బుడుగు
మరేం ! ఓ పుస్తకం
ఉంటుంది. నిజానికి చాలా పుస్తకాలుంటాయనుకో. కానీ ఈ పుస్తకం వేరు. వేరంటే చెట్టుకు
వేరుంటుందే. అట్లాగన్నమాట. వేరుగా ఉండే దీన్ని చూసినా ఇది `వేరు' అని వెంటనే తెలియాలి కదా! ఈ పుస్తకం కూడా వెంటనే తెలిసిపోతుందన్న
మాట. చాలా పుస్తకాలమీద
పేరు రాస్తారు. బొమ్మ వేస్తారు. అయినా చదివితే గానీ, వాళ్ళెవరో తెలియదు. ఈ `పుస్తకం' ఉందే ! ఇది చూడగానే తెలుస్తుంది. ఇది `బుడుగు' గారి గురించని. బుడుగు ఉండేది ఒక
అడుగు మాత్రమే. కానీ తెలుగు తెలిసిన వారందరికీ ఆ బుడుగు, పొడుగు ఎత్తు చాలా
ఎక్కువ! (అన్నట్లు
మీకు తెలుగు తెలీకపోయినా, బుడుగు తెలీకపోయినా, బుడుగుకు కొంచెం
అనుమానం అవుతుంది. కొంచెం కోపం వస్తుంది. వెంటనే తెలుగునూ, బుడుగునూ తెలుసుకోండి!)
ఇంతెత్తు బుడుగు గురించి తెలియని
వాళ్లు ఉంటున్నారేమోనని
అనుమానం వచ్చినట్టుంది. అందుకే బుడుగు
కథను, బొమ్మల్ని
అన్నింటినీ తెచ్చి విశాలాంధ్రవాళ్లు
మనకిస్తున్నారు.
పుస్తకం
మీద తెలుగు కూడా రాసి ఉంది.
అంటే మరేదో కూడా రాసి
ఉందని కానేకాదు. బొమ్మలున్నాయిగా! దాంతో కథ ఏమిటో, ఇక బొమ్మలేమిటో, ముందే తెలుస్తుంది. అయినా తెలుగు
కూడా రాశారు.
``ముళ్ళపూడి
వెంకట రమణ బుడుగు'' అని రాశారు. అసలేమో బుడుగు అంటే
వెంకట రమణేనట. ఆయన
తెలుగు వాళ్ళందరికీ తెలుసు. బుడుగు, వెంకట
రమణ ఇద్దరూ లేక ఒక్కొక్కరూ
లేక ఒక్కరూ మొత్తం తెలుగు
వాళ్ళ సొత్తు! అయినా
ఈ పుస్తకం మీద ``ముళ్ళ
పూడి వెంకట రమణ బుడుగు'' అని రాసుకున్నారు. వెంకటరమణగారెప్పుడూ ఇంతే!
జోకులేస్తుంటారు. బుడుగు గురించి, వాళ్ళ నాన్న గురించి, అమ్మ గురించి, అందరి గురించి రాసి మనల్ని నవ్విస్తుంటారు.
ఆయనేమో కొంచెం పెద్దవాళ్ళయ్యారట. అందుకని అప్పటికి
రాసిందంతా మళ్ళీ అచ్చేస్తున్నారట. ఎవరన్నా
ముందు పిల్లలుగా
ఉండి తర్వాత
కొంచెం పెద్దవాళ్ళవుతారు
గదా! ఇది తెలీక
ముందు `కథారమణీయం' వేశారట. అందరూ ``ప్రైవేట్'' చెప్పేసరికి మూడు అంకె
వేసి రెండో విడతగా మొదట
రావలసిన బుడుగు పుస్తకం
వేశారు. ఈపెద్దవాళ్లు
ఎప్పుడూ ఇంతే! తమకి
ఏంచేయాలో తెలీదు.
పిల్లల్ని అడగాలంటే అడగరు.
బుడుగుతో
పుట్టిన వాళ్లందరూ ఇప్పుడు కొంచెం
పెద్దవాళ్ళయ్యారు. బుడుగు మాత్రం మొదలే పెద్దవాడు
కనుక ఇన్నేళ్ళయినా అలాగే ఉండిపోయాడు. (ఈమాట బుడుగుతో
చెప్పకండి. నిజం
కొరడాతో కొట్టేయగలడు!)
ఇంతకీ పుస్తకం మీద రాసిపెట్టి
నాయన పేరు రాసుకున్నారా? ఆ తర్వాతేమో బొమ్మలు అని రాసుకున్నారు. పుస్తకం మీద, లోపల చాలా
బోలెడు బొమ్మలున్నాయి. అవ్వన్నీ చాలా, చాలా
బాగున్నాయి. బొమ్మలు
అని రాశారా? దాని
కిందేమో పాములా మెలికల గీత ఒకటి
ఉంది. అలా
గీస్తే `బాపు' అని అర్ధమట. అంటే కొంటె బొమ్మల బాపు
అని అర్ధమట! ఆయనెప్పుడూ
అంతే! `అక్షరాలు
సరిగా నేర్చుకోలేదేమో!' (ప్రైవేట్ మాస్టార్లు
టెంకి జెల్లలు వేశారేమో) వంకర టింకరగా రాస్తుంటారు. మరేం!
అప్పటినుంచి అలాగే రాయాలేమోననుకుని, అందరూ వంకర టింకరగానే రాస్తున్నారట. కంప్యూటర్లోకూడా
ఈయన పేరున అక్షరాలున్నాయట.(తప్పులు చేస్తే ఎంత బాగుంటుందో! ఇలాంటి తప్పులు ఇంకా
ఇంకా జరుగుగాక!)
పుస్తకం
మొదటి పేజీలో మరికొన్ని
సంగతులున్నాయి. బుడుగు పుస్తకం మరో పేరు `బాల రమణీయం' అట. అలాగంటే ఏమిటో ఆతర్వాత
ఉండే పేజీలో లిస్టు చదివితే తెలుస్తుంది. ఇంతకూ ఈ లిస్టులో
పుస్తకాలనీ, స్వంతంగా, స్వయంగా పక్కనుండి
వేయించి పెట్టడానికి (వేపడం కాదండోయ్! అచ్చు) ఎమ్బీయస్ ప్రసాద్ గారని
ఒక సంపాదకుడు ఉన్నారు.
చదవకుండానే! అందులో ఏముంటుందో, అదిబాగుంటుందని, ఎన్నిసార్లయినా
చదవ వచ్చునని మనకు తెలుసే! అందుకే మళ్ళీ చదువుదాం. చదవని వాళ్లూ!
మీరూ మళ్ళీ మళ్ళీ
చదువుదాం! రండి
మరి!