వెంకటేశము
గాబులోని నీరు కొంచెము కాళ్ల మీద
గుమ్మరించుకొనెను.
చెంబులోని నీరు చేతిలోనికి
పోయుచునే మొగమున జల్లుకొనెను.
విప్పి భుజమున వేసిన
రుమాల కొనతో మొగమునొత్తుకొనుచు
అరుగు మీదికి చేరెను.
అతనికి
అలసటయను మాటదెలియదు.
విరామమును దెలియదు.
దారసాక
మీది నారకట్టను జాడించి,
సగమున విడిచిన తాటిని
కొనసాగించ పేనసాగెను.
బిడ్డ
అనంతలచ్చిమి. వెలుతురందునటుల
అరుగు అంచున కూచున్నది.
చేటలోని బియ్యమును చెరుగుచు
మెరిగెలు ఏరుచున్నది.
నాయినకు
అనవసరపు మాటలలవాటు లేవని
దెలిసిన బిడ్డయామె.
నాయినయడిగిన
మాటకు మాత్రము బదులిచ్చిన
చాలునను బిడ్డయామె.
చేయవలసిన
పని చేయుచుండినచో మాటలవసరము
లేదను బిడ్డయామె.
“అమ్మలూ తయిదలు
ఆరవోసింటిరేమొ! ఎత్తినార్ర?” వెంకటేశమడిగినాడు.
“ఎండ ఉండంగనే
ఎత్తినము నాయ్నా” యన్నది
బిడ్డ.
“అమ్మలూ! అమ్మయాడికివొయిందిరా? సప్పుడలేదు!” అన్నాడు
నాయన.
“ఆరంజ్యోతి
సముర్తాడిందిగద నాయ్నా.
పసుపుగుంకుమకువిలువనంపితే
చిన్నాయిన వాండ్లింటికివొయింది.”
“తల్లిలేనిపిల్ల” తలవని తలంపుగా యాతని
నోట మాట వెలువడినది.
“నా తమ్మునికి
నా మీద కోపమెగాని. వొదినెమీదలేదన్నమాట.
పిలువనంపుకున్నడు.” ఈయాలోచన
మనసులోనే మిగిలినది.
మాటలుగా బయటకురాలేదు.
“రెయికెబట్టనన్న
దీస్కపొయ్యిందా లేదురా? మీయమ్మ!” నాయిన
ప్రశ్న
మాటలే
నచ్చని నాయినకు తమ్ముని
బిడ్డమీద తగని కనికారము
కల్గినదనుకొన్నది అనంతలచ్చిమి.
“రెయికెగాదే,
కోటకొండ ముసలాయిన దెగ్గర
దీసుకున్నవొల్లెవాటుగూడ
కొండవొయింది!”
వెంకటేశము
మొగమునబాధ చివుక్కున
గనబడినది. కనులు చిట్లించినాడు.బిడ్డకు
మనసొక్కసారి కలవరమయినది.
పేనుచున్నతాడు
ఆయన తొడ మీది వెంట్రుకనొక
దానిని పట్టి పెకలించినది.
అది యసలు కారణము. పెడగా
కూచున్న కూతునకది కనిపింపలేదు.
తమకు దానధర్మములకు పెట్టుపోతలకు
తగినంత రాబడి లేకుండనున్నదన్న
సంగతి ఆయమకు దెలిసినదే.
కానీ నాయన లాంఛనములకు
గూడ బాధపడు మనసుగాదే.
ఆయమలేచి
బుడ్డిదీపమును దుడిచి
ముట్టించు ప్రయత్నముననున్నది.
వెంకటేశముగూడ
తాడు పేనుట మానినాడు.
“అమ్మ యింకా
రాలేదేమిరా?”
“శానసేపయింది
నాయినా పొయ్యి. వొస్తనే
ఉంటది” పలగడి చప్పుడవగా
యామె తలయెత్తి చూచినది.
“అమ్మకు నూరేండ్లు.
యాదిలనే ఒచ్చింది.”
వరలచ్చుమమ్మ
పచ్చని మనిషి. చెయ్యెత్తు
మనిషి. నిజమునకు వెంకటేశము
ఆయమకన్నను ఆకారమున పిడికెడు
తక్కువ. రూపమున కడివెడు
తక్కువ. గుణమున, అన్యోన్యత్వమున
మాత్రము ఒకరికన్ననొకరు
బారెడెక్కువ. కాయకష్టమువలన
నించుక కమిలినట్లు కనబడునాయమ
మొగమున బొట్టుబిళ్ల రూపమున
గుంకుమబొట్టు, చూచువారలను
హెచ్చరించుచున్నట్లుండును.
అందుకేనేమో, ఊరంతటనామెకు
పెనిమిటికన్నను మెండు
గౌరవము. మసిగుడ్డలో గట్టిన
మాణిక్యమువంటి యాపెకు
భోళాతనమే గొప్ప యలంకారము.
“అమ్మో
కొత్తశీర గట్టినవేమేయ్! మరిది
మర్యాదలు శాననే జేసినట్లున్నడు! ఏది
సూతము!” వెంకటేశమునందున్న
చతురత్వము కేవలము పెండ్లము
ముందుమాత్రమే బయట పడును.
పెరవారి ముందు పెదవియాడదు.
“మీరు
మీరేమన్న గాట్లాడుకోండిగాని,
నా మరిది మరిదిగాకపోతడా? నా బిడ్డ
బిడ్డగాకపోతదా? వాల్లువెడుతరు.
నేను దీసుకుంట!”
ముదురాకు
పచ్చ ముతకచీర కొంగును
గర్వముగా నొక చేతయెత్తి,
దీపపు వెలుగున నెత్తి
చూపినది. అయమకా రంగులోన
తమ కుటుంబగౌరవము గానుపించినది.
సమమనస్కులయిరేమో గాన
అయమ పెనిమిటికి గూడనట్లే
తోచినట్లున్నది.
“నా తమ్మునికి
నా మీద కోపమెగాని. వొదినెమీదలేదన్నమాట.” ఈమారు
మాటలు బయటికి బలికినవి.
“నాయినా ఏమననంటె
నేనొక మాటజెపుత. దేశముమీద
మీయసొంటి మొగులాయి మనుషులున్నరుగనుకనె
ఇంకా వానలు వడుతున్నయి.
పంటలు వండుతున్నయి. చిన్నాయిన
మీరనుకున్నంత తిక్కోడేమి
గాదు!
ఆరంజ్యోతికి మనువు గుదిరిందిగద
జేష్టమాసముల లగ్గముగూడవెట్టుకున్నరు.
చిన్నమ్మనేమొ లేకపాయె.
మంచిచెడ్డలుజూసెటందుకు,
చాకిరిజేసెటందుకు ఒగ
ఆడిదిక్కుగావాలెగద! అమ్మయితె
అన్నిటికి తయారె. అందుకంటనె
ఆయమ్మను మంచిజేసుకుంటున్నడు
మీ తమ్ముడు! మీకు కోపమొస్తె
ఒచ్చెగాని నన్నువిలుచుకపొయ్యి,
ఒక రైకె బట్టనన్నవెట్టలేదెందుకో?” బిడ్డ
ధైర్యముజేసి నాలుగు మాటలు
అప్పజెప్పి, ఏదోనెపముననింటిలోనికి
వోయినది.
ఆ యింటనా తర్వాత
కొంతసేపు వరకు ఎవరికిని
మాటలు దోచలేదు.