దేవులాట
`` భూమిని
చాప చుట్టిన విధంబున
చుట్టి'' అని పద్యం చెబుతుంది. బొమ్మలో మాత్రం
వరాహమూర్తి ముట్టె మీద
అందమయిన, అధునాతన, నీలవర్ణ
భూగోళం చూపిస్తారు. మనిషితో
ఇదే తంటా! రెండు సత్యాలనుఅన్వయించి
చూడలేకపోవడంతో వివాదం
మొదలవుతుంది.
`కపిత్ధాకారభూగోళా''
అన్నారంటారు. ఏది ముందు ఏది
వెనుక? పరిశీలన వలన గదా
విషయ పరిజ్ఞానము దొరుకుతుంది!
భూమి చాపలాగ
ఉంటే, ఎటు బయలు దేరినా, ఏదో
కొంత దూరానికి అంచుతగులుతుంది. అక్కడి
నుండి ముందుకు పోవడమంటే
చరిత్రలో భాగంగా మిగలడమే. మానవుడు
తన అన్వేషణలో ఎంత దూరం
సాగినా భూమి అంచులు తాకనే
లేదు. అంటే భూమి
గుండ్రంగా ఉందని గదా
అర్ధం! ఇక అప్పుడు నిర్భయంగా
ఏదో ఒక దిక్కుగా
బయలుదేరి పరిశోధన కొనసాగించడానికి
అడ్డేముంది? లేదు గనుకనే
ఈ ప్రపంచంలో మనిషికి
తెలియని మూల ఏదీ మిగలలేదు.
అన్వేషణా
చరిత్రను జాగ్రత్తగా
గమనిస్తే దేశాలను
వెదుకుతూ బయలుదేరడంలో యూరోపు వారిదే ముందంజ అని సులభంగా
అర్ధమవుతుంది. భారతీయులు
లోపలి ప్రపంచాలను వెదుకుతూ గడిపారే
గానీ, ఇతర ప్రాంతాలకోసం
వెదికిందిలేదు. చైనా వారిదీ, అరబ్బు
వారిదీ ఇదే వరస. ప్రపంచం
చుట్టి రాగల పడవలు చైనా
వారి దగ్గర ఉండేవట. అయితే
ఆ ప్రపంచం చుట్టాలనే
ఆలోచన మాత్రం వారికి
రాలేదు. అది హిందూమహాసాగరం, శాంతి
సాగరాలలో తిరుగుతూ ఉండి పోయాయన్నమాట. చైనా
వారు 15 వశతాబ్దం నాటికి కన్ఫూషియస్ ప్రభావంతో, ఏదీ
అంటకుండా ఉండడం నేర్చుకున్నారు. పాశ్యాత్యులకు తెలిసింది కూడా
మధ్యధరా సముద్రం చుట్టు
ప్రాంతాలు మాత్రమే. రాను
రాను తూర్పున చైనాకు, దక్షిణాన
ఆఫ్రికా, భారతదేశాల వరకూ, వారి
ప్రయాణాలు కొనసాగాయి. ఇతరులంతా
తమకు తెలిసిందే ప్రపంచం
అనుకుంటూ బతికారు.
భారతదేశం
ద్వీపకల్పం. ఖండం మధ్యలో
గనుక ఉండి ఉంటే చుట్టూ ఇలాంటి భూమి ఉందనే
భావం ఉండేది కాదు. కానీ
మూడు వేపులా సముద్రం, పైభాగాన
దాట వీలుకాని మంచుకొండలు. అది
దాటి వెళితే ఉండేది
స్వర్గమే (త్రివిష్టపం) అని
మనవారు అప్పట్లో భావించారు. గంగా
కావేరుల మధ్యగలదే భూమి, అక్కడివే
నదులు. ఆతరువాతెప్పుడో
మాత్రమే మనవారికి ప్రపంచం
సంగతి తెలిసింది. అప్పట్లో
ఫ్రెంచివారు, ఆఫ్రికన్లు
అందరూ అంతే! కడుపులో
చల్ల కదలకుండా అన్ని
వనరులూ ఉన్న చోటే దొరుకుతుంటే
మరో చోటికి బయలు దేరాల్సిన
అవసరం ఏముంది?
యూరోపు
వారి సంగతి అలా కాదు. వారివి
చిన్న చిన్న దేశాలు. కాబట్టి
వనరులు తక్కువ. సముద్రం
లేకుంటే అసలా పద్ధతే
తెలియదు. అందుకే వాళ్లు
ముందు సముద్ర తీరాలు
చేరుకున్నారు. అలా తిరుగుతుంటే
సముద్రాలన్నీ కలిసే ఉన్నాయని
నిర్ధారణయింది. ప్రయాణించ
దలుచుకున్న వారికి ఏమయి
పోతామోననే భయం
తగ్గింది. ఇంగ్లీషువారు, స్పెయిన్, పోర్చుగీస్, ఫ్రెంచ్వారు
పోటా పోటీగా ప్రపంచం
మీదకు బయలుదేరారు.
అప్పటి
దాకా స్వంత లాభం
కోసం కొనసాగిన
అన్వేషణలు 1700 సంవత్సరం
తర్వాత ``సమాచారం కోసం''
అనే
కొత్త దారిని పట్టాయి. 1800
నాటికి
సముద్రాల తీరు తెన్నులన్నీ
తెలిసి పోయాయి. 1872 నుండి 1876 దాకా బ్రిటిష్ వారి ఛాలెంజర్ అనే ఓడ సముద్రాలను
పరిశీలిస్తూ
తిరిగింది. అప్పటినుంచి
ఇప్పటిదాకా సముద్రాల
పరిశీలన జరుగుతూనే ఉంది. అంతరిక్షంలాగే ఇక్కడ కూడా అంతు
కనబడడంలేదు. అప్పటికప్పుడు
కొత్త కొత్త సంగతులు
తెలుస్తూనే ఉన్నాయి. నిజానికి గ్రహాలు, వాటి
ఉపగ్రహాల సంగతి ఉన్న
చోటినుంచే కనుగొనడం
వీలవుతోంది. కానీ సముద్రం లోతులను
మాత్రం ఇంతగా తరచిన ప్రయత్నాలు తక్కువే. మునిగిపోయిన
టైటానిక్ను
వెలుగులోకి తెచ్చిన బాబ్ బలార్డ్ ఈ విషయాన్ని పదే పదే గర్తు
చేస్తుంటారు. `` భూమి
ఉపరితలం 29 శాతం మాత్రమే
పైకి కనబడుతుంది. మిగతా 71 శాతం నీటి అడుగున
ఉంది. అంగారక శిలల మీద కనిపించిన రకం జీవమే, గలపగోస్ ప్రాంతంలో సముద్రగర్భంలో
కనిపించింది. అసలు
జీవ పుట్టుక ఈ సముద్ర
గర్భంలోనుండే జరిగిందేమో” అంటారాయన.
ఖండాల
తీరు తెన్నులు తెలిసిన
తర్వాత భూగోళం అన్వేషణ
మరోదారి పట్టినట్లుంది. భూగర్భ
శాస్త్రజ్ఞులు, పురాతత్వ
పరిశోధకులు ఆ కార్యక్రమాన్ని
కొనసాగిస్తున్నారు. అంటే కనిపించే
భూమి లోపలి పొరల్లోకి చొచ్చుకు పోతున్నారని
అర్ధం.
మన వారు, చైనా
వారు మనసును లోపలికి
మళ్లించి కలకాలంగా చేసింది, చేస్తున్నది
సత్యాన్వేషణే. ఈ పరిశోధకులు
పాంచ భౌతిక ప్రపంచాన్ని వెదుకుతున్నదీ
సత్యం కోసమే. ఇద్దరిలోనూ
ఉండేది ఒకే రకం తపన! అన్వేషణ
వెర్రిగా మారుతుంది. కొత్త
సమాచారం, అనుభవాలు కలిగిన
కొద్దీ మరింత ముందుకు
సాగాలనిపిస్తుంది. అయితే
అన్ని అనుభవాలూ, అన్ని
సమాధానాలూ ఒకరికే అందవు. అంటారు
అన్వేషకులు రిచర్డ్ లీకీ. ఆయన తలిదండ్రులు
కూడా మానవజాతి పూర్వచరిత్రను
పరిశోధించడానికి అంకితమయ్యారు. రిచర్డ్ అదే దారిన కొనసాగి రెండు
కాళ్లూ పోగొట్టుకున్నారు. అయినా
ఆయనలో ఉత్సాహం మాత్రం
పోలేదు. ఎవరో
వచ్చి, మరెన్నో కనుగొనడం
అంటూ జరగదు. ఆయాదేశాలు, ప్రాంతాలు
కలకాలంగా ఉండనే ఉన్నాయి. వాటిని
గురించి అందరికీ తెలియడం
ఈ అన్వేషణుల ముఖ్య ఉద్దేశ్యం. అంటార్కిటికా
వెళ్ళినా అడవిలోకి
వెళ్ళినా, మానవుల జ్ఞానతృష్ణ
వెలుగుపరుస్తోంది గానీ
మరేదో కాదు. ఇదే ప్రయత్నంలో భాగంగా ఇతర బుద్ధిజీవుల
గురించి పరిశీలనలు అన్వేషణలూ
కొనసాగుతున్నాయి.