నాలుగు సంవత్సరాలకు
ఒకసారి అంతర్జాతీయ స్ధాయిలో ఆటల పోటీలు
జరుగుతాయి. వాటి పేరే ఒలింపిక్స్! అదేం విచిత్రమోగానీ ఒలింపిక్స్
తో పాటు ఆటల పోటీలు జరిగినప్పుడల్లా
పాత రికార్డులు, పాత
గ్రామఫోన్ రికార్డుల్లాగే బద్దలవుతుంటాయి. మనిషి రాను రాను
మరింత వేగం, మరింత
బలం, మరింత ఎత్తు!
అనే ఒలింపిక్స్
పిలుపుకు బాగా
రియాక్ట్ అవుతున్నాడా?
మానవశక్తికి ఎక్కడో
ఒక చోట పతాకస్థాయి ఉంటుంది. ఆతర్వాత వారికి వాతావరణంతో
పాటు సాంకేతిక శాస్త్రం
సాయంచేసి ఆ
మరింతలను ఆదుకునేలా చేస్తుంది.
అనబాలిక్ స్టెరాయిడ్స్ అనే ఔషధాలు కూడా ఈ ఫలితాలను
తప్పుదారి ద్వారా అందజేయగలవు.
1984 లాస్ ఏంజెల్‌స ఒలింపిక్స్ లో పి. టి. ఉషకు నాలుగవ స్థానం
వచ్చింది. ఆనాటి పరుగు
పోటీలో జమైకా అమ్మాయి
శాండ్రాపార్మర్ పాట్రిక్ ఎనిమిదవ స్ధానంలో, ఆస్ట్రేలియా
అమ్మాయి డెబ్బీకింగ్ ఆరవస్ధానంలో
వచ్చారు. తర్వాత
1987లో శాండ్రా ప్రపంచ
ఛాంపియన్ అయింది. 1988లో కింగ్ సోల్ ఒలింపిక్స్
లో బంగారు పతకం గెలిచింది. ఉష ఈ రెండు
పోటీల్లోనూ పాల్గొన్నది.
కానీ వెనుకబడిపోయింది.
``నాకు టాలెంట్ లేకనా? నేనెందుకు
వెనుకబడ్డాను? దీనికి
బాధ్యులెవరు'' అని ఉష ఈ మధ్యన ఒక
పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో
వాపోయింది.
అమెరికావారు
ఇతర అభివృద్ధి చెందిన
దేశాలవారు కుప్పలు తెప్పలుగా
మెడల్స్ గెలవడం మామూలయిపోయింది. ఈసారి కూడా పరిస్థితిలో
మార్పు ఉంటుందనుకోలేము.
వారు గెలిచే పతకాలను
కేవలం ఆ వ్యక్తులే ఆధారం అనుకుంటే మాత్రం తప్పు.
నిజంగా మెడల్ను పంచుకోవలసిన
పరిస్ధితి వస్తే అందులో
పరిశోధకులకు, శాస్త్రవేత్తలకు
ఆటల సామాగ్రి తయారు చేసే
కంపెనీలకూ భాగం ఇవ్వవలసి
ఉంటుంది.
క్రీడాకారుల
దుస్తులు, పరికరాలు మొదలయిన వాటిని
పోటీకి అనువుగా తయారు
చేయడానికి ధనిక దేశాలవారు
పెద్ద ఎత్తున
ఖర్చు పెడుతున్నారు.
అమెరికా వారి ఒలింపిక్స్ కమిటీ
రెండు బిలియన్ డాలర్లకు పైగా వెచ్చించి
స్పోర్ట్స్ సైన్స్ విభాగాన్ని ఏర్పాటు చేసింది.
ప్రైవేట్ కంపెనీల వారు కూడా ఈ
రకంగానే కృషి
చేస్తున్నారు.
ప్రపంచస్ధాయిలో పరుగు పందాలలో పాల్గొనే క్రీడా కారులు
వేసుకునే దుస్తులలో ఎంతో
మార్పు వచ్చింది. మన దేశంలో సినిమా వారు తప్పితే
మరొకరు బిగుతు గుడ్డలు వేసుకోవడం మనకు నచ్చదు.
సంసారపక్షంగా చీర కట్టుకుని పరుగు పందెంలో
పాల్గొనడం వీలు కాదు
కదా? మనకు దుస్తులు
కేవలం అలంకరణే. చేసే
పనికి అనువుగా ఉండడం
గురించి ఆలోచనే లేదు.
ప్లారెన్స్ గ్రిఫిత్ జాయ్నర్ వంద మీటర్ల పరుగుపందెంలో ప్రపంచరికార్డు స్ధాపించింది.
అప్పుడు ఆమె శరీరం
గంటకు 22 మైళ్ళ వేగంతో
కదిలిందట. అయితే
పరిశోధకులు అక్కడ మరో
విషయం కనుగొన్నారు.
శరీరం సంగతి
అటుంచి పరుగులో కాళ్ళది
ముఖ్య స్ధానం. ఆ పరుగులో
ఆమె కాళ్లు ముందుకు వెనక్కు 50 మైళ్ళ
వేగంతో కదిలాయట. అమెరికన్ ఒలింపిక్స్ కమిటీ
వారు ఈ విషయంపై
ప్రత్యేక పరిశోధనలు
జరిపారు. ``కాళ్ళ చుట్టూ
గాలి కదలిక వేరేరకంగా
ఉండాలి. కాబట్టి ఆ
కాళ్లు ఏరో డైనమిక్స్
విషయంలో ఎక్కువ అనుకూలంగా ఉండేట్టు
ఏర్పాటు చేస్తున్నాం''
అని పరిశోధకులు ప్రకటించారు.
సిడ్నీలోని పోటీలో అమెరికన్ క్రీడాకారులకోసం,
నికీ అనే కంపెనీ ప్రత్యేకంగా దుస్తులను
తయారు చేసింది. ఒంటికి
అతుక్కుని ఉండే ఈ దుస్తులు,
శరీరం మీద కలిగే గాలి
రాపిడిని తగ్గిస్తాయట.
అంటే పరుగు క్షణంలో
కొంత భాగమైనా త్వరగా
ముగిసే వీలుంటుంది.
కొత్త సాంకేతిక పరికరాల
సాయంతో ఫలితాలు నిర్ణయించే ఈ కాలంలో సెకండ్లో వందవ వంతు కూడా
గెలుపునకు ఓటమికి తేడా
తెచ్చే వీలుంది మరి!
కాళ్ళకు
జోళ్ళే లేకుండా పరుగెత్తి
పతకాలు సాధించిన బడుగు
క్రీడాకారుల గురించి
విన్నాం. కానీ కాలం
మారి పోయింది. తేలికగా,
సౌకర్యంగా ఉండే షూస్ వాడుకలోకి వచ్చాయి. ఇవి కూడా పరుగుకు ప్రతిబంధకాలే అని తేల్చిన పరిశోధకులు
మేజోళ్ళతోనే
సరిపుచ్చుతామంటున్నారు.
ఈ సాక్స్ కింద బుడిపెలుంటాయి.
జంప్స్ లో పాల్గొనేవారు
సులభంగా ఎగరడానికి ఈ బుడిపెలు లోహాలతో గాక తేలికరకం
సిరామిక్స్ తో
తయారుచేసుకున్నారట!
వందకోట్ల
జనాభాగల మన దేశంలో ఒలింపిక్ పతకం గెలవగలవారే
లేరా అని ప్రశ్న! ఈ వందకోట్లే క్రీడాకారుల ప్రగతికి
స్పీడ్బ్రేకర్స్
అవుతున్నాయంటే నిజంకాదా? పరిశోధన, కొత్త పరికరాల
సంగతి పక్కనపెట్టవలసిందే!
క్రీడాకారులకు
సరైన తిండి, శిక్షణ,
ఆదరణ కరవని పెద్దలే
ఒప్పుకుంటున్నారు. ఒలింపిక్స్ లాంటి పోటీలు
వచ్చినప్పుడు, కార్గిల్ యుద్ధంలో సైన్యంలాగే
మనకు క్రీడాకారులు గుర్తుకు
వస్తారు. లేదంటే మనకు
క్రికెట్ తప్ప మరొకటి తెలియదు.
విదేశాలనుంచి ట్రెయినర్స్
ను పిలిపించిన మాట వాస్తవమే!
ఆ ట్రెయినర్లు స్వయంగా
ఈ క్రీడాకారులకు
సాయం చేయవలసింది మేము
కాదు, దేవుడు!'' అని
బాహాటంగా చెబుతున్నారు.
బాణాలు వేయడం
మన దేశంలో పురాణకాలం
నుంచి తెలిసిన విద్య! మనకు తెలిసి ప్రస్తుతం
బాణాలు టెలివిజన్ తెరలకు పరిమితమయ్యాయి.
రెండు బాణాలు ఒకదానికొకటి
ఎదురుగా తాపీగా నిలబడి
కంప్యూటర్లో
తయారు చేసిన చిత్రవిచిత్రాలను వెదజల్లడం మనకు
తెలుసు. ఆర్చర్స్,
పాయింట్స్ మన్ మన దేశంలో
ఇంకా ఉన్నారు. వారికి అధునాతన
పరికరాలు మాత్రం అందుబాటులో
లేవు. ఇతర దేశాలవారు
ఇటువంటి విషయాల్లో తీసుకుంటున్న
జాగ్రత్తలను చూస్తే ఆశ్చర్యం కలగకమానదు.
సిడ్నీలో సెప్టెంబర్ నెలలో
గాలి చాలా వేగంగా
వీస్తుందట. అది మామూలు చోట్లనే
గంటకు 24 మైళ్ళ వేగంతో
వీస్తుందట. ధనుర్విద్య పోటీలు జరిగే హోమ్బుష్బే
అనే చోట గాలి వేగం ఇంతకు
రెండింతలు అంటే
గంటకు 50 మైళ్లు ఉంటుందట.
ఈవిషయాన్ని
పట్టించుకోకుండా
మామూలు అమ్ములు మాత్రమే వెంటబెట్టుకుపోతే
అవి లక్ష్యం చేరేలోగా
పక్కకు కొట్టుకుపోవడం
ఖాయం. బాణం
గంటకు 130 మైళ్ళ వేగంతో
దూసుకుపోయి 230 అడుగుల
దూరంలో టార్గెట్కు తగలాలి. ఈలోగా అంగుళం తేడా
వచ్చినా పతకం
కూడా గాలిలో కొట్టుకుపోయినట్టే
లెక్క. సిడ్నీ పోటీలకోసం
అమెరికావారు ప్రత్యేకంగా ఆరోలను తయారుచేసి
తెచుకున్నారు.
అంగుళంలో అయిదో వంతు
చుట్టుకొలత గల ఈ పుల్లలకు
ముందు భాగంలో స్టీల్ కన్నా బరువుండే టంగ్స్టన్తో
ములుకులు తయారు చేసి
బిగించారు. పుల్లలకు
కూడా అల్యూమినియం - కార్బన్హైబ్రిడ్ను వాడారు. అది
గాలిలో మరింత సులభంగా
దూసుకుపోయేందుకు గాను
కార్బన్ - గ్రాఫైట్ పూతను పూయించారు. ఈ రకం బాణం పుల్లలను ఈస్టన్ ఆర్చరీ అనే కంపెనీవారు
ప్రత్యేకంగా తయారుచేశారు.
శిక్షణ, ప్రాక్టీస్ సమయంలో కూడా నిరంతరంగా
వీడియో చిత్రీకరణ, ఆతర్వాత
నిపుణుల సాయంతో వాటి
విశ్లేషణ, సలహా సంప్రదింపులు
ఆయా రంగాల్లో క్రీడాకారులను
మరింత మెరుగైన
ఫలితాలను సాధించడానికి
సిద్ధంచేశాయి.
ఈత
పోటీలకు ప్రత్యేకమైన
దుస్తులు, బాక్సింగ్ ప్రాక్టీస్కు ఎలక్ట్రానిక్ పరికరాలు అమర్చిన
పంచింగ్ బ్యాగ్లు, సైకిలింగ్ పోటీలో నియమాలను అతిక్రమించకుండానే
అతిసౌకర్యంగా ఉండే సైకిల్స్,
పోల్వాల్ట్
కరల్ర తయారీలో నాణ్యత
ఇలా ఒక్కొక్క విషయం గురించి
వివరాలు చూస్తుంటే ఆశ్చర్యం
కలుగుతుంది. పోటీలో
గెలుపు ఒక్కటే కాదు,
అసలు పాల్గొనడం ఎంతో
ముఖ్యం అనే అందమైన మాట
ఒకటి ఉంది. ఈప్రపంచంలో
ఏరకమైన పోటీలోనైనా గెలవాలనే
కోరికలేనిదే పాల్గొనడం
అర్ధంలేని పని.