తెల్లోని
బిస!
సెప్టెంబర్
పదకొండు అనగానే అందరికీ
న్యూయార్కులో జంట భవనాలు
కూలిపోయిన సంఘటన గుర్తొస్తుంది.
సరిగ్గా అదే రోజున కరెంటు
పోయి ఆంధ్రప్రదేశం కటకటలాడిందన్న
సంగతిని అందరూ మరచిపోయారు.
గీత పక్కన మరో పెద్ద
గీత గీస్తే మొదటిది,
దానంతటదే చిన్నదయి
పోతుంది. వెనకటికి ఒకసారి
ఇలాగే కరెంటు పోతే పెద్ద
గగ్గోలయింది. ఈ సారి
కాలేదు. అంటే కరెంటు పోయినా
ఫరవాలేదని అర్థమా?
మనిషికి
నిప్పంటేనే తెలిసేది
కాదు. ఆ నిప్పును తన వాడకం
కోసం తెచ్చుకోవడంతో మనిషి
పరిణామ చరిత్ర ఒక మలుపు
తిరగింది మిగతా నాలుగు
వేళ్ళకూ ఎదురుగా తిరగగల
బొటన వేలు, నిప్పు, చక్రం
కలిసి మనిషిని ఈ నాటి
స్థితికి చేర్చాయని విజ్ఞులంటారు.
నిప్పు వచ్చి తర్వాత
నెగడు వేసుకుని, క్రూరజంతువుల
భయం నుంచి తప్పుకుని,
చీకటిలో కూడా కబుర్ల
చెప్పుకునే వీలు వచ్చింది.
ఆ తర్వాత చమురు వచ్చింది.
ఒక పాత్రలో చమురు పోసి,
నారతోనో, గుడ్డ పీలికతోనో
వత్తి చేసి వెలిగించుకుంటే,
ఇక రాత్రి పగలయిపోయింది.
చీకటి పడగానే ముడుచుకుని
కూచోవలసిన అవసరం పోయింది.
ఒకటేదో
దొరకింది గదా అని సంతృప్తి
పడే పద్ధతి మనిషికి లేదు. ఉత్తరోత్తర స్పృహా
చంచలత్వం రాజులకుంటుందంటాడు
వసు చరిత్రకారుడు. కానీ,
అది మనిషి సహజలక్షణం.
చెట్ల నుంచి వచ్చే గింజలను
పిండితే నూనె వచ్చింది.
అది సరిపోలేదు. నేల కడుపును
చీల్చి అందులోంచి చమురును
బయటకు తీయడం ఆతర్వాతి
మెట్టు. గ్యాసునూనె అదే
కిరసనాయిలు (అసలు పేరు
కిరోసిన్
లేదా కెరొసీన్) వచ్చింది.
చమురులో
వత్తివేసి వెలిగిస్తే
వత్తి ఒకటే మండుతుంది.
నిజానికి వత్తికూడా
కొడిగడుతుంది మంట ఆరుతుంది.
కాలీ కాలీ వత్తి చివరన
చేరిన, మండని పదార్థాలే
ఆ కొడి! ఆ కొడిని నలిపి,
లేదా చిదిమి దీపాన్ని
మరోసారి
వెలిగించుకోవచ్చు. గ్యాసునూనె కొత్తగా
వచ్చినప్పుడు అందరూ దాని
ఆశ్చర్యంగా చూచారు.
దాంతో దీపాలు వెలిగించుకున్నారు.
ఒక అమయాకుడు పెద్ద
మట్టి మూకుడు తెచ్చి, అందులో
గ్యాసునూనె పోసి, పెద్ద
వత్తి
వేసి వెలిగించాడట.
వత్తితో బాటు, మూకుట్లో
నూనె మొత్తం మండింది.
ఆ మంటను ఏం చేస్తే తగ్గుతుందో తెలియదు.
చూస్తుండగానే గుడిసె
మొత్తం అంటుకుని మంటలు
ఎగిశాయి. ఆస్తి అంతగా లేని
ఆ మనిషికి గుడిసె
తగలబడిందని బాధ కలిగినట్లు
లేదు. అడవి నుంచి
కట్టె తెచ్చుకుని, రెండు
రోజులు కష్టపడితే మరో
సరికొత్త గుడిసె వస్తుంది.
అందుకేనెమో ఆనందంగా
గుడిసెలోనుంచి తన డప్పును
మాత్రం బయటకు తెచ్చుకుని
దరువు వాయిస్తూ మండే
గుడిసె ముందు చిందు ఆడాడట.
ఇది కల్పన కాదు. పెద్దల
నోట విన్న అసలు సిసలయిన
నిజం.
కెరోసీన్ ఆ తర్వాత రాజ్యమేలింది.
దీపాలతో బాటు, స్టవ్ల ద్వారా వంటయింట్లోకి
కూడ దూరింది. వాసన, పొగ
కలిసి ఆరోగ్యాలకు హాని
కలుగుతున్నదేమో నన్న
అనుమానం ఎవరికీ రాలేదు.
గాలి ఆడని గదుల్లో కెరోసీన్ దీపాలు, పొయ్యిలు
చాలా మంది కళ్ళను, ఊపిరి
తిత్తులను పాడు చేశాయి.
అయినా అందరూ దానివెంటే
పడ్డారు. నాలుగణాలకు బియర్ సీసా
నిండాపొగే గ్యాసునూనె
కోసం గంటల కొద్దీ, వరుసలో
నిలబడిన రోజులు వచ్చాయి.
అప్పటికే
కరెంటు కూడా వచ్చింది.
కానీ అది అందరినీ
తాకలేదు. ఇప్పుడు
సంగతి అలాకాదు. అన్నిటికీ కరెంటే, అన్నిటికీ మీటలే. గిన్నెలో బియ్యం
పోసి, నీళ్లు కూడా
చేర్చి మీట వేస్తే అరగంటలో
అన్నం తయారు. కరెంటుంటే, ప్రపంచం మూలమూలలనుంచి
భారీ నాయకులు మొదలు వయ్యారి
భామల దాకా, అందరూ
మన నట్టింట్లోకి నడిచి
వచ్చివారి దివ్య సందేశాలనందిస్తారు. కరెంటు ఉంటే మాటలుంటాయి,
ఆటలుంటాయి, మంచినీళ్లుంటాయి. ఆకాశం నుంచి మనల్ని
నేల మీదకు దించే తొట్లెలుంటాయి. మొత్తం ప్రపంచం,
తీగెల్లో పాకే ఈ కరెంటు
వెంట పాకుతుంది. అదే తెల్లోని బిస! ఆశ్చర్యం కలిగించే
ప్రతి సాంకేతిక సదుపాయాన్నీ
అమాయక జీవులు వర్ణించుకునేందకు
వాడుకున్న మాట అది. “తెల్లోని బిస”!
కానీ
ఈ బిస నమ్మకం లేనిది. “యావత్ తైలం తావద్వాఖ్యానం.” దీపంలో చమురెంత సేపుంటే
పురాణం అంత సేపు సాగుతుంది. దీపం కొండెక్కుతుందని
ముందే తెలుస్తుంది. అది గమనించి మంగళం
పాడవచ్చు. ఈ కాలపు
మీటల దీపం కొడిగట్టదు. ఒక్కసారిగా ఆరిపోతుంది. పోయిందంటే మళ్ళీ
ఎప్పుడొస్తుందో చెప్పడం
తరం గాదు. ప్రపంచాన్ని
నడిపించే కరెంటు ఒక రోజున
తాను ఆగిపోయింది.
కరెంటుకయినా చేయగలిగిన
పని ఇంత అని ఉంటుంది. తలకు మించిన భారమయిందేమో
అది ఒక రోజున చప్పున ఆగిపోయింది.
మీటలంటే
మాటలు కావు. మీటలు ఆడకపోతే కొంత
మందికి సరదాలు లోపించి
కడుపు మంట మండుతుంది. ఏరకంగానయినా
కష్టమే. గనిలో, కార్ఖానాలో పనిచేసే
కార్మికుడికి ఆరోజులకు
కూలీ పోతుంది. గని, కార్ఖానా ఓనరు గారి
గదిలో ఏర్ కండిషన్ పనిచేయక ఆయనకూ
ఊపిరిఆడదు. అందుకే
కరెంటు పోయిందంటే అంతా
హడావిడిగా పరుగులు పెడతారు. అయినా అది రావలసిన
వేళకే వస్తుంది. “తెల్లోని బిస” సంగతి
అంతే.
ఎక్కి
ఝామ్మని తిరగమని కార్లు
తయారు చేసి ఇస్తే వాటి
క్రిందపడి మనుషులు చస్తున్నారు. రైలూ అంతే! విమానాలు నడాకాశంలో
పేలిపోతుండేవి. సరికొత్తగా ఆయుధాల లిస్టులో
వాటిపేరు కూడా చేరింది. అందుకేనేమో ఆయుధ
పూజ అంటూ దసరానాడు అందరూ
తమ తమ వాహనాలకు పూజలు
చేశారు. ఇదీ ఆశ్చర్యమే! తెల్లోని బిస అంటే
ఇదే! పని చేస్తుంది. కానీ గ్యారంటీగా
ఇదే పని చేస్తుందని లేదు.
కరెంటు
వాడుకుని నీటిని మంచుగా
మార్చే పెట్టె చాలా ఇళ్ళలో
ఉంటుంది అందులో నుంచి
ముక్కలను తీసుకోడానికి
ముళ్ళ చిమటా ఒకటి ఉంటుంది. ఒకావిడ దాన్ని ఎప్పుడూ
తన చేతి సంచిలో ఉంచుకుంటుందట
ఎందుకో తెలుసా? ఆత్మరక్షణకు ఆయుధంగా
వాడడానికి!
తెల్లోని బిస!
-కె.బి. గోపాలం
తేది:-12-11-2001