Vijayagopal's Home Page

Search for Extra Terrestrial Intelligence
Home
Audio - Ag Univ Lecture
Biodata
My Accomplishments
Telugu Science Primer
Books Published
My story
Telugu Articles - 1
Telugu Articles - 2
Telugu Stories and Articles-3
Marana Tarangam - A collection of Stories
Childrens stories
Poetry
English Collection
Translated Telugu Stories
Kahlil Gibran
Points to ponder Archives
Book Reviews
Science
TV Progs., Scripts

బుద్ధిజీవుల కోసం వెదుకులాట

అది రాయి కాదు. గాలి కాదు. ధూళి అంతకన్నా కాదు. కూడికవేస్తే వచ్చేది మొత్తంకన్నా ఎక్కువ అని సూత్రం ఉంది. అచ్చంగా అదే తీరుగా రాయీ, గాలీ, ధూళీ తయారయిన పదార్థాలతోనే ఒక బ్రహ్మపదార్థం తయారయింది. అదే జీవం. అది విశ్వంలో జరిగిన వింతల్లోకెల్లా వింత. పదార్థం విచిత్రమయింది, వినూత్నమయింది, వికృతమయింది, విస్తృతమయింది. ఇంకా ఏమేమయిందో, చివరకు తలకాయయింది. ఇందుగలడందులేదని ఎందెందు వెదికి చూచినా, అధఃపాతాళంనుంచి ఆకాశందాకా జీవం ఉండనే ఉంది. యితే, జీవమంటే ఇదుగో ఇదీ.... అని చెప్పుకోవడానికి నిర్వచనానికి మాత్రం అందకుండా ఉంది.

జీవం తనకు తాను ప్రతిరూపాలను తయారుచేసుకుంటుంది. అందుకోసం శక్తిని వాడుకుంటుంది. అన్ని పరిస్థితులకు తట్టుకుంటుంది. అంతటితో ఆగకుండా సమాజాలుగా ఏర్పడి, తనంటే ఏమిటో తెలుసుకుని తనవారికి తెలియజేస్తుంది.

అటువంటి జీవం ఇప్పుడొక ప్రశ్నను పట్టుకుని సతమతమవుతున్నది. లాంటి జీవం ఇంకా ఎక్కడయినా ఉందా లాంటిది కాకుంటే ఇంకోలాంటిది విశ్వంలో బూమ్మీద కాక, మరోచోట జీవం ఉందా?

సైన్సుకు తలనొప్పి పుట్టించే ప్రశ్నేదయినా ఉంటే, ఇదేనని చాలా మంది భావం. ఎంత ఆసక్తికరంగా ఉంటుందో, అంతే అంతుదొరకని ప్రశ్న ఇది మనిషికి తెలిసిన సంగతులనినంటినీ అందంగా ఒక బోర్డుమీద ప్లాను ప్రకారం గీశామనుకోండి. అందులో అక్కడక్కడ వెలితి కనిపించడం సహజం. వాటిల్లో అన్నిటికన్నా పెద్ద వెలితి, మరోచోట జీవం సమస్య. అంతరిక్షంలో తనకంటూ దుర్భిణీ కళ్లను నిలబెట్టేసి, అక్కడి గుట్టుమట్టులన్నీ పట్టేస్తున్నాడు మనిషి. కానీ, ఇంతవరకు కనిపించిన వినిపించిన మేరలో జీవం జాడలు మాత్రం తగల్లేదు.

 

అందరూ తలోరకంగా అంచనాలు వేస్తున్నారు. కార్ల్ సేగన్ అని ఒక పరిశోధకుడుండే వాడు. గొప్ప రచయిత కూడా. కాస్మాస్ అన్న పేరుతో అతను సృష్టించిన టెలివిజన్ సీరియల్ మన దేశంలోనూ చూచాం. మనముండే పాలపుంత గెలాక్సీలోనే లక్షల కొద్దీ గ్రహాల్లో బుద్ధజీవులున్నారని ఆయన నమ్మాడు. అతనితోబాటే పరిశోధనలు జరిపిన ఫ్రాంక్ డ్రేక్ సంఖ్యను కుదించి పదివేల చోట్లకు దించాడు. తోకచుక్కలను పరిశోధిస్తుండే మరొక సైంటిస్టు, ఉంటే వందలాది తప్ప బుద్ధిజీవులు మరీ అంతగా లేరన్నాడు. ఇక కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన బెన్ చుక్కర్మన్ వంటివారేమో, గెలాక్సీలో మరో చోట జీవం లేదు పొమ్మంటున్నారు. విశ్వం సంగతి మరో మాట అంటారేమో ఇలాంటివారు.

ఇవ్ననీ కాకిలెక్కలే. ఒక్కదానికీ నిక్కచ్చిగా నిలబడే ఆధారం లేదు. అయితే ఆధారంలేదుగనుక, జీవం లేదని అనుకోనవసరంలేదు. అందుకే దిశగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. రంగాన్ని ఎగ్జోబయాలజీ అంటున్నారు. దానికే మరోపేరు ఆస్ట్రోబయాలజీ. రంగానికి పేరు తరుచుగా మారుతోంది. ఇన్నాళ్లయినా తీరు మాత్రం మారలేదు.

విశ్వంలో గ్రహాలున్నాయనడానికి అనుమానం లేదు. 1995 నుంచి ఇప్పటిదాకా జరిగిన పరిశోధనల్లో నక్షత్రాల చుట్టు తిరుగుతుండే 30 గ్రహాలు కనిపించాయి. గ్రహాలను, వాటిమీద వాతావరణాలను వెదకడానికి అమెరికా వారు, ప్రత్యేక టెలిస్కోపులను తయారు చేస్తున్నారు. మనభూమి మీద అనువుగాని చోట్లలో రకరకాల జీవులు కనిపించాయి. ఇక ఇతరగ్రహాల్లో అలాంటి జీవులు ఉండవని మనం ఎందుకు అనుకోవాలి?

 

జీవం కోసం వెదుకులాటకు మొదటి మజిలీ అంగారక గ్రహం. అక్కడికి రకరకాల అంతరిక్షనౌకలను పంపించారు. 2008 నాటికి అంగారక గ్రహంనుంచి మట్టి నమూనాలు తెస్తారట. ఆ తర్వాత గురుగ్రహం చుట్టూ తిరిగే ఉపగ్రహం యూరోపా రెండవ మజిలీ అవుతుంది. అక్కడకూడా అగారకగ్రహం మీద లాగే, నీళ్లుండిన జాడలు కనబడుతున్నాయట. అందుని ఓదో రకమయిన జీవమూ ఉండవచ్చునని ఆలోచన. చిన్నజీవులు ముందు దొరికితే, బుద్ధజీవులు అవే దారిన పడతాయి.

నలభయి సంవత్సరాలుగా సెటి (Search for Extra Terrestrial Intelligence) అనే పేరుతో ఈ వెదుకులాట కొనసాగుతూనే ఉంది. ఫలితాలు మాత్రం శూన్యం. ఈ పేరున సాంకేతికశాస్త్రం మాత్రం బాగా అభివృద్ధి చేశారు. కనుక ఏదో ఒక రోజున అకస్మాత్తుగా జీవం తాలూకు క్లూ దొరికితే ఆశ్చర్యంలేదు!

ప్రయత్నం జరుగుతూ ఉంటే ఏదో ఒకనాడు ఫలితం దొరకకపోదు. ఆ ఒకనాటికోసం అందరూ వేచి చూస్తున్నారు. అందుకు దశాబ్దాలుకాక ఏవో కొన్ని సంవత్సరాలు పట్టేచోటికి వచ్చేశాం. అలాగని జీవం ఎక్కడెక్కడుందనే చిరునామాలు దొరికిపోయినట్లు అనుకోనవసరం లేదు. ఆశకు ఆధారం లేకపోలేదు. విశ్వంలో చాలా చోట్ల జీవులకు అనువయిన పరిస్థితులు ఉన్నాయి. జీవులు ఏరకంగా ఎక్కడ ఉన్నా ఏదో ఒకనాడు వివరాలు బయటపడ వలసిందే. కావలసిందల్లా ఒక సంకేతం! ఒక అడుగుజాడ! ఒక ఆధారం! అంతే! అది అందినరోజున మనిషి తపస్సు పలించినట్టే లెక్క. పరిశోధకులు విచిత్రంగా ఉంటారు. వారికి దొరికే ఫలితాలు ఇలాగే ఉండాలని పట్టు పట్టరు. ఏది దొరికినా ఫలితమే. జీవం దొరికినా, గతించిన జీవం తాలూకు ఆనవాలు దొరికినా ఫలితం ఫలితమే. ఒక ఫలితం చాలు. భూమి మీద మాత్రమే కాక మరోచోట కూడా జీవం ఉందవి నిరూపించగలిగితే చాలు. అప్పుడే ఒంటరితనమనే భావం అడుగంటుతుంది. బుద్ధిజీవులకోసం వెదుకులాట మరోదారి పడుతుంది.

 

గోపాలం కె. బి.

25 ఆగస్టు 2001

మళ్లీ సైటు పని మొదలయిందని సంతోషం