మరణతరంగం
8
దుఃఖం,
సంతాపం, యివి రెండూ మరణం
పట్ల మనిషి చూపించగల
ప్రతిక్రియలు. జరిగిన
నష్టానికి సూచకంగా దుఃఖం
కలుగుతుంది. ఆ దుఃఖం, సంతాపం
రూపంలో కొంత కాలంపాటు
నిలుస్తుంది. పోయిన మనిషి
గురించి తలుచుకుంటూ,
ఆ వ్యక్తి పోయారన్న విషయం
అలవాటయ్యేదాకా సంతాపం
కొనసాగుతుందని చెప్పవచ్చు.
సంతాపానికి కాలపరిమితి
లేదు. ‘ఇదేదో
త్వరగా పూర్తి చేసుకుందాం’ అనుకున్నా వీలుపడదు.
పండుగలు, పర్వాలు, ప్రత్యేక
సంఘటనలూ ప్రతి ఒక్కటీ
పోయిన వ్యక్తి జ్ఞాపకాలను
బలంగా మళ్లీ ముందుకు
లాక్కు వస్తుంటాయి.
బలమయిన
దెబ్బ తగిలితే నిజానికి
బాధ వెంటనే తెలియదు. కొంత
కాలం పాటు ఏమీ తెలియకుండా
పోతుంది. అది నిజంగా అనుభవించిన
వాళ్లే అర్థం చేసుకోగల
విషయం. మరణం పట్ల కూడా
మనిషి ప్రతిచర్య ఇలాగే
ఉంటుంది. ఫలానా వ్యక్తి
గతించే పరిస్థితిలో ఉన్నాడని
తెలిసినా కూడా, నిజంగా
వార్త తెలిసినప్పుడు
ఒక శూన్యం ఏర్పడుతుంది.
దీనికి పూర్తిగా వ్యతిరేకమయిన
పరిస్థితి యింకొకటి ఉంది.
ఒక వ్యక్తి చాలా కాలం
పాటు జబ్బు పడతాడు. ఇవాళో,
రేపో, అనుకుంటూనే చాలా
కాలం గడుస్తుంది. ఆంటిసిపెటరీ
బెయిల్ లాగ వీళ్లపట్ల
సంతాపం కూడా మరణంకన్నా
ముందే మొదలవుతుంది. ఆ
వ్యక్తి నిజంగా మరణించినప్పుడు
ఎలాంటి భావమూ కలగకపోవచ్చు.
ఒక్కోసారి ఓ రకమయిన రిలీఫ్
కూడా కలగవచ్చు.
దుఃఖాన్ని
కప్పి పుచ్చుకోవడం ధీరుల
లక్షణమని భావన. కానీ ఇలా
దుఃఖాన్ని కప్పి ఉంచితే,
ఒక్కో సందర్భంలో అది,
అనుకోనంత భయంకరంగా బయట
పడుతుంది. ఒకాయన కొడుకు
యుద్ధలో వీరమరణం పొందుతాడు.
ఆయన ఆ విషయాన్ని ఓ మాత్రం
లక్ష్య పెట్టినట్లే ఉండడు.
అంతే కాదు, ఇతరులకు ధైర్యం
చెపుతుంటాడు. కానీ నిజంగా
కొడుకు గురించి చెప్పవలసి
వచ్చే సరికి బెంబేలు
పడిపోతాడు. అప్పుడాయన
దుఃఖానికి అంతే లేదు.
1934లో నొబేల్ బహుమానం పొందిన
ఇటాలియన్ రచయిత లుయిగీ
పిరాండెల్లో కథ వార్
లో ఇదే కథ. అసలు కథేమిటంటే......
యుద్ధం
వాళ్లంతా
రాత్రి ఎక్స్ ప్రెస్
లో రోష్ నుండి బయలు దేరారు.
సల్మోనా వెళ్లాలంటే చిన్న
రయిల్లోకి మారాలి. అందుకనే
వాళ్లు తెల్లవారే దాకా
పాబ్రియానా స్టేషన్లో
గడుపుతున్నారు. తెల్లవారితే
గాని చిన్న రయిలు రాదు.
తెల్లవారింది.
ఆ సెకండ్ క్లాస్ పెట్టెలో
అప్పటికే అయిదుగురున్నారు.
ఒక ముసలావిడ కూడా ఆ పెట్టెలోకి
ఎక్కింది. ఎక్కింది అనేకన్నా
ఎక్కించారంటే బాగుంటుంది.
ఆవిడ ఒక మూటలాగ, మూటగట్టిన
శోకంలాగ ఒక మూలన నక్కింది.
ఆవిడ వెనకాలే వాళ్లాయనకూడా
వచ్చాడు. సన్నగా ఉన్నాడతను.
పాలిపోయిన ముఖం, మెరుస్తున్న
చిన్ని కళ్లు. ఆయన ముఖంలో
ఒక రకమయిన అలసట కనిపిస్తోంది.
ఎలాగో
ఒకలాగున చోటు చేసుకుని
కూచున్నాడాయన. తన భార్యకు
చోటిచ్చినందుకు పక్కవాళ్లకు
ధన్యవాదాలు కూడా చెప్పాడు.
భార్యవేపు తిరిగి కోటు
కాలరు సవరించి, ఏమిటి,
ఎలాగుంది అన్నాడు. ఆవిడ
జవాబివ్వలేదు. సరిగదా
కోటు కాలరుతో ముఖం కప్పుకోవడానికి
ప్రయత్నించింది.
వెధవ
ప్రపంచం తనలో తనే గొణుక్కున్నాడు
ముసలాయన.
అసలు
కథేమిటో, ఆవిడగారలా ఎందుకున్నారో
అందరికీ తెలియజేయడం తన
బాధ్యత అనిపించింది ఆయనకు.
వాళ్లకు ఒక్కగానొక్క
కొడుకు. వాడికి ఇరవై ఏళ్లు.
వాడి చదువుల కోసం ఉన్న
ఊరుకూడా వదిలి రోమ్ లో
మకాం పెట్టారు. వాడు చివరికి
సైన్యంలో చేరాడు. ఆరు
నెల్లదాకా యుద్ధంలోకి
పంపించరు అన్నారు, ముందు.
కానీ ఇప్పుడు వాణ్ణి
అకస్మాత్తుగా యుద్ధరంగంలోకి
పంపుతున్నట్లు ఆదేశాలు
ఇచ్చారు. వాణ్ణి చూడడానికి
వెళ్లాలి. అదీ ఆవిడగారి
పరిస్థితికి కారణం. దయనీయమయిన
పరిస్థితి అని ఆయనగారి
భావన.
ముసలావిడ
మూలుగుతోంది. ముక్కుతోంది.
ఈయన చెప్పే కబుర్లకు
వాళ్లకెలాగూ సంతాపం కలగదని
ఆమె నమ్మకం. ఎవరికి తెలుసు.
ఆ మిగతా వాళ్లు తమలాంటి
పరిస్థితిలోనే ఉండవచ్చుగదా.
అప్పటి వరకూ చాలా ఆసక్తిగా
వింటున్న ఒకతను ఇలా అన్నాడు.
‘మీరింకా
అదృష్టవంతులు! మీ అబ్బాయిని యుద్ధరంగానికి
ఇప్పుడు పంపుతున్నారు.
మావాడు యుద్ధం మొదలయిన
రోజే వెళ్లాడు. ఇప్పటికి
రెండుసార్లు గాయాలతో
తిరిగివచ్చాడు. మళ్లీ
వెళ్లిపోయాడుకూడా!’
“మరి
నాసంగతేమిటి నా ముగ్గురు
కొడుకులూ, ఇద్దరు మేనల్లుళ్లూ
యుద్ధరంగంలో ఉన్నారు!’ ఇంకో ప్రయాణికుడు
అన్నాడు.
‘ఉండొచ్చు.
కానీ మావాడు ఒక్కగానొక్క
కొడుకు!’
ధైర్యం చేశాడు ముసలాయన.
‘అయితే
మాత్రం? అతి
గారాబం చేసి మీవాణ్ణి
పాడు చేయగలరేమో అంతేకానీ
ఇంకా పిల్లలుంటే వాళ్ల
మీద చూపించే ప్రేమ మీ
ఒక్కగానొక్క కొడుకు మీదే
ఒలకబోయగలరా ఏమిటి? ప్రేమంటే ఏం రొట్టెముక్క
గనకనా తుంచి తలోకాస్త
పంచడానికి? పది మంది పిల్లలున్నా,
ఒక్కొక్కరికి మన ప్రేమ
మొత్తం చెందుతుంది! నాకున్న ఇద్దరు
కొడుకులూ పోయారు. నేను
వాళ్లకోసం చెరి సగమూ
బాధ పడడం లేదు. రెండింతలు
ఏడుస్తున్నాను!’
‘నిజమే!’ నిట్టూర్చాడు పెద్దాయన.
‘అయినా, ఇద్దరు కొడుకులు
ఉండి ఒక్కడు పోతే ఓదార్చడానికి
ఒక్కడన్నా మిగిలి ఉంటాడుగదా?’ ‘అవున’న్నారు మిగతా అందరూ.
అడ్డుపడుతూ ఇంకో పెద్దమనిషి
అన్నాడు. ‘అవును! ఓదారుస్తాడు. వాడితోబాటు
ఏడుస్తూ బతకాల్సిందే
గదా? కానీ.
ఒక్కడే కొడుకుండి వాడొక్కడూ
పోతే, వాడితో బాటుగా తండ్రీ
చావొచ్చు. ఏ బాధా ఉండదు.
దీనికేమంటారు.....?’
‘అర్థంలేదు!’ మధ్యనే అందుకున్నాడు
ఇంకో లావుపాటి పెద్దమనిషి.
ఆయన కళ్లు బాగా ఎరుపెక్కి
ఉన్నాయి. శరీరం బలహీనంగా
ఉన్నా, సత్తువంతా కళ్లలోంచి చొచ్చుకుని వస్తుందేమో
అన్నట్లున్నాడు. ‘అర్థంలేదు!’ మళ్లీ అన్నాడాయన.
నోట్లో ముందు వరుసలో
రెండు పళ్లులేవు. అది
కనిపించకుండా చెయ్యి
అడ్డుపెట్టుకుని మాట్లాడుతున్నాడు.
‘అర్థంలేదు
మీ మాటలకు. మనం పిల్లలను
ఏదో లాభంకోసం కంటామా
ఏమిటి?’
అందరూ
అవాక్కయిపోయారు. తొలిరోజునే
యుద్ధానికి వెళ్లిన అబ్బాయి
తండ్రి మాత్రం ‘మీరన్నది అక్షరాలా
నిజం! మన బిడ్డలు
మన బిడ్డలు కారు. వాళ్లు
దేశమాత బిడ్డలు. ....’ అన్నాడు. లావుపాటి
పెద్దమనిషి అందుకున్నాడు.
‘అర్థంలేదు.
బిడ్డలను కన్నప్పుడు
దేశం కోసం కంటున్నారేమిటి? పిల్లలు పుడతారు.
పుట్టాలి కాబట్టి పుడతారు! కానీ పోతే మాత్రం
మన ప్రాణాలనూ తీసుకుపోతారు.
మనం వాళ్లవాళ్లమే. వాళ్లు
మాత్రం మన వాళ్లుకారు! వాళ్ళకు వయసొస్తే
ఆ వయసులో మనం ఏంచేశామో
అదే చేస్తారు. మనకూ అమ్మా
నాన్నా ఉండేవాళ్లు. అంతేగాదు.
అమ్మాయిలూ, ఆటపాటలూ, ఆశలూ,
కూడా ఉండేవి. దేశం పిలిస్తే
మనం మాత్రం పోకపోయామా? అమ్మా నాన్నా కాదన్నా
పోయేవాళ్లమే. ఇప్పటికయినా
మనకు మనకన్నా మన దేశమే
ముఖ్యం! నీ
కొడుకు బదులుగా నీవురా
యుద్ధానికి! అంటే ఏ తండ్రి పోకుండా
ఉంటాడు?’
అంతా
నిశ్శబ్దం. అందరూ ఆయన
మాటలు ఒప్పుకుంటున్నట్లే.
‘పిల్లలకు
వయసు వచ్చిన తరువాత, వాళ్ల
యిష్టాలకు వాళ్లను వదల
వలసిందే. వాళ్లు మనకంటే
దేశమే ముఖ్యం నుకుంటే
తప్పా? మనం పెద్దవాళ్లమయిపోయాం.
మనమంతా బతికి బట్టగట్టాలంటే
మరి ఎవరో ఒకరు యుద్ధానికి
పోవలసిందే గదా అలాగని
వాళ్లు వెళితే వాళ్లకోసం
ఏడుపులా జీవితంలో దుఃఖాన్నీ,
అసహ్యాన్ని, నిరాశనూ
చూడకుండా చిన్న వయసులో
పోతేనే మేలు! మీరంతా ఇలా ఏడవడం ఏమీ
అర్థంలేదు. నన్ను చూడండి! నాలాగ నవ్వగలగాలి
మీరు. మావాడు వాడూ యుద్ధంలోనే
పోయాడు. పోతూపోతూ తనకు
ఇలా వీరమరణం చాలా సంతృప్తిగా
ఉందని రాశాడు. తెలుసా? అందుకనే నేను కనీసం
నల్లగుడ్డలు కూడా వేసుకోలేదు!’
బోసి
పళ్ల పై పెదవి వణుకుతూ
ఉంది. అతడి కళ్లు నీళ్లతో
మెరుస్తున్నాయి. అతనొక
నవ్వు నవ్వాడు. అది నవ్వో
ఏడుపో తెలియలేదు.
‘అవును.
నిజం.....’ అందరూ
అన్నారు. మూలనున్న ముసలావిడ
మాత్రం అలాగ వింటూనే
ఉంది. ఇన్నిరోజులుగా
ఇంతమంది చెపుతున్నా,
అవిడకేమీ సమ్మతిగా లేదు.
ఎవరికీ ఆమె భాధ అర్థంకాలేదనిపిస్తుందామెకు.
ఇప్పుడు మాత్రం, లావుపాటి
పెద్దమనిషి మాటలు, ఆవిడకు
మంత్రాల్లాగ వినిపించాయి.
ఇంతకాలమూ తనను అర్థం
చేసుకునే వాళ్లెవరూ లేరనుకుంది.
ఆవిడకిప్పుడే అర్థమవుతున్నది.
తనే మిగతా వాళ్లలాగ ఆ
ఉన్నత స్థాయికి చేరుకోలేక
పోతున్నదని. బిడ్డలను
యుద్ధానికి గాదు, మరణం
కౌగిట్లోకి కూడా పంపగల
ఆ ఉన్నతస్థాయిని, గురించి
ఆవిడకు ఇప్పుడిప్పుడే
తెలుస్తోంది.
దేశం
కోసం, ప్రజలకోసం పోరాడుతూ
తన కొడుకు ఎలాపోరాడిందీ,
ఎలా మరణించిందీ, ఆయన కథలాగ
చెపుతున్నాడు. ముసలావిడ
ఆసక్తిగా లేచి వింటున్నది.
ఆవిడకంతా కలలాగ తోస్తున్నది.
కొడుకు మరణం గురించి
అంత ధైర్యంగా వర్ణిస్తున్న
ఆ తండ్రిని అభినందించాలనుంది
ఆవిడకు. కలలలోంచి అప్పుడే
లేచినట్టూ, అంతకు ముందు
ఏమీ విననట్టూ, అమాయకంగా
ప్రశ్నించిందావిడ.
‘అయితే మీ అబ్బాయి నిజంగా
పోయాడా?’
అందరూ
ఆవిడ వేపు కళ్లప్పగించి
చూచారు. లావుపాటి పెద్దమనిషి
కూడా తన పొడుచుకొస్తున్న
కల్లను, అటుకేసి తిప్పి,
ఆవిడ ముఖంలోకి గుచ్చి
చూశాడు. జవాబు చెప్పాలనే
ఉంది. ఆయన నోటికి మాటలు
రావడంలేదు. అతనలాగే చూస్తున్నాడు.
ఆయనకప్పుడే అర్థమవుతోందా? ఆ అమాయకపు ప్రశ్న
వల్లే, ..... తన కొడుకు పోయాడని
– తననుండి దూరంగా..... శాశ్వతంగా
.... ఎన్నడూ తిరిగి రాని చోటికి.....
ఆయన ముఖంలో రంగులు మారుతున్నాయి.
జేబులోంచి రుమాలు బయటికి
తీసి, రెండు చేతులతో ముఖం
కప్పుకున్నాడు. ఆశ్చర్యం.....
అతను విపరీతంగా, ఎడతెరపి
లేకుండా ఏడుపు మొదలు
పెట్టాడు.
ఇటాలియన్
కథ
స్వాతి
మాసపత్రిక అక్టోబర్ 1987