ఇయం
గేహే లక్ష్మీః
జీవితాన్ని
కొంచెం జాగ్రత్తగా గమనిస్తే
అడుగడుగునా కథ కాదగిన అంశాలేవో ఎదురవుతుంటాయి. ఆ ఎదురయిన అంశాలను కథలుగా మలిచి
అచ్చులో చూడగలగడం, అందరికీ
చేతనయ్యే కళకాదు. ఓగేటి
ఇందిరాదేవి అలవోకగా కథచెప్పడం
చేతనయిన రచయిత్రి. 1966 నుంచి
ఇటీవలి దాకా రాస్తూనే
ఉన్నారు. అంతకు ముందూ రాసి
ఉంటారు. 66 నుంచి పత్రికలో
ప్రచురితమయినవి, ఆకాశవాణిలో
ప్రసారమయినవీ, ఆవివరాలు
తెలియనివీ మొత్తం 28 కథలను
రెండు సంపుటాలుగా పాఠకులకు
అందించారు. ఇంత కాలపరిమితిలో
కూడా వారి కథల్లో నడకతీరు, పట్టు
ఒకేలాగుండడం గమనించదగిన
విషయం.
స్త్రీగా
ప్రపంచాన్ని పరిశీలిస్తున్న రచయిత్రి స్త్రీల
దృష్టికోణం నుంచి విషయాలను
విశ్లేషించి
రాయడంలో విచిత్రమేమీలేదు. అయితే ఈకథల్లో
చాలా మటుకు విద్యావంతులయిన
స్త్రీల గురించి, వారికి ఎదురయ్యే సమస్యలు, సంఘటనలు
గురించి ఎక్కువగా రాసినట్లు సులభంగానే గమనిస్తాము. మగవారి మంచితనంతో పులకించినస్త్రీలు, మగవారి
చెడ్డతనానికి చెంపదెబ్బగా
జవాబు చెప్పిన స్త్రీలు, ధైర్యంగా
జీవితాన్ని ఎదుర్కొంటానంటూ
ముందుకు సాగిన స్త్రీలు, సగటు
స్వభావం స్త్రీలు ఈ కథల్లో
మనకు ఎదురవుతారు.
ఒక
చోట మాత్రం ఇందిరాదేవిగారు
పురుషుడి చేత ఉత్తమ పురుషలో
కథ చెప్పించారు. స్త్రీ
రచయితలు మగవారి డయిలాగులను
పండించలేరని ఒక అభిప్రాయం
ఉంది. ఇందిరగారు ఆ పని
చేసి చూపించారు. ఇద్దరు
మగవారు మాట్లాడుకునే
డయిలాగులు, స్త్రీ రచయితల
కలం నుంచి వస్తే బలహీనంగా
ఉంటాయంటారు. ఆప్రయత్నం
కూడా చేస్తే బాగుండును.
ఈ రెండు పుస్తకాలలోనూ
మొదట్లోనే రెండు కథలున్నాయి. వాటిని
గురించి ప్రత్యేకంగా
చెప్పుకోవలసిన అవసరం
ఉంది. నన్నయభట్టు గురించిన కథ చాలా బాగుంది. సంప్రదాయ
విషయాల నుంచి
సంఘటనలను గ్రహించి కథలుగా
అల్లడం పాత పద్ధతయి పోయింది. అది ఎవరికీ పట్టడం
లేదు. అలాగే వంశాంకురం
అనే మరోకథ చారిత్రక అంశాన్ని, ఆధునిక
కాలంతో ముడిపెడుతూ రాసిన
కథ. చాలా బాగుంది. రచయిత్రి ఈ రకమయిన ప్రయత్నాలను మరింత ముందుకు
సాగిస్తే సాహితీ సరస్వతికి
సేవచేసిన వారవుతారు. ఇక
గర్జంతం అనే భక్తి ప్రదాన
కథ. ఇది సాంఘికం. ఎందుకో
చెప్పవచ్చుగానీ ఈ కథ
మిగతా కథల మధ్యన ఇమడలేదు. మిగతా
కథల్లో కనిపించిన ధోరణి
ఇంగ్లీషు ఒక వేపు, సంస్కృత
సమాసాలు, భానుడు మనోహరంగా
ఉదయించాడులాంటి వాక్యాలు, భాష
మీద రచయిత్రికి గల పట్టు
కూడా, ఒక మార్గాన కాకుండా
రచయిత్రినీ, కొత్తపాతల
మధ్యన అటూయిటూ కదిలిస్తున్నాయని
సూచిస్తాయి.
ఫెమినిజం
అనే మాటకూడా పుట్టుకముందే
ఆ అంశం గురించి చక్కగా రాసిన రచయిత్రిగా
ఇందిరాదేవి గారిని గుర్తించింది
తెలుగు కథా ప్రపంచం. ఉద్యోగిని
అయిన ఒక స్త్రీకి కూడా
ఇంట్లో మాత్రం మరోరకం
గుర్తింపుంటుందని కథచెప్పగలిగారు
ఈ రచయిత్రి. వీరు ఇప్పటికి రాసిన కథలు బాగున్నాయని విడిగా చెప్పనవసరం
లేదు. ఇక మీద ఏం రాస్తారో
చూడాలి మరి.