పరిణామం
- పరిమాణం
ఈ భూప్రపంచం
మీద జీవం
పుట్టి 350 కోట్ల సంవత్సరాలయిందని
అంచనా. ప్రస్తుతం
భూమి మీద యాభైలక్షల నుంచి కోటి రకాల
జీవ జాతులున్నాయి. వాటిలో నాలుగింట
మూడువంతులు జంతువులు. 18 శాతం మొక్కలు. మిగతావి అటుజంతువులు, ఇటు వృక్షాలుకాని
విచిత్ర జీవులు. అయితే జీవం ఆవిర్భవించిన నాటి నుండి
ఈ నాటి వరకు ఉన్న రకరకాల
జీవజాతుల సంఖ్యమాత్రం
చాలా ఎక్కువ. ఇప్పుడున్న ప్రతి జాతికి
కనీసం 800 జాతులు విలుప్తమయినాయని
జీవశాస్త్రజ్ఞుల అభిప్రాయం. అంతరించి పోవడమంటే
రకరకాల కారణాల వల్ల ఆ
రకానికి చెందిన జంతు వృక్షాలు
ఒకటి కూడా లేకుండా పోవడమన్నమాట. ఇటువంటి విలుప్తాలకు
వాతావరణంలో వచ్చిన భరించరాని
మార్పులు కారణమయి ఉండవచ్చు.
ప్రస్తుతం
కూడా జంతుజాతుల విలుప్తమనే
ప్రక్రియ కొసాగుతూనే ఉంది.
దానికి గల కారణాలు
మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయి. దక్షిణ అమెరికాలో 11,000 సంవత్సరాలకు పూర్వం
పెద్ద పెద్ద జంతువులు
ఒక్క సారిగా మట్టుపెట్టుకుపోవడం
ప్రారంభమయింది. అందుకు గల
కారణాలను చెపుతూ పాల్ మార్టిన్ అనే పరిశోధకుడు
ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అప్పట్లో భయంకరమయిన
ఒక ప్రాణిజాతి బయలుదేరి
తన శక్తి పాటవాలతో చాలా
జాతుల ప్రాణులను ముట్టుపెట్టనారంభించిందని
ఆ సిద్ధాంతం చెపుతుంది. మాస్టడాన్ ఏనుగులు, కత్తికోరల పిల్లులు
వగైరాలతో సహా డజన్ల కొద్దీ
జంతుజాతులు ఈ జీవి బారికి
గురయ్యాయి.
ఈజీవి వేటనేర్చుకున్న
మానవుడని మార్టిన్ వర్ణించాడు.
మానవుడు ఆశకొద్దీ అవసరమయిన దానికన్నా
ఎక్కువ జంతువులు ప్రాణాల
తీశాడని నిపుణుల కధనం. ప్రాచీన మానవులు
ఆ నాటికి రాతి ఆయుధాలను
వాడడం నేర్చుకున్నాడు. రాతికి బరిసెలలాగా
కరల్రను సంధించి విసరడం నేర్చుకున్నాడు. అందుకే ఆనందంగా వినాశనానికి
నాంది పలికాడు. మనిషి నాగరికత పెరిగినకొద్దీ అతని ఆయుధాల
నాణ్యత పెరిగింది. ప్రత్యక్షంగా
వేటాడడమేగాక పరోక్షంగా
కూడా పలురకాలుగా అతడు
జీవజాతుల వినాశనానికి
కారణమవుతున్నాడు.
జంతు జాతుల
వినాశనానికి మొత్తం ఒక
మానవ జాతి మాత్రమే కారణం
కాదని గమనించవలసి ఉంది. హిమయుగం అంతరించిన
తర్వాత ఎండాకాలాలు మరింత
వేడిగాను, శీతాకాలాలు
మరింత చల్లవిగానూ మారినాయి. ఇందువల్ల
కూడా ఎన్నో
జంతువృక్షాలు లుప్తమయ్యాయి. అయితే 11,000 సంవత్సరాలనాటి
నుండి మాత్రం విలుప్తాలకు ముఖ్య కారణం మానవుడేనని
పరిశోధకుల అభిప్రాయం. పరిస్థితి ఇదే విధంగా
కొనసాగితే
2000 సంవత్సరాలనాటికి
జీవజాతులు ప్రతి అయిందింటిలోనూ ఒకటి నాశనమవుతుందని
అంచనా. గత
మూడు వందల సంవత్సరాలలోనే
మానవుని ధాటికి తాళలేక
వెన్నెముక గల జంతువులలో 300 రకాలు విలుప్తమయ్యాయి.
ప్రపంచ
వ్యాప్తంగా జంతువులు
విలుప్తమయిన తీరుకు, మానవుని వ్యాప్తికి
సంబంధం కనబడుతుందని పరిశోధకులంటున్నారు. గత 50,000 సంవత్సరాలుగా మానవుడూ
వేటాడుతూ ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా, పసిఫిక్ దీవులకు చేరుకున్నాడు. అక్కడి జంతులు కూడా
అదేకాలంలో వినాశనానికి
గురయ్యాయి. ఆఫ్రికా, ఆసియా, యూరపులోని
కొన్ని భాగాలలో నశించిన
జంతుజాతుల సంఖ్య మాత్రం
తక్కువగా ఉంది. ఇక్కడి జంతువులు అప్పటికే
మానవజాతి నుండి తప్పించుకు
తిరగడం నేర్చుకుని ఉండవచ్చు.
ఆనాటి మానవుడు చేసిన
వినాశనం, నేటి
వినాశనం ముందు దిగదుడుపే. మానవుడు జంతువులను
ఆహారం కోసమే కాక, వాటి చర్మం, ఈకలు
మొదలయిన వాటికోసం కూడా
చంపుతున్నాడు. పంటలను, పశువులను రక్షించుకోవడమనే
నెపంతో మరికొన్ని జంతుజాతులను
ముట్టుబెడుతున్నాడు. చెట్లు నరకడం,
అడవులను తగలబెట్టడం, పశువులమేత, నీటి వనరుల అభివృద్ధి
మొదలయిన కార్యక్రమాల
వల్ల కూడా
జంతుజాతుల ఆవాసాలకు హాని కలుగుతున్నది. పెంపుడు జంతువులుగా
మనిషి చేరదీసిన పిల్లులు, కుక్కలు, పందులు
మనిషిని ఆశ్రయించి బతుకుతున్న
ఎలుకలు జంతువుల గుడ్లను, పిల్లలను మట్టుబెడుతున్నాయి.
మానవుడు
తన స్వంత ప్రయోజనాలకోసం కొన్ని రకాల
కొత్త జంతువులను ఇతర
ప్రాంతాల నుండి తెచ్చి
తన వాతావరణంలో ప్రవేశపెట్టాడు. రకరకాల కొత్త ఆయుధాలు
కూడా ఒక చోటి నుండి మరొకచోటికి
వ్యాప్తి చేశాడు. జంతుజాతులకు అందవలసిన
ఆహారాన్ని తన ఆహారంగా
స్వంతం చేసుకున్నాడు. ఇటువంటి కారణాల వల్ల కూడా ఎన్నోరకాల
జంతుజాతుల మనుగడకు ముప్పు
వాటిల్లింది.
11,000 సంవత్సరాల
క్రితం అంతరించిన కొన్ని
జంతుజాతులు
1. అమెరికన్ మాస్టడాన్ (మామత్ అమెరికానమ్) మామత్ అనే ఈ
ఏనుగు ఈ నాటి ఏనుగులకన్నా
ఆకారంలో చిన్నది. అయినా భారీ శరీరం
గలది. అలాస్కానుండి
మధ్యమెక్సికో ప్రాంతాలలో
ఉండేది. వేటగాళ్ళ
బారిన పడి విలుప్తమయ్యింది.
క్రీ.శ. 500-1950 మధ్యన
అంతరించిన కొన్ని రకాలు
మానవుడు కొత్త ప్రాంతాలకు
చేరి అక్కడి జంతుసంపదకు
కలిగించిన
ముప్పుకు ఇవి ఉదాహరణలు
హవాయి, మడగాస్కర్, న్యూజీలాండ్ వంటి
ప్రాంతాలకు మనిషి చేరిన
తరువాత అక్కడి అమాయక
ప్రాణులు క్రమంగా అంతరించి
పోయాయి. వాటిలో కొన్నింటి వివరాలుః
1. కరొలీనా
పారాకీట్
(కానురాప్సిస్ కారొలినెన్సిస్) 19 వశతాబ్దంలో
అమెరికా అంతటా విరివిగా
కనిపించిన
చిలుక జాతి పక్షి
ఇది. పండ్ల తోటలు, పంటలను నాశనం చేస్తున్నదన్న
నెపంతో రైతులు వీటిని మట్టుపెట్టారు.
2. పాసింజర్ పావురం ( ఎక్టోపిక్టస్ మైగ్రెటోరియస్) 19 వశతాబ్దం
మధ్యకాలానికి కూడా ఈ
పక్షులు గుంపుగా ఎగురుతుంటే ఆకాశం
నల్లబడిందని అనిపించేది. నిర్దాక్షిణ్యంగా
వేటాడబడిన ప్రాణులకు
ఇవి ఉదాహరణలు. ఈ
జాతికి చెందిన చివరి
పక్షి 1914లో సిన్సినాటి జూలో ప్రాణం
విడిచింది.
3. క్వాగా ( ఇక్వస్క్వాగా) తల,
మెడ మీద మాత్రమే ఉండే
జీబ్రా వంటి చారలున్న
ఈ గుర్రం జాతి జంతువు
దక్షిణ ఆఫ్రికాలో ఉండేది. 19వ శతాబ్దం తొలి రోజులలో
తెల్ల దొరల ధాటికి తట్టుకోలేక
అంతరించిపోయింది.
ఈ జాతి చివరి జంతువు 1883లో ఆమ్స్టర్డాం
జూలో మరణించింది.
4. ఎగురలేని
ఇబిస్ ( ఏప్టెరిబస్ గ్లెనోస్) వేయి
సంవత్సరాల క్రితమే హవాయియన్ దీవులలో
తుడిచిపెట్టుకు పోయింది. పొలినీసియన్ల వేటకు, వారి పెంపుడు కుక్కలు, పందులకు చివరకు ఎలుకలకు
బలి అయింది.
5. మొవా (డైనోర్నిస్ జైగాంటియస్) పక్షులన్నింటిలోకి ఎత్తైన మోవా
పది అడుగుల ఎత్తుగలది. న్యూజిలాండ్ నుండి
1,000 సంవత్సరాలనాడు అంతరించింది.
6. జయంట్ లెమ్యూర్ (మెగలాడాపిస్ ఎడ్వార్డి్స)చెట్లలో పెరిగిన
ఈ కోతి జాతి జంతువు చాలా
నెమ్మదయిన జీవి. మడగాస్కర్ దీవికి మానవుడు
చేరిన తర్వాత అంటే 15,000
సంవత్సరాల క్రితం
విలుప్తమయింది.
7. ఆరాక్స (బోస్ప్రైమిజీనియస్)యూరపులోని పెంపుడు
పశువులన్నీ
ఈ అడవి జంతువు జాతి
సంతతిలోనివే. ఇవి
ఆరడుగుల ఎత్తుండేవి. మధ్యయుగం
కాలంలో అడవులు నాశనమవడంతోటే
ఇవి కూడా అంతరించి పోయాయి.
8. డోడో (రాఫస్
కుకులేటస్) ఈ ఎగురలేని
పక్షిని తొలిసారిగా 1598లో మారిషస్లో కనుగొన్నారు. కానీ 70 సంవత్సరాలలో
ఇవి అంతులేకుండా పోయాయి. వేటగాళ్లు, కుక్కలు, గుడ్లుతినే
పందులు వీటి వినాశనానికి
కారణం.
9. స్టెల్లర్స్
సీకా (హైడ్రోడయాలిసిస్ జైగాస్) ఇది ఆవుమాత్రం
కాదు. ఈ జలచరాన్ని
కమాండర్
దీవుల ప్రాంతంలోని
బేరింగ్
సముద్రంలో తొలిసారిగా 1741లో చూశారు. దీని పొడుగు 30 అడుగులు. ఎదురు తిరిగి అపాయం
కలిగించే శక్తిలేని ఈ అమాయక ప్రాణి 1768 కల్లా విలుప్తమయింది.
10. టాస్మేనియస్ తోడేలు (థైలాసినస్ సైనోసెఫాలస్) ఇది కూడా
కడుపుముందు సంచీ ఉండే మార్సుపియల్ జాతి
జంతువు. దీని తల
తోడేలు వలె ఉంటే, శరీరం మీద మాత్రం పులిలాగా
చారలుండేవి. తమ గొర్రెలను చంపుతుందన్న
దృష్టితో యూరోపియనులు
ఈ జాతిని అంతం చేశారు. 1930 నాటికి ఈ
జాతి పూర్తిగా విలుప్తమయిందనుకున్నారు. కానీ ఆ తర్వాత కూడా
అడపాదడపా ఈ జంతువు కనిపించిందన్న వార్తలు
వచ్చాయి.
విలుప్తానికి
చేరువవుతున్న ప్రాణులు
ప్రస్తుతం
కనీసం వెయ్యి రకాల జంతువులు అంతరించి
పోయే స్థితికి చేరుకున్నాయని
అంచనా. ఈ స్థితికి
చేరిన వృక్షజాతుల సంఖ్య
మరింత ఎక్కువ.
విలుప్తానికి
చేరువయిన ముఖ్యమయిన జాతులుకొన్నిః
1. మంచు
చిరుత (పాంథెరా ఉన్సియా) మధ్య ఆసియాలోని కొండల్లో
నివసించే ఈ అందమయిన మృగం
అటు వేటగాళ్ళ బారికి
ఇటు తమ జంతువులను కాపాడుకుంటున్నామనే
నెపంతో మట్టుబెడుతున్న
వారి బారికి గురవుతున్నది. అడవుల వినాశనం కొనసాగుతుంటే
దీనికి ఆవాసం కరువవుతున్నది. ప్రస్తుతం ప్రపంచంలో
వీటి సంఖ్య 5000కు
మించదు.
2. తెల్లరెక్కల
గ్వాన్
(పెనెలోప్ ఆల్బిపెన్నిస్). టర్కీ
కోడికన్నా కొంచెం చిన్నదిగా
ఉంటుంది ఈపక్షి. పెరు ప్రాంతంలోని అడవులలో
దీని నివాసం. వీటి
సంఖ్య బహుశః 100కు
మించదు.
3. కాలిఫోర్నియా
కాండార్(జిమ్నోజిప్‌స కాలిఫోర్నియానస్) ఆకారం
పెద్దదిగా ఉన్నా ఎగుర
గలిగే పక్షులలో ఇది ఒకటి. రెండు రెక్కలు బారజాపితే, ఈ చివరనుండి ఆ చివరకు 10 అడుగుల పొడుగు ఉంటుంది. దక్షిణ కాలిఫోర్నియా
జూలో వీటిని జాగ్రత్తగా
పెంచుతున్నారు. అక్కడ వీటి సంఖ్య
30 దాటింది. 1988లో
జూలో తొలిసారిగా కాండార్లు పిల్లలను
కన్నాయి.
4. కొండ
గొరిల్లా (గొరిల్లా
గొరిల్లా బెరింజై)
గుంపులుగా జీవించే
ఈ ప్రాణి మనుషులను చూస్తే
పారి పోతుంది. ఆఫ్రికాలోని ర్వాండా - జయిరే - ఉగాండా
సరిహద్దు ప్రాంతాలలో
విరుంగా రేంజిలో ఇవి
మిగిలి ఉన్నాయి. అక్కడ వీటి సంఖ్య
400 దాకా ఉంటుంది.
వేటగాళు్ళ, అడవుల వినాశనం ఈ జాతి
స్థితికి కారణం.
5. గోల్డన్ లయన్ టమారిన్ (లియోంటోపితికస్ రోజాలియా) ఇది కోతి జాతి జంతువు. బ్రెజిల్ దక్షిణ ప్రాంతాలలో 400 దాకా మిగిలి ఉన్నాయి. వ్యవసాయం, పశువుల
మేత, అభివృద్ధి
పేరున జరుగుతున్న ఇతర కార్యక్రమాల
కారణంగా వీటి సంఖ్య క్రమంగా
తరిగి పోతున్నది.
6. ఖడ్గ
మృగం (డైసిరాస్ బైకార్నిస్) ఔషధంగా
పనికి వస్తుందని అభూత
శక్తులను కలుగజేస్తుందని ఈ అతికాయపు
ప్రాణికొమ్ముల పట్ల మనిషి
ఆసక్తి పెంచుకున్నాడు. గత పది సంవత్సరాలలో వీటి సంఖ్య
నాలుగింట మూడు వంతులు
తగ్గింది. ప్రస్తుతం
వీటి సంఖ్య 3,500 ఉండవచ్చు. వీటి నివాసస్ధానం
ఆఫ్రికా.
7. నీలి తిమింగలం (బాలినాప్టెరా మస్కులస్) జంతువులన్నింటిలోకి
పెద్ద కాయం గల జలచరమిది. గత శతాబ్దంలోనే దీన్ని వేటాడడం
మొదలయింది. 1966 నుండి
అంతర్జాతీయస్థాయిలో
దీని రక్షణ
కొరకు కృషి జరుగుతున్నది. వీటి సంఖ్య పదివేలకన్నా
తక్కువే ఉంటుంది.
మానవుడు
ఇటీవలే తను చేస్తున్న
వినాశనాన్ని గుర్తించిన దాఖలాలు
కనబడుతున్నాయి. అంతరించి పోతున్న ప్రాణులకోసం `అభయారణ్యాలు,
ఏర్పాటు చేయడం వీటిలో
మొదటిది. ఇక అడవుల
వినాశనం వేగాన్ని తగ్గించే మార్గాలు
కూడా వెదుకుతున్నారు. అయినా ప్రాణికోటిలోని వైవిధ్యాన్ని
యధాతధంగా నిలపడం బహుశః
మనిషి తరం కాదని నిపుణుల
అభిప్రాయం.
తన జాతి
సంఖ్య అదుపులేకుండా పెరుగుతుంటే
మనిషి జంతువులను గురించి
పట్టించుకునే పరిస్థితిలో
ఉండకపోవడం సహజమే!