తుపాకుల
ప్రపంచం
పొద్దున్నే
ప్రపంచం సంగతులన్నీ తలుపు
కింది నుంచి ఇంట్లోకి
దూరి వచ్చేస్తాయి. విప్పి
చూస్తే బాంబుల వర్షం,
తుపాకుల మోత, భయం విలయం
ఇల్లంతా పరుచుకుంటాయి.
తుపాకులను గురించిన
కొన్ని జ్ఞాపకాలున్నాయి.
మాఊళ్ళో బడి ముందర పెద్ద
మర్రిచెట్టు ఉండేది.
అది ఈనాటికీ ఉంది. అప్పట్లో
ఆ మర్రిచెట్టు కిందనే
ప్రార్థన జరిగేది. చెట్టు
మీద గుడ్లగూబ ఉందని ఎవరో
చూశారు. అంత పెద్ద చెట్టు
మీద ఒక అమాయకపు పక్షి
ఉందని అంత గత్తర ఎందుకయిందో
నాకు ఇవాళిటికీ అర్ధం
కాదు. ఒక పంతులుగారు మిలిటరీ
మనిషిలా ఉండేవారు. ఆయన
నిజంగా మిలిటరీలో పని
చేసిందీ, లేనిదీ నాకు తెలియదు.
ఆయన దగ్గర తుపాకీ ఉంది.
దాన్ని మోసుకు వచ్చి
ఆయన గుడ్లగూబను
`ఉడాయించే' ప్రయత్నం
మొదలుపెట్టారు. అందరూ
గుంపుగా చేరారు. తుపాకీ
పాతకాలం పద్ధతి. తూటాలు
లేవు. తుపాకీ మందు, పొడుగాటి
చువ్వసాయంతో నింపాలి.
తరువాత `ఛర్రాలు' అంటే
బాల్ బేరింగ్లోంచి ఊడిపోయిన
ఇనుప గుండ్లు నింపాలి.
అవి గట్టిగా ఉండడానికి
పేడ పొడి దట్టించాలి.
ఒక పేలుడు తర్వాత మళ్ళీ
తుపాకీ తయారు కావడానికి
బోలెడు టైమ్
పడుతుంది. మూడు, నాలుగు
సార్లు కష్టపడి `నింపి
తుపాకీ పేల్చారు. గుడ్లగూబ
చావలేదని, ఎగరి ఎటోపోయిందని
నా నమ్మకం చస్తే కింద
పడాలి? పడలేదు. ఎందుకో
గుర్తులేదు కానీ అంతటితో
ఆనాటి కార్యక్రమం ముగిసింది.
గుడ్లగూబ కనిపించలేదు.
తుపాకీ కనిపించాలంటే
దసరా పండుగ రావాలి. ఏ
వారం నాడు విజయదశమి వచ్చిందంటే
దాన్ని బట్టి ఒకానొక
దిక్కున పొలంలో జమ్మికొమ్మ
నాటేవారు. ఊరి నడిమి
నుంచి అందరూ బయలు దేరి
భజన చేస్తూ ఆ కొమ్మదాకా
వెళతారు. అక్కడ పూజ జరుగుతుంది.
జమ్మికింద రాతలుంటాయి.
అంతా అయింతర్వాత మళ్ళీ
భజనతో ఊళ్ళోకి గుడిదాకా
రావాలి. ఈ కార్యక్రమంలో
ప్రత్యేకాకర్షణ `తుపాకి'.
ఉత్సవం మొదలయినప్పటి
నుంచి ఒకాయన అదే పనిలో
ఉండేవాడు. అయితే ఊళ్ళో
తుపాకీ గల మనిషి ఆయనొక్కడే.
అందుకే నాకాయన హీరోలా
కనపడేవారు. తుపాకి చూడాలని
చాలా సరదాగా ఉండేదని
ప్రత్యేకంగా చెప్పనవసరంలేదనుకుంటాను.
మొట్టమొదటి తుపాకీ
మోతకే గుడి దగ్గరకు
పోవాలని ఉండేది. కానీ
కుదిరేది కాదు. భజనకంటే
ముందు `బొడ్రాయి' దగ్గర
మేకపోతును మెడ నరికి
బలిఇచ్చేవారు. తుపాకీ
మోత అక్కడ మొదలవుతుంది.
తుపాకీ ఇష్టమే కానీ
బలి చూడాలంటే భయం. అందుకే
ఓపికపట్టి భజన మొదలయింతర్వాతే
వెళ్ళడం. ఆ తర్వాత జట్టు
తిరిగి వచ్చే దాకా తుపాకీని
గమనిస్తూ ఉండడమే కార్యక్రమం!
తుపాకీ గలాయన మా కుటుంబానికి
ఒక గొప్ప ఉపకారం చేశాడని
నా నమ్మకం. అదింకా కరెంటు
దీపాలు లేని కాలం. ఇళ్లు
పాతకాలం నాటివి. పై కప్పులో
దూలాల మీద అడ్డంగా `వాట్లు'
వాటి మీద అడ్డదిడ్డంగా
`చిలుకు చెక్క'
కలవారయితే ఆ చిలుకు
చెక్కను చదునుగా చెక్కించి
సందు లేకుండా పరిపించేవారు.
మా పెద్దలంతా స్థితిపరులుకారు.
అందుకే చేతి కందిన కరన్రంతా
పరిచేశారు. అందరమూ వరుసగా
కూర్చోని అన్నాలు తినడం
అలవాటు. పిల్లలందరూ ముగించినట్లే
గుర్తు. నాయనగారు ఎత్తి
చెంబుతో మంచినీళ్లు తాగాలి
కనుక తలపైకెత్తారు.
నీళ్లు తాగి నెమ్మదిగా
మమ్మల్ని అందరినీ చప్పుడు
చేయకుండా బయట హాల్లోకి
పొమ్మన్నారు. మిద్దెలో
పెద్ద పామున్నది. అది
వాట్లు, చిలుకు చెక్కలో
ఇరుక్కున్నది. కదలడానికి
కష్టపడుతున్నది. నాగుపామట.
లాగి కిందకు పడేస్తే
ఏం చేస్తుందో మరి! నాయన
గారు తుపాకీ గలాయనను
పిలిపించారు. అతను
వచ్చి ఒక మోతతో పామును
పరలోకానికి పంపిచారు.
చెట్లు నుంచి ఆకులు
తెంపే `కమ్మల కత్తి'తో
దాన్ని కిందకు లాగారు.
మా కుటుంబానికి కలకాలంగా
తరతరాలుగా పాములతో సంబంధం
ఉందని కథలున్నాయి. అది
మరో చరిత్ర అవుతుంది.
మొత్తానికి ఆచారం,
సెంటిమెంటూ అన్నీ కలగలిపి
ఆ పాముకు మా గడ్డి దొడ్లోనే
అంత్యక్రియలు జరిగాయి.
అదుగో! అప్పుడు చూడగలిగాము
పామును! చాలా పొడుగుంది.
అందుకే చిలుకు చెక్కలో
ఇరికింది. తుపాకీ లేకుంటే
ఏమయ్యేదో!
చదువని కొంతకాలం,
తరువాత బతుకుదెరువని
కొంతకాలం పల్లె నుంచి
దూరమయినది నేనొక్కడినే
కాదు. అంతా దారి
వెదుక్కుంటూ అప్పుడప్పుడు
పల్లెకు చేరేవారమే!
ఒకసారి వెళ్ళినప్పుడు
తుపాకీ గలాయన గురించి
అడిగాను. జైల్లో ఉన్నాడన్నారు.
దాయాదులతో పొలం పంపకాల
సంగతిగా తగువులు వచ్చినాయట.
గోడవారన మూత్రం చేస్తూ
కూచున్న దాయాది నొకడిని
ఇతను తుపాకీతో పేల్చి
చంపాడట! మాట వింటేనే వెన్ను
జలదరించింది. నేను
చిన్నప్పటి నుంచి అభిమానించిన
తుపాకీ ఎంత పని చేసింది?
ప్రపంచమే మారిపోయింది.
ఎవడి మీదా ఎవడికీ నమ్మకంలేదు.
మంత్రి గారుగానీ మరొక
పెద్ద మనిషిగానీ బజార్లోకి
బయలుదేరితే ఆయనకి ఇరుపక్కల
తుపాకులుంటాయి. పిల్లల
ఆటకు మొదటి బొమ్మలు తుపాకులు.
అన్నల ఆయుధాలు తుపాకులు,
అక్కడ ఆత్మరక్షణ కోసం
తుపాకులు. ఇన్ని రకాలుగా
మరెన్నో రకాలుగా ఎక్కడబడితే
అక్కడ తుపాకులు దొరుకుతుంటే హత్యకూ తుపాకులే,
ఆత్మహత్యకూ తుపాకులే!
తుపాకీ మీద ప్రేమతో
ఉగ్రవాదుల్లో చేరిన యువకుడి
పాత్ర ఒకటి సినిమాలో
వచ్చిందట. అందుకే పత్రిక
వచ్చిందంటే విప్పడానికి
మనసు పుట్టదు. అందులోంచి
తుపాకీ వాసన వస్తుంది.
తుపాకులు లేని ప్రపంచం
బాగుంటుందేమో?
గోపాలం.కె.బి
తేది: 29 అక్టోబర్ 2001