పాలమూరు పట్నమయింది.
బస్
స్టాప్ దగ్గర నిలబడి ఉన్నాను. ఒకతను వచ్చి ఫలానా బస్సు ఇక్కడికి
వస్తుందా ? అనడిగాడు. నాకు తెలియదు. అదే మాట చెప్పాను.
నీవు ఎక్కడుంటావు? అనడిగాడు. ఎందుకని
అడిగితే `నీవు పల్లెటూరి వాడివయితే
నీకు బస్సు సంగతి తెలియదు. లేకుంటే
తెలుస్తుంది అన్నాడు. నాకు కొంచెం కోపం వచ్చింది. కానీ తమాయించుకున్నాను. నాకు ఆ తర్వాత అనుమానం
వచ్చింది. బస్సు
గురించి అడిగాడంటే అతనికీ
తెలియదు. ఆ రకంగా
అతనూ పల్లెటూరి వాడయ్యాడు. అతనికింకా
ఏమేం సంగతులు
తెలియవో మరి!
తర్వాత మరోసారి
పల్లెకు పోయాను. బస్సు దిగిం తర్వాత
ఎందుకోగానీ ఒక్క నిమిషం
చుట్టూ కలియజూడాలనిపించింది. టీ షాపులు మొదలు టేపురికార్డర్లమ్మే అంగడి
దాకా ఎన్ని హంగులు వచ్చాయక్కడికి? ఊళ్ళో ఓ డాక్టరున్నాడు. రక్షిత మంచి నీటి పథకం అంటూ నల్లాలున్నాయి. చిన్నప్పుడయితేనా, ఊరంతా కలిసి రెండు
మూడు దుకాణాలు. అవి ఇళ్ళలోనే నడిచేవి. దుకాణదారు రోజూ
సైకిలు మీద వెళ్ళి కొత్త
సరుకులు తెస్తాడు.
ఇవాళ ఎవరయినా అడిగిన
వస్తువు లేదంటే, మరుసటిరోజుకు దొరుకుతుంది. అంతకన్నామించి
ప్రజల దగ్గర పైసలుండేవి
కావు. కూలీ
తెచ్చుకున్నవీ, పండించుకున్నవీ తిండి
గింజలూ, అవసరం
కొద్దీ అంగడి వారికి
ఇస్తే తూచి ధరకట్టి దానికి
సరిపడా సామాను ఇచ్చేవారు. కోడినమ్ముకుని డబ్బు చేసుకునే
వారు, కూరగాయలమ్ముకుని అవసరాలు
తీర్చుకునే వారూ,
ఎవరూ కూడా తాము చేస్తున్నది
వ్యాపారం అనుకోలేదు.
ఇంతో అంతో కలవారి
ఇళ్ళలో కూడా ఆడకూతుళ్ళకు పైసలంటే
ఏమిటో తెలిసేదికాదు. కానీ వారి అవసరాలు
వారివి. గాజులు
వేయించుకోవాలి. పిన్నులు, పక్కపిన్నులు, కొంచెం ముందుకు సాగగలిగితే
స్నోలు, పౌడర్లు, రిబ్బన్లు కావాలి. మా అక్కయ్య జడవేసుకుని
చివర్న సన్నటి తాడు కట్టుకోవడం
నాకు గుర్తుంది. గాజులాయన నెలకు ఒక సారీ, రెండుసార్లూ వస్తాడు. సైకిలు మీద పెట్టె
పెట్టుకుని
అరుస్తూ ఊరంతా తిరుగుతాడు. అలవాటుగా కొంతమంది
ఇళ్ళ అరుగుమీద చేరుకుంటాడు. ఆ చుట్టుపక్కల ఉండే
ఆడంగులంతా అక్కడికి చేరుకుంటారు. గాజులాయనకు రూపాయలూ, పైసలే ఇవ్వాలన్న కట్టడి
ఏమీ లేదు. కడుపు
నిండా భోజనం పెట్టినా
సరే చేతినిండా గాజులేసేవాడు. కలిగిన వారు కాయా, కూరా, ధాన్యం
ఇస్తే తీసుకునేవాడు.
అమ్మాయిలకు ఆకర్షణ
ఉండే మరోరకం బేరం సూదులు
ముత్యాలవాళ్లు, వీళ్ళ దగ్గర సూదులే
కాదు, అమ్మాయిలకు, అమ్మలకు పనికి వచ్చే
రకరకాల వస్తువుంటాయి. వీళ్ళంతా ఆడవాళ్ళే. ఒక అందమయిన గంపలో తమ
సరంజామా ఎత్తుకుని, ఒక్కో సందర్భంలో చంకన కట్టిన గుడ్డలో
బిడ్డతో సహా వీళ్లు ఊరూరా తిరుగుతుండేవారు. మిస్వరల్‌డలూ, టెలివిజనూ వచ్చిన
తర్వాత ఇన్ని రకాల
సౌందర్యసాధనాలు వచ్చాయికానీ, అప్పట్లో స్నో,
పౌడర్ మాత్రమే ఉండేవనుకుంటాను. అప్పుడో ఇప్పుడో వ్యాసలైన్ కనబడేది. వీటన్నింటికీ డబ్బులు అమ్మాయిలు
ఎక్కడి నుంచి తెచ్చుకునే
వారో మరి?
పల్లెటూరి అమ్మాయిలకు
పెద్ద అంగడికి పోయి తనకు
నచ్చిన చీరె, రయికె
తెచ్చుకోవడం తెలియదు. అప్పట్లో అందరి దుస్తులూ
ఒకే రకంగా ఉండేవనిపిస్తుంది. ఇప్పుడు నాగరికత పెరిగి `గ్రామీణాభివృద్ధి' నినాదంగా బతుకుతున్న
కొంతమంది, ముదురు
రంగులుండే, ముతకరకం
చీరలు ఫ్యాషన్గా కట్టుకుంటారు. మా ఊరికి కోటకొండ ముసలాయన ఒకతను వచ్చేవాడు. నిజంగా ముసలాయనే. అతను తెచ్చే నేత చీరెలు, రవిక కణుములు పల్లెవారికి
పనికి రాకుండా పోయి, ఇప్పటికి గొప్పవారి వార్డ్రోబ్లకు చేరాయని
నాకు ఇప్పుడనిపిస్తుంది. ఊళ్ళో ఆడవాళ్ళంతా
కోటకొండ ముసలాయన పిల్లలే. అందర్నీ ఆదరంగా `బిడ్డా' అని
పిలిచేవాడు. అప్పుగా
కూడా బట్టలిచ్చేవాడు. మా అమ్మ ఆయనకు అన్నంపెట్టడం
గురించి చర్చేలేదు. అతను
మా ఇంటికి అతిధి కింద
లెక్క.
ఇవాళ ఊళ్ళో వెలసిన
దుకాణాలలో
కోకాకోలా, పెప్సీలు, మినరల్ వాటర్ కూడా దొరుకుతున్నాయి. మాకు పిప్పరమింటులనే
గోలీలు, చిన్న
చిన్న బిస్కట్లు తప్ప
మరోటి దొరికేవి కావు. ఎప్పుడో ఒక సారి పీచు మిఠాయి
అమ్మేటతను వచ్చేవాడు ` అమ్మా తాన్కీ పోండీ, పైసా అడ్గీతేండీ' బొంబై మిఠై కొన్కోండీ' అంటూ పాట పాడేవాడు. పైడ్ పైపర్ వెంట ఎలుకలు పోయినట్లు
మేమంతా ఆ సైకిల్ వెంట పడి వెళ్ళేవాళ్ళం. అప్పుడతను కొంచెం
మిఠాయి ఒక బొట్టుకు ఇచ్చేవాడు. ఈ మధ్య నెపుడో మా అమ్మాయి
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్లో అలాంటి మిఠాయి
కొన్నది. దాని పేరు షుగర్ క్యాండీ, వెల పదిరూపాయలు. మా అమ్మాయి పల్లెటూరి
పిల్లకాదు మరి.
ఎండాకాలం వస్తే
మరో ఆకర్షణ అయిస్ ఫ్రూట్. దాన్ని అమ్మేవారూ
కొనేవారూ అందరూ `అయిస్క్రోట్' అనేవారు. అవి
తింటే గొంతు నొప్పవుతుందని
పెద్దల అభ్యంతరం.
ఎలాగయినా తినాలని
పిల్లల తాపత్రయం. వడ్లు దంపే మరగిర్నీలో
అనుబంధంగా ఈ అయిస్ క్రోట్ తయారయ్యేది. కొంతమందికది ఆ రెండుమూడునెలలూ
జీవనోపాధి కల్పించేది. ఆకు పచ్చని ఇన్సులేటెడ్ డబ్బాలలో
వాటిని నింపి సైకిల్ వెనుక
కట్టుకుని
తలోదారీ బయలు దేరి
పల్లెల్లో
అమ్ముకుని, సాయంత్రానికి ఇల్లు
చేరడం వారి కార్యక్రమం. అంటే ప్రతి ఊరికీ వారు
చేరుకోవడానికి ఒక సమయం
ఉంటుంది. సరిగ్గా ఆ సమయానికి, రెండు మూడు పైసలు సంపాయించగలిగిన
ప్రతి పిల్ల , పిల్లవాడు
ఎదురుచూస్తూ ఉండేవారు. గొంతునొప్పి అయితేనెవరికి
భయం. `చల్లగా తియ్యగా
అయిస్క్రోట్' తినాల్సిందే.
ఇటువంటి చిన్న
చిన్న సరదాలతో సంతృప్తి
పడిన నాలాంటి పల్లె మనిషికి
నగరంలో ఏ బస్సు ఎక్కడికి
పోతుందో తెలియనవసరం లేదు.
ఆ సంగతి నాకు తెలియలేదని
ఎవరో ఎగతాళి చేస్తే బాధపడడం
అంతకన్నా అవసరం లేదు. కోకాకోలాలు, కుళాయి నీళ్లూ వచ్చి
పల్లెల్ని పల్లెలుగా లేకుండా
చేశాయి. ఆ మనుషులూ, పల్లెమనుషుల్లా ఉండడం లేదు. ప్రగతి జరగవలసిందే. పల్లెలు పట్నాలయిపోవలసిందే. ఏం చూసి అన్నారో తెలియదు
గానీ, తాతగారు పాలమూరు
పట్నమయిపోతున్నది' అన్నారట.