Vijayagopal's Home Page

Baadha - mandu

Home
Audio - Ag Univ Lecture
Biodata
My Accomplishments
Telugu Science Primer
Books Published
My story
Telugu Articles - 1
Telugu Articles - 2
Telugu Stories and Articles-3
Marana Tarangam - A collection of Stories
Childrens stories
Poetry
English Collection
Translated Telugu Stories
Kahlil Gibran
Points to ponder Archives
Book Reviews
Science
TV Progs., Scripts

What cures what?

బాధ - మందు

 

 `బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్' అని తెలుగు దేవదాసు నోటి వెంట కవిగారు సులభంగానే చెప్పించారు. అంత మాటా చెప్పిన తర్వాత కూడా, హృదయబాధ తట్టుకోలేక దేవదాసు డాక్టరు అవసరం లేకుండానే ఒకానొక మందు తీసుకోవడం మొదలు పెట్టాడు. బాధ గనుక తగ్గి ఉంటే అతను మరోలా బతికి ఉండే వాడేమో! హృదయబాధ తగ్గక పోగా శరీరం కూడా గుల్లయి పోయి, మనిషే చెత్తకుండీల పక్కకు చేరుకున్నాడు. దిక్కు మాలిన కుక్కలతో నేస్తం చేశాడు. వేసుకున్న మందు, బాధ సంగతి మరిచి మనిషిని అంతం చేస్తుంది గనుక, ఆదెబ్బతో నొప్పి, బాధ అన్నీ తగ్గినట్లే లెక్క. శరత్ బాబు ఏమనుకుని ఆ కధ రాశారోగానీ, ఆతర్వాత మానసిక బాధకు మందొకటే తరుణోపాయమనే నమ్మకం చాలా మందికి కలిగింది. దేవదాసు ఆ మందు తాగి బాగుపడ్డాడని శరత్ గనుక రాసి ఉంటే  ఆయనను తప్పు పట్టాలి. ఆయన దయ కూడా తలవకుండా తన కధా నాయకుడిని పైకి పంపించేశారు. అది తెలిసి కూడా బాధా సర్పదష్టులు కొందరు అదే మందును తీసుకుంటూ ఉంటారు. అతను `దేవదాసు' అయ్యాడు అని అనిపించుకోవడం కొంతమందికి సరదా!

అన్నట్లు దేవదాసు ఈ మధ్యన మళ్ళీ పుట్టాడు. అన్ని రంగాలలోనూ అలవిమాలిన ప్రగతి జరుగుతున్న  కాలం గనుక, ఈ దేవదాసు కూడా బోలెడంత ప్రగతి సాధించాడు. ఇతను ప్రజల ముందుకు రావడానికి  కోట్లు ఖర్చయినట్లు వార్తలు ముందు వచ్చాయి. పత్రికలన్నీ గతంలో వచ్చిన దేవదాసులతో ఈ అవతారాన్ని  పోల్చి తమ తమ అభిప్రాయాలు తెలియజేశాయి. శరచ్చంద్రుని  దేవదాసు కంపుగొట్టే ధనవంతుడేమీ కాదు. (స్టింకింగ్రిచ్ అనే ఇంగ్లీషు పదప్రయోగానికి ఇది తెలుగుసేత మాత్రమే గానీ, ధనవంతులు కొంపుగొడతారన్నానని మాత్రం అనుకోకండి!) అతనో పల్లెటూరి మోతుబరి కొడుకు అంతే! కానీ ఈ కాలం దేవదాసు అవతారం, ఎంతదూరం నడిస్తే అటు చివర వస్తుందో తెలియని  భవనాల్లో, రంగారు బంగారు వాతావరణంలో కనబడుతుంది.  అలాగెందుకు చూపించారో సంజాయిషీలు ఇచ్చిన పాత్రికేయులు కూడా ఉన్నారు. మొత్తానికి అదంతా సినిమా వాళ్ళ బాధ అనుకుంటే ఒకటి మాత్రం అనుమానం లేకుండా చెప్పవచ్చు. తెలుగు దేవదాసుగారు షూటింగ్ సమయంలో ఉపవాసాలే చేశారో, ఉప్పిండే తిన్నారో తెలియదుగానీ, అతను తెరమీద కనిపించిన మరుక్షణం ప్రేక్షకుల మనసులు దిక్కులేని బాధకు గురయిపోయాయి. ఈ పాటికీ ఆ సినిమాను ఇరవైరెండవసారిగా చూచినా `అయ్యో ! పాపం!! అనిపిస్తుంది.

తాజాగా వచ్చిన దేవదాసు  ఇఫెక్టుకోసం నీట్లో పడి దొర్లుతున్నా  అజీర్ణం చేసిన లక్షణాలు కనిపించాయంతే గానీ, అయ్యో అనిపించలేదు.

 అదీ ఒక రకంగా ప్రేక్షకులను బాధపెట్టడమే గదా! ఈ సారి మరొకరెవరయినా దేవదాసు తీస్తే, ఏడవడం చేతగాని, హీరోగారిని ఎంచుకుంటారు. సినిమాహాల్లో సమయానుకూలంగా టియర్గ్యాస్, మరోపెయిన్గ్యాస్ లాంటివి  వదిలే  ఏర్పాటు చేస్తారు. సాంకేతికంగా మనం బోలెడు ముందుకు సాగాము. అందుకే బాధ పెట్టడమూ, బాధపడడమూ ఇప్పుడు అంత ఫ్యాషన్ కావు!

 నొప్పి కలిగించే మార్గాలు చాలానే ఉన్నాయి. వాటిని తగ్గించే మార్గాలు మాత్రం చాలా చాలా తక్కువగా ఉన్నాయి.  సినిమాల ద్వారా ప్రపంచాన్ని  హడలగొట్టించిన  ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ తలనొప్పి తగ్గడానికి మంచి చిట్కా ఒకటి  చెప్పినట్లు ప్రచారంలో  ఉంది. ఆ మాటలను యధాతధంగా తెలుగులో  చెప్పాలంటే హిచ్కాక్ తలనొప్పికి నా దగ్గర తిరుగులేని ఉపశమనం ఉంది. ఆ తలను నరికితే సరి! అన్నాడట. ఇంత మంచి ఉపాయం అతను గనుక చెప్పగలిగాడు. నొప్పికి కారణాలు కొన్ని చాలా సహజంగా వస్తాయి. తెనాలి రామకృష్ణుని కథ గురించి కొందరికయినా గుర్తు వచ్చి ఉండాలి. `జీవితంలో అన్నిటికన్నా సుఖకరమయిన పరిస్థితి ఏది?' అని రాయలవారు అడిగారట! `శరీరబాధ' తొలగిన సందర్భం దేవరా!' అన్నాడట రామకృష్ణుడు. అసహ్యించుకునేందుకు ఏమీ లేదుగానీ, ఒంటికీ, రెంటికీ వచ్చి, ఆ బాధను తొగించుకునే  వీలు కలగకపోతే అయ్యే బాధ అనుభవం లేని వారెవరు? ఆ తర్వాతి సుఖం తెలియని వారెవరు?

వైద్యపరంగా కూడా బాధ, లేదా నొప్పిని గురించి తెలుకోవలసిన చిత్రమయిన అంశాలు కొన్ని ఉన్నాయి. `నొప్పిని తగ్గించడానికి' అని ఇచ్చేమందులేవీ, ఉద్దేశించిన పని చేయవు. అవి నొప్పి మెదడుకు తెలియకుండా చేయగలుగుతాయి. నొప్పి, బాధ అనేది ఒక అనారోగ్యంగా  గుర్తింపబడ లేదు. ఒక్కొక్క అనారోగ్యంతో ఒక్కొక్కరకం నొప్పి కలుగుతుంది.  కొన్ని సార్లు మాత్రం అసలు అనారోగ్యం కన్నా ఈ నొప్పి  ప్రాణం మీదకు తెస్తుంది.  శరీరంలో కలిగే అన్ని సమస్యలకు స్పెషలిస్టు డాక్టర్లు ఉన్నారు. కానీ `నొప్పి' స్పెషలిస్టులు మాత్రం లేరు. జ్వరం, నొప్పి ఒకలాంటివేనని అందరూ అనుకున్నారు. ఈ మధ్యన బాధ గురించిన పరిశోధనలు బాగా జరుగుతున్నాయి. బాధకు కారణమయిన అనారోగ్యం కుదుట పడిన తర్వాత కూడా బాధ కొనసాగుతున్న  సందర్భాలున్నాయట. చాలాకాలం, తగ్గకుండా కొనసాగేది క్రానిక్ పెయిన్. ఒక్క సారిగా  వచ్చి బాగా పెరిగేది అక్యూట్ పెయిన్. ఈ రెండవరకం నొప్పి వస్తే, నాడీ మండలం బాగా పనిచేస్తున్నట్లు లెక్క. క్రానిక్ నొప్పి, నాడీమండలాన్ని, మెదడును పాడుచేసి అదో ప్రత్యేకమయిన అనారోగ్యంగా మారుతుందట.

శరీరానికి బాధ కలిగితే, కొన్ని రసాయనాలు పుట్టి మరింత బాధపుట్టిస్తాయట. మనసుబాధకు వేసుకునే మందుకూడా అంతే గదా!

 

 

Read my other articles too