Vijayagopal's Home Page

Icchutalo Unna Hayi - An article in Telugu
Home
Audio - Ag Univ Lecture
Biodata
My Accomplishments
Telugu Science Primer
Books Published
My story
Telugu Articles - 1
Telugu Articles - 2
Telugu Stories and Articles-3
Marana Tarangam - A collection of Stories
Childrens stories
Poetry
English Collection
Translated Telugu Stories
Kahlil Gibran
Points to ponder Archives
Book Reviews
Science
TV Progs., Scripts

An article I wrote long back!

ఇచ్చుటలో ఉన్న హాయి!

రాజు దగ్గరికీ, పెద్దలూ, గురువుల దగ్గరికీ, బాలింతరాలి దగ్గరికీ, అలా కొంతమంది దగ్గరికి వట్టిచేతులతో పోకూడదని ఒక ఆచారం ఉంది. పండో మరొకటో తీసుకుపోయి వారికి ఇచ్చుకోవడం పద్ధతి. విదేశాలక, వేరే ఊరిక వెళ్లినవారు కూడా దగ్గరివారికొరకు అక్కడినుంచి ఏదో ఒకటి తెచ్చి ఇవ్వడం అలవాటు. అంతదూరాన ఉన్నప్పుడుకూడా అందరినీ గుర్తుంచుకుని, వారికోసం ఏదో ఎంపికచేసి తెచ్చారంటే, అందులో ఆత్మీయత కనబడుతుంది మరి. కానీ,  కానుకలు ఇచ్చేవాళ్లకూ, తీసుకునే వాళ్లకుకూడా ఇబ్బంది కలిగిస్తాయి. ఇవ్వవలసినవాళ్లు ఎంతోమంది ఉంటారు. వాళ్లందరి అభిరుచులను గుర్తుంచుకుని ఎవరికి ఇష్టమయిన వస్తువులను వాళ్లకు తెచ్చి ఇవ్వాలంటే ఎంతకష్టంగా ఉంటుందో మనందరికీ అనుభవంలో ఉండేదే. అందరికీ ఒకేరకం వస్తువు తెచ్చి ఇస్తే ! ఏదో ఒకటి తెచ్చిపడేశారులే!’ అన్నమాట ఎదురవుతుంది.

శ్రద్ధయా ధేయం, హ్రియా ధేయం, సంవిదా ధేయం అంటుంది ఉపనిషత్తు. ఇచ్చేటప్పుడు శ్రద్ధతో ఇవ్వాలి. అంటే మనస్పూర్తిగా ఇవ్వాలి. మొక్కుబడి కాకూడదు. ఇచ్చేదేదో శక్తికొలదీ ఇవ్వాలి. విత్తశాఠ్యం నకారయేత్ పిసినారితనం పనికిరాదు. అన్నింటినీ మించి సంవిదా ధేయం. ఎందుకు ఇస్తున్నాము, ఏమి ఇస్తున్నాము మొదలయిన విషయాలు బాగా తెలుసుకుని ఇవ్వాలి. చక్కెరవ్యాధితో బాధపడుతున్న మనిషికి చాకొలేట్లు తెచ్చినా, గడ్డం పెంచుకుంటున్న మనిషికి బ్లేళ్ల పాకెటు ఇచ్చినా వెక్కిరించినట్టు ఉంటుంది. అదులో మనసుపెట్టి, గుర్తెరింగి ఎంపికచేసింది లేదని, చెప్పకుండానే తెలుస్తుంది! డయబిటిసు ఉండేవాళ్లకొరకు ప్రత్యేకంగా మిఠాయిలు తినుబండారాలు దొరుకుతాయి. అని వెతికి తెచ్చి ఇస్తే ఆ మనుషులు కొంతకాలం తమ బాధను మరిచిపోయి సంతోషంలో మునిగితేలుతారు. వస్తువు, దానిధర ముఖ్యం కానేకాదు. దాని వెనుకగల మంచి మనసు ముఖ్యం. ఎదురుగా లేనప్పుడు కూడా ఒకరి గురించి గుర్తుంచుకుని, వారి అలవాట్లను, పరిస్థితులను, అభిరిచులను గుర్తుంచుకుని తెచ్చి ఇచ్చేది పెన్సిలు ముక్కయినా పెద్ద సంతోషాన్ని కలిగిస్తుంది.

నిజానికి కానుకలు ఎంత తక్కువ ధర అయితే అంత మంచిదని అనిపిస్తుంది. ఆ ఇవ్వడం అంతటితో ముగియదు. ఇచ్చి పుచ్చుకోవడమనే ఆచారం ఉన్నదిగద మరి. పుచ్చుకున్నవారు, సమయం సందర్భం చూచి, అంతకంతా తిరిగి ఇవ్వాలనేది అక్షరరూపం లేని రూలు. ఇది చాలాసార్లు చాలా రకాలుగా ఇబ్బందుల్లో పడవేస్తూ ఉంటుంది. బహుమతిగా వచ్చిన గుర్రానికిగల పళ్లు లెక్కపెట్టగూడదని సామెత. అసలు నోట్లోకి చూడనేవద్దంటుంది, ఈ సామెతయొక్క జెర్మన్ రూపం. పశువులకు ఎన్ని పళ్లున్నాయో, వాటి స్థితి ఎలాగుందో చూస్తే, వాటి వయసు బయటపడుతుందని చాలా మందికి తెలియకపోవచ్చు. పనికిరానిది పడేద్దామా, ఎవరికయినా ఇద్దామా అనేది మరొక పద్ధతి. ఇట్లా పనికిరాని వస్తువులను అమ్మేందుకు ప్రత్యేకంగా దుకాణాలుంటాయి. వాటిని గిఫ్ట్ షాపులంటారు. వాటిలో దొరికే వస్తువులు ఎవరికయినా ఇవ్వడానికేగాని మనం కొని ఇంటిలో పెట్టుకునేవిగా ఉండవు. అటువంటి వస్తువులు మన ఇంట్లోనూ ఉంటాయి. కానీ అవి మనం కొన్నవి కావు. ఎవరో ఏ సందర్భంలోనో ఇచ్చి ఉంటారు. మనకు నచ్చినవి కొని మరొకరికి ఇస్తే, మరెవరికో నచ్చినవి మన ఇంటికి చేరుకుంటాయి. తెలివిగల వాళ్లయితె ఇట్లా వచ్చిన వస్తువులను భద్రంగా దాచి, గుట్టుచప్పుడుకాకుండా మరొకసారి ఇంకెవరికో ఇచ్చివేయడం కొత్తేమీ కాదు.

పెళ్లికానుకలుగా కొంతకాలం స్టీలు గిన్నెలు వగైరాలు ఇవ్వడం బాగా అలవాటుండేది. అట్లా ఇచ్చేవి ఊరికే ఇవ్వకుండా అదేదో దానశాసనంలో వేసినట్టు ఫలానా సందర్భంగా ఫలానా తేదీన ఫలానావారు ఇచ్చినది అని ఆ వస్తువు మీద వంకరటింకరగా చెక్కి ఇస్తారు. పెళ్లి ముగిసిన కర్వాత కానుకలు ముందేసుకుని కూచుంటే, భోరుమని ఏడవాలనిపించే పరిస్థతి వస్తుంది. ఒక్కొక్కటి ఒక్కో రూపంలో వందగ్లాసులు, వందమూకుడులు ఊరికే దొరికినా ఆనందమేముంది. వాడుకోవడానికి లేదు. ఇంకొకరికి ఇవ్వడానికి లేదు. ఇట్లాంటి వస్తువులను ఠోకున కొనేవాళ్లు, పేర్లు తుడిపేవాళ్లు కూడా ఉన్నారని తెలిసింది. ఆయనెవరో మంత్రిగారు, కానుకలుగా వచ్చిన శాలువాలను తిరిగి అమ్ముతాడని విన్నాము. ఒకానొక మంత్రిణి, పట్టుచీరలు, అట్లాగే అమ్మేవారని విన్నాము.

చాలా కాలం కింద ఒకానొక పెళ్లిలో పెళ్లికూతురికి కిలో టీపౌడరు కానుకగా ఇవ్వడం చూచాను. బహుశః ఆవిడగారికి టీ అంటే చాలా ఇష్టమయి ఉంటుంది. లేదా ఇచ్చిన పెద్దమనిషికి టీ వ్యాపారం అన్నా ఉండి ఉంటుంది.

ఉపకరించే వస్తువులను కానుకలుగా ఇస్తే, కొన్ని రోజులకవి లేకుండాపోతాయి. కొంతకాలం ఉండే వస్తువులయితే, ఎదురుగా ఉండి ఎప్పటికప్పుడు ఇచ్చినవాళ్లను గుర్తుకు తెస్తుంటాయి. నిజమే. కానీ, గుర్తుకు వచ్చినప్పుడల్లా మధురభావం కృతజ్ఞతా భావం మనసులో మెదిలేటట్లుండాలి. చికాకు కలిగించేదయితే, అది కానుక ఎట్లాగవుతుంది?

 

గోపాలం కె.బి.

20 ఆగస్టు 2001

Will you think twice before buying a gift?