మరణతరంగం 6
చచ్చి
స్వర్గం చేరుకుంటే సుఖంగా
ఉంటుంది. ప్రపంచం గురించి
ఆలోచించనక్కర లేకుండా
అమృతం తాగుతూ, రంభ డాన్సు
చూస్తూ, హాయిగా బతకవచ్చుననుకునే
వాళ్లూ ఉండే ఉంటారు. మంచి
వాళ్లకు బతికినంత కాలం
కష్టాలుంటాయి. ఈ భూమి
మీద నూకలు చెల్లితే అంతా
సుఖమే సుఖం! అని మనవాళ్లు అనాదిగా
నమ్ముతున్నదే. అలా నమ్మిన
ఒక కుర్రవాడి పాత్ర చుట్టూ
అల్లిన కథ పిచ్చివాళ్ల
స్వర్గం. అయిజాక్ బషేవిస్
సింగర్ అనే పోలాండ్ రచయిత
రాసిన ఇద్దిష్ కథ ఇది.
అసలు కథ ఏమిటంటే......
పిచ్చివాళ్ల స్వర్గం
అనగనగా
ఒక ధనవంతుడు. ఆయన పేరు
కదిష్. ఆయనకు ఒక్కడే కొడుకు.
ఆ అబ్బాయి పేరు అట్సెల్.
వాళ్లింట్లో ఒక దూరపు
చుట్టాల అమ్మాయి కూడా
ఉంటుంది. ఆమె పేరు అక్సా.
అట్సెల్ అందగాడు. అక్సా
కొంచెం పొట్టి. కానీ అందగత్తె.
ఇద్దరిదీ ఇంచుమించు ఒకే
వయసు. వాళ్లిద్దరూ కలిసి
తినేవారూ. కలిసి తిరిగేవారూ,
చదువుకునే వారూ, ఆడుకునేవారు
కూడా. మొగుడు పెళ్లాలాట
కూడా ఆడేవారు అప్పుడప్పుడు.
పెద్దయింతరంవాత వాళ్లిద్దరికీ
పెళ్లి చేసేయాలని, పెద్దలనుకున్న
సంగతీ అందరికీ తెలుసు.
పెరిగారు. పెద్దవాళ్లయ్యారు.
కానీ అట్సెల్ కు ఒక మాయదారి
రోగం పట్టుకుంది. ఎన్నడూ
కనివిని ఎరుగని మాయరోగం
అది. ఆ అబ్బాయి ఎప్పుడూ
తాను చనిపోయాననుకునే
వాడు!
తనకలాంటి
ఆలోచనలు ఎక్కడినుంచి
వచ్చాయి?
ఇంట్లో ముసలి పని మనిషి
ఎప్పుడూ కథలు చెపుతుంది
గదూ! ఆవిడే
స్వర్గం గురించి చెప్పిందట! స్వర్గానికెళితే
కష్ట పడవలసిన పనిలేదు.
చదువుకోవలసిన అవసరం అంతకంటే
లేదు. అమృతం తాగుతూ హాయిగా
బతకవచ్చు!
అట్సెల్
నిజానికి సోమరి. పొద్దున్నే
లేవాలన్నా, బడికి పోవాలన్నా,
పనిచేయాలన్నా తనకు ఇష్టం
ఉండేది కాదు. పెద్దవాడయితే
తండ్రి వ్యాపారమంతా తనే
చూచుకోవలసి వస్తుందేమోనన్న
భయం కూడా ఉండేదతనికి.
మరి సుఖపడాలంటే స్వర్గానికి
పోవాలి. స్వర్గానికి
పోవాలంటే చావక తప్పదు.
ఇలా ఆలోచించి, ఆలోచించి,
చివరకు ఆ అబ్బాయి తను
చనిపోయినట్టు ఊహించడం
మొదలుపెట్టాడు.
పాపం
అమ్మా నాన్నా చాలా బెంగపెట్టుకున్నారు.
అక్సా కూడా ఏడిచింది.
అట్సెల్ మాత్రం ఎంత చెప్పినా
వినడు. “ఏమిటి
మీ పిచ్చి? ఒకవేపు నేను చనిపోయి
పడి ఉంటే మీరంతా కబుర్లేమిటి? నన్ను పాతేసెయ్యండి! నేను స్వర్గానికి
వెళ్లిపోవాలి!” అనేవాడు.
ఎంతో
మంది డాక్టర్లు ఎన్నో
మందులు వేశారు. ఎన్నో
రకాలుగా నచ్చజెప్పడానికి
ప్రయత్నించారు. “నువ్వింకా తింటూ
తాగుతూ రాయిలా ఉండి చచ్చావంటావేమిటి?” అన్నారు.
ఇంకేముంది అట్సెల్ తిండి
మానేశాడు. నిజంగానే చచ్చే
పరిస్థితి వచ్చింది!
కదిష్
అందరికన్నా పెద్ద డాక్టరుగారి
దగ్గరకు వెళ్లాడు. తన
కొడుకు సంగతి వివరించాడు.
అంతా విన్న డాక్టరుగారు
“ఏం ఫరవా
లేదు! ఎనమిది
రోజుల్లో మీవాడి రోగం
కుదురుస్తాను. కానీ ఒక
షరతు! నేను
ఏంచేయమంటే అది చేయాలి
మీరు! ఎందుకని
ప్రశ్నించకుండా!” అన్నారు.
కదిష్
ఇంట్లో అందరికీ ఈ విషయం
వివరించాడు. ఆ రోజునుంచే
వైద్యం మొదలయింది. డాక్టరుగారు
ఏం చెపితే అది క్షణాల్లో
అమలు జరగాలి. అది నియమం.
డాక్టర్ అట్సెల్ గదిలోకి
ప్రవేశించారు. నలిగిన
గుడ్డలతో చిక్కిపోయిన
అట్సెల్
మంచంలో
పడి ఉన్నాడు. డాక్టర్
మొహం చిట్లించి, “ఏమిటిది? ఇంకా ఈ శవాన్ని
ఇంట్లో దాచుకున్నరేమిటి? అంతిమ యాత్రకు
ఏర్పాట్లు చేయండి!” అంటూ అరిచారు. అట్సెల్
తలిదండ్రులు అదిరి పోయారు.
ఆ అబ్బాయి మాత్రం మొహం
చింకిచాటంత చేసుకుని
“నేనెప్పుడో
చెప్పాను1 చూడండి!
నేను చనిపోయానో లేదో? డాక్టరుగారు
కూడా అదే మాటన్నారు!” అన్నాడు.
డాక్టరుగారి
షరతు జ్ఞాపకం తెచ్చుకుని
ఇంట్లో అందరూ శవయాత్రకు
ఏర్పాట్లు మొదలు పెట్టారు.
ఇదంతా చూస్తున్న ఆట్సెల్
సంతోషం పట్టలేక గంతులు
వేశాడు. “ఆకలి! అన్నం కావాల”న్నాడు. “స్వర్గంలో
తిందువుగానిలే!” అన్నారు డాక్టరుగారు.
ఆ యింట్లోనే
డాక్టరుగారి ఆదేశం ప్రకారం
ఒక గదిని స్వర్గంగా మార్చేశారు.
గోడలు కనిపించకుండా తెరలు,
నేల కనిపించకుండా తివాచీలు
ఏర్పాటు చేశారు. కిటకీలు
తలుపులు మూసేశారు. కథలో
స్వర్గంలోలాగ దీపాలు
అమర్చారు. సేవకులంతా
దేవదూతల్లాగ అలంకరించుకున్నారు.
అట్సెల్ని
శవపేటికలో పెట్టి ఊరేగింపు
మొదలు పెట్టారు. అబ్బాయి
నిద్రపోయింది చూచి, అతడిని
స్వర్గం గదిలో దిగబెట్టారు.
నిద్రలేచిన అబ్బాయి ఆశ్చర్యపోయాడు.
“నేనెక్కడున్నాను? ఎవరక్కడ?” అన్నాడు
దేవదూత ప్రత్యక్షమయి
“ఇది స్వర్గం
మహాప్రభో!” అని జవాబిచ్చాడు. “సరే! నాకాకలిగా ఉంది.
ఆహారం అమృతం కావాల”న్నాడు అట్సెల్.
ముఖ్యసేవకుడు చప్పట్లు
చరవగానే తెరలు తొలగించుకుని
సేవకులు బంగారు పళ్లాలలో
అన్ని పదార్థాలు చట్టుకువచ్చి,
అట్సెల్ ముందు అమర్చారు.
బాగా తిని వెంటనే మళ్లీ
నిద్రలోకి జారుకున్నాడు
అబ్బాయి. మరురోజు పొద్దున్న
నిద్రలేచాడుగానీ, అది
పగలో రాత్రో తెలియలేదతనికి.
అట్సెల్ నిద్రలేచాడని
గమనించగానే, సేవకులంతా
సిద్ధమయి అచ్చం మొదటిరోజులాగానే
ఆహారం ఏర్పాటు చేశారు.
‘ఇదేం బ్రేక్ ఫాస్ట్? కాఫీ, బ్రెడ్
రోల్స్ కావాల”న్నాడతను.
“కానీ స్వర్గంలో అవేవీ
ఉండవు. ఎప్పుడూ ఇదే తిండి! మహాప్రభో!” అన్నారు
సేవకులు. “అసలిప్పుడేమిటి? పగలా? రాత్రా?” అన్నాడు అట్సెల్. “అంటే ఏమిటది? ఇక్కడదంతా
ఉండదు!” అన్నారు
సేవకులు. ఎలాగోలాగ తిండి
అయిందనిపించి, “మరి కాలక్షేపానికి
నేనిప్పుడేం చేయాలి?” అని ప్రశ్నించాడా
అబ్బాయి. “స్వర్గంలో ఎవరూ ఏమీ
చేయరండీ!” జవాబు. మిగతా దేవతల గురించి
అడిగితే చాలా దూరం అన్నారు.
“మరి మా అమ్మా
నాన్నా ఎప్పుడొస్తారు?” అని అడిగాడు
అట్సెల్.
“మీ నాన్నగారు ఇరవై ఏళ్ల
తర్వాత, అమ్మగారు ముప్ఫయి
ఏళ్లకు!”
అన్నారు.
“మరి అక్సా సంగతి ఏమిటి?”
“ఆమె రావాలంటే యాభయి
సంవత్సరాలు కావాలి!”
“అంటే అప్పటిదాకా నేనిలా
ఒంటరిగా ఉండవలసిందేనా?”
“అంతే మహాప్రభో!”
“సరే, ఇప్పుడు అక్సా ఏం
చేస్తుంది మరి?”
“కొన్నాళ్లు మీకోసం
ఏడుస్తుంది. నెమ్మదిగా
మరిచి పోయింతర్వాత ఇంకో
అందమయిన కుర్రవాణ్ణి
చూచి పెళ్లి చేసుకుంటుంది.
భూమ్మీద బతికేవాళ్లు
ఎప్పుడూ అంతేగదా!” అన్నారు సేవకులు.
అట్సెల్కు తిండి ఒంటబడుతున్నది.
కానీ చేయడానికి పని మాత్రం
లేదు. ఎనిమిది రోజులు
అలా గడిచే సరికి అతనికి
దుఃఖం ముంచుకు వచ్చింది.
పట్టలేక సేవకుడితో “స్వర్గంకన్నా
భూమిమీదే బాగుంటుదేమో?” అన్నాడు.
“అయ్యో!
ఏంబాగులెండి! చదువుకోవాలి! పనిచేయాలి! ఒక్కటా అంతా కష్టం!” అన్నాడు
సేవకుడు.
“ఆ ఏం కష్టంలే? ఇలా పడి ఉండేకన్నా
కట్టెలు కొట్టినా సుఖంగా
ఉంటుంది1
అయినా ఇలా ఎన్నాళ్లుండాలి
నేను?” అన్నాడు
ఆ అబ్బాయి.
“ఎప్పటికీ ఇలాగే!” జవాబు.
“ఛీ! అలాగయితే
నేను ఛస్తాను!”
“చచ్చినవాళ్లు మళ్లీ
చావడానికి వీల్లేదు!” చింతలో పడ్డాడు
అట్సెల్.
కొన్ని
క్షణాల తరవాత ఒక సేవకుడు
ప్రత్యక్షమయ్యాడు. “మహాప్రభో! తప్పు కాయాలి.
తప్పు ఎక్కడ జరిగిందో
తెలియదు. కానీ మీరు చనిపోలేదు1 ఇంకా బతికే
ఉన్నారు!” అన్నాడు.
ఎగిరి
గంతేసి అట్సెల్ “ఏమిటి? నేనింకా బతికే ఉన్నానా? మరి నన్ను
ఇక్కడ ఎందుకు ఉంచారు? వెంటనే మాయింటికి
తీసుకెళ్లండి!” అన్నాడు.
సేవకులు
తన కళ్లకు గంతలు కట్టి,
కాసేపు అటూ యిటూ తిప్పి,
చివరకు ఇంట్లో అందరూ
ఉన్న గదిలోకి తెచ్చారు.
గంతలు విప్పారు. మళ్లీ
ప్రపంచం చూచిన అట్సెల్
సంతోషం పట్టలేకుండా ఉందప్పుడు.
బ్రతకడమెంత హాయిగా ఉంటుందో
అర్థమయిందతనికి. అక్సాని
చూచి, “నీవింకా
ఎవరినో పెళ్లి చేసేసుకుని
ఉంటావనుకున్నాను! నా అదృష్టం! ఇంకా ఇక్కడే ఉన్నావు!” అన్నాడు.
వాళ్లిద్దరి
పెళ్లి ఘనంగా జరిగింది.
కానుకలు, కట్నాలు కూడా
ఘనంగా వచ్చాయి. సోమరితనం
మానేసి అట్సెల్ వ్యాపారం
మొదలు పెట్టాడు. బాగ్దాద్,
భారతదేశమూ తిరిగాడు.
చాలా కాలం తర్వాత గానీ
అట్సెల్ కు డాక్టరుగారు
చేసిన వైద్యం గురించి
తెలియలేదు. పిచ్చివాళ్ల
స్వర్గం గురించి అతను
తన పిల్లలకు వాళ్లకూ
కథలుగా చెపుతూ ఉండేవాడు.
కథకు
ముగింపు మాత్రం ఎప్పుడూ
ఒకటే. “నిజంగా
స్వర్గంలో ఎలా ఉంటుందో
ఎవరికీ తెలియదు!” అని.
ఇద్దిష్
కథ
స్వాతి
మాసపత్రిక ఆగస్టు 87 లో
ప్రచురితం.