నిధి
కోసం
అనగనగా ఒక దేశం. అందులో ఒక అడవి. ఆ అడవిలో గజిబిజిగా దారులు. ఏ దారి ఎటు పోతుందో ఎక్కడ ఆగిపోతుందో తెలియదు. అలాంటి అడవిలో నాలుగు జీవులు. అందులో రెండు
చిన్న కుందేళ్లు. మిగతా
యిద్దరు మరుగుజ్జు మనుషులు. మనుషులన్నాక వాళ్లకు పేర్లుంటే బాగుంటుందేమో. సరే పేర్లున్నాయి. ఒకడు
హరి. మరొకడు గిరి.
కుందేళ్లు పేరుకు జంతువులయినా ఎంతో
చురుకయినవి.
ఆ అడవిలో ఈ నలుగురికీ ఒకటే
పని. తిండి వెతకడం. తినడం.
జంతువులకు వాసన
పసి గట్టడం తెలుస్తుంది గనుక, కుందేళ్లు తిండిని వాసననుబట్టి వెతుకుతూ పోతాయి.
మనిషి పొట్టయినా పొడుగయినా, మెదడును వాడుకుంటాడు. ఇష్టమయిన తిండి కోసం
వెతుకుతాడు. తనకు
ప్రత్యేకంగా ఏదో కావాలనుకుంటాడు.
మనుషులకూ జంతువులకూ
ఒకటి మాత్రం సమానం. తిండి
వెతకవలసిందే. అడవి అంతా
పరుగెత్తి వెతికితేనే
తిండి దొరుకుతుంది.కొన్నిసార్లు
తిండి సులభంగా దొరుకుతుంది.
కొన్నిసార్లు ఎంత వెతికినా
దొరకదు. మంచితిండి దొరికే
ప్రాంతాలు తెలిసిన వారికి
మాత్రం అంతా సులభమవుతుంది.
కుందేళ్లు పాపం,
అమాయక ప్రాణులు. నిత్యం
అడవి మొత్తం పరుగులు
పెడతాయి. తిండి దొరకని
చోటునుంచి మరోచోటికి
పరుగుపెడతాయి. వాటికి
పండ్లుకాయల వాసన బాగా
తెలుసు. అయితే దారి మాత్రం
అంతగా తెలియదు.
మనుషులు తిండి
వెతికే పద్ధతి వేరు. అందులో
తెలివి, అనుభవం అనే అంశాలుంటాయి.
అయినా అపజయాలుంటాయి.
మొత్తానికి అటు
కుందేళ్లకు ఇటు మనుషులకు
ఒకేచోట మంచి తిండి దొరికింది.
అది ఒక తోటలాంటి చోటు.
అందులో ఎన్నో రకాల తిండి,
కావలసినంత ఉంది. ఎన్నిరోజులయినా
సరిపోయేలా ఉంది.అందుకే
దాని పేరు నిధి.
కుందేళ్లు పరుగు
ఆపేశాయి. తిండి సులభంగా
దొరుకుతున్నది. తినడానికే
కష్టం, అంతే. హరి, గిరీ కూడా
అక్కడికే వెడుతున్నారు.
హాయిగా తమకు ఇష్టమయింది
తింటున్నారు. మొత్తానికి
బతుకులు మారిపోయాయి.
కొంచెం ఆలస్యంగా నిద్రలేవడం.
స్నానం ఆలస్యంగా చేయడం,
నెమ్మదిగా నడుస్తూ నిధిని
చేరడం అలవాటయింది. నిధి
ఉందని తెలుసు. ఎక్కడ ఉందో
తెలుసు మరి. ఎక్కడికీ
పోదనీ తెలుసు.
అక్కడికి అన్ని
రకాల తిండి పదార్థాలు
ఎక్కడినుంచి వస్తున్నాయని
మాత్రం తెలియదు. ఎక్కడి
నుంచి వస్తే ఎందుకు తింటే
చాలదా. అందుకే బతుకు సులభమయింది.
కొన్నాళ్లకు ఈ నిధి మనకోసమే
మనదే అనే భావం మొదలయింది.
కనుక ఇల్లు నిధికి దగ్గరగా
మార్చుకున్నారు.
నిధి దొరికితే
సంతోషం దొరికినట్లే.
అనేది వారి నినాదమయింది.
మిగితా వారెవరయినా
వస్తే “ఇదుగో
మా నిధి!” అంటూ చూపించడం
మొదలు పెట్టారు.
వచ్చినవారికి
కొంచెంగా విందులు కూడా
చేశారు. “ఎంత కష్టపడితే
ఈ నిధి దొరికింది మాకు!” అని
గర్వంగా చెప్పుకున్నారు.
కడుపు నిండా తినడం, హాయిగా
పడుకోవడం అలవాటయింది.
అలా కొంతకాలం సాగింది.
హరి, గిరిలకు కొంచెం గర్వం
కూడా మొదలయింది. ఏంజరుగుతున్నదో
చూచే ఓపికలేదు.
కుందేళ్లు మాత్రం
నిత్యం నిధి దగ్గరకు
వస్తాయి. చుట్టూ తిరిగి
పరిస్థితిని పరిశీలిస్తాయి.
తర్వాత కావలసినంత తింటాయి.
ఒక ఉదయాన వచ్చిచూచే
సరికి నిధి లేదు! అంతా ఖాళీ! కుందేళ్లకు
ఆశ్చర్యం లేదు! ఈమధ్య తిండి
తగ్గుతున్నట్లు అవి గమనించాయి.
ఏదో జరుగుతున్నదని వాటికి
అనుమానం రానే వచ్చింది.
కనుక ఆశ్చర్యం లేదు. ఏముందీ
మళ్లీ పరుగులు ప్రారంభం.
వాటికి మెదడులో ఆలోచనలు
అవసరం లేదు. పరిస్థితి
మారింది. నిధి కదిలింది.
మనమూ కదలాలి. అంతే మళ్లీ
వాసన పసిగట్టడం పరుగెత్తడం.
తిండి దొరికిన దాకా వెతకడం.
హరి, గిరి కూడా
కొంచెంసేపు తర్వాత నిధి
దగ్గరకు వచ్చారు. నిధి
లేదు. ఏమిటి నిధి లేదా? ఎవరెత్తుకుపోయారు? అన్యాయం! ఇలాంటి
మాటలు పుట్టాయి. గిరి
మాత్రం అసలేమీ అనలేదు.
కొండలాగ ఉండిపోయాడు.
హరి అరుపులను పట్టించుకునే
మనసు కూడా లేదు గిరికి.
నిధి అంటే బతుకు.
నిధి అంటే సంతోషం. తిండితోనే
ప్రపంచం. నిధి అంటే మిగతా
సంతోషాలకు దారి. ఆరోగ్యానికి
మార్గం. నిధి అంటే భద్రత.
సుఖమయ జీవితం.
కుందేళ్లు కొత్త
తిండిని వెతుకుతూ వెళ్లాయి.
వీళ్లిద్దరు మాత్రం కదిలేందుకు
సిద్ధంగా లేరు. అన్యాయం
జరిగింది. ఎన్ని పథకాలు
వేశారు బతుకు గురించి.
అవన్నీ కుప్ప కూలినట్లేనా.
మనసు పాడయింది పాపం. తిండి
లేకుండానే దినం గడిచి
పోయింది.
మరురోజు హరి,
గిరీ మళ్లీ అక్కడికే
వచ్చారు. తిండి మాత్రం
లేదు. ఆలోచనలో పడ్డారు.
హరి ఒక్కసారిగా అడిగాడు,
మన కుందేలు మిత్రులు
ఏమయ్యారూ అని. పోరా వాళ్లకేం
తెలుసు.అన్నాడు గిరి.
కుందేళ్లు. వాటికి తెలివిలేదు.
మనం మనుషులం. సమస్యలకు
సమాధానం వెతకగలం అన్నాడతను.
కుందేళ్లు మాత్రం
అడవిలో పరుగులు పెడుతూనే
ఉన్నాయి. వాటికి తెలిసింది
ఒకటే. తిండి వెతకాలి. అనుకుంటుండగానే
మరో నిధి దొరికింది. అది
మరో నిధి. ఆనందంగా కుందేళ్లు
గంతులు వేశాయి. హాయిగా
తినసాగాయి.
హరి, గిరి ఆలోచిస్తున్నారక్కడ.
ఖాళీ నిధి దగ్గర. ఆకలి.
చిక్కిపోతున్నారు వారు.
కుందేళ్లు ఏమయినయి. అవీ
మనలాగే ఆకలితో బాధ పడుతున్నాయేమో? రకరకాలుగా
ఆలోచనలు వస్తున్నాయి.
హరికి మాత్రం ఎందుకో
వాటికి తిండి దొరికి
ఉంటుందనిపించింది. మనమూ
వెతుకుతూ వెళితే తిండి
దొరుకుతుందనీ అనిపించింది.
“వెళదాం
పద!”
అన్నాడతను. “ ఛట్! నాకిక్కడే బాగుంది.
నేను రాను! బయలుదేరి అడవిలో
దారి తప్పడానికా?” అన్నాడు
గిరి. హరికి కూడా భయముంది.
అందుకే ఇద్దరూ అక్కడే
ఉండిపోయారు. చూస్తూ ఉండు.
ఏదో ఒకరోజున మన నిధి మనకు
తిరిగి వస్తుందంటాడు
గిరి. ఇవాళ మాత్రం తిండి
లేదు. కడుపు లోపలికి పోయింది.
రోజూ ఒకటే పని! తిండి లేదని
ఏడవడం!
ఏ మార్పూ జరగడం లేదు! అన్నాడు
హరి. భయపడితే పనులు జరగవని
అనుమానం మొదలయింది అతనికి.
వెతుకులాట, పరుగు
మొదలు పెట్టాల్సిందే.
కానీ పరుగు అలవాటు లేకుండా
పోయింది. కూచుని తినడం
వల్ల ఓపిక నశించింది.
వెతికితే ఇంకో నిధి దొరుకుతుందంటావా
అంటాడు గిరి. ఏమో వెతకితే
తెలుస్తుంది అని హరి
అంటాడు. ఇన్నాళ్లూ అతని
మనసులో అదే ప్రశ్న తిరుగుతున్నది.
నిధి దొరకాలి. దొరికితేనే
బాగుంటుంది. అనిపించింది.
ప్రపంచంలో పరిస్థితులు
మారుతుంటాయి. ఇప్పడూ
అదే జరిగింది. బతుకంటే
అంతే. మనం బయలుదేరి మన
ప్రయత్నం చేయాలి! అనుకున్నాడు
హరి. అతని ముఖంలో ఒక చిరునవ్వు
కనిపించింది. నానిధి
ఏమయింది అని గిరి మనసులో
ప్రశ్న. నేనెందుకు నిధి
కొరకు వెళ్లడం లేదని
హరి మనసులో ప్రశ్న. కానీ
వెళ్లాలంటే ఏదో తెలియని
భయం.
భయంకూడా మంచిదేమో!
ఏమీ చేయకుంటే
లాభం ఉండదనే భయం ఉండాలి.
ఆ భయంతోనే హరి బయలుదేరి,
అడవిలో తిరగసాగాడు. కాయో
పండో దొరికితే తింటున్నాడు.
నిధి దొరుకుతుందన్న నమ్మకం
లేదు. దారి తప్పి తిరిగిన
చోట్లే తిరుగుతున్నాడుకూడా! తప్పు
చేస్తున్నానా? అన్న అనుమానం
వస్తున్నది. కుందేళ్లు
పరుగెత్తుతూ వెతకగా లేనిది,
నేను తెలివిగల మనిషిని
వెతికితే తప్పేమిటి? అని సమాధాన
పెట్టుకున్నాడు. మొదటి
నుంచీ నిధి గురించి జాగ్రత్త
పడి ఉంటే, ఇంతవరకు వచ్చేది
కాదని తోచింది హరికి.
కుందేళ్లు గమనిస్తూ ఉన్నాయి
కనుకనే తమదారి తాము వెళ్లాయి
అనిపించిందతనికి.
చాలా రోజుల తర్వాత
ఒక నిధి కనిపించిందతనికి.
లోపల మాత్రం అంతా ఖాళీ.
హరికి తిరగడానికి ఆసక్తి
చాలడం లేదు. దారి తెలియడం
లేదు. తోడుగా ఎవరూ లేరు.
ఇలా ఈ అడవిలో ఛస్తానేమోనని
భయం మొదలయింది. వెనక్కు
తిరిగి వెళితే మేలేమోననిపించింది.
వెనక్కు వెళ్లాలన్నా
అడవే. ముందుకు వెళితే
ఏముంది. అది కూడా అడవి.
ముందు ఏముందో అనుకుంటే
భయం ఎక్కువనిపించింది.
తన భయమే తనను భయపెడుతున్నది.
నడుస్తుంటే భయం లేదు.
అందుకే ముందుకు నడక సాగించాడతను.
కొత్తదారులు వెతకసాగాడు.
ఈ పని ఇంతకు ముందే ఎందుకు
చేయలేదు. అనుకున్నాడు
కూడా. మరింత ఉత్సాహంగా
మరింత వేగంగా వెతుకుతున్నాడు.
త్వరలోనే మరో నిధి దొరికింది.
అక్కడ మొదటి నిధి కన్నా
మంచి తిండి ఉంది. మరెన్నో
కొత్తరకాల తిండి ఉంది.
నమ్మకంగా ముందుకు సాగినందుకు
నిధి దొరికింది.
ఆలోచనలో కాలం
గడిపితే ఆకలి తప్ప మరొకటి
అందలేదు. ఆలోచన మారి ముందుకు
సాగితే అంతా మారింది.
ఆలోచనలు మారితే ఆచరణలు
మారాయి. మరో నిధి మరింత
బాగుంది. ఇది నిజమేనా
అనిపించేటంత బాగుంది.
హరి హాయిగా తిండి తిని
సేదదీరుతూ ఆలోచించసాగాడు.
నిధి ఏమయిందని అనుకుంటే
జరిగింది లేదు. భయపడినంత
కాలం ఏమీ జరగలేదు. లేని
పాత నిధి గురించి ఆలోచన
దండగయిందే. భయంగానే తాను
ముందుకు నడిచాడు. భయమే
తనను ముందుకు నడిపించింది.
ఏం భయమది. తిండి దొరకకుంటే
ఎట్లాగన్న భయం.
కుందేళ్లు అప్పటికే
ఆ మరో నిధి దగ్గరకు చేరుకుని
ఉన్నయి. హరిని ఆనందంగా
పలకరించాయి. స్వాగతం
చెప్పాయి. హరికి అప్పుడు
తెలిసింది తన తెలివి
తక్కుతనం గురించి. తెలివి
తక్కువగా గిరితోబాటే
అక్కడే ఉన్నన్నాళ్లూ
ఏమీ జరగలేదు. తప్పు తెలుసుకుని
తాను బయలుదేరగలిగాడు.
కుందేళ్లకు ఇన్ని ఆలోచనలు
లేవు. ప్రతి విషయాన్ని
గురించి ఆలోచించే పనే
లేదు. నిధి పోయిందంటే
మరో నిధి కొరకు వెతుకుతూ
బయలుదేరడం ఒకటే తెలుసు.
అందుకే అవి తనకంటే ముందు
వచ్చాయి.
హరి తాను చేసిన
తప్పులను గురించి ఆలోచించసాగాడు! ముందు
ముందు చేయవలసింది కూడా
అర్థమయింది! మార్పు జరిగితే
దానికి భయపడగూడదు. చేతయినంత
త్వరగా మనమూ మారాలి. అనవసరమయిన
ఆలోచనలూ చర్చలతో బుర్ర
పాడుచేసుకో గూడదు. అన్నిటికన్నా
ముఖ్యమయిన విషయం ఒకటి
ఉంది. నిధి పోతే ఎక్కడో
ఇంకొక నిధి ఉండనే ఉంటుంది.
వెతకడమే తక్కువ. భయం వదిలి
సాహసంగా వెతికితే అది
దొరికి తీరుతుంది.
అలా ఆలోచిస్తూ
ఉంటే గిరి గుర్తుకు వచ్చాడు.
అతను కూడా వస్తే ఎంత బాగుంటుంది.
తాను వచ్చినట్టే గిరి
కూడా రావచ్చు గదా! అనిపించింది.
ఇప్పుడు తాను వెళ్లి
గిరిని తేవడం తెలివిగల
పని కాదేమో. గిరి తనదారిని
తానే వెతకగలగాలి. హరి
వచ్చేప్పుడు తెలివిగా
దారి వెంట గుర్తులు వదిలాడు
కూడా!
గిరి వాటిని చూడగలగాలి! వాడగలగాలి! అతనుకూడా
భయం వదులుకోవాలి. మారాలి! తను నిజంగానే
దారివెంట ఎన్నో గుర్తులు
వదిలాడు. గిరి వాటిని
గుర్తించగలగాలి!
హరి తన అనుభవసారాన్ని
ఒక సారి గుర్తుకు తెచ్చుకున్నాడు.
మార్పు జరగడం
సహజం. జరుగుతుంది. జరగాలి
కూడా. నిధి కదులుతుంది.
మార్పు వస్తుందని మనం
ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి.
నిధి కదులుతున్న సూచనలు
గుర్తించాలి. అది సులభంగానే
వీలవుతుంది. నిధి కదిలిందంటే
ఆశ్చర్యం లేదు. కదలడమే
సహజం. కనుక వెంటనే మన ప్రయత్నం
మొదలు పెట్టాలి. త్వరగానే
మరో నిధి దొరుకుతుంది.
మారాలి! నిధితోబాటు మనమూ మారాలి.
కదలాలి. అదే సాహసం! అందులోనే
ఆనందం. మరో నిధి దొరికితే
మరింత ఆనందం!
హరి ఇప్పుడు తిని
పడుకోవడం లేదు. అడవి మొత్తం
తిరుగుతుంటాడు. అన్ని
విషయాలు తెలుసుకుంటాడు.
కొత్తదారులను గుర్తుంచుకుంటాడు.
తిని పడుకోవడం మంచి పని
కాదు. ఎప్పుడేమవుతుందో
తెలియదు.
రాత్రయింది. హరి
నిద్రపోదామని సిద్ధమవుతున్నాడు.
ఈలోగా బయటఅడుగుల చప్పుడయింది.
ఎవరో వస్తున్నారు. గిరి
అనుకుంటా? అతను మారాడా? బయలుదేరాడా? వచ్చాడా? అతనేనా? అతనే
అయితే ఎంత బాగుంటుంది?