కోతల
కొటేషన్లు
కొటేషన్స్
రెండు రకాలుగా ఉంటాయి.
సర్కారు వారు ఏదయినా
సరే, ఒక వస్తువు, సేవ కావలసినప్పుడు
కొటేషన్స్ తెప్పించుకుంటారు.
అంటే ఆ వస్తువులను, సేవలను
ఎవరు ఎంత తక్కువ ధరకు
అందజేస్తారనేది ముందుగానే
చెప్పాలన్నమాట. మామూలుగా
మనమయితే, ఓ పైసా ఎక్కువ
పోయినా సరేననుకుని నాణ్యమయిన
వస్తువు తెచ్చుకుంటాం.
సర్కారు వారి సంగతి మాత్రం
అట్లా కాదు. వచ్చిన కొటేషన్లలో
అందరికంటే చవకగా ఎవరయితే
వస్తు వులివ్వడానికి,
సేవలు అందించడానికి ముందుకు
వస్తారో వాళ్లనే ఎంచుకోవాలని
రూలు. ఎంత కోత పెడితే అంత
మంచిది. అంటే అక్కడ నాణ్యత
అవసరం లేదనిగదా అర్థం
ఏదో ఒక ఫలానా మార్కు వస్తువు
కావాలంటే ఎవరు తక్కువ
లాభం చూచుకుని అమ్మితే
వాళ్ల దగ్గర కొనుక్కోవచ్చు.
కానీ చింతపండు కావాలనుకోండి.
ఒకాయన నాలుగు రూపాయలంటాడు.
అది శుభ్రంగా ఉంటే పండు
మాత్రమే ఉంటుంది. గింజ,
నారలు ఉండవు. ఇలాంటి పద్ధతులేవో
ఉంటాయి. ఇంకొకాయన ఒకే
రూపాయికి ఇస్తానంటాడు.
అందులో పెద్ద చిక్కు
ఉంటుంది. అంటే చింతపండులో
కాదు! వ్యవహారంలో! ఉండేది చింతపండే
అయినా అది తినడానికి
కాదుగదా, అంట్లు తోముకోవడానికి
కూడా పనికిరాదు. అయినా
సరే, కొటేషన్
ఎవరిది తక్కువగా ఉంటే
వాళ్లదగ్గరే కొనాలిగదా! అందుకనే కొన్ని
సర్కారీ సంస్థలు అంట్లు
తోమడానికి కూడా పనికిరాని
ఆ చింతపండు కొని, అచ్చంగా
పులిహోర వండేస్తారు! అందుకే వెనకట్నుంచీ,
సర్కారు వారి సంగతి మనకు
అర్థం కాకుండా ఉంటుంది.
ఈ రకం
కొటేషన్ గురించి చెపుతుంటేనే
సగం కాలం కరిగి నిండిపోయేలా
ఉంది. సర్కారు వారి పద్ధతి
ప్రకారం ముచ్చటగా ముగ్గురినుంచయినా
కొటేషన్ తెప్పించాలని
రూలు. అయితే ఎవరో ఒకరికే
చెప్పి, “నీ
రేటు నీ పేరుమీద వేసి,
మరో రెండు కంపెనీల పేరు
మీద ఎక్కువ ధరలతో నీవే
కొటేషన్ ఇచ్చేయ్!” అనే పద్ధతి ఒకటి
ఉందట! “నువ్వింత ధర వెయ్యి! తర్వాత చూద్దాం!” అనే పద్దతీ
ఉందట. అయితే గియితే, మనలాంటి
మామూలు మనుషులు ఏం కొనాలనుకున్నా
అది మన ఇష్టం వచ్చిన చోట,
ఇష్టం వచ్చిన ధరకు కొనవచ్చు
గనుక, మనకు ఈ మొదటి రకం
కొటేషన్ తో పనిలేదు. బతికిపోయాం!
కొటేషన్లు
రెండు రకాలుగా ఉంటాయనుకున్నాం
గదా! కనుక
రెండవ రకం గురించి మనమిప్పుడు
చెప్పుకుందాం! ‘సత్యమునే
పలకవలెను’ అనేది ఒక కొటేషన్. అంటే
ఇదివరకే ఎవరో ఒకరు చెప్పిన
మాటను, మనం సందర్భంగానో,
అసందర్భంగానో మళ్లీ చెప్పవలసి
వచ్చినప్పుడు ఈ రకంగా
చెప్పడాన్ని కొటేషన్
అంటారు. ‘సత్యమునే
పలకవలెను’ అన్నారు గాంధీజీ అనడం
పద్దతి. అది సిసలయిన మన
భాష పద్దతి. విషయం ముందు
చెప్పి, తర్వాత చెప్పినవారి
పేరు చెప్పడం! ఒక ముక్కకాక, చాలా పొడుగాటి
సంగతిని ఇలా చెపుతుంటే,
ఆ చెప్పేదేదో మనమే చెపుతున్నామనే
వీలుంది. ఇంగ్లీషులో
‘అండ్ గాంధీజీ
సెడ్’ అని,
అప్పుడు గాంధీజీ ఏమన్నారో
చెప్పే పద్ధతి ఉంది. అంటే
ఎవరి మాటలూ ఎవరూ ఎత్తుకుపోనవసరం
లేదన్నమాట! ఇంకా ముందుకు పోతే, గాందీజీ
అన్న మాటలను చదవడం మొదలు
పెట్టేముందు, “ఐ కోట్” అని, అది ముగిసిన
తర్వాత “ఐ
అన్ కోట్” అంటారు. అంటే అంత నిక్కచ్చిగా
ఎవరి మాటలు వారివిగానే
చెప్పాలని భావం. అక్కడ,
గాందీజీ గారేమన్నారంటే,
అని వాక్యమంతా చెప్పి,
మళ్లీ “అని” అనో, “అన్నారు” అనో అంటే, అది తెలుగు
వాక్యంలాగుండదు.
ఇంతకూ
‘సత్యమునే
పలకవలెను’ అనేది గాంధీగారు మొదటిసారిగా
చెప్పారా? కాదు. లేదు. ‘సత్యం వద!’ అనేది ఉపనిషద్వాక్యం.
ఆ వాక్యాన్ని మీరూ, నేనూ
చెప్పడం మొదలు పెడితే,
వినే వాళ్లకు గౌరవం ఎందుకుండాలి? “మీరు చెప్పబోయే మాట
మంచిదే అయితే, అది ఇదివరకే
ఎవరో ఒకరు తప్పక చెప్పి
ఉంటారు”
అని నేనొక కొటేషన్ తయారు
చేశాను. అయినా సత్యం గురించి
సందర్భం వచ్చినప్పుడంతా,
గాంధీగారు గుర్తు రావడం
అలవాటయింది. ఎందుకంటే
ఆయన ఊరికే చెప్పడంతో
ఆపకుండా, ఆ పద్ధతిని ఆచరించి
చూపించారు. అలా కొన్ని
విషయాలు కొంతమంది చెపితే
బాగుంటుంది.
జీవితాన్ని
కాచి వడబోసి చెప్పే మాటలు
కొన్ని గుండెకు హత్తుకుంటాయి.
వాటిలో ఆచరణ ఉండకపోవచ్చు.
చెప్పిన విషయం కొత్తేమీ
కాకపోవచ్చు. అయినా వినగానే
“అవునుగదా!”, అనిపిస్తుంది.
ఫేన్ మన్ అని భౌతిక శాస్త్రంలో
నొబేల్ బహుమతి గెలుచుకున్న
పరిశోధకుడు ఒకాయన ఉన్నారు.
ఆయన, చాలా చిక్కుగా కనిపించే
భౌతిక శాస్త్ర విషయాలను
చాలా సులభంగా చెప్పగలిగారు.
అంతకన్నా అందంగా ఒక జీవిత
సత్యాన్ని చెప్పారాయన.
“మనకుండేది
ఒకే జీవితం! అలా జీవిస్తూ ఒకనాడెప్పుడో
చాలా తప్పులు చేశామని
తెలుస్తుంది! అప్పుడు చూస్తే,
నిజానికి జీవితం అయిపోతూ
ఉంటుంది!” అన్నారాయన. ఫేన్ మన్
జ్ఞాని. అతనికి ఎందుకు
తప్పుచేశాననిపించిందో
చెప్పాలంటే ఒక గ్రంధం
అవుతుంది. అందుకు సరిపడే
సంగతులన్నింటినీ ఆయనే
చెప్పుకున్నాడు. అవన్నీ
గమనిస్తే మనకు ఆశ్చర్యం
కలుగుతుందే తప్ప, తప్పులు
చేశారనిపించదు. అదంతా
పక్కన బెట్టి, ఒక్క క్షణం,
ఫేన్ మన్ ను కూడా పక్కన
బెట్టి, ఆ వాక్యాలను మననం
చేసుకుంటే, ఒక గొప్ప నిజం
ప్రతివారి ముందూ నిలబడుతుంది.
ఈ రెండో
రకం కొటేషన్లతో గొప్ప
చిక్కులున్నాయి. కొందరు
ఏది మాట్లాడినా కొటేషన్
అవుతుంది. కొందరు ఏది
మాట్లాడదలుచుకున్నా,
గతంలో, ఎవరో ఆ విషయంగా
చెప్పిన కొటేషన్ తో మొదలు
పెడతారు. కొందరు సందర్భం
ఏదయినా సరే, వెదికి ఒకానొక
రచయిత, కవి, వ్యక్తి మాటలను
గుర్తు చేస్తారు. మాటలను
ఉటంకించారు అని ఒక పదం
తయారు చేశారు. కొటేషన్
అనే నామవాచకానికి మాత్రం,
ఉటంకం, ఉటంకంనం అని స్థిరం
చేసినట్లేలేదు. “తలనొప్పికి తిరుగులేని
మందు ఉంది! ఆ తలను నరికితే సరి!” అనేది, హారర్
చిత్రాల నిర్మాత ఆల్
ఫ్రెడ్ హిచ్ కాక్ గారి
కొటేషన్. ఇదే రకం?
9 జులై
2001