రాజమహేంద్రి
క్షేత్రపటాలు, సాదృశ్య పరిశీలన
దృశ్య
కళా దీపిక -
విశాఖపట్నం.
సుమారు
రెండు వందల యాభయి సంవత్సరాల
క్రితం రాజమహేంద్రి వాస్తవ్యులయిన
నందిగం నాగేశం, కొమరౌతు
వెంకటేశం అనే చిత్రకారులు
వివిధ దేవతల
చిత్రాలను రాశారు. వీటిలో 33 చిత్రాలు
దేశంలో ఉన్న క్షేత్రాలకు
సంబంధించినవి. మిగతావి
రామాయణం బొమ్మలు. పటాలలోని
విగ్రహాల గురించిన వివరణను
కొలపల్లి బుచ్ని (బుచ్చి
అయ్యుండాలి) రాశారు. మరో
గుర్తు తెలియని వ్యక్తి
పారశీకంలో వివరణ రాశాడు. ఈ
చిత్రాలన్నీ
జర్మనీ లోని హాంబుర్గ్
పట్టణ ప్రదర్శన శాలకు
చేరుకున్నాయి.
స్వయంగా కళాకారుడు, కళాచరిత్ర
పరిశోధకుడు శ్రీనివాస్ ఈ చిత్రాల గురించి
తెలిసిన నాటి నుంచి లెక్కలేని
కృషి చేసి ఇదుగో ఈ పుస్తకాన్ని తయారు చేసి మన
ముందుంచారు. పుస్తకం
పేరు, తీరు చూస్తే మనకవసరం
లేదనిపిస్తుందేమో గానీ, అందరూ
చదవదగిన గొప్ప పరిశోధన
గ్రంధమిది. కళ గురించి, కళల
చరిత్ర, తత్వం గురించి
ఏ కొంచెమయినా ఆసక్తి
ఉన్న వారయితే ఈ పుస్తకాన్ని తలకెత్తుకుంటారు.
శ్రీనివాస్ చిత్రప్రతి యొక్క
ఫోటోగ్రాఫ్‌లను
సంపాయించారు. వాటిలోని
వివరాలు, వాటి వెనుకనుండే
విశేషాల గురించి మంచి వివరాలు సేకరించారు. వాటన్నింటినీ
ముందుగా సా`దృశ్య' పరిశీలన
అనే పేరుతో వ్యాసాలుగా
అందించారు. చిత్రాలలోని వివరాలను వాటి
పూర్వాపరాలను విమర్శ
చేసిన తీరు చాలా బాగుంది. ప్రతి
పుటలోనూ ఆసక్తికరమయిన
సంగతులు ఎన్నో మనముందుకు
వచ్చి నిలబడతాయి.
రంగనాధుని
బొమ్మను రంగనాయకి, గోదాదేవిలతో
గాక బీబీనాంచారమ్మతో
రాయడంలో విశేషం ఏమిటన్న
ప్రశ్న, దానికి జవాబు అవుననిపించేవిగా
ఉన్నాయి. అసలు చిత్రాలు
రాయడమేమిటనే వివరణకూడా
ఒక చోట ఇచ్చారు. కుంభకోణంలోని
ఇతర దేవుళ్ళను వదిలి
చక్రపాణిని బొమ్మగీయడం, అది అసలు మూర్తిలా
లేకుండడం మొదలయిన అంశాలు
గమనించదగినవి. ప్రతి
వ్యాసం చివర ఇచ్చిన పాద
సూచికలు (ఫుట్ నోట్స్) పరిశోధకుని పట్టుదల గురించి చెప్పక
చెపుతాయి.
చిత్రపటాలను, విచిత్రమయిన
భాషలో కొనసాగిన వివరణలను
యధాతధంగా ఒక విధంగా ముద్రించారు. ఈభాష, చిత్రకారులు, వివరణ
రాసిన వారి పేర్లు తీరు
చూస్తుంటే వీరెక్కడి
వారయి ఉంటారని అనుమానం కలుగుతుంది. శ్రీనివాస్ ఈ విషయం గురించి, భాషాపరమయిన అంశాలను గురించి పారశీకం
గురించి కూడా మరింత చర్చించినట్లయితే ఇంకా బాగుండేది.
చిత్రాలలోని
తత్వాలకు సంబంధించిన విషయాలను మరికొన్ని
వ్యాసాలుగా చివరగా అందించారు. కళ గురించి
పట్టించుకోని వారు గూడా ఈరచన చదివితే, ఇక మీద అటువేపు
ఆసక్తి చూపుతారనవచ్చు.
శ్రీనివాస్ ఈ కృషిని ఇంతటితో
ఆపకుండా, ఈ కళాఖండాలను గురించి, మరెన్నింటినో
గురించి రచనలు చేయాలి. ఈ రచనలు
ఇంగ్లీషులో వస్తే మరింత
బాగుంటుంది. పుస్తకం ధర మూడొందలకు
అయిదు తక్కువ! అయినా తక్కువే!