షాన్ ఏంటికి
ఒక్కొక్క గదిలోనూ
ఒక ట్యూబ్లైటు, ఒక మామూలు
లైటు, ఒక బెడ్లైట్ ఉండడం
ఇప్పుడు చాలా మామూలయింది. హాలు పెద్దదయితే
అందులో అరడజను దీపాలు, అందులో సగమన్నా
పంఖాలు ఉంటాయి. గోడ మీద రెండు మూడు చోట్ల
సైనికుల్లాగ వరసగా స్విచ్లుంటాయి. ఒకప్పుడు, ఆముదం దీపాలు పెట్టుకునే
వారట. అది మరీ పాతకాలం. మేము చదువులో
కొంచెం ముందుకు కదిలిన
తర్వాత కూడా ఇంట్లో గ్యాస్నూనె దీపాలే
గతి. అందుట్లో
ఒకదాని పేరు `కందిలీ.' అందరికీ
తెలిసిన పేరు(?) హరికెన్ లాంతరు. వంట, భోజనాలు
ముఖ్యం గనుక ఆ కందిలీ
వంటగది ముందు, భోజనాల పడసాలలో ఉండేది. మిగిలిన
గదుల్లో కోడిగుడ్డు బుడ్డీలుండే
చిమ్నీలు మాత్రమే గతి. సాయంత్రం లక్ష్మిదేవి
ముందర దీపం పెడితే, అందుల్లో చమురున్నంత
సేపు ఆ గదిలో ఎక్కువ వెలుతురు. అది నిజానికి
గదికాదు మనసాల అనే వారు
దాన్ని. అది చాలా పెద్దహాలు. అయినా
కోడి గుడ్డు చిమ్నీయే
అక్కడ.
ఊరు మొత్తం మీద
సైకిలుండే పెద్దమనుషలు
నలుగురుండే వారేమో. సైకిలు నిజంగా
పెద్ద మనుషలులకు
గుర్తు. గడియారమూ
అంతే. పక్కింట్లో
ఉండే అన్నగారొకాయన పట్నం
నుంచి ఒక
ట్రాన్సిస్టర్ రేడియో
తెచ్చారు. దాన్ని
తీసుకుని ఆయన గర్వంగా
ఇల్లంతా తిరుగుతుంటే
మేం ఆయన వెంట నోరు వెళ్లబెట్టుకుని
చూస్తూ తిరిగిన దృశ్యం
ఈ నాటికీ కళ్లలో మెదులుతుంది.
ఊరికి దగ్గరలో
ఒక మిల్లు వచ్చింది. కూలినాలి చేసుకునే
వారు కొంతమంది, మిల్లులో నౌకరికి కుదిరి
నాలుగు పైసలు సంపాయించడం
మొదలయింది. అప్పుడు ఊర్లో సైకిళ్లు
ఎక్కువ కావడం కూడా మొదలయింది. పెళ్ళి అయితే `పిలగానికి సయికిలు, గడియారం, రేడియ' ఇయ్యాలనేది
ఒక స్టేటస్ సింబల్గా మారింది. గుడి మీదనుంచి
ఒక్క స్టేషన్ మాత్రమే
వినిపించే కమ్యూనిటీ
రేడియోకు గౌరవం తగ్గింది.
అప్పట్లో పైసలున్నా
సరే, వాటిని ఖర్చుపెట్టడానికి
మార్గాలు తెలియవు. అసలు బజార్లో
ఇన్ని వస్తువులెక్కడివి? ఉన్న ఒకటి రెండు
వస్తువులు కూడా మనకెందుకులే
అనుకోవడమే ఒక సంతృప్తి.
చేతనయిన చోటికి పైసలు `కూడబెట్టడం'అని ఒక పద్ధతి
కొంత మందికి మాత్రమే
తెలిసేది `గాజుల
బ్యారం భోజనానికి' మాత్రమే సరిపోయే
పద్ధతయితే ఇక సమస్యే లేదు. ఆడవారికి గానీ, మగవారికి గానీ
ఇన్ని తీర్ల బట్టలు లేవు. ఇన్ని రకాల సోకులు
లేవు. ఉన్నాసరే
అవి తెచ్చుకోవాలన్న మనసు
లేదు. స్థితిమంతులయితే, పొలమూ, పశువులూ, వెండి
బంగారమూ మాత్రమే, దానికి గుర్తు! ఇంట్లో రెండు
కుర్చీలు తెచ్చుకుని, దర్జాగా కూచోవచ్చునని
కూడా ఎవరికీ తెలియదు.
కాలం మారి రాను
రాను కన్సూమరిజం మొదలయింది. బట్టలు ఉతుక్కునేందుకు, వారి వారి స్తోమతను
బట్టి రెండు మూడు రకాల
సబ్బులు, స్నానానికి
మరో రెండు మూడు రకాల సబ్బులుండేవి. అటువంటిది, దుకాణ దారునికే
గుర్తు లేనన్ని రకాల
సబ్బులు వచ్చినయి. ఏది
ఎంచుకుని తెచ్చుకోవాలో
తేల్చుకోవడం పెద్ద సమస్యే
అయింది.
పల్లెలకు కూడా
కరెంటు వచ్చింది. దీపాలు వచ్చినయి.
అంతేగాని పంఖాలు రాలేదు. ఎదురింట్లో ఉండే
వ్యవసాయ కుటుంబం వారు
పల్లెలెక్కన స్థితి పరులే. ఇద్దరన్నదమ్ములూ
వ్యవసాయంతో బాటు నౌకరీలు
కూడా చేస్తుండిరి. ఇంట్లో గాలి ఆడడం
లేదనిపించి చిన్నతను
ఒక టేబుల్ ఫ్యాన్ కొని
తెచ్చాడు. వాళ్లమ్మగారికి
దాని ఇంగిలీషు పేరు నోటబట్టలేదు. `ఈ షాన్ ఏంటికి
దెచ్చిన్రు'? అని అడిగింది. అనవసరం గదా మనకు అని
ఆమెగారి భావం. షాన్ అంటే గొప్పలు
అని అర్థం వస్తుంది ఉరుదూలో
నిజంగానే పల్లె బతుకులకు
షానెందుకు?
కడుపు నిండా, కమ్మగా తినాలె.
కలిగింది పదిమందికి పంచిపెట్టాలె. అదే నిజమయిన గొప్పదనం. కానీ ఈ పద్ధతి
పాతబడిపోయింది. ఇంట్లో కూచుని ఏమి తిన్నదీ
చూచే వారెవరూ ఉండరు. అంతేగానీ, కూర్చుండ మా ఇంట
కుర్చీలు లేవు, అనుకుంటే మాత్రం అవమానమయిపోతుంది. అందమయిన దుస్తులుండాలి. ఇంటాబయటా అన్నీ
రకాల హంగులుండాలి. అప్పుచేసయినా
సరే, అన్నింటినీ
అమర్చుకోవాలి. కాలానికి తగినట్లు, అందరి మధ్యనా
ఎగతాళి కాకుండా, ఉండాలంటే తిండి కాదు
ముఖ్యం. ఈ హంగులే
మన రంగులుగా అందరికి
కనబడతాయి మరీ.
రంగుల టీవీ ఉండాలి. వీలయితే అవి రెండుండాలి. టేప్ రికార్డర్ పాతపద్ధతయి
పోయింది. సీడీప్లేయర్లో పాటలు
బాగా వినిపిస్తాయి. వీసీడీ వేసుకుని
సినిమా చూచే వీలుంటే
మరీ మంచిది. వంటిట్లో నడుం విరుగ నవసరం లేకుండా
రకరకాల యంత్రాలుండాలి. గ్యాసు స్టవుండాలి. పైషర్ కుక్కర్, మిల్క్
బాయిలర్ వగైరా వగైరా. ఈ
చాంతాడు లిస్టు ఎక్కడ
తెగేను. పేలాలు వేయించుకునేందుకు
ఒక యంత్రం, రొట్టె కాల్చుకునేందుకు
మరో యంత్రం. మజ్జిగ కలిపేందుకు ఒక
యంత్రం, వెన్న
పడిందాకా చరిచేదానికి
మరో యంత్రం.
టెలిఫోన్ ఒకటి
ఉంటే సరిపోదు. ఎక్కడి
నుంచయినా సరే మాట్లాడేందుకు
వీలుగా కార్డ్ లెస్ ఫోన్ ఉండాలి. ఇంట్లో ఎవరూ లేనప్పుడు
జవాబు చెప్పే ఆన్సరింగ్ మెషిన్ ఉంటే
మరీ మంచిది. గది గదికీ షాన్, అదే, ఫ్యానుండాలి. ఎయిర్ కూలర్ ఎండకాలం
రాగానే పనిమొదలు పెట్టాలి. ఇవన్నీ గొంతెమ్మ
కోర్కెలు కానేకావు. అచ్చమయిన మధ్యతరగతి
మందహాసాన్ని మరింత మందంగా, అందంగా తీర్చిదిద్దగల
హంగులు మాత్రమే ఇవన్నీ.
పిల్లలకు ఈ హంగులు
లేని ప్రపంచం తెలియదు. చెబితే బీద అరుపులు
అరుస్తున్నారనుకునే
ప్రమాదం నిండుగా ఉంది. మనిషికెప్పుడూ
ఒకటే బాధ. జీవితం
చేతనయినంత సౌకర్యంగా
గడవాలని అందులో తప్పేమీ
లేదు. కానీ జీవితం
మరింత ఆనందంగా గడవాలంటే
మాత్రం, ఈ హంగులకు
తోడు మరేవో కొన్ని రంగులు
కూడా ఉండాలేమో
మరి?
-గోపాలం కె.బి.
తేది:27-03-2002