Vijayagopal's Home Page

Eat and live!
Home
Audio - Ag Univ Lecture
Biodata
My Accomplishments
Telugu Science Primer
Books Published
My story
Telugu Articles - 1
Telugu Articles - 2
Telugu Stories and Articles-3
Marana Tarangam - A collection of Stories
Childrens stories
Poetry
English Collection
Translated Telugu Stories
Kahlil Gibran
Points to ponder Archives
Book Reviews
Science
TV Progs., Scripts

బతకడానికి తినాలా? తినడానికి బతకాలా?

వదినెగారు ఆ మధ్యన ఒకరోజు నీకోసం గోధుమరొట్టె చేయాలా?’ అని అడిగారు. నిజమే. గోధుమరొట్టె కావాలంటేప్రత్యేకంగా అడగవలసిందే. లేదంటే జొన్నరొట్టె ఒకటే కదా రొట్టె. అందునా కొంచెం చేదుకూడా లీలగా తోచే పచ్చజొన్నరొట్టె. అదొకటే రొట్టె. ఆ రొట్టం మీదనే కొంచెం కూర, పచ్చడి వేసుకుని, ఒక అంచునుంచి తుంచుకుంటూ తింటూ పోయి చివరికి చేయి కడిగేసుకుంటే ఆ పూటకు తిండి అయిపోయినట్లే. ఇప్పటికయితే పిండి, వాడి తాతగారి రహస్యఫార్ములా ఆధారంగా తయారు చేసినట్టు ఫలానా కంపెనీ పేరుపెట్టి అందమయిన ప్లాస్టిక్ సంచుల్లో అమ్ముతున్నారు. అందుకే ఈ కాలం పిల్లలకు పిండి దుకాణంలోంచి వస్తుందని మాత్రమే తెలుసు. వెనకట ఇంట్లో పిండి, రొట్టెలు ఒక వ్యనస్థ.

 

జొన్నలు ఎప్పటికప్పుడు కొనడమంటూ ఉండదు. పండించుకోవడం లేనివాళ్లు కూడా ఒకేసారి కొని గోలెంలో ఉంచుకోవడమే.వాటికి పురుగులు పట్టకుండా జాగ్రత్త పడాలి. పిండి విసురుకునే ముందు వాటిని ఎండలో ఆరబెట్టాలి. తేమ ఉంటే గింజలు ఇసుర్రాతిలో చుట్టుకుపోతాయి. గలగలా ఎండిన జొన్నలు పక్కన పెట్టుకుని చేతనయిన ఇద్దరు ఇసుర్రాయికి ఇటొకరు అటొకరు కూచుని ఆపడమనే మాటలేకుండా పిండి ఇసురుతుంటే అదొక చక్కని కార్యక్రమం. జానపద సంగీతంలో వ్యవసాయంలోని రకరకాల కార్యక్రమాలకు వాటి లయను బట్టి పాటలున్నట్టే, ఇసుర్రాయి పాటలు కూడా ఉండేవి. తిరగిలి అని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలువబడే ఇసుర్రాతి చప్పుడు ఆధారశృతి. ఆ చప్పుడు ఆగకుండా కొనసాగుతుంది. ఆ పాటలుకూడా ఒకరకంగా లాగినట్లుండేవి. ఇసిరే ఇద్దరిలోనూ ఒకావిడ ఇసుర్రాయిని తిప్పుతూనే పిడికిలితో గింజలను దాని రంధ్రంలోకి పోస్తుంది. చుట్టూ పడినపిండి మరీ ఎత్తుకు పేరుకుంటే, ఆ పిండిని దూరంగా జరుపుతుంది. ఇసుర్రాతిని తిప్పడానికి ఒక కామ. అది అప్పుడప్పుడు వదులవుతుంది. అప్పుడు తిరగడం ఆగుతుంది. కామను గుంజ అని కూడా అనేవాళ్లు. దాన్ని మళ్లీ గట్టిగా దిగ్గొట్టడానికి ఒక గుండ్రాయి.

 

ఇవన్నీ వాడుకుని ఎంతసేపు విసిరితే ఇంటికి సరిపడా పిండి తయారయేను ఇంటెడి చాకిరీ చేసే అమ్మలకు ఇదొక అదనపు వ్యాయామం. అందుకే వాళ్లు హాయిగా తిన్నారు. అలిసేట్టు పనిచేశారు. అయినా చెక్కిన బొమ్మలలాగ ఉన్నారు.

 

జొన్నరొట్టె తయారుచేయడం ఇంకొక కళ. అది అంత సులభంగా అబ్బేది కాదు. పిల్లలంతా పెద్దవాళ్ల దగ్గర చాలాకాలం అప్రెంటిసుగా ఉండి నేర్చుకోవలసిన కళ అది. జొన్నపిండిని చన్నీటితో కలిపితే ముద్దగా రాదు. గోధుమలో ఉండే జిగట గుణం అందులో లేదు. అందుకే నీళ్లను మరిగించి, ఆ మరిగే నీటిని పిండిలో పోసి ముద్ద కలుపుతారు. దాన్ని అలాగే ఎక్కువసేపు ఉంచినా కుదరదు. అందుకనే అంత పిండినీ ఒకేసారి కలపకూడదు. అంచెలంచెలుగా కలపాలి. ముద్ద తయారయింతర్వాత దాన్ని కర్రతో ఒత్తుకోవడమూ కుదరదు. అట్లా ఒత్తితే ఎక్కడికక్కడ ముక్కలవుతుంది. అరచేతినీ, వేళ్లనూ ఒడుపుగా వాడుకుంటూ రొట్టె అంతా ఒకేమందంగా ఉండేట్లు తట్టుకోడం జొన్నరొట్టె తయారీలో కిటుకు. అది చేతనయితే మిగతా పనులు ఏదో రకంగా నెట్టుకుపోవచ్చు. దానికన్నా పెద్ద ఒడుపు, కొట్టిన రొట్టెను ఎత్తి పెనంమీద వేయడం. ఏకొంచెం జాగ్రత్త తక్కువయినా రొట్టె, ముక్కలయి పోతుంది.

 

రొట్టెను కొంతమంది పీటమీద తడితే, మరికొంతమంది కర్రలో మలిచిన పెద్ద స్తాంబాళం వంటి పాత్రలో తట్టేవారు. దానిపేరు దాగెర. పెనం మీద రొట్టె వేడెక్కేలోపలే దానికి చల్లని నీరురాచి, పగలకుండా చూడాలి... అది చేత్తోనే చేయాలి.

 

దూరంనుంచే రొట్టెలు తడుతున్న చప్పుడు, అవి కాలుతున్న వాసన, కార్యక్రమం గురించి ప్రచారంలో పనిచేసేవి. వంటపని ఒడుపుగా చేస్తుంటే, అది నిజంగా చూడముచ్చటగా ఉంటుంది. రొట్టెలు చేయడం సంగతి కూడా అంతే. కాలిన రొట్టెలను, నిప్పులవేడి తగిలేట్లు పొయ్యిచుట్టూ పేరిస్తే, వాటిలోని తేమంతా పోయి, బిస్కెట్లలాగ కరకరగా తయారవుతాయి. వాటిని గంపలోవేసి గాలి ఆడేట్లు ఉంచితే సరి. వేడిరొట్టె తినడం ఎంత బాగుంటుందో, నిన్నటిరొట్టె తినడమూ అంతే బాగుంటుంది.

 

అడవులు పోయినయి. కట్టెలపొయ్యిలు పోయినయి. పల్లెల్లో కూడా గ్యాసు వాడుతున్నారు. ఈ ఆఘమేఘాల పద్దతిలో జొన్నరొట్టె చేసినా దానికి సరయినరుచి రాదు.

 

బతకడానికి తినాలా, తినడానికి బతకాలా అనేది ఒక పెద్ద ప్రశ్న. బతకడానికే తినడమయితే ఇన్ని రకాలు అవసరంలేదు. ఇన్ని దినుసులు అవసరంలేదు. అట్లాగని తినడానికే బతకడమూ తప్పే. కానీ, బతికినంతకాలం తినాలె గనుక, అందులో నాణ్యమెరిగి తినడం మంచిపద్ధతి. ఏం తిన్నా పొట్టనిండుతుంది. నిజమే. కానీ, తిన్నతిండి కొంత మానసిక సంతృప్తిని కూడా ఇచ్చేరకంగా ఉంటే మిగతాపనులు చేయడానికి ఆనందంగా ఉంటుంది.

 

ఇప్పుడంతా స్పీడుయుగం. అయినా ఆ స్పీడుకు సరిపడేట్టే పిజ్జాలు వగైరా తింటున్నారు. వెన్న, కూరలతో తినే జొన్నరొట్టెకు, పిజ్జాకు పెద్దతేడా లేదంటే ఒప్పుకుంటారా?

This article was originally published in Andgra Prabha Daily on 17the September 2001