తెలివి ఎవరి సొమ్ము?
నవల్సు
రాయడంలోనూ, నాట్యమాడడంలోనూ
కావలసినంత మంది అమ్మాయిలున్నారు
గానీ, సైంటిస్టులుగా
మాత్రం లేడీసు ఎక్కువగా
లేకపోవడానికి కారణం ఏమిటని
చాలా కాలంగా ప్రశ్న ఉండనే
ఉన్నది. ఈ పద్ధతి ఇవాళ
కొత్తగాదు. ‘లేచింది
మహిళా లోకం!’ అన్న
పాట పుట్టక ముందునుంచీ
ఇలాగే ఉంది. పురుషాహంకారం
అంతగా లేదనుకుంటున్న
సమాజాలలోనూ ఇలాగే ఉంది.
ఉండగా,
ఉండగా 2005 జనవరిలోని ఒకానొక
శుభోదయాన లారెన్స్ సమ్మర్స్
అనే ఒకానొక పరిశోధకుడు
పేరుకు తగినట్టుగానే
వాతావరణం ఎంచుకుని, ఎండలాగే
మండించే సిద్ధాంతాన్ని
ఒకదాన్ని ప్రపంచం ముందు
పెట్టాడు. అతనేదో లాకాయి
లూకాయి అయితే ఎవరూ పట్టించుకునే
వారు గాదేమో. తెలివికి
రాజధాని లాంటి హార్వర్డ్
విశ్వవిద్యాలయం అధిపతి
అతను.
ఆడా మగా
మెదడుల్లోపల, అంతరాంతరాల్లో
ఉన్న అంతరం – అదే తేడా,
కారణంగానే అమ్మాయిలు
అంతగా సైన్సులోకి రావడం
లేదని సమ్మర్స్ గారి
నమ్మకం. ఆడవాళ్లకు తెలివి
కొంచెం తక్కువ అన్న వాదం
ఒకప్పుడు మొదలయి, రకరకాల
కారణాలుగా మరుగున పడిపోయింది.
సమ్మర్స్ గారి పుణ్యమా
అని అదిప్పుడు మళ్లీ
రగులుకుంది. ఆడా మగా మెదడు
నిర్మాణంలో తేడాలున్నాయని
ఎప్పటినుంచో తెలుసు.
పనితీరులో కూడా తేడా
ఉందని ఆ మధ్యన అన్నారు.
కానీ ఆ కారణంగానే, వారికి
సైన్సు, లెక్కలు, భౌతిక
శాస్త్రం, ఇంజనీరింగు
లాంటి విషయాలు తలకు ఎక్కడంలేదని
మాత్రం ఎవరూ తేల్చి చెప్పలేక
పోయారు.
తేడాలున్నమాట
మాత్రం నిజమేనంటున్నారు
అందరూ. ఆ తేడాల వల్ల తెలివి
మీద ప్రభావం లేదు, కానీ
చిత్రంగా ఒక ఆలోచన బయట
పడింది. రకరకాల చికిత్సల
విషయంలో అందరికీ ఒకే
మందు కాకుండా, తేడాను
బట్టి ఆడ మందులు, మగ మందులు
వాడితే బాగుంటుందని పరిశోధకులు
అంటున్నారు. మానసిక రుగ్మతలయిన
డిప్రెషన్, అడిక్షన్,
షిజోఫ్రీనియా, స్ట్రెస్
సంబంధ సమస్యల్లో ఈ పద్ధతి
మరింత బాగా పని చేసే వీలుందంటున్నారు.
ఇక మీద మెదడు, మందుల గురించి
వరిశోధన చేసే వారంతా,
ఆడా మగ తేడాలను కూడా తమతమ
పరిశోధనలకు జత చేసి చూస్తే,
మంచి ఫలితాలుంటాయని అంటున్నారు.
మెదడు
నిర్మాణం, పనితీరుల్లో
తేడా ఉందని తెలుసు. ఆ తేడా
ప్రభావం లైంగిక విషయాల
మీదే ఉంటుందని అనుకున్నారు.
చివరకు చుంచులలో కూడా,
హైపొతలామస్ అనే భాగం,
ఆడా మగా తేడాను బట్టి
వేరువేరు ప్రవర్తనలకు
కారణమవుతుందని గమనించారు.
హైపొతలామస్
సెక్స్ హార్మోన్ల విడుదలకు
కేంద్రం. అందుకే న్యూరో
సైంటిస్టులంతా, తేడా
సెక్స్ వరకే పరిమితం
అన్న అభిప్రాయానికి చేరుకున్నారు.
ఈ భావాలకు ఈ మధ్య గట్టి
కుదుపులు తగులుతున్నాయి.
లింగభేదం ప్రభావం కేవలం
లైంగికత మీద మాత్రమే
గాక, జ్ఞాపక శక్తి, భావాలు,
దృష్టి, వినికిడి, ఒత్తిడిని
తట్టుకునే తీరు మొదలయిన
వాటి మీద కూడా ఉంటుందని
పరిశీలకులు సూచించారు.
మెదడులోకి తొంగి చూడడానికి
పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ
లాంటి పద్ధతులు రావడంతో,
గత అయిదు పదేళ్లలో ఈ రకం
పరిశోధనలు ఎక్కువయ్యాయి.
ఫలితాలు ఆశ్చర్యకరంగా
వస్తున్నాయి. నిక్షేపంగా
బతికి ఆలోచిస్తున్న వారి
మెదళ్ల మీదకూడా పరీక్షలు
చేయగల అవకాశం ఉండడం గమనించదగిన
సంగతి.
మెదడు
నిర్మాణంలో, స్త్రీ పురుషుల
మధ్య తేడాలు చాలా భాగాల్లో
ఉన్నట్లు గమనించారు.
పై స్థాయికి కేంద్రమయిన
ఫ్రాంటల్ కార్టెక్స్
ఇందులో ఒకటి. నుదురు ఎంత
విశాలంగా ఉంటే తెలివి
అంత ఎక్కువగా ఉంటుందని,
అనుభవం మీద మనవాళ్లు
చెప్పడం తెలిసిందే. నుదురులో
ఉండే ఈ ఫ్రాంటల్ కార్టెక్స్
తెలివికి కేంద్రం అన్నమాట
పరిశోధకులు అంగీకరించిందే.
అయితే పోల్చి చూస్తే
ఈ భాగం మగవారికన్నా ఆడవారిలో
ఎక్కువగా ఉంటుందని మాత్రం
ఈ మధ్యన అర్థమయింది. భావాలను
అదుపు చేసే లింబిక్ కార్టెక్స్
కూడా స్త్రీలలోనే ఎక్కువగా
ఉందంటున్నారు.
తేడాలో
పెద్దది, చిన్నది అంటే,
దేనికంటే అన్న ప్రశ్న
పుడుతుంది. మొత్తం మెదడుతో
పోలిస్తే, అందులో ఒక భాగం
ఎంత ఉందన్న నిష్పత్తి
ప్రకారం ఈ కొలతలను తీస్తారు.
భాషను
అర్థం చేసుకోవడం, మొత్తం
మీద అవగాహన లాంటి లక్షణాలకు
కేంద్రమయిన భాగాలలో,
చివరకు కణాల స్థాయిలో
కూడా తేడా ఉందని తెలిసింది.
కడుపులో శిశువు ఆడా మగా
తేడా, ఊపిరికన్నా ముందే
మొదలవుతుందని పరిశోధనలు
సూచిస్తున్నాయి.
సమ్మర్స్
గారి వాదం సంగతి తర్వాత
తేలుతుంది గానీ, మొత్తానికి
మెదడు స్థాయిలో ఆడా మగా
మధ్య తేడా ఉందని తేలిపోయింది.
అన్నట్లు రాజకీయాలలో
రాణించే రాణులు తక్కువ.
ఉన్నవాళ్లలో చాలా మంది
ఇల్లుగలాయన తరఫున వచ్చినవారు.
ఈ సంగతి ఆలోచించాలి!
తేజ,
జులై 8, 2005