మృత్యుకంపం
అది
గుజరాత్లోని
ఒక గ్రామం. అన్ని గ్రామాలకు
లాగే దానికీ ఒక పేరుండేది.
1956లో వచ్చిన భూకంపంలో గ్రామం
నేలమట్టమయింది. అప్పటి
ప్రధాని నెహ్రూ ఆ ప్రాంతాన్ని సందర్శించారు.
తిరిగి కట్టిన ఊరికి
జవహర్నగర్ అని పేరు పెట్టుకున్నారు.
50 ఏళ్లు నిండకముందే జనవరి
26న వచ్చిన భూకంపంలో ఊరు
మరోసారి మట్టిదిబ్బగా
మారింది. ఈ సారి ఇంకా ఆ ఊరిని
ఎవరూ సందర్శించినట్లు
వార్తలు రాలేదు.
గుజరాత్ భూకంపం మొత్తం
దేశాన్ని కుదిపింది.
నష్టం మాత్రం ఆ రాష్ర్టంలోనే
ఎక్కువగా జరిగింది. భుజ్, రాజ్కోట్, జమ్నగర్, సురేంద్రనగర్, పాటన్ మొదలయిన
నగరాలన్నింటిలోనూ పెద్ద
ఎత్తున నష్టం జరిగింది. భుజ్లో 90
శాతం ఇళ్ల,
భవనాలు కూలిపోయాయి. జరిగిన ప్రాణ
నష్టం గురించి రకరకాల
అంచనాలు వస్తున్నాయి. 25,000 నుండి మొదలయిన
ఈ అంకె ఎక్కడ నిలబడుతుందో
తెలియదు. కూలిన
భవనాల కింద కూరకుపోయిన
వారింక ఎందరున్నారో తెలియదు. జరిగిన ధన నష్టం 25 వేల కోట్లని
ఒక అంచనా!
ప్రకృతి వైపరీత్యాలు
మనిషికి కొత్తేమి కాదు. అయితే అవి వచ్చి
తగిలే దాకా వాటిని గురించి
పట్టనట్టే బతకడం మాత్రం
అలవాటు. భూకంపం
వచ్చింది. మానసికంగా
మొత్తం ప్రపంచాన్ని కదిలించింది. ఇక కొంతకాలం
వరకు అందరూ భూకంపాలను
గురించి ఆలోచించడం సహజం. కొద్దిపాటి
భయంతో గడపడమూ సహజం.
కాలంతో బాటే ఈ సంఘటనలో
మరుపున పడతాయి.
మళ్ళీ ఎక్కడో ఎప్పుడో
మరో ఉత్పాతం జరుగుతుంది. అందరినీ తట్టి
లేపుతుంది. ఉత్పాతాలకు కారణం కొన్ని
సందర్భాలలో వేల ఏళ్లగా
కొనసాగుతూ ఉంటుంది. జరిగే సంఘటన
మెరుపులా సెకండ్లు, నిమిషాల్లో
ముగుస్తుంది. అంతులేని హానికి
కారణమవుతుంది.
గతంలో
జరిగిన సంఘటన వివరాలు, విధ్వంసం, అంతగా ప్రపంచానికి
అందేవి కావు. ఇప్పుడు పరిస్థితి మారింది. దేశంలోని మారుమూల
పల్లెలో ప్రజలు టివిలో
దృశ్యాలను చూచి,
గుండె కరిగి, సహాయంతో ముందుకు
వచ్చారంటే పరిస్థితిని
అర్థం చేసుకోవచ్చు. మనుషుల్లో
మంచితనం ఉందనడానికి ఇటువంటి
సంఘటనల తర్వాత సాక్ష్యాలు
బయటపడతాయి. మనుషుల్లో పిరికితనం
కూడా ఉందని మరోవైపు సాక్ష్యాలుంటాయి. గుజరాత్లోనే కాదు
దేశంలో మరెన్నో చోట్ల
భూకంపం వస్తుందని వదంతులు
అప్పుడే మొదలయ్యాయి. ఒక పెద్ద భూకంపం
తర్వాత చిన్న చిన్న భూకంపాలు
రావడం మామూలే. అలాంటి భూకంపాలు
వచ్చాయి కూడా! అవి కథలల్లే వారికి
మరింత బలాన్నిచ్చాయి. (మార్చి
నెలలో హైదరాబాద్లో భూకంపం
తప్పదనీ, అందుకు
కారణం నీళ్లు పడని బోర్ బావులని
ఒక ఇంట్లో మాట్లాడుకోవడం
నేను స్వయంగా విన్నాను - రచయిత) ఇంకేముంది?
అంతా అయిపోతుంది. అని చేతులు
వెల్లకిల వేస్తున్న వారూ
ఉన్నారు. ఇటువంటి
సమయాల్లో కావలసింది సరైన
సమాచారం. దాని
గురించి అవగాహన!
సూర్యుడు మండుతుండే
అగ్నిగోళం. అందులోంచి కొంత పదార్థం
బయటపడి భూమి తయారయింది. పై పొరలు చల్ల
బడ్డాయి. ఆ పొర
మీద నీరు చుట్టు గాలితో
కూడిన వాతావరణం ఏర్పడ్డాయి. పరిస్థితులు
అనుకూలించడంతో జీవం పుట్టింది. అది పరిణామానికి
గురవుతూ మనుషులూ వచ్చేశారు. తెలివిగల మానవజాతి
తన పరిసరాలను, పరిస్థితిని అర్థం
చేసుకోవాలనే ప్రయత్నంలో
ఉంది. చాలా చాలా
విషయాలు మనిషికి అర్థమయినట్లే
లెక్క. అటు తన స్వంత మెదడు, ఇటు ప్రకృతి
మాత్రం మనిషికి ఇంక అంతు
పట్టలేదు. రెండూ
కలిసి మొత్తం జాతిని
గగ్గోలు పెడుతున్నాయి. ప్రకృతి నిరంతరం
హెచ్చరిస్తూనే ఉంటుంది. `నీ బ్రతుకు
నీవనుకున్నంత సుఖమయం
కాదు'! అంటుంది. ప్రకృతి వైపరీత్యాలనుండి
అనునిత్యం వెంటాడే శీతోష్ణస్థితి, కాలుష్యం దాకా
అడుగడుగునా అపాయాలే!
ఎండా, వానా, నీరు, గాలి, అన్నీ అవసరమే. అన్నీ మనకు
అనుకూలంగా ఉండే పద్ధతిలో
అవసరం. అంగుళం
మేర దాటి ముందుకు జరిగినా
ఇవన్నీ ప్రమాదాలవుతాయి. అగ్నిగోళం
మీద బ్రతుకుతున్నాం. అనుక్షణం ఆపదల్లో
ఉన్నాం!
విరిగే
కొండ చరియలనుంచి, పొగ మంచు దాకా 20కి పైగా వైపరీత్యాలను
పరిశోధకులు గుర్తించారు. గతంలో ఐక్యరాజ్యసమితి
వారు ఒక దశాబ్దంపాటు
వైపరీత్యాల గురించి అవగాహన, పరిశోధన పెంచడానికి
ఒక కార్యక్రమం నిర్వహించారు. అప్పుడు ఎన్నెన్నో
వివరాలు, విశ్లేషణలు
అందుబాటులోకి వచ్చాయి. వైపరీత్యాల్లో
భూకంపాలకే పెద్ద పీట, నిజానికి భూమి
కంపిస్తూనే ఉంటుంది. లోపలి పొరల్లో
ఉడుకుతూనే ఉంది. గట్టి పడిన పైపొరల్లో
ప్లేట్‌స ఉన్నాయి. అవి కదులుతూ సర్దుకుంటూ
ఉంటాయి. భారతదేశం
ఒకప్పుడు ఆసియా నుంచి
విడిగా ఉండేది. ఉత్తరంగా కదులుతూ
వచ్చి యూరేసియన్ ప్లేట్ మధ్య
రాపిడి ఇంకా కొనసాగుతూనే
ఉంది. గుద్దుకున్నప్పుడు
ప్లేట్లలో కొన్నినెరియలుపడి
ఉంటాయి. అవి
భూగర్భంలో ఉండే బలహీనమైన
ప్రాంతాలు. అటువంటి ప్రాంతాలలోనే
భూకంపాల ప్రభావం ఎక్కువగా
ఉంటుంది.
పరికరాలు అవసరం లేకుండానే
గుర్తించగల భూకంపాలు
ఏటా 50,000 దాకా
వస్తుంటాయి ఇందులో నుంచి
వంద దాకా భూకంపాలు పెద్ద
నష్టాన్ని కలిగించగలుగుతాయి. మరీ గొప్ప హాని
కలిగించే భూకంపం సగటున
ఏటా ఒకటయినా వస్తుందని
పరిశోధకులు సంపాదించిన
సమాచారం చెబుతుంది.
అందరూ గమనించవలసిన విషయం
ఒకటి ఉంది. వెంట
వెంటనే గొప్ప హాని కలిగించిన
భూకంపాలు రెండు మూడు
వచ్చిన సంఘటనలు చరిత్రలో
లేవు. కాబట్టి
ఇవాళో, రేపో, ఇంకో నెలలోనో
మన దగ్గరా కొంపలు కూలుతాయనుకోవడం
తప్పు. మనిషికి
ప్రకృతితో బాటు మెదడు
కూడా అదుపులోకి రాలేదనడానికి
ఇదొక ఉదహరణ మాత్రమే. పరిశోధకులు
కూడా ఇదే మాట నిస్సందేహంగా
చెబుతున్నారు.
భూకంపం తర్వాత ప్రకృతి
వైపరీత్యాలలో చెప్పుకోదగినవి
అగ్ని పర్వతాల పేలుళ్లు. ఇటీవలే పొపొకాట
ఫెటిల్ అనే అగ్ని పర్వతం
పేలింది. పేలేముందు
అది కొంచెం భయపెడుతుంది. మనుషులకు జాగ్రత్త
పడే వీలుంటుంది. తుఫానులు, సుడిగాలులు, వరదలు, వానలు మొదలయిన వాతావరణ
సంబంధ వైపరీత్యాలను గురించి
కూడా ఈ మధ్యన చాలా ముందుగానే
సూచించగలుగుతున్నారు. అందుకని రాను
రాను జన నష్టం తగ్గుతున్నది. వడగళ్లు కూడా
వైపరీత్యాల్లోకే వస్తాయి. మనదేశంలో అగ్ని
పర్వతాలు లేవు. వడగళ్లు పంటలకు నష్టం
కలిగిస్తాయి గానీ, మనుషులకు నష్టం
కలిగించే సైజుకు రానే
రావు. వానలు
లేకపోతే వచ్చే కరువు
కాటకాలు కూడా ప్రకృతి
వైపరీత్యాలే! వాటి గురించి కూడా
ముందే తెలుస్తుంది. వచ్చిన చిక్కంతా
భూకంపాలతోనే ఉన్నట్లుంది.
భూకంపాల గురించి పరిశోధనలు
జరిపే జాతీయ భూభౌతిక
పరిశోధన సంస్థ ఎన్జిఆర్ఐ హైదరాబాద్లోనే ఉంది. చిన్నా చితకా
కదలికలు వచ్చినప్పుడు
కూడా వాళ్లు వెంటనే రంగంలోకి దిగి
అందరికీ వివరాలను అందిస్తూనే
ఉన్నారు. భూకంపం
గురించి సమయం, ప్రదేశాలను ముందే
గుర్తించి ఎప్పడం వీలుకాదని
వాళు్ళ ఒప్పుకుంటున్నారు. అయితే ప్రకృతిలోనే
సూచనలు అందుతాయని, వాటిని అందుకుని
తగిన జాగ్రత్తలు తీసుకోవడం
చేతగావాలని అంటున్నారు
పరిశోధకులు. జంతువులు విపరీతంగా
ప్రవర్తించడం, బావులలో నీటిమట్టం
ఒక్కసారిగా హెచ్చుతగ్గలకు
గురికావడం భూకంపాలకు
ముందు సాధారణంగా జరుగుతాయి. వీటిని ప్రజలు
అంత గట్టి సూచనలుగా భావించకపోవడం
సహజం. వీటికన్నా
ముఖ్యమైన మూడు సూచనలున్నాయి.
భూమి
లోపల జరుగుతన్న గడబిడకు
గుర్తుగా రేడియో ఆక్టివ్ వాయువులు
నేలలో నుండి వెలువడడం
వీటిలో మొదటిది. లాతూర్ భూకంపానికి
ముందు ఇలాంటి వాయువులు
మహారాష్టత్రో బాటు మన
రాష్ట్రం, కర్నాటకలలో
కూడా వెలుపడ్డాయి. పెద్ద భూకంపం వచ్చే
ముందు చిన్న చిన్న కుదువులు
రావడం రెండవ సూచన, ఇటువంటి చిన్న `షాక్స్' కచ్ ప్రాంతంలో ఈ
సంవత్సరం మొదట్లో వచ్చాయట. ఇక మూడవది అంత
సులభంగా తెలియదు. అది నేలలో విద్యుద్వాహకత్వం
పెరగడం. నిజానికి
మొత్తం మూడు సూచనలు మామూలు
మనిషికి అర్థం కానివేననేది
సత్యం!
మన దేశంలో భూకంపాలు తీవ్రంగా వచ్చే ప్రాంతాలను గుర్తించి ఒక మ్యాప్గా తయారు చేశారు. ఇందులో కచ్ ప్రాంతం ఒకటి. భుజ్ పరిసరాల్లోని అల్లాబంగ్ అనే చెరువు భూకంపం వల్ల దానంతటదే తయారయిందట. శ్రీనగర్ పరిసరాలు, అటు మేఘాలయ, అస్సాం మొదలైన ప్రాంతాలు కూడా ఇందులో ఉంది. హైదరాబాద్తో సహా, దక్కను పీఠభూమిలో చాలా ప్రాంతం అన్నిటికన్నా సురక్షిత ప్రాంతంగా గుర్తించబడింది. ఇక్కడి భూకంపాలు 5.7 రిక్టర్కు మించవు. అంటే అపాయం ఉండదు. మహారాష్టల్రో కొంత ప్రాంతం మాత్రం మధ్యరకంలో ఉంది. అందుకే లాతూర్ ప్రాంతంలో పెద్ద భూకంపం వచ్చింది. భూకంపాల విషయంగా దక్షిణ భారతం నిజానికి భయపడనవసరం లేదంటున్నారు పరిశోధకులు మన రాష్ట్రంలో ఒంగోలు, భద్రాచలం, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాలు, హైదరాబాద్ నగరం మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువగా భూకంపాలకు గురికాగల ప్రాంతాలుగా లెక్కింపబడుతాయి.
నిజానికి
రానున్న కాలంలో గుజరాత్ భూకంపంతో
పోల్చదగిన మరో భూకంపం
మన దేశంలో వచ్చే వీలులేదని
పరిశోధకులు గట్టి హామీ
ఇచ్చారు. ఈ ఒక్క
జనవరి మొదటి తేదీ నాడే
ఫిలిప్ఫీన్సులో 7.3 శక్తిగల భూకంపం
వచ్చింది. తొమ్మిదవ
తేదీన వనువాటూ దీవులలో
అంతదే మరొక భూకంపం వచ్చింది. ఆ తర్వాత అలాస్కాలో, మధ్య అమెరికా
తీర సముద్రంలో మరో రెండు
భూకంపాలు వచ్చాయి. అయితే వాటి వల్ల
పెద్ద నష్టం కలగకపోడం
గమనించదగిన విషయం. జూన్ రెండు వేల సంవత్సరంలో
ఇండోనీషియాలో 7.9
రిక్టర్ స్కేల్ శక్తి
గల భూకంపం వచ్చింది. అయితే మృతుల
సంఖ్య మాత్రం వందకు దాటలేదు. గుజరాత్ భూకంపం
శక్తి గురించిన సమాచారంలో
తేడాలు వచ్చాయి. మన దేశపు పరిశోధకులు,
నిపుణలు దీని శక్తిని 6.9గా గుర్తించారు. అయితే
అమెరికా వారి జియలాజికల్ సర్వే
మాత్రం ఈ భూకంపాన్ని 7.9గా గుర్తించింది. భూకంపాల శక్తి
ప్రపంచమంతటా తెలుస్తుంది. మొదట్లో వీటిని
కనిపెట్టే కేంద్రాలు 50కి ఎక్కువగా
ఉండేవి కావు. కానీ అంతర్జాతీయ అవగాహనలో
భాగంగా ఈ కేంద్రాల సంఖ్యను
బాగా పెంచారు. వీరందరూ నిరంతరం
ప్రంపంచమంతటా వచ్చే భూకంపాలను
గమనిస్తూనే ఉంటారు.
భూకంపాలను
గురించి చేప్పే సందర్భాలో
వచ్చే ఈ రిక్టర్ స్కేల్ అనే
సంఖ్య గురించి చాలా మందికి
తెలియకపోచ్చు. వర్షం ఎంత వచ్చింది, గాలి ఎంత బలంగా
వీచింది లెక్కించినట్లే
భూమి ఎంతగా కంపించిందో
తెలిపేందుకు పద్ధతులున్నాయి. ఇవి రెండు రకాలు. మొదటిది మెర్కాలి
స్కేల్లో మొత్తం 12
అంచెలుంటాయి. జరిగిన కదలిక ప్రభావాలను
ఈ అంచెలలో వర్ణిస్తారు. ఇటీవల మాత్రం
రిక్టర్ స్కేల్ ఎక్కువగా
వాడుకలో ఉంది. ఇది భూకంపం విడుదల
చేసిన శక్తిని గుర్తిస్తుంది. అయితే
ఇందులో గుర్తించవలసిన
అంశం ఒకటి ఉంది. ఒక సెంటీమీటరు వర్షం
కంటే రెండు సెంటీమీటర్ల
వర్షం రెండు రెట్లే. మెర్కాలి స్కేల్లో మాత్రం
శక్తి స్కేల్లోని ఒక్కొక్క
అంచెకు సుమారు పదిరెట్లు
పెరుగుతుంది. విడుదలయే శక్తిని
బట్టి కలిగే ప్రభావం
మారుతుంది.
తేడాల
విషయం పక్కన పెడితే, ఒకే శక్తిగల
భూకంపంవల్ల నష్టంలో తేడాలు
ఉండడం గమనించవలసిన సంగతి. ఇండోనీషియాలో
వంద సంఖ్య గుజరాత్లో వేలలోకి
ఎందుకు చేరుకున్నది? అనేది ప్రశ్న? ఇందుకు సమాధానం
దొకరకాలంటే, భూకంపం ఎక్కడ వచ్చిందని
మరో ప్రశ్న వేయాలి!
భూకంపం
సముద్రంలో వస్తే అలలు
అల్లంత ఎత్తుకు లేస్తాయి. వీటిని సునామీలంటారు. తీరానికి దగ్గరగా
ఉంటే ఈ అలలు కొంత ఉత్వాతాన్ని
కలిగిస్తాయి. ఇక భూమి మీద వచ్చే
కంపనాల ప్రభావం గురించి
చెబుతూ పరిశోధకులు ఇలా
నిర్వచించారు `నేల కదలడంతో ముందు
కొండచరియలు విరుగుతాయి, నేల పగుళ్లువారుతుంది. ఇవి ప్రకంపనంతో
బాటే కలిగే ప్రభావాలు. తర్వాత ఆస్తి
నష్టం, ప్రాణనష్టం
అగ్ని ప్రమాదాలు వస్తాయి. ఇవి ప్రాథమిక ప్రభావాలు. ఆ తర్వాత సెంకండరీ
ప్రభావాలుగా, ఆర్థిక సమస్యలు, అంటు వ్యాధులు, తిండి నీళ్ల
కొరత కూడా వస్తాయి. ఈ ప్రభావాలు పెద్ద
భూకంపాలతో బాటు మాత్రమే' !
గుజరాత్లో కలిగిన
నష్టాలకు గమనిస్తే, నగరాల పేర్లు
ముందుగా వినబడుతున్నాయి. తీవ్రత మరీ
ఎక్కువ గనుక పల్లెలు
కూడా నేలమట్టమయ్యాయి. కానీ జననష్టం
పట్టణాల్లో ఎక్కువ. అయిదారంతస్తులుగా
భవనాలు కట్టుకుని అందులో
కుటుంబాలు కాపురం ఉంటే
కూలిన ఇంట్లో ఎంతమంది
కూరుకుని ఉన్నారో తెలియడంలేదు. ఆ మనుషులను
వెలికి తీయాలంటే అది
మరో సమస్య! గుజరాత్కు భూకంపాల
చరిత్ర ఉంది. అయినా అక్కడ కూడా భవనాలను ఆలోచన
లేకుండ కట్టుకోవడం, మనిషి తీరును
చెప్పక చెప్పుతున్నది. ప్రమాదం అడవిలో
వస్తే ఫర్వాలేదు. అక్కడ కూడా చెట్లు, జంతువులు నాశనమవుతాయి. కానీ జనారణ్యంగా
మారిన ఈ నగరాల్లో ప్రమాదం
చిన్నదయినా ప్రభావం ఎక్కువగా
ఉంటుంది.
ఇటువంటి
సమయాల్లో ఎంతో సహనం, సమన్వయం కావాలి. నగరాలను తిరిగి
కట్టేందుకు సమయం
పడుతుంది. అప్పుడయినా సరైనా
పద్ధతులను పాటించాలి. ప్రమాదంలో
ఇరుక్కున్న వారిని వెలికి
తీయడం గగనమవుతున్నది. వైద్య సహాయం
కష్టతరంగా ఉంది. సహాయం పేరిట మనుషులు, పదార్థాలు
పెద్ద ఎత్తున వస్తున్నా
వాటిని సరిగా వాడుకోవడం
వీలుకావడం లేదని అర్థమవుతున్నది. ఇకనైనా ఇటువంటి
పరిస్థితుల్లో జరగవలసిన
పని తీరు గురించి మన వారు
నేర్చుకోవాలి. గట్టి ప్రణాలికలను
తయారు చేయించుకోవాలి. సమయం దాటిన
తర్వాత అందిన సహాయం సహాయమే
కాదు.
భూకంపం
తర్వాత వెనువెంటనే వచ్చే
ప్రాథమిక ప్రభావాలను
ఎదుర్కోవడంలోనే సమస్యలు
వచ్చాయి. తర్వాత
వచ్చే ఆర్థిక, ఆరోగ్య సమస్యలను
ఎదుర్కొనడానికి దేశం
మొత్తం ఒక్క తాటిమీద
నడవలసిన అవసరం వచ్చింది. అప్పుడే
కొత్త పన్నుల గురించి
చర్చ మొదలయింది. సహాయ చర్యల పేరున
దొంగ వ్యవహారాల గురించిన
వార్తాలూ
వస్తున్నాయి. ఇటువంటి సమస్యలన్నింటినీ
ఎదుర్కోవడానికి ముందుగా
అందరికి సరైన అవగాహన
అవసరం. అది
లేకుండా ఎంత చేసినా బూడిదలో
పోసిన పన్నీరవుతుంది.
మనిషికి
గతం నుంచి పాఠాలు నేర్చుకోవడం
చేతనయితే, పరిస్థితి
మరోలా ఉంటుంది. దూరాభారం వారికి
ప్రమాదం ఒక వార్తగా మిగలకూడదు. ఆ ప్రాంతంలో
వారికి అది మరువలేని
శాపంగా మారకూడదు. ప్రపంచం మొత్తం
ఒక కుటుంబంగా మారిన ఈ
రోజుల్లో కష్ట, సుఖం అన్నింట్లోనూ
అందరం పాలుపంచుకోవాలి.
-గోపాలం కె.బి.
తేది:11-01-2001