ఆరున్నొక్క రాగం
పాట, వైద్యం తెలియని
వారు ఈ ప్రపంచంలో ఎవరూలేరని
ఒకమాట. మాటను
సాగతీసి ఒక పద్ధతిగా
పాడితే పాట. ఆకలవుతున్నదమ్మా! అంటూ గొంతు చించుకు
పాడిన బిచ్చగాడిదీ పాటే. వెయ్యిమంది ముందు
వేదిక మీద కూచుని రాగాలు
పలికించిన పండితుడిదీ
పాటే. పది మంది
ముందు `వినండి' అంటూ పాడిన వారినే
గాయకులంటారు. ఆడవాళ్ళయితే గాయనులంటారు. అలాగా అనిపించుకోని
వారిలో కూడా చాలా మంది
కమ్మగా పాడే వారుంటారు. అనిపించుకున్న
వారిలో కొందరు గొంతెత్తితే `గాయం' అయే పరిస్థితి ఉంటుంది. `వందేమాతరం' అంటూ ఆ మధ్యన ఒకాయన
గొంతెత్తి పాడడం మొదలుపెట్టాడు. `చిన్న పిల్లవాడిని
చీమ కుడితే ఒక్కసారిగా
ఆరున్నొక్కరాగం ఎత్తుకున్నట్లు
ఉంది' ఆ పాట అని
మా అమ్మాయి, చిన్నదే
వ్యాఖ్యానించింది. పాటల్లో రకరకాలుంటాయి. వాటి గురించి
తెలియకుండానే చాలా మంది
బతికేస్తుంటారు. తెలియకుండానే కొంత మంది
పాడేస్తుంటారు. కూడా!
సంగీతంలో శాస్త్రీయ
సంగీతమని ఒక పద్ధతి ఉంది
ఆ ప్రపంచంలో వారిది మరో
ప్రపంచం. బాలమురళీ
కృష్ణ, ఏసుదాసు
పేరు చెబితే `సినిమా
పాటలు పాడతారని' అందరూ గుర్తిస్తారు. కానీ వారు పాడే
కర్ణాటక సంగీతం వినడానికి
కొందరు చెవి కోసుకుంటారు. ఇంతకూ అక్కడ కూడా
అంటే కర్ణాటక సంగీతంలో
కూడా సంగతులు కొన్ని
ఉంటాయి. స్వరాలు, గతులు కలిపి శాస్త్రబద్ధంగా
పాడే సంగతులు కొన్ని
సరదాగా మాత్రమే వినడానికి
కొన్ని శాస్త్రీయ సంగీతం
పాడడానికి మంచి గొంతు
ఉండనవసరం లేదని ఒక పద్ధతి
ఉంది. రామనాధన్గారని ఉద్దండ
పండితుడు ఒకాయన ఉండేవారు. ఆయన పాట రేడియోలో
వస్తుంటే గ్రామఫోను పెంకు
సరిగా తిరగడంలేదేమో! గుర గురలాడుతున్నది. చూడండి.' అంటూ పెద్ద మనిషి ఒకాయన
ఫోన్ చేసి చెప్పాడట. విషయం ఏమిటంటే పాడేది
పెంకు కాదు. స్వయంగా
రామనాధన్గారే! ఆయన పాట
అలాగుండేది. అయినా
పాండిత్యం గొప్పది కనుక
అందరూ పడివినేవారు. ఉత్తరాదిన సిద్ధేశ్వరీదేవిగారని
ఒక గాయని. గొంతెత్తితే
మగరాయునిలా ఉండేది. పాట మాత్రం అమృతంలా
ఉంటుంది. ఇంతకూ అసలు
విషయం ఏమిటంటే గొంతు బాగుండగానే
సరిపోదు. దాంతోపాటు
పాట కూడా బాగుండాలి.
చాలా మందికి తాము బాగా
పాడతామని నమ్మకం ఉంటుంది. పిల్లలు మరింత
బాగా పాడతారని మరీ మరీ
నమ్మకం ఉంటుంది. ఇంటికి వెళ్ళిందే తడవు! `మాపిల్లల పాట
వినాల్సిందే'! అని కుదేస్తారు. వద్దనడానికి ఉండదు
కొంత మంది పిల్లలు అడిగిందే
అలస్యమంటూ వెంటనే పాడేస్తారు. మరికొంత మంది
మంకు చేసి మంచి చేసి చివరకి
పాడతారు. కొంతమంది
పాడితే తేనె తిన్నట్లు
ఉంటుంది. `మరో
పాట అందుకొమ్మని' మోమాటం లేకుండా అడగాలనిపిస్తుంది. మరికొందరు పాడితే
భయమవుతుంది. దాన్ని
ప్రదర్శించడానికి వీలు
ఉండదు.
పాట తరువాత వచ్చే టీలు, టిఫిన్లు తలుచుకుంటూ
కాలం గడపాల్సి వస్తుంది. వంట చేసిన వారూ, పాట పాడిన వారూ
వెంటనే ఇన్స్టాంట్గా ఫలితం కావాలంటారు. బాగా పాడలేదంటే
బాగుండదు. టీ
కూడ దొరకదేమో! అందుకే మొక్కుబడిగా
బాగుందనాలి. ఆ జవాబు
వచ్చిన మరుక్షణం మరోపాట
అందుకుంటే
అప్పుడుంటుంది యాతన!
సంగీతంలో అన్నింటికన్నా
కష్టమయినా అంశం `కూచుని వినడం' అని విద్వాంసుడు ఒకరు
పదే పదే చెప్పారు. సంగీతం పాడడానికి
రావాలి. అంటే
పాట రావాలి. అలాగే
వినడం కూడా రావాలి. విన్న తరువాత బాగున్నదీ, లేనిదీ తెలుసుకోవడమూ
చేతగావాలి
బాగోలేదని చెప్పడం
తప్పయినా విషయం తెలిసి
ఉండాలి.
జంట కచేరీలు, అంటే ఒకదాని తరువాత
మరొకటి జరుగుతున్నాయి. మొదటి కచేరీ, కళాకారిణి బాగా పాడుతున్నది. రెండవ కచేరీ కళాకారుడు
గ్రీన్ రూమ్లో శృతులు, మతులు కలుపుకుంటున్నాడు. బయట జరిగే పాట
వినడం కాదు కదా పట్టించుకోనుకూడా
లేదు. మొదటి కచేరీ
అయిపోయింది. ఆమె
లోపలికి వస్తుంటే ఈయనగారు
రంగస్థలం మీదకు వెళుతున్నారు. ఒకర్ని ఒకరు ఎరిగినవాళ్ళే. పెద్ద చిరునవ్వు
నవ్వి `రొంబ
ప్రమాదమా పాడినార్ అన్నాడాయన. అంటే తమిళంలో `చాలా బాగా పాడారు'! ఈ `ప్రమాదం' అనే మాట గొప్ప
ప్రమాదకారిగా వినపడుతుంది
మరి. అర్థం తెలియకుంటే
ఇంతే సంగతులు. పాట ఎలాగ ఉందంటే `టెర్రిఫిక్'! అనే జవాబు
చేప్పేవారు లేకపోలేదు. భావం `చాలా బాగుందనే'! మాటకు అర్థం మాత్రం `భయంకరంగా' ఉందని, భయం పుట్టించే
పాట బాగున్నట్లా?
ఓ గుడిలో కూచుని ఉన్నాము. అక్కడ సంగీతం
కార్యక్రమం జరగవలసి ఉంది. ఆ సంగతి మా ధ్యాసలో
లేకుండా మాటల్లో పడ్డాము. ఇంతలో మైకులోంచి
ఒక చప్పుడు మొదలయింది. ప్రక్కనున్న
మిత్రుడు ఉలిక్కిపడి `ఏమిటిది? దూడ అరుపులాగా!' అని అర్థం వచ్చే మాట
అన్నాడు. ఆ పాడేటతని
పాట ఈయనకు వినిపించిది. కానీ ఈయన మాట, అతనికి విపించలేదు
నయం! పాడుతున్నతను
తానుబాగానే పాడుతున్నాననుకుంటాడు. లేకుంటే పాడడు
గదా!
గోపాలం.కె.బి
తేది: 1 అక్టోబర్2001