సుఖము కోసము దుఃఖమది
ఎందుకో
ఇహముకోసము ఇడుములవి
ఎందుకో
భద్రముగ రేయెల్ల
భజన గానమ్ముండ
నిద్రరాలేదన్న
వగపెందుకో
తలమీద నీ అభయహస్తమ్ము
తానుండ
గొడుగులేదేమన్న
గొడవెందుకో
వంకలేనటువంటి
కదలీ ఫలములుండ
టెంకాయ లేదన్న
తెగులెందుకో
మోక్షమార్గమ్మది
ముందు తానుండగా
సూక్ష్మముల కోసమీ
సుడులెందుకో
భవనామమనియేటి
భవ్యపాయసముండ
తీపి కారములకై
దిగులెందుకో
సాయుజ్యమది తాను
సాధింపబడియుండ
పై మెట్టు కోసమీ
పరుగెందుకో
పాట 2
నానోట నీమాట పలికినంతనె
మాట సురభిళమ్మాయెనయ్యా
తనువు పులకితమ్మాయెనయ్యా
నాకంట నీ రూపు
కాంచినంతనె
జగము కాంతిమంతమ్మాయెనయ్యా
మనసు శాంతివంతమ్మాయెనయ్యా
చేతులను నీ భజన
జేసినంతనె
యొడలు పావనమ్మాయెనయ్యా
జన్మ స్నాపితమ్మాయెనయ్యా
ఓప్రభూ నీ మోల
నిలిచినంతనె
అహము మాయమై పోయెనయ్యా
ఇహము నీవెయై పోయెనయ్యా
పాట 3
అందగాడంటేను అతనే
గదా
ఎందులో లేని సౌందర్యమదిగూడి
ఎదుట నిలిచిన రూపు
తానే గదా
పద్మములబోలు పాదములు
అవియే గదా
పాపముల గడుగు పాదములు
అవియే గదా
స్వామి అడుగిడిన
భువియంత దివియే గదా
కళల వెలిగెడు కరములవియే
గదా
అభయమిచ్చెడు కరములవియే
గదా
స్వామి కరము సోకిన
బతుకు ధన్యము గదా
వేల సూర్యుల వెల్గు
మేనదిగదా
వెన్నెలలు చిందేటి
మేనదిగదా
స్వామి సామీప్యమందుటే
ధన్యతగదా
సూర్యచంద్రుల
మించు కనులవి గదా
కరుణ వెదజల్లెడు
కనులవి గదా
స్వామి వీక్షణకటాక్షమే
చాలును గదా