చిత్రభాను
క్రమం
మరోకొత్త సంవత్సరం వచ్చింది. దీని పేరు చిత్రభాను. విచిత్రంగా
మనవారు సంవత్సరాలకు అంకెలను
గుర్తుగా వేయలేదు. పేర్లు
పెట్టారు. అవి కూడా
అరవయి మాత్రమే పెట్టారు. ఆ
లెక్కన వచ్చిన సంవత్సరాలే మళ్ళా
వస్తుంటాయి. నిజానికి
కాలం సుడులు తిరగదు. గానుగెద్దులాగా
అక్కడే గుండ్రంగా
కూడా తిరగదు. దాని పద్ధతిలో
అది పోతుంది. కాలం వంపు
తిరుగుతుందని
సైన్సు అంటుంది. భూమి
గుండ్రంగా ఉంటుందని కూడా తెలుసు. కానీ
చూచే వారికి అది బల్లపరుపుగా
ఉన్నట్లు కనిపిస్తుంది. కాలం
కూడా ముందుకే సాగుతుందనిపిస్తుంది. గడిచిన క్షణం
మనకు మరోసారి అందుబాటులోకి
రాదు. మనిషి మాత్రం సుడులు
తిరుగుతుంటాడు. ప్రదక్షిణాలు చేస్తుంటాడు. చరిత్ర
పునరావృతమవుతుందంటారు. అంటే
పాతకాలపు వ్యక్తులు మళ్ళీ వస్తారని కాదు. పాత
కాలపు పద్ధతులు, ఆలోచనా
ధోరణలు మాత్రం తప్పకుండా
తలలెత్తుతూనే ఉంటాయి. మనిషి
మెదడుకు ఉండే శక్తి అంతు
లేనిదంటారు. అయినా ప్రపంచం
నలుమూలలా అందరికీ ఒకే
రకమయిన ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనలు
ఎంత కాలమయినా అదే రకంగా వస్తుంటాయి. అందుకేనేమో మన
వారు అరవయి సంవత్సరాలతో
ఆపి మళ్ళీ మొదటికి రమ్మన్నారు. సంవత్సరంలో
పన్నెండు నెలలు ఉండడానికి
ఆధారం ఉంది. మరి ఈ సంవత్సరాలు
అరవయి ఉండడానికి పద్ధతేమయినా
ఉందేమో, తెలిసిన పెద్దలు
చెప్పాలి. వచ్చిన సంవత్సరమే మరోసారి వచ్చినప్పుడు, గతంలో
ఆ సంవత్సరం రావడం గుర్తున్న
వారే పెద్దమనుషులు. వారు అరవయ్యేళ్ళ
తమ చరిత్రను ఒక సారి సమీక్షించి
చెప్పాలి.
నిజానికి
మనిషికి రాబోయేకాలం మీద
ఉండే ప్రేమ గతం
మీద ఉండదు. చరిత్ర
మీద మనకు ప్రేమ
తక్కువే. ఏ దేశ చరిత్ర చూచినా
అందులో గర్వించ దగినదేదీ
లేదనుకోవడం అలవాటు, చరిత్ర
అనగానే రాజులు, రాజ్యాలు, చట్టాలు
తప్ప మనకు మరొకటి గుర్తురాదు. ప్రతి
మనిషికీ చరిత్ర ఉంది. ప్రతి
పల్లెకూ చరిత్ర ఉంది. ప్రకృతిలోని ప్రతి అంశానికీ
చరిత్ర ఉంది. ఇటువంటి
చరిత్ర పట్ల మనకు
పట్టింపులేదు. కనీసం
తమ వంశచరిత్రను గురించి
తెలుసుకోవాలనుకునేవారు
కనిపించరు. మూడు తరాలముందు
మనవారు ఎక్కడ ఉండేవారు, ఎలా
ఉండేవారు తెలియదు. అంతకు
ముందు సంగతి అసలే తెలియదు. మనగురించి మనకు తెలియనప్పుడు, మొత్త
దేశం గురించి తెలిసేదీ
అంతంతే!
ప్రతి
పల్లెకూ ప్రతి ప్రాంతానికీ
ఒక చరిత్ర ఉంటుంది. రాజధాని
ఢిల్లీ నగరాన్ని మార్చి మర్చి కడుతూ
ఇప్పటిచోటికి తెచ్చారని చెపుతుంటారు. అదిరాజధాని కనుక
దాని గురించి చర్చ జరుగుతుంది. మన ఊరు మామూలు
పల్లె. దాని గురించి
చర్చ జరగదు. కానీ ఈ పల్లె
ఎక్కడనుంచి వచ్చింది, ఎవరు
కట్టించారు లాంటి ప్రశ్నలడిగి
చూస్తే ఆశ్చర్యకరమయిన
వివరాలు ఎదురవుతాయి. గ్రామనామాల గురించి పరిశోధనలు
జరిగాయి, జరుగుతున్నాయి. ఆ పరిశోధకులకు అందుతుండే సమాచారం
ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. మొత్తం చరిత్రను
ఒకటిగా చూడడం, ఆకాశం
నుంచి నేలను చూడడం
లాంటిది. అంతా
కలిసి అలుక్కుపోయి, ఏవేవో
రంగులు, ఆకారాలు తయారయి
ఒక రకమయిన దృశ్యం కనబడుతుంది. దగ్గరకు
చేరి చూచినకొద్దీ వింత వింత వివరాలు
అర్ధమవుతాయి.
అన్ని వివరాలనూ అందరూ
చూడడం కుదరదు. తమ చుట్టు
పక్కల ఉన్న వివరాలయినా
చూడకపోతే మాత్రం అన్యాయం.
ఇవాళ మనం
ఉన్న తీరుకు, నిన్న అంతకు
ముందు జరిగిన విషయాలే
కారణాలు. పరిణామ చరిత్రలో, సామాజిక
చరిత్రలో, సంస్కృతీ
చరిత్రలో వరుసగా జరిగిన
మార్పుల కారణంగానే మనం
ఇవాళ ఇలాగున్నాము. కానీ
ఈ చరిత్ర వివరాలను తరచి
చూడడానికి ఎవరికీ ఓపిక
లేదు. అవసరం కూడా లేదనుకుంటారు. చూపంతా రేపటామీద, రానున్న
సంవత్సరం మీద మాత్రమే
నిలిపి చూడాలనుకుంటారు. అవేమో కనిపించవు. కనిపించాలంటే, అవి
అక్కడ ఉండాలి. వాటిని
చూచే పద్ధతి మనకు తెలిసి
ఉండాలి. ముందుకు చూడడానికి మన
దగ్గరున్న పద్ధతులు
అంతగా పనికిరావడం లేదు. ఒకప్పుడు
మనం లేదా మన వారు చూచిన, అనుభవించిన
గతాన్ని నిజానికి చూడగలగాలి. కానీ
వెనక్కి తిరిగి చూస్తే గతం కూడా భవిష్యత్తులాగే
గజిబిజిగా కనబడుతున్నది. గతాన్ని
చూడడానికి తగిన ఆధారాలు, పరికరాలు
ఇంకా మన మధ్యన కొన్ని
పడి ఉన్నాయి. వాటిని గుర్తించలేక
పోతున్నాము. ఇంకా కొందరు
వ్యక్తులు గతం గురించి
చెప్పగలిగిన వారు మన
మధ్యన ఉన్నావారు చెప్పింది
వినడానికి ఎవరూ అంతగా
ఆసక్తి చూపించడం లేదు.
ఈ
ప్రపంచంలో శాశ్వతమయినదేదయినా
ఉంటే, అది మార్పుఅన్నారొక
పెద్దమనిషి. వద్దన్నా
కొత్త సంవత్సరం వచ్చి
తీరుతుంది. మనం
పండుగ చేసుకోకున్నా, ఉగాది
పచ్చడి కళ్ళకూడా చూడకున్నా చిత్రభాను వచ్చేసింది. ఈ
రకమయిన మార్పుకు ఒక క్రమం
ఉంది. కానీ మనిషి
మారే తీరు మాత్రం మారిపోయింది. వేగం
పెరిగింది. కొత్తదనాన్ని అడ్డుకోవలసిన
అవసరం లేదు. అడ్డుకున్నా అది ఆగదు. ఆ ప్రవాహంలో
ఎదురు నిలబడితే పడిపోవడం
తప్పదు. కానీ కొత్త మీద
మోజు కొద్దీ పాతను మరిచిపోవడం
మాత్రం మంచిది కాదు. ఈ
కొత్తరావడానికి, పాతపద్ధతులే
ఆధారం.
ఇప్పుడు
మధ్యవయసులో ఉన్నతరం చిత్రమయిన
పరిస్థితిలో ఉంది. వీరు పుట్టి పెరిగింది
వెనుకటి వాతావరణంలో గనుక, ఆరుచులను
మరిచిపోలేకపోతున్నారు. వాటిని
మరిచిపోతే మన
ఉనికే పోతుందని అనుకుంటున్నారు. అటువంటి ఆలోచన
తప్పేమీ కాదు. ఇటు పక్కనుంచి
కొత్తదనం, కొత్త్తతరం
ఉప్పెనలా వచ్చి
ముంచెత్తుతున్నది. మరీ పెద్దవారికి
ఈ కొత్తదనం వికృతంగా
కనిపిస్తుంది. మధ్యతరం
వారు మాత్రం ఈ కొత్తలోనూ
కొంతపాలు పంచుకుంటున్నారు. కానీ పూర్తిగా
ఇందులో ఇమిడి పోలేక, గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. పాత రుచులను నెమరు
వేసుకుంటున్నారు. ఆ రుచులను కొత్త వారికి
అందించాలని ప్రయత్నం
చేస్తున్న వారూ కొందరున్నారు. మనం
ఇవాళటికీ గతంలోని
కొన్ని విషయాలను గురించి, కొందరు
వ్యక్తులను గురించీ చెప్పుకుంటున్నాము. కానీ
చాలామందికి, ఆవిషయాలు, వ్యక్తుల
గురించిన అసలయిన తత్వం
అర్ధకాలేదనే అనిపిస్తుంది. స్ధూలమయిన
విషయాల గతే ఈ రకంగా ఉంటే
పల్లె చరిత్ర, వంశాలచరిత్ర, ప్రాంతాల
చరిత్ర, పద్ధతుల చరిత్ర
ఎవరికి గర్తుంటాయి?
గతాన్ని
పోగొట్టుకోకూడదంటే, మధ్యతరం
వారు తమ వంతుగా కొంతపని
చేయవలసి ఉంటుంది. మరిచి
పోతున్నారనుకుంటున్న
విషయాలను వాటి గుర్తులనూ
ఏదో రకంగా ఒక చోట చేర్చి
ఉంచాలి. చరిత్ర పనరావృతమవుతుంది
గనుక ఏదో ఒక నాడు
కొత్త వారి చూపు
కూడా వాటి మీద పడకపోదు. మనిషి
తీరు గురించి మరోసారి
ఆలోచించేందుకు సామాగ్రి
మిగలాలి కదా!