రుచిలేని
కుక్కర్ బతుకులు
ఓటుపుట్టి
మనకంతా చేటు తెచ్చింది,
అంటూ పాతకాలపు జానపదగీతాన్ని
మా అయ్యగారు పాడుతుండగా
విన్నాను. అత కష్టపడి
సంపాయించుకున్న స్వతంత్రమూ,
ప్రజాస్వామ్యమూ మనకు
అంతగా పనికిరావని ఆకాలంలోనూ
కొందరు అనుకున్నారని,
ఈ పాట మనకు చెప్పకనే చెపుతుంది.
ఇంగువ
గురించి కథ చెప్పేవారు.
ఇంగువచెట్టు దరిదాపులకు
వెళితేనే అదిరిపోయే వాసన
ఉంటుందట. దాన్ని గాటుపెట్టి
పాలు తీయడమంటే, అందుకు
ప్రత్యేకమయిన శిక్షణ
ఉండాలట. గుర్రం మీద పరుగు
తీస్తూ కత్తితో చెట్టుకు
గాటువేసి, వాసన చుట్టుకునే
లోగా ఆచోటినుంచి తప్పుకుంటారట.
ఇందులో కొంత అతిశయోక్తి
ఉంటే ఉందేమోగానీ, ఇంగువ
కట్టిన గుడ్డ అనే మాటలో
మాత్రం ఆలక్షణం లేదు.
పాల ఇంగువ తెచ్చే పనైతే,
దాన్ని మరే ఇతర వస్తువులతో
కలిపి తేకూడదు. అట్లా
తెస్తే ఇంగువ వాసన ఆ వస్తువుకు
శాశ్వతంగా అంటుకుంటుంది.
ఆ ఇంగువను పెసరగింజంత
విరిచి తిరగమోతలో వేస్తే,
వీధివీధంతా గుబాళింపు
నిండిపోతుంది. ఇప్పుడేమయింది
ప్లాస్టిక్ డబ్బాలో ఇంగువపొడి
దొరుకుతుంది. దాన్ని
కొంత గుమ్మరించినా సరే,
చివరకు వంటకంలో దాని
వాసన కోసం వెదుకుతూ ఉండాల్సిందే.
కూరగాయలు
వెనకటిలాగ రుచించడం లేదనేది
చాలా మంది అనుభవం. పెరిగే
జనాభా అవసరాల కొద్దీ,
పెద్ద ఎత్తున పంటలు రావాలి.
మామూలు పద్ధతులయితే పనికిరావు.
వాటికి కొత్త రకం ఎరువులు
వేయాలి. పురుగు మందులు
వేయాలి. చివరకు బియ్యం
బియ్యంలా రుచి ఉండదు.
వంకాయ వంకాయ రుచి ఉండదు.
బర్రె ఏమితింటే, పాలరుచి
ఎలాగుంటుందో చెప్పినవాళ్లను
చూచాము. తోడు ఎక్కువగా
పెడితే పాలు తొందరగా
పులుస్తాయని, ఆ పాల పెరుగు
కూడా పులుపవుతుందని అనడం
విన్నాము. ఇటువంటి సంగతులు
చెపితే ఈ కాలం పిల్లలకు
అర్థమవుతుందా?
ఒకప్పుడు
టమాటాలంటే అందరూ అబ్బురంగా
చూశారు. రానురాను టమాటా
లేనిదే రోజు గడవని కాలం
వచ్చింది. చింతపండు పులుపుతోబాటు
దాని పులుపు ఉంటేగాని
‘చారు’ చారుతరంగా ఉంటుందనే
అభిప్రాయం చాలా మందికి
ఉంది. ఇక ఇప్పుడు బజార్లోకి
వెడితే దేశవాళీ టమాటాలను
వెక్కిరిస్తూ అందంగా,
పొంకంగా, రంగుగా ఉండే
హైబ్రిడ్ టమాటాలు పిలుస్తున్నాయి.
వండుకుని తింటే తెలుస్తుంది
వాటిలో ఏ రుచీ లేదని!
అవసరమని
తెచ్చుకున్న ఓటుతో అంతగా
ప్రయోజనం కనిపించ లేదని
పాటపాడిన వాళ్లు, పాడుతున్నవాళ్లూ
నాటికీ నేటికీ ఉన్నారు.
కానీ ఓటు లేందే దేశమే
లేదని కూడా అందరూ ఒప్పుకుంటారు.
అచ్చంగా అలాగే వంటలో,
పంటలో వచ్చిన కొత్త పద్ధతులు
రుచులను మరపింప జేస్తున్నాయి.
అయినా కొత్త పద్ధతులు
తప్పడం లేదు. వంటింట్లోకి,
కరెంటు, ప్రెషరుకుక్కరు,
గ్యాసు వచ్చిన తర్వాత
పరిస్థితి మరింత అన్యాయమయి
పోయింది. నువ్వులను బాణలిలో
వేపి, వేడిగా ఉండగానే
రోట్లో పోసి, రోకటితో
దంపుతుంటే, మొదట్లో వచ్చే
ఆ చప్పుడు, ఆ గుబాళింపు
ఎవరికన్నా గుర్తున్నాయా
ఇప్పుడు నూలను గ్రైండరులో
వేసి తిప్పితే, ముఖానికి
పూసుకునే పగడరుకంటే,
మెత్తని పొడి, లేదంటే
ఒక ముద్ద బయటకు వస్తుమది.
అది కూరలో పులుసులో పడినా,
ఏదో పిండి పోసినట్లే,
రుచి మాత్రం దొరకదు!
సుగంధద్రవ్యాలన్నీ,
ఇగిరిపోయే లక్షణం ఉండే
రసాయనాలు. అందుకే వాసనలు
అంత సులభంగా పరిసరాల్లో
నిండుకుంటాయి. వాటిని
పట్టి ఉంచాలంటే, పదార్థాలు
వేడెక్కకుండా జాగ్రత్త
పడాలి. రుబ్బడం, దంపడం
కూడా మొరటుగా ఉండకూడదు.
గ్రైండరులో క్షణాల మీద
పని జరుగుతుంది, నిజమే.
కానీ, మొదటి క్షణాలలోనే
పదార్థంలోని పస యావత్తూ,
గాలిలో కలిసిపోతుంది.
అందుకే ఇప్పటికీ రోటి
పచ్చళ్లకోసం శ్రమపడే
వారు కొందరు మిగిలి ఉన్నారు.
గ్రైండరులో వేసిన పచ్చడి
అచ్చంగా భానుమతిగారి
అత్తగారి కథల్లో చదివిన
‘వెంకాయపెచ్చడి!’ అందులో ఉండే పదార్థాల
రుచి, రంగు, రూపం భూతద్దం
వేసి వెతికినా కనపడవు.
రెండు
బర్రెల పాడి కలిస్తే,
పాలు, పెరుగు రుచి మారిపోతుందనే
వారు. అప్పుడు వందల గేదెల
పాలు ఒకచోట పోసి, వాటిని
శక్తి మేరకు వేడి చేసి,
చల్లబరిచి ఓ నాలుగైదు
రోజులలా కొనసాగిన తర్వాత,
అందించ గలుగుతున్నారు.
ఆ పాలను కాచితే ముందు
గిన్నెకు అంటుకుంటాయి.
తాగితే నాలుకకు అంటుకుంటాయి.
పెరుగయితే చేతులకూ అంటుకుంటుంది.
ఇవి పాలు అని, పాడి పదార్థాలనీ,
మనలను మనం మభ్యపెట్టుకోవడం
తప్పితే, సరయిన పాడి రుచి
ఎవరికయినా గుర్తుందా? కుండలో రోజంతా
పిడకల మీద కాగి, ఎరుపెక్కిన
పాలను, ఆ కుండలోనే పెరుగుగా
మార్చితే, అందులే ఉండే
రుచి ఇప్పుడెవరికయినా
అనుభవంలో ఉందా అందులోంచి
అడుగున మిగిలిన మాడును
గోకి, తిన్నవాళ్లకు తెలుస్తుంది
జీవితం రుచి. ఆ మీగడ వేరు,
ఆ నెయ్యి వేరు!
అంతా
స్పీడు యుగం. మీట నొక్కితే
మాట జరిగి పోవాలి. జరుగుతున్నది.
ప్రతి పని చేయడానికి
కరెంటు యంత్రాలు వచ్చేశాయి.
కానీ జీవితంలో రుచి పోయింది.
అత్తెసరు ఒక రుచి. వార్పు
ఒక రుచి. కలి పోసి వండిన
తెలంగాణం అన్నం, విశాఖ
తరవాణీ అన్నీ ఇప్పుడు
కుక్కరులోంచి ఒక సంకటిలాంటి
ముద్దను తీసుకుని
తిని తేనుస్తున్నాయి.
తలుచుకుంటే గతమే మేలనిపిస్తుంది.
ఇంతగా తిండి వస్తువులను
గురించి పరిశోధనలు చేస్తుంటారు
గదా, పాతకాలపు రుచులను
నిలబెట్టే పద్ధతులను
గురించి ఎందుకు పరిశోధించరు?
చివరగా
ఒక్క సంగతి. అయిదు నక్షత్రాల
హొటేళల్లో మాత్రం మట్టిమూకుడులో
పెరుగు, పల్లెటూరి పద్ధతుల్లో
వండిన తిండీ డొరుకుతున్నయట.
అనగా అర్థము ఏమిటని?