అవ్వ
– నూలగింజ
ఉండంగుండంగుండంగ
ఒగ ఊరుండె.
ఆ
ఊర్లె ఒగ అవ్వ ఉండె.
ఒగనాడు
అవ్వకు నూలగింజ దొరికింది.
నూలగింజను
సేతుల వట్టుకోని అవ్వ
ఆలోచన జెయ్యసాగింది.
“ఈనూలగింజను
గొండవొయ్యి నాటువెట్టి
నీల్లువోస్త.
చెట్టువెరిగి
చారెడు నూలొస్తయి.
చారెడు
నూలెల్ల నాటువెడితె సోలెడు
నూలొస్తయి.
పొలం
కౌలుకు దీస్కోని సోలెడు
నూలు నాటువెడితె,
సంచులకొద్ది
నూలు వండుతయి.
ఇగేమున్నది?
నూలన్ని పట్నానికిగొండవొయ్యి
అమ్ముకుంటెనా?
కావల్సినన్ని
దుడ్లొస్తయి!
పెద్ద
ఇల్లు గట్టుకోవొచ్చు.
ఇంటిచుట్టు
చెట్లు వెట్టుకోవొచ్చు.
కావల్సినన్ని
పసురాల వెంచుకోవొచ్చు.
పాలువిండుకోవొచ్చు.
పండ్లుదెంపుకోవొచ్చు.
అట్లంటని
తిని పండుకుంటె అయినట్లెనా
కరువుకాలం
దీరిపాయె గనుక
మనుమనికి
మంచి పిల్లను జూసి పెండ్లిజేయాలె.
వానికి
పెండ్లమొస్తె ఆపిల్లకు
తీర్లతీర్ల శీరలు దేవాలె.
సింగారాలు
జెయ్యించాలె. రామసక్కటి
రయికెలుగుట్టించాలె.
తోటలకెల్లి
పూలు దెంపుకొచ్చి పిల్ల
సిగెనిండ వెట్టుకుంటది.
అంతట్లనె
పిల్లకు కడుపాయెనంటరు.
పూలు
ముడిపియ్యాలెనంటరు.
సీమంతం
జెయ్యాలె. పిల్ల సిగ్గువడుతది.
శీతమ్మకంటె
సక్కగుంటది.
అట్లంటని
పండుగజెయ్యకుండ ఉంటమా?
పదిమందికి
జెప్పకుండ ఉంటమా?
తొమ్మిది
నెలలయి కానుపైతది.
బుడుమకాయెలాగ
బుడ్డటి మునిమనుమరాలు
వుడ్తది.
ఆ
పిల్లకు సక్కటి తొట్లె
గట్టిపియ్యాలె.
దానిమీద
అస్మానుగిరి వెట్టిపియ్యాలె.
మునిమనుమరాలు
కిలకిల నవ్వుతది.
ఇల్లంత
ఎన్నెల ఒంపినట్టే ఉంటది.
మునిమనుమరాలు
దోగాడుతది.
శిన్న
కిష్నుడు కదిలొచ్చినట్టే
ఉంటది.
మునిమనుమరాలు
“అవ్వా” అంటది.
పానం
లేసొస్తది.
పిల్లకు
తీర్ల తీర్ల సోకులుజెయ్యాలె.
ఉగ్గువెట్టాలె.
ఎన్న వెట్టాలె. ఎన్నన్న
సరే అడిగిందల్ల దెచ్చియ్యాలె.
అంతట్లనె
పిల్ల పెద్దగవుతది.
సదువుకెయ్యాలంటరు.
సాలెకు
వంపాలంటరు.
సాలెకువొయ్యొచ్చిన
పిల్లకు దిష్టే దగిలెనో,
గాలే దగిలెనో
ఇంటికి
రాంగనే ఉప్పురాళ్లు దిప్పెయ్యాలె.
శిటపటమంటయి.
పిల్ల
జరసేపు పండుకుంటది. నిద్రవడితె
పెయ్యి నెమ్మదయితది.
మల్ల
లేసి దెగ్గరికొస్తది.
నెత్తిన శెయ్యివెట్టి
గోకుతుంటది.
“అవ్వా నొవ్వనే”
అంటది.
“యాడబిడ్డా”
అంట
“నెత్తిలనే”
అంటది.
ముందర
గూసుండవెట్టి నెత్తిన
సూతును గదా!
పిల్ల
నెత్తి నండ పేలు!
సాలెల
సదువు సంగతేమొగాని పేలు
మాత్రమొచ్చినయి!
శిటుక్కున
ఒగ పేనును గుక్కుత.”
అనుకుంటనే
అవ్వ నిజంగనే ఏందో కుక్కింది.
ఆలోచన
తెగింది.
సూస్తేమున్నది?
శేతులున్న
నూలగింజ నుగ్గు నుగ్గు
అయింది!
అంటేమన్నట్టు?
పగటి
కలలు పనికిరావు అన్నట్లు!