నాకు కావలసినవాళ్లు
అని నేననుకుంటున్న కొంతమంది
ఈ ప్రపంచాన్నే వదిలేసి
వెళ్లిపోయారు.
ఎంత అమాయకుణ్ణి.
ఏం వెతుక్కుంటు వచ్చానిక్కడికి?
ఆ ! అన్నట్టు ముసలితాత
ఉండనే ఉన్నాడు. పోయి పలుకరిస్తే
బాగుంటుంది.
తాత ఇల్లు ఊరి
అవతలి దిక్కుంటుంది.
ఇంటిముందు ఒక పెద్ద
వేపచెట్టు. ఇంకో దిక్కు
ఏదో పూలచెట్టు. అంత అంగణంలో
ఆపసోపాలు పడుతూ ఆడుకునే
వాళ్లం. బావిలోకి తొంగి చూడాలంటే,
నేలమీద కాళ్లు గాలిలోకి
లేచేవి. “పడతవురా” అంటూ తాత అరిచేవాడు.
ఇప్పుడు ఆ అంగణం
నాకు అంగుళంలా కనిపించింది.
బావి, సిమెంటు తొట్టిలా కనిపించింది.
అన్యాయం! అవి చిన్నవయిపొయినయి!
“ముసలయ్యతాతా” పిలిచాను.
ముసలయ్య
వంగిపోయాడు పాపం.
నిజంగా ముసలయ్య
అయ్యాడు.
కర్రపుచ్చుకుని
నడుస్తున్నాడు.
కుంపటిమాత్రం
మునుపటిలాగే వెలుగుతున్నది.
ముసలయ్య కథలకొరకు
నావంటి పిల్లలమంతా తెల్లవార్లు
ఇక్కడే చేరే అలవాటు.
“ఎవరూ ? గోపయ్యా ! ఎప్పుడొచ్చినవు బిడ్డా? దా కూసో!” అని మర్యాదచేయను
ప్రయత్నించాడు.
అదేదీ పట్టించుకోక
నేనే పోయి గోడపక్కన ఉన్న
మొద్దు మీద కూచున్నాను.
ముసలయ్య నా కుశలమడిగాడు.
ఏదో మర్యాద చెయ్యాలని
తపనపడుతున్నాడు.
“ముసలయ్య తాతా ! నీవు కష్టపడకు! మాట్లాడు
చాలు!” అన్నాను.
“ఈ జన్మకు కష్టమెక్కడిది
బిడ్డా ? అల్సట లేను జన్మ. నీ
తాతగారి నాటినుంచి ఇయాలటి
దాన్క ఒకటే తీరుగ ఉన్న.
ఇంక ఎన్నాళ్లకు దీస్కపోతడో
దేవుడు, తెల్వదు.” అన్నాడు
తాత.
అలుపెరుగని ఆ మనిషిలో
నిరాశ. ఆశ్చర్యం.
తాతయినా మారకుండా
ఉంటాడనుకున్నాను.
పాపం అతను కూడా
మనిషేగదా.
“ఎంకటమ్మవ్వ ఏదీ?” అడిగాను.
“అందరిల్యాగనే ఆమెగూడవాయె.
నేనే మిగిలిన!” జవాబు.
అవును. ఊర్లో తెలిసిన
మొగం కనిపించినట్లే లేదు
ఇప్పటివరకు. ఎవరయినా
ఉన్నా నన్ను గుర్తించే
పరిస్థతిలో ఉండరు. గుడి
మారింది. బడిమారింది.
ఊరుఊరంతా మారింది. ఏండ్లుగడిచినా
అంత వెనకటిలాగే ఉంటుందనుకున్న
నాకు, ఒకసారి తలతిరిగినట్లయింది.
అయినా ఎక్కడో ఏదో
ఒకటి మారకుండా ఉండకపోదు.
ప్రయత్నించడంలో వెదకడంలో
తప్పేముంది. అందుకే అడిగాను.
“తాతా కథ చెప్తవా ఒకటి ?”
తాత మొగం వెలిగిపోయింది.
అతను నవ్వాడు.
“కతనా ? ఇంకా నా దెగ్గరకూచోని
కత యింటవా నాయ్నా?”
“ఎందుకూ ? వినగూడదా?”
అహ ! అదిగాదు! పెద్దోనివయినవు.
పెద్దనదువులు జదివినవు.
ఇంకా నా కతలు బాగనిపిస్తాయి
నీకు?”
“ఎన్ని జదివితే ఏమిలే
నీ కతలు ఆ పుస్తకాల్లో
ఉండవుగద ! నీవయితే కథజెప్పు
వింటనో విననో నీకే తెలుస్తుందిగద!”
ముసలయ్యకు నమ్మకం
కలిగినట్లే ఉంది. కూచున్నచోటనే
కొంచెం సర్దుకున్నాడు.
కుంపట్లో నిప్పును ఒకసారి
కెలికాడు.
“అవును! ముసలయ్యతాతా నీవు
కథచెప్పి ఎన్నిదినాలయి
ఉంటుంది?” అడిగాను.
ఆలోచనలో పడ్డాడతను.
“మీ తర్వాతి
పిల్లలు పిల్లలుగాదు ! ఇయాల
చిన్నపిల్లలు, కతలర్తంగావు.
రేపటికి పెద్దోండ్లవుతరు.
కతలువట్టవు.వాండ్లకు.
ఇగ ఎవరడుగుతరు? ఎవరికి జెప్పాలె
కతలు?” ఎదురు ప్రశ్న.
తాత ఏదో ఆలోచించాడు.
ఓక్షణం లోపలికిపోయి రెండు
జొన్నకంకులు తెచ్చాడు.
వాటిని కుంపట్లో మంటమీద
కాల్చి కాపిళ్లు రాల్చాడు.
విడాకులో పోసి నా ముందు
పెట్టాడు. ఎన్నాళ్లయింది
జొన్నకాపిళ్లు తిని
“తాతా సంక్రాంతికి
బండ్లుగడుతున్నారె ఇంకా?”
“బండ్లా ? సూసినవుగద! గుడిసెలువొయ్యి
సిమిటిమాలెలు లేసినయి.
ఇంటిటంటికి దీపాలొచ్చినయి.
నల్లలొచ్చినయి. బండి,
ఎడ్లు ఉండెటోండ్లే తక్వయిపొయునరు.
ఇప్పుడంత కరెంటు ఎగుసం
గద.”
కొంచెం సేపు నిశ్శబ్దం.
“మాల్యాకనే ఎన్కటి
సంగతులన్ని పేరుకు మిగిలినయి.
అంతే.”
అవునుమరి. తెల్లవారిందిఅ
మొదలు బతుకుదెరువు వెదుక్కుంటూ
ప్రపంచం మీద పడడం తప్పిస్తే
ఈనాటి మనిషికి తీరికెక్కడిది? పట్నమయినా
పల్లె అయినా ఒకటే తీరు!
“గోపయ్యా కత జెప్తగనీ
ఒకమాట ఇయ్యాలె.”
“ఏమది?”
“ నీవు పుస్తకాలు రాసినవట.
నాయినజెప్పిండు. నా కతలుమాత్రం
పుస్తుకముల రాయగూడదు
నీవు.”
“ఎందుకని?” తాతకు
పుస్తకాలంటే ఇష్టం లేదన్నమాట.
“ఈ కతలుగూడ పుస్తుకముల
ఒస్తే ఇగ మమ్ములను ఎవరు
పలుకరిస్తరయ్యా ?” ఆలోచనగా
అన్నాడు తాత.
నిజమే. కానీ అందరు
పెద్దలలాగే తాతగూడా పోతాడు.
అప్పుడు ఎవరు చెప్పాలె
కథలు. ప్రశ్న మెదిలింది
నా మెదడులో. కానీ ఆమాట
అడిగే ధైర్యం లేదు.
అతనికి మాత్రం
నా ఆలోచన అర్థమయనట్లుంది.
“నేంజెప్పినన్ని దినాలు
నేంజెప్పుత. ఆ తర్వాత
ఇంకెవరో ఉండనే ఉంటరు
బిడ్డా. ఈ కతలు కాయిదం
మీదికి ఎక్కగూడదు. ఇట్లనే
ఉండాలె. ఏమంటవు?”
“నేనేమంటాను? అవుననలేను..
కాదనలేను. “ఆ” అన్నానంతే.
“సరే కత జెప్త ఇను. ఇగ
మల్ల ఎవరికి కత జెప్పను.
అసలెవరన్న ఒచ్చి అడిగిన్నాడుగద.
ఇన్ని దినాలు రాజులకతలు,
మంత్రులకతలు, పాత ముచ్చట్లు
చెప్పిన. ఇయాల మాత్రం
ఇయాల్రేపటి కతజెప్త.
“ మీనికెల్లి
దేవుడు ఈ లోకం తీరు చూస్తనే
ఉన్నడు. వీండ్లనిట్ల
ఇడిసిపెట్టి శానదినాలయింది! అనిపించింది ఆయనకుగూడ.
సూసినవుగద. ఏంజూసినవు?