ఎక్కడో
దేశం కాని దేశంలో తిరుగుతుంటాము.
అంటే అది మన దేశంకాని
దేశమని అర్ధం.
అక్కడి మనుషులు అక్కడ
ఉంటారు. వారు మన భాష
మాట్లాడరు. మనలాగా
ప్రవర్తించరు. వాళ్ళ
మధ్యన మనం అడవిలో తిరుగుతున్నట్లు
తిరుగుతుంటాము. అంతమందిలోనూ ఒంటరితనం
అనుభవిస్తూ ఉంటాము.
అప్పుడు ఉన్నట్లుండి
ఒక ప్రక్కనుండి మనమాట
వినబడుతుంది. ఆత్రంగా
అటువైపు చూస్తాము. ఎవరో
మనలాగే అడవిలోనే ఉంటూ
ఒకరికన్నా ఎక్కువగా ఉన్నారు
కనుక మనభాషలో
మాట్లాడుతుంటారు.
ఆ మనుషులు
ఈక్షణంలో
మనకు ఆప్తబంధుల్లాగా కనిపిస్తారు. వెంటనే వారిని
చేరి మొహమాటం లేకుండా పలకరించాలనిపిస్తుంది.
వారు కూడా మనలాగే అంగలారుస్తుంటే అంతకంటే ఆనందంగా పలుకుతారు.
అక్కడ ఒక కొత్త బంధుత్వం పుడుతుంది.
కొత్త సంఘం తయారవుతుంది.
హైదరాబాద్
మానగర్
తమిళ సంఘమయినా, చివరకు తానా, ఆటాలయినా మరెక్కడున్నా ఇటువంటి సంఘమయినా ఈ రకంగా పుట్టేదే!
గడపలన్నింటిలోనూ ఏ గడప మేలు అంటే
మహాలక్ష్మి నివసించు `మా' గడప
మేలంటూ పిల్లలకు ఒక పాట
నేర్పిస్తారు. తన
వారితనము లేదా? చేదా?
అంటూ త్యాగరాజు ఒక కీర్తనలో రామా? నీకెటువంటి
భావం లేదా? నేను నీ
వాణ్ణి గదా? అంటూ నిలదీస్తాడు.
రామాయణంలో శ్రీరాముడే స్వయంగా `జననీ
జన్మభూమిశ్చ స్వర్గాదపి
గరీయసి' అని సెలవిచ్చాడు.
ఇంతకు `మనవారు'
అనిపించుకోదగిన వారెవరు?
పక్క ఊరికి వెళ్ళినప్పుడు
మన ఊరి వారు మన వారు! పక్క రాష్ట్రానికి
వెళితే మన
`నాడు' వారు మన వారు.
ఒలింపిక్సులో మల్లీశ్వరి పతకం సంపాయించిన తర్వాత మూడు రంగుల జెండా ఎగరేసి, జనగణమన
వినిపిస్తుంటే ఒక్క తెలుగు వారికే
కాదు మొత్తం భారతీయులకు ఎదపొంగి ప్రపంచాన్ని జయించిన భావం కలుగుతుంది. ఈ గర్వానికి
కారణమయిన ఆ
వ్యక్తికి కూడా దేశం
పట్ల ` తనవారి
' పట్ల అంత గట్టి భావమూ
ఉంటే ` ఈ విజయం నా దేశానిది!'
లాంటి అందమయిన భావాలు పెల్లుబుకుతాయి.
ఆకాశం నుంచి, అంతరిక్షం
నుంచి భారత దేశాన్ని చూసిన తర్వాత రాకేశ్శర్మ `సారే
జహాఁసే అచ్ఛా హిందుస్తాఁ
హమారా! అని
దేశవాసుల ఒడలు పులకింపజేశాడు.
దేశమంటే
మట్టికాదోయ్?
దేశమంటే మనుషులోయ్! అని గురజాడ
వారు ఏనాడో గుర్తు చేశారు.
`నమ్ నాడు'
అదే `నాదేశం'! నా
దేశం అంటే నా ప్రజలు,
నా సహజన్ములు! వారి
పట్ల గౌరవం, ప్రేమ,
అభిమానం ఉండడం మనిషన్న
ప్రతి వారికీ
సహజం. దీనికి
దేశభక్తి అనే
గొప్ప పేరు పెట్టినా,
ప్రాంతీయాభిమానం అనే మామూలు పేరు
పెట్టినా అభ్యంతరంలేదు. ఈ భావం భారతీయులకు ఎంత ఉంటుందో బుర్కీనా ఫాసోవాసులకు
అంతే ఉంటుంది!
మనదేశం
సంగతి వచ్చే సరికి ఈఅభిమానికి అంచెలున్నాయి.
హరగోవింద ఖొరానాకు
నోబెల్ బహుమతి
వచ్చినప్పుడు
అదేదో మన పక్కింటి
అబ్బాయికి వచ్చినట్లు
ఆసేతు శీతనగం ప్రజలు ఆనందపడిపోయారు.
`మనవాడు తెలుసా! అంటూ
పొంగిపోయారు. గమనించవలసిన
సంగతేమిటంటే
ఆయనకు ఈ రకమయిన కదలిక
అంతగా కలగలేదు. ఇన్నాళ్లు
లేని ప్రేమ ఇవాళ పుట్టిందా
అనుకుని నిర్లిప్తంగా
ఉండిపోయాడాయన!
అమర్త్యసేన్ కొంచెం సెంటిమెంటల్గా రియాక్టయ్యాడు. వెంటనే దేశానికి వచ్చాడు. నా దేశం, నాప్రజలు అన్న భావజాలాన్ని అనుమానం లేకుండా అందరిముందూ
వెల్లడించాడు. చెప్పదగిన మంచి మాటలేవో
చెప్పాడుకూడా ! ఇక
ఇవాళ సర్
విదియాధర్
నయీపాల్ వంతు వచ్చింది.
అందరూ ఆయన మన వాడే అంటూ సంబరపడిపోతున్నారు.
నయీపాల్లో అంతో ఇంతో భారతీయత
మిగిలి ఉంది.
అందుకే ` ఇది నా
పూర్వీకుల దేశమయిన భారతదేశానికి
కూడా గౌరవం! అన్నాడు.
`నా దేశం' అని ఆయన
ఇప్పుడు తన్ను
తాను కొంత మనల్ని మరికొంత చిన్న జేయవలసిన అవసరం లేదు!
గొప్పదనం ముందే ఉంది కనుక ఆయనకిప్పుడు నోబెల్ బహుమతి వచ్చింది. అది నిజానికి ఆలస్యమయింది.
ఇప్పటికయినా వచ్చింది కనుక అందరమూ
సంతోషించవలసిందే. ఆ
బహుమతి రాక ముందు కూడా
ఆయన మన దేశం వచ్చి మన మధ్యన ఆనందంగా తిరుగాడినందుకు మరింత సంతోషించాలి!
నయీపాల్ రచనా వ్యాసంగం
మొదలు పెట్టింది నిన్ననేమీకాదు. నిజానికి వయసుపైబడింది
గనుక రాయడం మానేశాడాయన. ఆయన గొప్పవాడయి
ఉండి గొప్పదనానికి మనం
గర్వించవలసి ఉంటే అది ఇంతకు ముందే జరిగి ఉండాలి.
జరిగింది కూడా! ఇప్పుడు
సందర్భం వచ్చింది కనుక మరోసారి ఆయన
`మనవాడే' అని అనుకోవడం. బహుమతి
రాకున్నా ఆయన
మనవాడే!
రవీంద్రనాథ్ ఠాగూర్ తర్వాత అంతర్జాతీయ
స్ధాయిలో మన
సాహిత్యానికి
గుర్తింపు తీసుకురాదగిన రచయితలు నిన్నటి
వరకు ఎవరూ లేరా? అని
కూడా మనం ఒకసారి
ప్రశ్నించుకోవాలి! ప్రపంచానికి మన భాషలు
చదివి అందులో
పండిన సాహిత్యాన్ని అర్ధం చేసుకునే
తీరిక లేదు. రెడీమేడ్గా ఇంగ్లీషులో రాసిన వారి మీద దృష్టి
సులభంగా పడుతుంది. సల్మన్ రుష్దీ అయినా
అరుంధతీరాయ్
అయినా, ఈ మధ్యన సాహిత్యాకాశంలో మిలమిలలాడుతున్నభారతీయ
తారలెవరయినా
ఇంగ్లీషులో రాసిన వారే!
నిజానికి దేశంలో వస్తున్న రచనలతో పోలిస్తే వీరిలో కొందరి రచనలు చాలా మామూలుగా
ఉంటాయి. అరుంధతీ రాయ్ నవల నిజానికి
మన ప్రమాణాలతో చూస్తే
ఎంతమాత్రం గొప్పది కాదు.
మొత్తానికి
ప్రపంచం ఎవర్నో గుర్తిస్తుంది,
అప్పుడు చుట్టుప్రక్కల వాళ్ళంతా `మనవాడు' అంటూ బయలుదేరతారు.
అదీ సంగతి!