నా
కళ్ళతో చూడు
మనకు సంబంధించిన విషయాలను
మనమే సమీక్షించుకోవాలంటే బోలెడు చిక్కులుంటాయి. మనిషికి తన తోడిదే
ప్రపంచం. చివరకు
దేవుడిని కూడా తన ప్రతిరూపంగా
ఊహించుకున్నాడు మనిషి. కనుక ఎవరికి వారు, తాము చాలా మామూలుగా
ఉన్నామని, మిగతా
వారంతా విచిత్రంగా ఉన్నారని
అనుకుంటారు. ఆ మిగతా
వారుకూడా మిగతా వారి గురించి
అలాగే అనుకుంటారు.
అందులో మనమూ ఉంటాము.
చైనా పాకిస్తాన్లతో మన దేశం యుద్ధాలు
జరుపుతున్న రోజుల్లో
ఒక సినిమా థియేటర్లో
టికెట్లకోసం వరుసలో నిలబడి
ఉన్నాను. ఇంకా
టికెట్లివ్వడం మొదలు
కాలేదు. వరుస మాత్రం
హనుమంతుడి తోకలా ఉంది. నా వెనుక ఒక సర్దార్జీ వచ్చి
నిలబడి ఉన్నాడు. అతను పంజాబునుంచి వచ్చిన
మనిషి. అంటే ఇక్కడ
పుట్టి పెరిగిన మనిషి
కాదని భావం. బుకింగ్ కిటికీ
పక్కన మరో కిటికీ ఉంది. దాని మీద ఎమర్జెన్సీ
బుకింగ్ అని రాసి ఉంది.
(అసలప్పటికింకా దేశానికి
ఎమర్జెన్సీ గురించి అనుభవం
లోకి రాలేదని గమనించాలి). ఈ సర్దార్జీ మాటలు కలుపుతూ ఆ కిటికీ
దేని కోసం? అని అడిగాడు. నాకు తెలియదు గనుక
ఆ మాటే చెప్పాను. మీకు ఎమర్జెన్సీ
అంటే ఏం తెలుస్తుంది? అని ఓ చిన్న ఉపన్యాసం
ఇచ్చేశాడు. యుద్ధం
తాకిడికి భయపడుతూ నగరంలో
చీకటి చేసి బిక్కుబిక్కుమంటూ
బతకడం గురించి చెప్పాడు. దక్షిణాది వారు ఇదంతా
తెలియకుండా సుఖంగా బతుకుతున్నారన్నాడు. నిజమనిపించింది. ఎమర్జెన్సీ అనే మాటను
సినిమా టిక్కెట్లకు వాడినందుకు ఆయనకు ఎంత
కోపం వచ్చిందో గానీ మీ
దక్షిణాది వాళ్ళంతా `పులుపు తింటారు. పిల్ల ల్ని కంటారు' అనేశాడు. నిజమేనేమో
అనిపించింది.
పిల్లలను
కనడం అందరూ చేస్తున్నారు. కానీ పులుపు తినడం
మాత్రం ఇంత విచిత్రమయిన
లక్షణమని నాకు తర్వాత అర్ధమయింది. ఉత్తర భారతదేశంలో
పులుపు కోసం నిమ్మకాయ, దానిమ్మగింజలపొడి
లాంటివి వాడతారు.
చింతపండు వారికి దొరకదు. ఢిల్లీకి వెళ్ళేముందు అక్కడికి
మాట్లాడి, ఏమయినా
తేవాలా? అని అడిగితే, మంచి చింతపండు తీసుకురమ్మని
అడిగింది మా అన్నయ్యగారి
అమ్మాయి. మనకు
చింతపండు లేనిదే దినం
గడవదు. అక్కడి వారికి
అదొక విచిత్రమయిన పదార్ధం. దక్షిణాది వాళ్లుండే ప్రాంతాల్లో
దుకాణదారులు చింతపండు
అమ్ముతారు. కానీ
దాని ధర ఆకాశాన్ని అంటుతూ
ఉంటుంది.
మన దేశంలో
వైవిధ్యం తీరు చెప్పుకోదగినది. వంద మైళ్లు ప్రయాణం
చేస్తే చాలు తిండి తీరు
మారుతుంది. అటువంటిది
దేశం ఆ చివరికి వెళ్ళిపోతే
తిండి తీరు మారడం కాదు. పూర్తి తారు మారవుతుంది. అక్కడి వారికి ఆలుగడ్డలు, క్యాబేజి లాంటివి
ఉడకేసుకు తినడం తప్ప
మరోటి తెలియదు. మీ దగ్గర పొడి కూరలేవీ దొరకవా అని
అడిగాను ఒకచోట. దొరుకుతాయని ధీమాగా
చెప్పాడు హోటలతను.
రెండు రొట్టెలు, కూరా పట్టుకురమ్మన్నాను. వంకాయ కూరని తెచ్చాడు. వంకాయ ముక్కలను నీళ్ళలో
ఉడికించి, ఇంత ఉప్పుకారం
వేసినట్లుంది. అడిగితే ` ఇదే
పొడికూరంటూ
వాదానికి కూడా దిగాడతను.
దక్షిణ
భారతదేశంలో తిండి గురించి
వర్ణిస్తూ వెక్కిరిస్తుంటే
వారికి మహదానందంగా ఉంటుందని
నాకు అర్ధమయింది.
మనమూ వాళ్ళ తిండి గురించి అంతే ఆనందంగా
చెప్పుకుంటామని తర్వాత అర్ధమయింది. వైవిధ్యానికి అంతం
ఎక్కడుందో తెలియదు గానీ, ఢిల్లీలో సీతాఫలమంటే
గుమ్మడి కాయ!
ఎక్కడి వారికయినా సరే
మరోచోటి వారి తీరు విచిత్రంగానే
కనబడుతుంది. అది
మన పద్ధతిలాగా లేక పోతే
చాలు మనకు విచిత్రమే! భారతదేశాన్ని పడమటి దేశాలవారు ఈ రకంగానే
వర్ణించుకుని చెప్పుకుంటారట. ఇప్పటికీ మన దేశంలో
నగరాల్లోకూడా వీధుల్లో
ఏనుగులు, లొట్టిపిట్టల
మీద ఎక్కి తిరుగుతుంటారని, ఇక్కడ సగం మందికయినా
మామూలుగా మంత్రాలు తెలిసి
ఉంటాయని అనుకునే వారు
కొందరున్నారు. మన దేశంలో రంగుల టెలివిజన్ కూడా
వచ్చిన తర్వాత, `మీకు టీవీ అంటే తెలుసా? ` అని అడిగిన తెల్ల దొరను
నేను స్వయంగా చూశాను. బాబూ!
మాకు ఈ ఊళ్ళోనే టీవీ
స్టేషన్ కూడా ఉందని అప్పట్లోనే
చెబితే అతను బిత్తర పోయాడు. అది మరో విషయం.
మన దేశం
గురించి పరిచయం చేస్తున్న ఒక
వ్యాసం ఈ మధ్యన ఇంటర్నెట్లో ఒకటి కనబడింది. ` ఆ దేశంలో
దేవుళ్లు, స్వామీజీలు, ప్రాచీన కళా, ఆశ్రమాలు, గుడులూ, లెక్కలేనన్ని శిధిలాలు మాత్రమే
గాక మరో
కొన్ని అంశాలు కూడా లేక పోలేదు. అక్కడ అంతులేని
అడవులు, ఎడారులు, కొండలూ ఉన్నాయి. బోలెడంత సంపద వాళ్ళ
దగ్గర ఉంది. దాంతో
బాటే ఏనుగులు, సింహాలు, చిరుతపులులు, రైనోలు కూడా ఆ దేశంలో
ఉన్నాయని ఆ వ్యాసం మొదలవుతుంది. మన దేశం సాంకేతికంగా, విద్యాపరంగా
ఇంత సాధించిన తర్వాత
కూడా ప్రపంచం దృష్టిలో
మాత్రం ఇంకా ఏనుగులు, పులుల దేశంగానే మిగిలి
పోయిందనేనా అర్ధం?
పడమటి దేశాలనుంచి
పరిశోధకులు, పర్యాటకులు
వచ్చి మన దగ్గర జరిగిన
ప్రగతిని చూస్తున్నారు. వాళ్లు ఏం చూడదలుచుకుని వస్తే అదే
వారికి కనబడుతుంది. నిజంగానే
మన దేశం `హీట్ అండ్ డస్ట్'! అంటే వేడిమి, దుమ్మూ గలది. లెక్కకు
మించిన ప్రజలూ, పర్యావరణ కాలుష్యం
ఉన్నాయిక్కడ. మనకు
మాత్రం ఇవి మామూలుగా, మన జీవితాలతో పెనవేసుకుపోయిన
అంశాలుగా కనబడతాయి. బయటి వారికివి భయంకరంగా
కనబడతాయి. ఇక్కడి ప్రభుత్వ యంత్రాంగం, కులవ్యవస్ధ గురించి
కూడా వ్యాసంలో ప్రసక్తి
ఉంది.
ప్రపంచంలో కెల్లా పెద్దదయిన
సినిమా పరిశ్రమ ఒక వేపు, అధ్వాన్నమయిన జీవన
పరిస్థితులు మరోవేపు, అభివృద్ధి చెందిన
శాస్త్ర సాంకేతిక విజ్ఞానం
ఒక వేపు, అంతులేని
బీదతనం మరో వేపు, సంగీతనృత్యాలు కళాసంపదలు
ఒకవేపు, లంచగొండితనం
మరోవేపు ఉన్నాయని వ్యాసంలో
వర్ణించారు.
మన దేశంలో
ఋతుపవనాలు, బంతిపూలు, పేడ, దుమ్ము, రంగులు, శవాలు, పొగ, బూడిద, అన్నిటి కన్నా మించి ప్రతి సంగతి
గురించి కట్టు కథలు ఉన్నాయట. ఇవన్నీ ఇంకెక్కడా
లేవని అర్ధం చెప్పుకోవాలా?
పడమటి
వారికి మాత్రం మన దేశంలో ఇవే కనబడతాయి. మనకు ఇవి మామూలు విషయాలే
మరి!