స్నేహ హస్తం
డా. కె.బి.గోపాలం
“సర్!”
“.....”
“వింటున్నారా”
“వినడంలేదని అనుమానం ఎందుకొచ్చింది?”
“సర్ వాళ్లు కూడా
మాంసం....”
“ఎవరావాళ్లు?”
“సర్!”
“నీకెన్ని సార్లు
చెప్పాను ఈ సర్ బుర్ నాకు
నచ్చవని!”
“సారీ రాజ్!
ఇంతకూ నేను చెప్పేదేమిటంటే,
ఆల్ఫా అరిటేమియా నుంచి
సంకేతాలు వచ్చేవిగదా
వాళ్లను ప్రోబ్ చేసి
మనవాళ్లు రిపోర్ట్ పంపారు.”
“ఆ రేడియో సంకేతాల
వాళ్లేనా? ఏమిటి రిపోర్టు?”
“వాళ్లుకూడా మనలాగే
మాంసంతో నిర్మింపబడిన
ప్రాణులంటున్నారు.”
“రక్తంకూడా ఉందా?”
“లక్షణంగా బాస్! కానీ వింతేమిటంటే ఎముకల్లేవు!”
“డామిట్! మరి శరీరం ఎలాగుందట?”
“మాంసం ముద్ద బాస్!”
“ఛట్! వీల్లేదు!”
“అలాగంటే ఎలా రాజ్? రెండు సార్లు
స్పెసిమన్స్ తెప్పించి
పరిశీలించి తయారు చేసిన
రిపోర్టు చదవకుండానే
కాదు పొమ్మంటే ఎట్లా?”
“అయితే ఆ మాంసం ముద్దలు
మనకు రేడియో సంకేతాలు
పంపాయా?”
“అంతేగదా! అయితే సంకేతాలు వాళ్ల
శరీరాలనుంచి కాదు. యంత్రాలనుంచి
వస్తున్నాయి. వాళ్లు
మాట్లాడడమంతా యంత్రాలతోనే!”
“నిలబడలేని ఆ మాంసం
ముద్దలు యంత్రాలను తయారుచేశాయంటావా? నన్ను నమ్మమంటావా?”
“నేను కేవలం రిపోర్టు
గురించి చెపుతున్నాను.
ఇందులో నమ్మకం అపనమ్మకం
లేనేలేదు. చచ్చీచెడీ
తయారు చేసిన రిపోర్టును
కాదనడానికి ఏమిటి నీఅధికారం?”
“నేను మీ పరిశోధన బృందానికి
లీడరునని తెలుసా?”
“తెలుసు! అందుకే సర్ అంటూ వచ్చాను.
ఈ మారుమూల గెలాక్సీలో
పడి నీతో తలపగలగొట్టుకుంటున్నాను. బుద్ధిజీవులు
దొరికితేనేగానీ కొంప
జేరనిచ్చేట్లు లేదు నీ
వాలకం. పాజిటివ్ గా ఫలితాలొచ్చాయంటేనేమో
వినవు!”
“ఇంటిమీద ధ్యాస పుడుతోందా?”
“ఇల్లొకటి ఇంకా ఉందేమిటి
మనకు?”
“ఇంతకూ ఆ సంకేతాలిచ్చిన
వాళ్లు యానవులేమో ఆలోచించావా? యానవులంటే,
అదే, ఒక స్టేజిలో మాత్రం
మానవుల్లాగ ఉండి, తరువాత
యంత్రాలయిపోయే ఆ జాతి! ఆర్ ఎక్స్
ఫోర్ నాట్ సెవేన్ లోనా
అక్కడే గదూ కనపడింది?”
“కాదు కాదు. తెచ్చిన
రెండు సార్లూ స్పెసిమన్లను
ఒక్క జీవితకాలం పెంచి
చూచారు మనవాళ్లు. జీవితకాలమంటే
ఎంతో తెలుసా? మనకు మూడున్నర
సంవత్సరాలు! వాళ్ల లెక్కలో అది
ముప్ఫయి అయిదు రోజులు! మొత్తం
జీవితమంతా ఎముకలు లేని
రక్తమాంసాలుగానే ఉన్నారు
వాళ్లు!”
“ఏమో నాకు నమ్మకం కలగడం
లేదు! తలమాత్రమే
మాంసంగా ఉండే రానవులేమో
వీళ్లు! పాలపుంత చివర్లో దొరికిన
రానవులకు శరీరమంతా ఒకరకంగా,
తల ఒక రకంగా ఉండడం గుర్తుందా? ఇంతకూ ఈసారి
వీళ్లకు మెదడు ఉందా?”
“పుర్రెలో కాదుగదా! అందుకే
సగం శరీరం మెదడే ఉంది! అందుకే
వాళ్లు అంతబాగా యంత్రాలు
తయారుచేసి పుట్టిన నాటి
నుంచి చచ్చేదాకా వాటి
సాయంతోనే మాట్లాడుకుంటున్నారు!”
“ఛట్! బతికినంత
కాలం యంత్రాలతోనే మాట్లాడడం
ఏమిటి? అబ్సర్డ్!”
“చూడూ! నమ్మకపోతే పోయిందేమీ
లేదు. ఇక నీతో వాదు నాకు
తగదనిపిస్తోంది!”
“కూల్ డౌన్! అంటే నీకు కోపం
కూడా వస్తోందన్నమాట!”
“సర్! అందుకే
ఈ బుద్ధిజీవులను మాంసవులు
అందామని మనవాళ్లు ప్రతిపాదించారు.
మనం దూరం దూరంగా ఉన్నప్పుడు
మాత్రమే యంత్రాల సాయంతో
మాట్లాడుతున్నాం. వా
ళ్లు ఎప్పుడూ అదే పద్ధతిగా
పెట్టుకున్నారు. ధ్వనికాలుష్యం
వాళ్ల శరీరాలకు అసలు
పడదు. గట్టి శబ్దాల వల్లనే
ఒక స్పెసిమన్ చనిపోయినట్టు
చెపుతున్నారు.”
“నో సర్ ప్లీజ్! అంటే మనలాంటి
మాంసం ముద్దలు .... సారీ...
మాంసవులు.... విశ్వంలో మరో
మూలను ఆక్రమించి పరిపాలిస్తున్నారంటావ్!”
“అమ్మయ్య! ఇప్పుడు అలా రా దారికి! ఈ మాంసవులు
మనకంటే తెలివయిన వాళ్లు! కోడ్ లో
వస్తున్న సంకేతాలను, మనకుగాకుండా
వాళ్ల మధ్యనే నడుస్తున్న
సంభాషణలను తరచి చూస్తే
ఈ సంగతి తెలిసి పోయింది!”
“రేడియో సంకేతాలంటే
అర్థమయినయేమో! వాళ్ల మాటలెట్లా
అర్థమయినయి?”
“అమ్మయ్య! ఇంతకూ వాళ్లు మాట్లాడతారని
మీరు అంగీకరించారన్నమాట! అంతేగాదు
సర్! వాళ్లు
సంగీతం కూడా పాడుతున్నారు! డాన్స్
కూడా ఆడుతున్నారు! ఇంకా….”
“ఛట్! నేను
ఇమాజిన్ కూడా చేయలేను! పాడే మాంసం
ముద్దలు! ఆడే మాంసం ముద్దలు! ఛట్!”
“కథ మళ్లీ మొదటికొచ్చిందా
సర్?”
“నో సర్ బుర్ ప్లీజ్!”
“అదీ సంగతి! అయితే సరే! కానీ పాడుతున్నారు,
ఆడుతున్నారు అనే మాట
మాత్రం నిజం!”
“ఛట్! చంపుతున్నావు! ఇంతకూ వాళ్ల
సంకేతాలేమిటి? ఏమంటారు వాళ్లు?”
“మిత్రజీవులారా! స్నేహహస్తం అందియ్యండి! అంటున్నారు!”
“ఛట్! ఎముకల్లేని
మాంసపు హస్తం! నాకయితే చిరాకెత్తుతోంది!”
“కానీ వారి వెచ్చదనం
చాలా హాయిగా ఉందంటున్నారు
మన టీమ్ వాళ్లు!”
“అంటే వీళ్లప్పుడే
స్నేహ హస్తం అందించేశారేమిటి?”
“నీ అనుమతి లేకుండా
ఆ పని చేసే ధైర్యం ఎవరికుందయ్యా
రాజ్? నే
చెప్పింది స్పెసిమన్లను
పరిశీలించినప్పటి సంగతి!”
“ఇంతకూ నీవేమంటావు
స్నేహ హస్తం అందించడం
గురించి?”
“నిజం చెప్పమంటావా? అబద్ధం
చెప్పమంటావా?”
“రెండూ చెప్పు పోనీ!”
“ఏముంది? పద్ధతి ప్రకారం
సంకేతాలన్నింటినీ లాగ్
చేయడం. ఆ మాంసవులకు జవాబులు
పంపించడం. కాంటాక్ట్
ఏర్పడిన తర్వాత
హెడ్ క్వార్టర్స్ కు
లింక్ చేయడం. ఆ తర్వతి
బాధ్యత మన మీద ఉండదు. కంట్రోల్
రూం ఎం చెపితే అది చేయడం!”
“ఇక నిజం చెప్పు!”
“సంకేతాలన్నీ గప్ చిప్
గా తుడిచేయడం. పరిశోధన
సిబ్బందినంతా రీప్రోగ్రాం
చోయడం. ఎమీ జరగనట్లే ముందుకు
నడిచి పోవడం!”
“సిబ్బందిని రీప్రోగ్రాం
చేస్తే అంతా మరిచి పోతారు.
స్పెసిమన్స్ గా తెచ్చిన
ఆ మాంసవుల సంగతేమిటి? “వారు ఇంకో
టీంను కాంటాక్ట్ చేసినప్పుడు
మన సంగతి చెప్పేసేయవచ్చు
గదా?”
“ఒరేయ్ రాజ్! ఏమీ అనుకోకు! వాళ్లను
తొలిసారిగా చూచినప్పుడే
నాకు కంపరం పుట్టింది.
వినడానికే నీవు ఇంత గాభరా
పడిపోతున్నావు. నేను
చూశావు. నా సంగతేమిటంటావు?”
“ఇంతకూ నా ప్రశ్నకు
జవాబు చెప్పలేదు!"
“వాళ్లను ట్రీట్ చేసి
వదిలేశాను. శరీరం నిండా
మెదడే వెధవలకు! సారీ ఇంతకూ మనం
వాళ్లకు గుర్తుకు వచ్చినా
అదొక కలలా ఉంటుందంతే!”
“ఛట్! మాంసం
ముద్దలకు కలలొక్కటే తక్కువయినట్టు! ఇంతకూ ఏమంటావ్?”
“వాళ్లను పట్టుకుని
మాంసవజాతికి కుశలమేనా
అని అడగడం నావల్లయితే
కాదు!”
“ఒప్పుకుంటాను! కానీ కాస్త ఆలోచించు! హెడ్ క్వార్టర్స్
కు తెలిస్తే కొంప మునుగుతుంది! పోనీ స్పేస్
షిప్ మునుగుతుంది!”
“చూడూ! ఈ మాంసవులు గాళ్లు
మన భూమిదాకా ప్రయాణించలేరు.
వాళ్ల శరీరనిర్మాణమే
అందుకు కారణం. పైగా వాళ్ల
కమ్యూనికేషన్స్ కు మన
వ్యవస్థ అంతా కలిసి గొప్ప
అడ్డుగా తగులుతుంది.
ఆపైగా ధ్వని కాలుష్యం
సంగతి చెప్పనే చెప్పానుగదా!”
“మిగతా టీముల సంగతి?”
“వాళ్లు మన సెక్టర్లోకి
ఎందుకు వస్తారంటావ్?”
“ఇంతకూ ఏమంటావ్?”
“మనకేమీ తెలియదు! మనమేమీ వినలేదు! మనమేమీ
చూడలేదు! కనుక మనమేమీ చెప్పలేదు!”
“ఈ మాటకొరకే గదా నేనింత
సేపటినించి ఎదురు చూస్తున్నది!”
********
సెర్చ్ పార్టీ
4 సెక్టర్ 12576
భూకేంద్రానికి
నివేదిక,
ప్రయత్నాలింకా
కొనసాగుతూనే ఉన్నాయి.
చెప్పుకోదగిన
కొత్త విశేషాలేమీ లేవు.
“రాజ్!”
“....”
“రాజ్! వింటున్నావా?”
“వినడంలేదని అనుమానం
ఎందుకొచ్చింది?”
“రాజ్ గెలాక్సీ గొరీనియో
నించి సంకేతాలు వస్తున్నాయట! టీంను పంపించేదా?”
“ఏ టీం పంపిస్తావు?”
“సెర్చ్ కమిషన్ రాజ్!”
“యస్ డ్యూటీ ఫర్స్ట్! కాల్ మీ
సర్! రిపోర్ట్
రిజల్ట్స్ ఇమీడియేట్లీ!”
“తొలి పరిశీలనల్లో
అక్కడి వాతావరణమంతా వాయువులతో
నిండి ఉన్నట్టు తెలిసింది.
అక్కడి జీవుల గురించి
మాత్రం ఇంకా ఏమీ ఊహించ
లేకపోతున్నాము!”
“ఛట్! ఊహించలేకపోవడమేమిటి? ఈ విశ్వంలో
ఎవరూ లేరంటావా ఏమిటి
మనం తప్ప!”
“సర్?”
“కమాన్! ప్రయత్నం మానవ లక్షణం! స్నేహ హస్తంతో
ముందుకు నడవాలి! ఈ విశ్వంలో మనతో
స్నేహానికి ఇంకెవరూ లేరంటే
నాకెందుకో గొప్ప ఒంటరితనం
అనిపిస్తుంది!”
“ఓకే సర్!”
*******