మరే భాషా మిగలదా?
నాలుగవ
తరగతి పాఠ్యపుస్తకాల్లో
వివిధ రాష్ట్రాల ప్రజల
కట్టుబొట్లు, జీవన విధానాల
గురించి పాఠాలున్నాయి.
వారివారి పండుగల గురించి
ప్రత్యేకతల గురించి కూడా,
వివరంగా కాకున్నా, చూచాయగా
కొంత చెప్పారక్కడ. అందులో
మన రాష్ట్రం గురించిన
పాఠం చదువుకుని బయట రోడ్డు
మీదకు వస్తే, పాపం పిల్లలకు
ప్రశ్నార్థకాలు ఎదురవుతాయి.
ఒకప్పుడు
మనిషి వేషం, భాష, తీరు, తెన్ను
చూచి ఏ ప్రాంతం వారో చెప్పడం
వీలయేది. సినారె గారు
చెప్పినట్లు, నాగరికత,
మన గోచీలు పీకించి ఇరుకు
పాంట్లు తొడిగించింది.
ఇటీవల ఆడపిల్లలంతా పంజాబీ
పద్ధతిలోకి మారిపోయారు.
దేశం ఈ చివరనుంచి ఆ చివర
వరకు ఏ ప్రాంతం వారయినా
ఒక్కలాగే కనబడుతున్నారు.
ఇంకొంచెం నాగరికత ముదిరితే,
ఇక్కడవారు కారేమో అన్న
అనుమానాలకు కారణమవుతున్నారు.
నోరు తెరిచి మాటాడడం
మొదలు పెడితే, అందరి నోటా
ఒకేలాంటి మాట. మాతృభాషలో
సంభాషణ అనాగరికతకు గుర్తు.
టెక్నాలజీ
అందరినీ ఒకే గాట కట్టేస్తుందని
అర్థం వచ్చే సూత్రం ఒకటి
ఉంది. టెలిఫోను ఒక కాలంలో
కలిగిన వాళ్ల ఇళ్లలోనే
ఉండేది. ఇప్పుడది పల్లెటూర్లో,
గల్లీలో వాళ్లకు కూడా
అందుబాటులోకి వచ్చింది.
రూపాయి జేబులో ఉన్నవారెవరయినా
టెలిఫోను వాడుకోవచ్చు.
అదొక పద్ధతి. టెక్నాలజీ
మనకు అందించిన మరొక అద్భుతం
టెలివిజన్. అందులో రకరకాల
ఛానల్స్, రకరకాల ప్రోగ్రాములు.
ఏ కార్యక్రమం ఏ భాషలో
తయారయిందో అర్థం కాదు.
అసలా మనుషులు మనవాళ్లేనా
అని అనుమాన పడుతుంటే
అచ్చమయిన తెలుగులో మాటలు
వినపడడం మొదలవుతుంది.
చాణక్యుడు ఒకనాడు హిందీలో
మాట్లాడతాడు. మరోరోజు
తెలుగులో మాట్లాడతాడు.
మరీ కొన్ని ఛానల్స్ లోనయితే
అందరూ కలిసి ఎవరికీ అర్థం
కాని భాషలో కేకలు వేస్తుంటారు.
అది సంగీతమని అనుకొమ్మంటారు.
ఒక కార్యక్రమాన్ని అరడజను
భాషల్లోకి డబ్ చేస్తే
గిట్టుబాటు. అందులోని
విషయానికీ, కట్టు బొట్టు
వగైరా వివరాలకూ, వినబడే
భాషకూ పొంతన ఉంటుందా
అన్న ప్రశ్న ఎవరికీ పట్టదు.
ఏతావాతా, అందరమూ మనమన
భాషలను మరిచిపోతున్నాం.
ఇంకా మరిచిపోకుంటే ఇంకొన్ని
రోజుల్లో తప్పనిసరిగా
మరిచిపోతాం.
కంప్యూటర్
రంగంలో భారతీయులు ఎటుచూచినా
జెండా ఎగరేసి, జై అంటూ
ముందుకు సాగిపోతున్నారు.
ఇందుకు మనవారికి గల భాషాపాండిత్యం
కారణమని గమనించాలా? మనం సులభంగా
ఇంగ్లీషు నేర్చుకుని
నాలుగు బొట్లేరు ముక్కల
నుండి నవల్సు దాకా అప్పజెప్పగలుగుతాం.
సల్మాన్ రుష్దీ, విక్రం
చంద్రా, చిత్రా దివాకరుని
వగైరాల్లాంటి ఆంగ్ల రచయితలను
కోకొల్లలుగా ప్రపంచానికి
పంచుతాం. మనకు అంటే చదువుకున్న
భారతీయులకు, ఇంగ్లీషు
చేతగావడం, కంప్యూటరు
రంగంలో ఒక పెద్ద అనుకూలమయిన
అంశం అయి కూచుంది. చైనా,
జపాను వారికి చదువు రాదని
కాదు. ఇంగ్లీషు మాత్రం
మనకు వచ్చినంత బాగా రాదుగాక
రాదు. అదీ సంగతి!
కొత్తశకాలు
సహస్రాబ్దాలు వస్తే రానివ్వండి.
కొత్తదనాన్ని తెస్తే
తేనివ్వండి. కానీ గుర్తించవలసిన
సంగతులను మాత్రం కొన్నింటిని
గుర్తించవలసిన బాధ్యత
మన మీద ఉంది. వెనకటి సంగతేమో
గానీ, ప్రస్తుతం ప్రపంచంలో
ఆరువేల భాషలు వాడుకలో
ఉన్నాయి. అంటే ఇంకా ఎవరి
భాష వారికి ఉందనే అనుకోవచ్చు.ప్రగతి
గతి ఇలాగే సాగితే, 2100 నాటికి,
మిగిలే భాషలు మూడువేలకు
తక్కువేనని అంచనా. పండుగలకు
ప్రతి దానికీ ప్రత్యేకతలు
ఉండేవి. ఫలానా పండుగని
ప్రత్యేకంగా పట్టింపులుండేవి.
యూరోపు వాడి యంత్రాల
పుణ్యమా అని ఇప్పుడు
అందరికీ అన్ని పండుగలకూ
సేమ్యాలు మిగిలి పోయాయి.
అవి కూడా మన పాత పద్ధతి
సేమ్యాలు కానేకావు. అచ్చంగా
అలాగే, ప్రపంచమంతటా ఇంటర్నేషనల్
భాష, అయిన ఇంగ్లీషు ఒక్కటే
మిగిలినా ఆశ్చర్యపడనసరం
లేదు!
‘ఉదార చరితానాంతు
వసుధైవ కుటుంబకం’ అన్ననాడు వారి
ఉద్దేశ్యం ఒకటయితే, ఇవాళ
నిజంగా ప్రపంచమంతా ఒకటే
కుటుంబమయింది. ప్రస్తుతం
ప్రపంచ జనాబాలో అయిదవ
వంతు మంది ఇంగ్లీషు మాట్లాడుతున్నారట.
అందరినీ ఒకేగాట కట్టే
సంస్కృతీ విశేషానికి
ఉదాహరణగా ముందు ఇంగ్లీషు
భాషను చెప్పుకోవచ్చు.
మన రాష్ట్రంలో కొంత భాగంలో
కొంతకాలం పాటు, సడకులుండేవి.
‘సడకేమిటి? అసహ్యంగా!’ అన్నవాళ్లున్నారు.
దాన్ని ‘రోడ్డు’ అనాలి అని
నచ్చజెప్పారు. ఇప్పుడా
సడకులన్నీ ఇంచుమించు
రోడ్డులయినయి. అదలా ఉంచితే
మనం మాత్రం ఇంగిలీషు,
కొంచెం తెలుగు శైలిగల
టింగిలీషు భాష వంటబట్టించుకున్నాం.
‘వాట్ యార్?’ అన్న మాటలో,
యార్ (నేస్తం) అనేది ఉరుదూ
మాటని మనకు తోచనే తోచదు.
ఇది మన రాష్ట్రానికి,
మన దేశానికి పరిమితమయిన
పద్ధతి కానే కాదు. ప్రపంచమంతటా
ఎవరికి వారు తమదయిన ఇంగ్లీషు
మాటకారితనాన్ని తయారు
చేసుకుంటున్నారు.
ఇంటర్నెట్,
ఇతర మల్టిమీడియా మాధ్యమాలను
గురించి తలుచుకుంటే,
ఇంగ్లీషు తప్ప మరో భాష
మిగిలేనా అన్న అనుమానం
రాకమానదు. అందరికీ, కనీసం
కొందరికయినా అర్థమయే
ఇంగ్లీషు ఒకరకమయితే,
స్థానిక భాషల పదజాలాన్ని
ఇంగ్లీషుతో కలిపి, తయారు
చేసే భాషలు మరింత విచిత్రం.
ఉత్తర భారతంలో హింగ్లిష్,
దక్షిణంలో టింగ్లిష్
అని మనం సరదాగా అనుకుంటాం.
కానీ అవసరం వచ్చినప్పుడు,
ఇంగ్లీషు వాడికి అర్థమయ్యేలా
విషయం చెప్పగలం కూడా! సింగపూర్
లో సింగ్లీష్ ఉంది. అందులో
మలయ్, చైనీస్ భాషలు ఇష్టంగా
కలిసి ఉంటాయి. అది అక్కడివాళ్లకు
తప్పతే మరొకరికి అర్థం
కాదట!
గోపాలం
కె.బి.
17
ఫిబ్రవరి 2001