ఏస్కో
బుడ్డీ చీకటింటిలో, మందేస్కోబుడ్డీ చీకటింటిలో
“ఏస్కోబుడ్డీ
చీకటింటిలో, మందేస్కోబుడ్డీ
చీకటింటిలో” అంటూ జానపదం
బాణీలో నాన్నగారు ఒకపాట
పాడుతూ ఉండేవారు. నిజానికి చీకటి
అనే మాటకు బదులు మరో మాట
ఉండేది. అది వాడడం ఇప్పటి పరిస్థితుల్లో
కుదరదు. ఆ ఇంటిలో “చీకట్లో
చిందులాట, తెరపైని బొమ్మలాట”ఉంటుంది. వాటితో
బాటు “సోడాబుడ్డి
పిలుపులు, సారాయి కిళ్ళీ
ఉమ్ములు” కూడా ఉంటాయి ఇప్పటికి
ఆ ఇల్లేమిటో ఆర్ధమయి
ఉండాలి. సినిమా
వచ్చిన మొదట్లో,
సినిమాహాలు గురించి
జనం పాడుకున్న పాట అది. ఇవాళ మన దేశంలో రాజకీయం, సినిమా, క్రికెట్ల కున్న పాపులారిటీ
మరో విషయానికి ఉన్నట్టు
తోచదు. చిత్రంగా, ఈ మూడు రంగాల వారూ
ఒక దాంట్లో నుంచి మరోదాంట్లోకి
కప్పదాటుగా మారుతున్నారు
కూడా.
మొదట్లో
సినిమాలు వచ్చినప్పుడు, అవి
చాలా మటుకు రాజుల కథలు, పౌరాణికాలుగానే
ఉండేవి. కొంత కాలం తర్వాతే
సాంఘికాల జోరు అందుకున్నది. అందులోనూ
మంచి సందేశాత్మకమయిన
సినిమాలే ఎక్కువగా వచ్చేవి. అయినా
సినిమాను చీకట్లో చిందులాటగానే
లెక్కవేశారు మనవాళ్లు. సినిమా
చూడడమంటే, ఆదేదో పనిలేని
వాళ్లు చేయదగిన పనికిందే
లెక్క. నిజంగా పండితులంతా
పనిగట్టుకుని ఈ రంగంలోకి
దూకే దాకా సినిమాలో నటించడం, సినిమా
తీయడం, రాయడం అన్నీ కొంచెం
అగౌరవమయిన పనుల కిందకే
లెక్కయినట్లున్నాయి. కానీ
అందులో డబ్బులు బాగా
రాలుతుండడంతదో చాలా మంది
అటువేపి మొగ్గుచూపి, సినిమాకు
గౌరవాన్ని కలిగించారు.
అది మంచిదిగానీ, చెడ్డది
గానీ, సినిమా ద్వారా వెళ్ళినంత
సులభంగా, ఒక సందేశం సమాజంలోకి
చేరడానికి మరో మార్గం
ద్వారా వెళ్ళదనిపిస్తుంది. గత
మూడు నాలుగు నెలల్లో
వచ్చిన యువప్రేమ సినిమా
ప్రభావం గురించి ఒక పెద్ద
మనిషి చేసిన విశ్లేషణ
ఆశ్చర్యం కలిగించింది. కురవ్రాళ్ళంతా
ఆ సినిమాలను ఆదర్శంగా, ప్రేమించి, రేపులు, హత్యలు, ఆత్మ
హత్యలకు పాలుపడుతున్నారట. సినిమాలు
చూచి దొంగతనాలు చేయడం
గురించి ప్రపంచమంతటా
తెలిసిందే. మంచికన్నా
చెడు మనుషులను మరింత
సులువుగా ప్రభావితం చేస్తుందనేది
గుర్తించవలసిన నిజం. సినిమా
మొత్తం చెడు చూపించి, “చివరకు
మాత్రం ఇది చెడు తెలుసా”?
అని చెప్పినందుకు
ఆ సినిమా వల్ల మంచి జరగదని
తేలిపోయింది. అటువంటి సినిమాలను కొంత
మంది మాత్రమే ఆసక్తిగా
చూస్తారు.
ఇదంతా
ఆలోచిస్తుంటే, చిన్నప్పుడు
సినిమాలు చూడడం గుర్తొస్తుంది. ఒక
సినిమా వస్తుంది. అది
బాగుందన్నమాట పల్లెలకు
కూడా పాకుతుంది. ఇక ఎద్దుల
బండ్లు కట్టుకుని, సద్దులు
కూడా కట్టుకుని పల్లెలనుంచి
జాతరలకు పోతున్న వారివలె
బయలు దేరి సినిమాచూచి
వచ్చే వాళ్ళం. నిజానికి
మా పల్లె సినిమాకు నడిచిపోగలిగిన
దూరంలోనే ఉండేది. అయినా
పెద్దలూ, పిన్నలూ నడవడం
కుదరదు గనుక బండి తప్పేదికాదు. నేను చదువు పేరిట
రోజూ ఆ సినిమాల దాక వెళుతూ
ఉన్నా, ఇంటికి బయలు దేరి
వెళుతుంటే, దారిలో బండి
అడ్డం వచ్చేది. ఆ బండిలో
సినిమాకు పోతుంటే, పట్నం
మిత్రులు చూచి నవ్వుతారేమోనని
ఓ అనుమానం. అయినా లవకుశ, రాము, ప్రహ్లాద
లాంటి సినిమా దాకా బండీలోనే
వెళ్లి చూచినట్లు గుర్తు. ఈ
మూడింటిలోనూ రాము సాంఘిక
చిత్రం తల్లి లేని పిల్లవాడిని
తండ్రి పెంచడం గురించి
కథ. పనిగట్టుకుని
వచ్చి, పైసలిచ్చి టాకీసులో
దూరి, మనసారా ఏడ్చే అమ్మలను, అక్కలనూ
చూచి ఆశ్చర్యపోయే వాడిని, సీతకష్టాలు
సీతవికావు, రాముకష్టాలు
రామువి కావు. అన్ని
కష్టాలూ మావే. చూడడం
తప్పదు మనసు కష్టపెట్టుకోకా
తప్పదు. మానవ సంబంధాలు మరో
రకంగా ఉండేవి గనుక, ఆ
సంబంధాలను గురించి బొమ్మ
తీసి, అందరి మనసులనూ పిండి, డబ్బు
చేసుకోవడం అప్పట్లో సినిమా
వారు తెలివిగా చేసిన
పని! సినిమా అంటే ఎంతో
గౌరవంగా ఉండేది. నవ్వించడానికి
పూనుకుంటే, పక్కలు పట్టుకుపోయేదాకా
నవ్వు పంచేది. ఎక్కడా
వెలికితనం లేదు.
చదువు
ముందుకు సాగుతుంటే, చదువుతో
బాటే సినిమాలు చూడడమూ
ముందుకు సాగింది. అంతచవకగా, మరోరకంగా, సరదాగా
కాలక్షేపం చేసే పద్ధతి
మరోటి లేదు గనుక, పెద్దవాళ్లుకూడా
“పోనీలే” అని
మమ్మల్ని సినిమా చూడనిచ్చినట్లున్నారు. ఇప్పుడొస్తున్న
సినిమాలే గనుక అప్పట్లో
వచ్చుంటే, టాకీసు చాయలకు
కూడా పోనిచ్చేవారు కాదని
నాకు తెలుసు. నెమ్మదిగా
అప్పుడే సినిమాల్లోకి
మసాలా చేర్చడం మొదలయింది. రాధాకృష్ణ
టాకీసులో సినిమా చూడడానికి
వరుసలో నిలబడి ఉన్నప్పుడు, రద్దీకి
కారణం గురించి చర్చ జరిగింది. “ఇందుట్ల
తొడ సూపిస్తరంట”!
అన్నవ్యాఖ్యానం వినిపించింది! జానపద చిత్రాలలో
నిజానికి అంతకంటే
ఎక్కువే అంగప్రదర్శన
జరిగేది. అయినా
కథపట్టులో దృష్టి అటువెళ్ళినట్లు
లేదు. ఈ సినిమాలో
ఓ తల్లి పుణ్యం గట్టుకుని
నేరుగా తొడచూపిందన్న
మాట. ఇప్పుడే
సినిమా (కనీసం
టీవీలో) చూచినా, అమ్మాయిలకు
తక్కువ గుడ్టలుంటాయి. అబ్బాయిలే సిగ్గుపడుతున్నట్లుగా, నిండు చేతుల టీషర్టుతో, ఒళ్ళంతా కప్పుకుని
ఉంటారు. ఈ సినిమా
చూడడానికి బండి కట్టుకుని
రానవసరం లేదు. సినిమాయే సిగ్గు విడిచి
పల్లెదాకా వచ్చి నట్టింట్లో
నాట్యం చేస్తుంది. అందులో మనుషులు, అమ్మాయిలు గానీ, అబ్బాయిలు గానీ, తెలుగువాళ్ళలాగా
మాత్రం ఉండరు. ఒకవేళ తెలుగు మాట్లాడినా
అది తెలుగులా ఉండదు. ఏ సినిమా ఏభాషలో, ఏ దేశంలో ఆడినా ఒకే
లాగుంటుంది. తెలుగు
మాటాడుకునే జంట,
ఒక్కక్షణంలో అమెరికా, ఆస్ట్రేలియా వెళ్ళిపోయి
వీధుల్లో పడి పాటలు పాడుతుంటారు. అందుకేనేమో ఆ పాటలు
తెలుగులాగుండవు.
సినిమా
మొత్తానికి చీకట్లో చిందులాట
కాదు అంతా బట్టబయలుగానే
తయారయింది. చూడడం మీ ఇష్టం.
-గోపాలంకె.బి.
తేది:27-03-2002