రంగు
పూసిన ప్రపంచ తంత్రం
చలన
చిత్రంలో నాయికా నాయకులు
చిత్రంగా చెట్లవెంట,
గట్లవెంట గెంతుతూ పాటలు
పాడతారు. నిజం ప్రపంచంలో
అట్లా పాటలు పాడుకోవడం
వీలు కాదుగాక కాదు. పత్రికలో
వచ్చే కథల్లో అన్ని పాత్రలు
పడికట్టు మాటలు మాట్లాడతాయి.
అందరూ మనం అనుకున్న విధంగానే
ప్రవర్తిస్తారు. వాస్తవ
దృష్టితో ఆలోచిస్తే,
‘ఇలా జరుగుతుందా? మన్నా?’
అనిపిస్తుంది. అక్కడక్కడ,
వాస్తవాలు కనిపించే సినిమాలు,
కథలు వస్తాయి. వాటికి
‘అసాధారణమయినవి’ అని
అర్థం వచ్చేట్టు పేరేదో
పెట్టేస్తారు.
మనిషి,
బతుకు తాకిడికి ఉక్కిరి
బిక్కిరి అవుతుంటాడు.
అందుకే కల్పన సంగతికి
వచ్చేసరికి, ఎలా ఉంటే
తనకు బాగుంటుందో అలాంటి
బొమ్మను గీసుకుంటాడు.
కల్పనలో కూడా మళ్లీ నిజమే
ఎదురయితే, ఎవరికీ నచ్చదని
ఏనాడో తేలిపోయింది!
రాజకుమారులకు
ప్రపంచ జ్ఞానం అంతగా
లేదని తెలిసింది. అప్పుడు
రాజు, పండితులను పిలిచి
తరుణోపాయం చెప్పమన్నాడు.
వాళ్లు కాకమ్మ పిచికమ్మ
కథలతో జోడించి రాజకుమారులకు
లోకనీతిని చెప్పడానికి
ప్రయత్నించారు. ఆ తర్వాత
ఆ రాజకుమారులకు ఏమయిందీ
తెలియదు. కానీ ఆ కథలన్నీ
పంచతంత్రం పేరిట ఈ నాటికీ
ప్రచారంలో ఉన్నాయి. మిత్రభేదం,
మిత్రలాభం గురించి అందరికీ
తెలుసు. ఇవి మొదటి రెండు
తంత్రాలు. తర్వాత సంధి,
అవిమృశ్యకారిత్వము, విగ్రహము
అని మరో మూడు తంత్రాలు
ఉన్నాయి. వాటిని గురించి
అంతగా ప్రచారం లేదు. మొత్తానికి
ప్రచారంలో ఉన్నవాటిలో
కూడా బోలెడంత ప్రపంచ
జ్ఞానం ఉంది. కథ చూచిన,
చదివిన వారికి ఆ నీతి
ఎంతవరకు మనసుకు ఎక్కిందనేది
ప్రశ్న. అందులో కూడా జంతువులు
మాట్లాడుతుంటే, దాంట్లో
కూడా మనకంటే తెలివిగా
మాట్లాడుతుంటే, చూచి
ఆనందించడంతో పని ముగుస్తుంది.
కానీ చెపుతున్నది జంతువుల
జీవన పద్ధతి కాదని, ఆ విషయాలన్నీ
మన బతుకులకు సంబంధించినవని,
అర్థం అవుతున్నదా వాస్తవాన్ని
నేరుగా చెపితే, పొడిపొడిగా,
కొన్ని సందర్భాల్లో ఘాటుగా
ఉంటుంది. దానికి కల్పన
జోడించి చెపితే, అసలు
విషయం మరుగున పడిపోతుంది.
ఈ
రోజుల్లో పిల్లలకు కథలంటే
కార్టూన్లు ఒకటే. కార్టూన్
ఫిల్మ్ తయారు చేయడం, చాలా
కష్టం, ఖర్చుతో కూడుకున్న
పని. అందుకే మన దేశంలో
కనిపించే కార్టూన్లన్నీ
పడమటి దేశాల్లో తయారయినవే.
‘పాప్ ఐ’ అని ఒక కథ ఉంటుంది.
పీలగా ఉండే ఒక అబ్బాయి
ఒకానొక ఆకుకూర తింటాడు.
అతనికి గొప్ప బలం వచ్చేస్తుంది.
దాంతో తనకంటే ఆరంతలుండే
విలన్ను చావగొట్టి చెవులు
మూస్తుంటాడు.
ఆకథలోని
నీతి నిజానికి ‘ఆకుకూరలు
తిన్నచో బలము వచ్చును’
అని. పిల్లలు ఆకుకూరలు
తినడంలేదని ఈ కథను తయారు
చేశారట. కానీ ఇన్ని సంవత్సరాలయి,
‘పాప్ ఐ’ (అంటే మిడిగుడ్లు
అని అర్థం) ఆడుతున్నా,
దాన్ని చూచి ఆకుకూరలు
తినడం మొదలు పెట్టిన
పిల్లలు లేనట్లేనని లెక్కతేలింది.
వీటితో బాటు వచ్చే చాలా
బోలెడు సీరియల్స్ లో
ఎలుక పిల్లిని, పిల్లి
కుక్కను భయపెట్టి చావగొడుతుంటాయి.
అంటే చిన్నవాళ్లు పెద్దవాళ్లను
తన్నచ్చు, తన్నాలి, తన్నగలుగుతారు
అని నీతి. అది మాత్రం అందరికీ
అర్థం అవుతుంది. మంచిచేసే
హీరోల పేరున వందల కార్టూన్
కథలున్నాయి. అవన్నీ చూచిన
తర్వాత పిల్లలు, బొమ్మ
తుపాకీ తీసుకుని ముందు
నాన్నతో మొదలు పెట్టి,
అందరినీ చంపుతామని బయలుదేరతారు.
కథలోలాంటి విలన్ లు వాళ్ల
ముందుకు రారు మరి ఉన్నవాళ్లలో
ఇంతో కొంతో విలనీ ఉంది.
కాబట్టి వాళ్లనే చంపితే
సరి. ఇంకా నయం! నాన్నల దగ్గర
నిజం తుపాకీ ఉండడం అంత
మామూలు గాదు మన దేశంలో!
పంచతంత్రం
రాసిన రోజుల్లో, కామిక్
స్ట్రిప్స్ మొదలయిన కాలంలో
ప్రపంచతంత్రం మరో రకంగా
ఉండేది. తెలివి అంత సులభంగా
కనబడేది కాదు. పిల్లలంటే
అమాయకత్వానికి మారు పేరు.
వాళ్లకు కాకి మాట్లాడిందని
చెపితే నమ్మినట్టున్నారు.
ఇప్పుడు పిల్లలకు ప్రపంచజ్ఞానం
ఎక్కువ. దాన్ని జీవితానికి
జోడించి చూడడం మాత్రం
తక్కువ. కాకీ, పిల్లీ మాట్లాడవని
తెలుసు. అయినా కార్టూన్
ఛానల్ చూడందే దినం గడవదు.
అదేమంటే మళ్లా కథమొదటికి
వస్తుంది. కల్పన నిజంగా,
నిజంలా ఉండకూడదు. ఇటువంటి
పరిస్థితిలో నీతి, నిజం
చెప్పాలంటే, రంగుపూసిన
పంచతంత్రాలకన్నా, నలుపు
తెలుపు ప్రపంచతంత్రమే
మంచిది అనిపిస్తుంది.
పిల్లల తెలివిని గుర్తించడం
ముఖ్యం. వాళ్లతో గంభీరమయిన
చర్చ చేయడం అవసరం. నిర్ణయాలను
వాళ్లకే వదిలి వేయడం,
చేతనయితే సూచనలు చేయడం
పద్ధతి.
మెటర్నిటీ
హోం నుంచి, బాబుతో, తల్లి
ఇంటికి వచ్చింది. ‘తమ్ముడు
ఎలా వచ్చాడు?’ అని పెద్దబాబు,
అయినా చిన్న వయసువాడు
అడిగాడు. పిల్లలు ఎలా
వస్తారని చెప్పే కథలు
ప్రపంచంలో రకరకాలుగా
ఉన్నాయి. పడమటి దేశాల్లో
కొంగలు వాళ్లను తెస్తాయని,
కాబేజీ మడుల్లో పిల్లలు
దొరుకుతారని, చెపుతుంటారు.
తల్లి అటువంటి సంగతేదో
చెప్పింది. అడిగిన చిన్నకుర్రవాడు
చీదరించుకుని, ‘నేనడిగింది
అదికాదు, నార్మల్ డెలివరీనా? సిజేరియన్
చేశారా?’ అన్నాడట.
ప్రపంచం
అట్లాగుంది. వాస్తవాన్ని
కథగా చెపితే బాగుండదు.
కనుక కల్పనలో కల్లబొల్లి
కబుర్లుండాలి. కానీ, కథలను
వాస్తవం చేసే ప్ర.యత్నాలు
మరీ ఎక్కువగా జరుగుతున్నాయి.
అప్పుడేమిటి మార్గం?