పట్నంలో కూడా ప్రతి
దినం కొన్ని గంటలపాటు కరెంటు ఉండదట.
పల్లెల్లో నయితే ఎన్ని గంటలసేపు
ఉంటుందో చెప్పగలిగితే
గొప్ప! పట్నమంటే
పెద్దలంతా ఉండి వ్యవహారం
నడిపేచోటు. ఎక్కడ
కరెంటుపోయినా అక్కడ పోవడానికి
వీలులేదు. అక్కడ
అంతా వెలుగే, నీడలు
ఉండకూడదు.
వెదకగలిగితే నీడల్లోనూ
చీకట్లోనూ అందం ఉందనే
సంగతి అందరం మరిచిపోయాం. చిన్నప్పుడు నూనె
దీపాలుండేవి. అంతకుముందు
ఉండే ఆముదం దీపాలకంటే నేలలోంచి
బయటకు వచ్చిన మట్టినూనె
దీపాలు మేలనిపించింది. అప్పట్లో ఇప్పటిలాగా
పగలూ, రాత్రీ తేడా
తెలియకుండా
చిటుక్కుమని `లైటు' వేసుకుని నీడలు లేకుండా బతకడం అప్పట్లో
తెలిసేది కాదు. బుడ్డి దీపం ముట్టించిన
తర్వాత ఉండేది వెలుతురా
చీకటి కూడానా? చెప్పడం
కష్టంగా ఉండేది. ఏం చూడాలన్నా కనులు చికిలించాల్సి
వచ్చేది. చదువు
కూడా వాటి ముందే కొనసాగేది.
నిజానికి
చేయవలసిన రాచకార్యాలన్నీ పగలుండగానే
చక్కదిద్దుకోవడం,
పొద్దుకూకిన తర్వాత, విరామంగా
కాలం గడపడం అప్పటి పద్ధతి. ఇంత ఉడకేసుకుని తినడం, చేతనయినంత త్వరగా
పడకేయడం అప్పటి కార్యక్రమం. ఆ చీకటిలాంటి వెలుతురులో
అంతకన్నా చేయవలసిన పనులు ఏవయినా
ఉంటే అవి సరదాకూ, ఉల్లాసం కొరకు చేయవలసినవే. ఊరికే కూచుని ముచ్చట్లు
చెప్పుకోవడం మొదలు భజన, పాట, ఆట మొదలయిన
కాలక్షేపం కార్యక్రమాలకు అనువయిన
సమయం రాత్రిలో
మొదటి భాగం.
ఇంట్లో కిరోసిన్ ఉన్నా, లాంతరు
లాంటి పెద్ద దీపాలు ఎక్కువగా
ఉండవు. ఒకటి ఉంటే
అది వంట ఇంట్లో ఉంటుంది. అందరి భోజనాలు అయ్యేదాకా
అది అక్కడే ఉంటుంది. మంచి వెలుతురులో
చదువుకోవాలంటే దాని ముందుకే
చేరాలి. ఇక వీధుల్లో
దీపాలు ఉండేవి కాదు. వెన్నెల రోజులయితే, `వెన్నెల- నీడ' ఆట, `వెన్నెల కుప్పల' ఆట సాగుతుంది. అమావాస్య పక్షమయితే ముడుచుకు
పడుకోవడమొక్కటే ఆట. కొంచెం ధైర్యం చేసి ఆ గుడ్డి
చీకట్లో బయటకు వెడితే
దృశ్యం చాలా బాగుండేది. కరెంటు దీపాలు ఆ అందాలను
దొంగిలించేశాయి.
ఇప్పుడంతా పట్టపగలే! అందుకే కరెంటు పోయినప్పుడు ఉండే చీకటిని ఎవరూ ఇష్టపడడం
లేదు.
సంధ్య వేళలు రెండూ ఎరగ్రానే
ఉంటాయి. అయితే
రెండింటిలోనూ తేడా ఉంది. పొద్దుటి ఎరుపులో
నుంచి పసుపురంగు పుడుతుంది. నేనున్నానంటూ
వెలుగు వస్తుంది. నీడలు వస్తాయి. నిజాలు బయటపడతాయి. మరో కొత్తరోజు మొదలవుతుంది. కానీ సాయంత్రం పరుచుకునే ఎరుపు సంగతి మరో
రకంగా ఉంటుంది. అది నెమ్మదిగా నీడలను
మాయం చేస్తుంది. చీకటిని పరిచయం చేస్తుంది. అదీ నెమ్మదిగానే! ఆ చీకటి మనతో దోస్తీ
చేస్తానంటూ
చేయి చాపుతుంది. చల్లగా వెన్ను నిమురుతుంది. నిద్ర పుచ్చుతుంది. కాలమంటే ఏమిటో తెలియని
పాతకాలం మానవుడు,
చీకట్లో ఇంకేమీ చేయలేకనే
రాత్రి నిద్రపోవడం మొదలు
పెట్టాడు. మనం ఇప్పుడు
తెలివి మీరి తెల్లవార్లూ పనిచేయడం
నేర్చుకున్నాం! సహజంగా,ప్రకృతి
సిద్ధంగా వచ్చే చీకటి, వెలుతురూ
నెమ్మదిగా
వస్తాయి. మీటలతో
వచ్చేవి మాత్రం హఠాత్తుగా
వస్తాయి.
ఎన్నిసార్లు అనుకున్నా మళ్ళీ
దొరకని అందం, జొన్నలు
చల్లినట్లు నక్షత్రాలు
కనిపించే ఆకాశం! చీకటి పోయింది. దానితో బాటే ఆకాశం అందాలూ మాయమయినాయి. పగలంతా ప్రపంచతంత్రం
నడుస్తుంది. రాత్రి
నడిచేది రమ్యమైన తంత్రం. లేదా రహస్య తంత్రం! మెదడుకు
పనిచెప్పే పనులు, సాహిత్య, కళాజగత్తుకు
సంబంధించిన
కార్యక్రమాలకు ఈ చీకటి పొద్దుకన్నా
మించిన సమయం మరొకటి లేదు.
ఇంత వెలుగుల కాలంలోనూ, ఒకనాటకం, సినిమా, సంగీత కచేరీ నడవాలంటే
సాయంత్రం కావల్సిందే. అంతా వచ్చి చేరిన తర్వాత
దీపాలు ఆర్పి చీకటి చేయవలసిందే. ఆ చీకటి జరగబోయే
కార్యక్రమానికి మన మనస్సుల్లో
ఒక వాతావరణాన్ని తయారు చేస్తుంది.
పాత కాలంలోనయినా అమ్మమ్మ
కథల నుంచి మొదలు అన్ని
రకాల కళారూపాలకు అనువయిన
కాలం రాత్రిలో తొలిజాము. ఆ చీకట్లోనే
మనసు పంచుకున్న జంటలు, భయం భయంగానే ఒకచోటు
చేరి మాటలూ పంచుకునేది. అదంతా చీకటి సమయం. నీడల కాలం. ఈనాటి
మీటలకాలంలో నీడలకు తావులేదు. సినిమాల్లో టెలివిజన్ కథల్లో
నీడలుండవు. అంటే
అదంతా నిజం కాదని సూచన. అన్యాయంగా
నిజం జీవితంలో కూడా నీడలు లేకుండా
పోతున్నాయి. నీడలతోనే కాలం
కొలతలు వేసుకున్నారు. ఒకప్పటి సన్డయల్, జంతర్ మంతర్లు అందుకు ఉదాహరణలు.
వెలుతురు లాంటి చీకటి, వెలుతురు కలిసిన చీకట్లో
నీడలు ఒకటి కాక లోతులూ
తెలుస్తాయి. చిత్రపటంలో లోతులు తేవడం
కోసం చీకటిని ఆశ్రయించే, నీడలను సృష్టించే కళాకారులు
ఈ సంగతిని అంగీకరిస్తారు.
వెలుగులో దృశ్యం, ప్లాష్ వేసి తీసిన ఫోటోలా
చదునయిపోతుంది.
దక్షిణ
భారతదేశపు గుడులలో ఇప్పటికీ
చీకటిని నిలబెడుతున్నారని చాలామంది
గమనించారు. బయట ఇంటి అలంకరణలు, దీపాలు ఉన్నా, గర్భగుడిలో చమురు దీపాలు, నెయ్యి దీపాలు మాత్రమే
మినుకు మినుకు మంటుంటాయి. ఆ మసక వెలుతురులో భక్తునికి
కనిపించీ, కనిపించని
దేవుడు,నిజంగా
ఆస్తినాస్తి విచికత్సను
కలిగిస్తాడు.
నక్షత్రాల హోటళ్ళల్లోనూ
ఇదే పద్ధతి! బయటంతా
వెలుగుల పండుగయినా తిండి
తినే చోట మాత్రం చీకటి! అంటే అది అందమనే గదా!