నేనెవరిని?
నన్నుసిద్ధం
చేసిన ప్రజలనే కాదంటున్న
నేనెవరిని?
నా శరీరంలో
దాగి ఉన్న నామెదడు నా
కన్నా మోసకారి!
ఈ మెదడుతో
ఎదురు పడడం సాధ్యం కాకుండా
ఉంది!
నేనాలోచించేది
ఏదీ నాకు పట్టిలేదు, ఆలోచనలన్నీ
అరువు తెచ్చుకున్నవే,
నన్ను కదిలించిన సంగతుల
గురించి, నన్ను కదిలించని
సంగతులను గురించీ, ఆలోచించలేకుండా
ఉన్నాను -------
నేనాలోచిస్తున్నాను
–
రాజకీయంగా – సాంఘికంగా
– ఇంకోరకంగా
– మరో
రకంగా ----
అప్పుడప్పుడు
అర్థం లేకుండా ----
అయినా నా ఈ ఆటకు,
ఎప్పుడో రాసి పెట్టిన
రూల్సున్నాయి –
నేను రూల్సు మార్చినా
, ఆటమాత్రం మార్చదలుచుకోను,
నేను –
ఊహలూ ఉద్రేకాల
పుట్టను –
చరిత్ర మిగుళ్లు
తిని బలిసిన నేను,
ప్రేరణలూ,
పూరణల కట్టను,
ఒకకాలు ఆటవికయుగంలో,
ఇంకోకాలు అంతులేని నాగరికతాపథంలో,
నేను నిర్భేద్యుణ్ణి,
సమస్త సామగ్రి
కలబోసి చేసిన మాయబొమ్మని
నేను నిశ్శబ్దాన్ని,
ఈ మత్తులో
నన్ను నేను చిత్తుచేసుకోవాలనీ,
ఈమత్తులో
నా ఆశలగుత్తులను ఎత్తుగా
పేర్చుకోవాలనుకుంటూ
నేనీ,
కాలమంతా వృథా చేశానుగదా,
ఏనాడో మాత్రమే,
శృతిలో కొన్ని స్వరాలు
పలికిన,
ఈనాడు మాత్రం
పనికిరాక మూలపడిన,
వాయిద్యాన్నా
నేను
ఆనాటి శృతుల్లో
అక్షరాలను –
నా సంతకాన్ని
వెతుక్కుంటున్నాను,
నా సంతకం – ఎవరికి
కావాలి నా సంతకం –
మెరుపు మెరిసి
మొక్కలు ముక్కలయినాయి,
మనుషులంటే పిచ్చెత్తి,
మధ్యలోకి విరిచేసింది,
మిడతలదండు పొలాలను
మింగేసింది,
వరదలు కొండలనుకూడా
ముంచేశాయి,
భూకంపాలింకా ఆగనేలేదు,
ఇవి నా సంతకాలు
ఇవే నా సంతకాలు
నేను
ఈ పుస్తకాల్లో,
ఈ కథల్లో, ఈ కావ్యాల్లో,
ఈ పత్రికల్లో, ఈ ప్రసంగాల్లో,
మునిగి ఉండకపోతే –
ఈ సమాచార
ప్రపంచంలో కరిగి ఉండకపోతే,
అనామకుణ్ణి
అయ్యుండే వాణ్ణా?
అస్తవ్యస్తమైన
అక్షరాలలాగ మిగిలి ఉండేవాణ్ణా?
అప్పుడే
బాగుండేదేమో
ఇంకేదయినా
మంచి ఆలోచనన్నా వచ్చి
ఉండేది,
నా కళ్లకు
నా చెవులకు నేనర్హుణ్ణి
నా ఊహలు మాత్రం,
ఈ ఏటి పక్క కొంగలూ, రాత్రిపూట
దొంగలూ, ఆకలిగొన్న సివంగులూ,
నా ఎదనే రహదారిగా వస్తున్న
-----
నా ఊహలు మాత్రం-
నావే – నేననర్హుణ్ణే ---
తమ అత్యుత్తమ మేధస్సులను,
ఆలోచనల కరుకు నోట్లను,
నమ్మేవాళ్లను
పిలవాలనుంది,
అమ్మేవాళ్లను
అదిలించాలని ఉంది,
నమ్మండి
బాబూ –
మీరు నమ్ముకున్న
ఈ చిల్లర నాణాలు,
ఈనాడు చెల్లవు
–
మీకింకా
తెలియనే తెలియదు పాపం
–
మీ బొమ్మలనూ,
మీ బొరుసులనూ, ఫూడ్ ఫర్
ఆల్, పులిబొమ్మలతో సహా
తిరిగి తీసుకోండి
జేబుల్లో
దాచుకోండి –
ఆ మాయలన్నీ,
మీ మాయలన్నీ, ఆనాడే అయిపోయినయి,
ఒప్పుకోండి
– తాతలొదిలిన
దేశంలో – అరువు తెచ్చుకున్న
దృశ్యాల్లో, అడుక్కొచ్చుకున్న
బొమ్మల్లో బతుకుతున్నామనీ,
వీటన్నిటికీ మీరు
వెల చెల్లిస్తే,
మీ ప్రాణాలతో –
ఆవలి గట్టున – ఆ మైదానం
– ఆ రహదారీ
– అన్నీ
వదిలేసి – మీ మార్గాన –
ఊహా గమ్యంనుండి
ఊహా గమ్యానికి – అంతులేని
ప్రయాణం –
అప్పుడర్థమవుతుంది.
నీడలాంటి నిద్ర
–
రెక్కలొచ్చి అగాధంలోంచి
ఆకాశానికి ఎగిరిపోయి–
ఒక మనిషి ఇంకొకణ్ణి
కరవకపోతే –
అరవకుండా వదిలేస్తే
-----
తన అరవయి ఆరు చేతులతో
పక్కవాణ్ణి పట్టేయకపోతే
–
ఓ మానవతా ----
అదుగో అంతంత దూరం
----
అసింటా ---- అంతంత
దూరం ---
నేను ఛస్తా – నిన్ను
చంపుతా ---
నన్ను నేనే చంపుకుంటా
----
ప్లీజ్! అసింటా! అంతంత దూరం
----
నాకు కోపం – ఆదీలేని
– అంతంలేని
కోపం–
అనాటి హిమయుగంనాటి
నా కోపం –
ఈనాటి హిమయుగానికి
ఎదురొడ్డి ----
ఈ యుగం అంతమైతే
--- అందరూ అన్నట్లు ----నమ్మినవాళ్లు
–
నమ్మనవాళ్లు ---
శాస్త్రజ్ఞుడూ , స్వామివారూ
----అందరూ అన్నట్లు ---
ఈ యుగం అంతమైతే
---
ఇప్పుడే ఎందుకు
కాకూడదు?
ఈ చలనం ఆగకముందే
–
ఆ జ్వలనం సాగకముందే
–
తుదితీర్పు రాకముందే
–
ఇప్పుడే ఎందుకు
ఆగకూడదు?
అభ్యంతరం ఉంటుందా
ఎవరికైనా?
ఇంకా ఉంది