ధుడి గురించి ఒక
కథ ప్రచారంలో ఉంది. మృత్యువునెలాగూ
తప్పించుకోలేరు గనుక
పోయిన వాళ్లకోసం దుఃఖించడం
వ్యర్థం అన్న భావనను
ఈ కథ ద్వారా చాలా బాగా
చెప్పారు. కథ ఏమిటంటే
---
దుఃఖం
కేశగౌతమికి
ఒక్కడే కొడుకు. అల్లారుముద్దుగా
పెంచుకుంటున్న ఆ కొడుకు
మరణించాడు. మరణంతో రాజీ
పడలేని ఆ తల్లి మనసులో
ఆశ మాత్రం చావలేదు. పిల్లవాని
శవాన్ని భుజానవేసుకుని
ఇంటింటికి వెళ్లి “మందువేయమ”ని అడుక్కుంది.
“పాపం పిచ్చిది” అనుకున్నారు
ప్రజలు. ఇంతకన్నా ఇంకేమీ
చేయలేరు గనుక.
గౌతమి
మాత్రం పట్టువిడవకుండా
తిరుగుతూనే ఉంది. చివరకొక
పెద్దమనిషి తారస పడ్డాడు.
ఆయన్నీ మందువేయమని వేడుకుంది
గౌతమి. జాలిగొన్న ఆ పెద్దమనిషి
“అమ్మా! నేనే మందూ
మాకూ ఎరుగను. అయినా నీ
బిడ్డకు మందువేయగల వైద్యుణ్ణి
మాత్రం ఎరుగుదును” అన్నాడు.
ఆశగా
గౌతమి “ఎవరాయన?” “ఎక్కడుంటాడు?” లాంటి ప్రశ్నలు
కురిపించింది. “శాక్యముని అంటే
బుద్ధుడు. ఆయన ఒక్కడే
నీ బాధను తీర్చగలవాడు.
ఆయన దగ్గరకు వెళ్లు” అన్నాడు పెద్దమనిషి.
తనదారిన తాను వెళ్లిపోయాడు.
కేశగౌతమి
బుద్ధుని జాడ తెలుసుకుని
వెళ్లింది. బాలుడి శరీరాన్ని
ఆయన పాదాల వద్ద ఉంచి పలురీతుల
విలపించింది. “స్వామీ! నా బిడ్డను కాపాడగలవాడవు
నీవొక్కడవే నన్నారు! దయచేసి నాబాబుకి
నీచేతితో మందువేయి” అని వేడుకుంది.
“అలాగే తల్లీ! అయితే ఒక పిడికెడు
ఆవాలు కావాలి” అన్నాడు బుద్ధడు.
“అంతేనా?” అని సంతోషంతో
ఒక్కసారి గెంతి “ఇప్పుడే తెస్తానుండండి!” అని బయలుదేర
బోయింది గౌతమి. “ఆగు తల్లీ! ఒక్క షరతు! నీవు ఆవాలు ఏ యింట్లోనుంచి
తేదలచుకున్నావో లేక తేగలవో
ఆ యింట్లో మరణం సంభవించి
ఉండకూడదు!” అన్నాడు బుద్ధుడు. సగం
ఆశలుడిగినా మిగిలిన ఆశనే
ఆసరాగా చేసుకుని యింటింటింకి
వెళ్లింది గౌతమి. ఆమె
అడిగిందే తడవుగా “ఒక పిడికెడు ఆవాలు
ఒక భాగ్యమా? ఇదుగో తల్లీ!” అని ఇవ్వడానికి
వస్తారు గృహస్తులు. గౌతమి
ఇంకో ప్రశ్న అడుగుతుంది.
“ఈ ఇంట్లో
అంటే మీ కుటుంబంలో ఒక
కొడుకుగానీ, కూతురుగానీ,
ఒక తల్లిగానీ, తండ్రిగానీ,
ఇంకో బంధువుగానీ మరణించారా?” “అయ్యో! ఎందుకడుగుతావు తల్లీ! ఉన్నవాళ్లు
తక్కువ. పోయినవాళ్లు
ఎక్కువ. మాబాధలను ఏమడుగుతావు!” అంటారు గృహస్తులు.
ఆ యిల్లు దాటి పోతుంది
గౌతమి ఆవాలు తీసుకోకుండానే.
అలా గౌతమి ఊరంతా తిరిగినా
ఇంకా వట్టిచేతులే మిగిలాయి.
మరణం సందర్శించని ఇల్లే
లేదా ఈ ఊళ్లో అని ఆలోచిస్తూ
విసిగి వేసారి గౌతమి
దారి పక్కన ఒక చెట్టు
కింద కూలబడింది.
దీపాలు
వెలుగుతున్నాయి దివ్యంగానూ.
కొంతరాత్రి తర్వాత ఒక్కొక్క
దీపమే ఆరిపోవడం మొదలయింది.
అక్కడో యిక్కడో ఒక చిన్న
దీపం మాత్రమే మినుకు
మినుకు మంటున్నది. రాత్రి
గడుస్తూనే ఉన్నది. చీకటి
నలువేపులా రాజ్యం చేయడం
మొదలు పెట్టింది. గౌతమి
మనసులో మాత్రం చీకటి
విచ్చుకుంది. “నాకెంతటి స్వార్థం? దుఃఖం మనిషి
జ్ఞానాన్ని నాశనం చేస్తుందికాబోలు! మరణంవల్ల
నష్టపోయింది నేనొక్కర్తినేనా?” అనుకున్నది
గౌతమి.
ప్రేమ
వల్ల పుట్టిన స్వార్థాన్ని
వదిలి గౌతమి కొడుకు శరీరాన్ని
అడవిలో ఖననం చేసింది.
బుద్ధభగవావనుని చెంతచేరి
బౌద్ధధర్మాన్ని శరణుజొచ్చింది.
తనబాధలను మరిచిపోయింది.
“మానవజన్మ బాధల మయమేగాక
చాలా చిన్నదికూడా. మరణాన్ని తప్పించుకునే
మార్గమే లేదు. ఈజీవిత
పద్ధతే అంత” అన్నాడు బుద్ధుడు.
“పండిన పండు రాలిపోయే
భయమున్నట్లే ప్రతి మనిషికీ
ప్రతి జీవికీ మరణభయం” అన్నాడాయన.
“పిన్నవారూ, పెద్దవారూ,
అజ్ఞులూ, విజ్ఞులూ, మరణానికి
అందరూ సమానులే. తండ్రి
కొడుకును కాపాడలేడు.
తల్లి కూతురిని కాపాడలేదు.
ఎవరూ ఎవరినీ కాపాడలేరు.
అందుకని శాంతి కోరుకున్నవారు
మరణంవల్ల కలిగే దుఃఖాన్ని
త్యజించాలి!” అని బోధించాడు బుద్ధుడు.