Vijayagopal's Home Page

Yendalo kooda Pandage!

Home
Audio - Ag Univ Lecture
Biodata
My Accomplishments
Telugu Science Primer
Books Published
My story
Telugu Articles - 1
Telugu Articles - 2
Telugu Stories and Articles-3
Marana Tarangam - A collection of Stories
Childrens stories
Poetry
English Collection
Translated Telugu Stories
Kahlil Gibran
Points to ponder Archives
Book Reviews
Science
TV Progs., Scripts

An article on Summer in childhood

ఎండలో కూడా పండుగే!

బడి నుంచి పల్లె కొంతమందికి మూడు మైళ్ళయితే, మరికొంత మందికి మరో రెండు మూడు మైళ్లుండేది. అందరమూ గుంపు గట్టుకుని అంతదూరాన్ని  ఆనందంగా నడిచేసి బడికి చేరుకునే వాళ్ళము. తిరిగి వచ్చేటప్పుడు తొందరలేదు గనుక తీరికగా నడవచ్చు. కానీ ఎండాకాలం మాత్రం తిరుగుదారి  చెమటలు కారుతున్నాసరే పరుగు తీయాలనిపించేది. కానీ పిల్లలను ఎండలు అంతగా బాధించవని ఇప్పుడనిపిస్తుంది. ఆ ఎండలో కూడా ఆడుతూ పాడుతూనే నడక సాగుతుండేది.  దారివెంట చెట్లు దయదలిచి మా తలలమీద మీద గొడుగులు పడుతుండేది. అదేం విచిత్రమో గానీ ప్రపంచంలో  చాలా సంగతులు తలకిందులుగా జరుగుతుంటాయి.  వాన కురుస్తుంటే బయటంతా బురదగా ఉంటుంది. అయినా  అప్పుడు బడికి సెలవులుండవు. మా బడి పాతకాలం నాటిది. బలంగా వాన కురిస్తే  గదులన్నీ  బావులయ్యేవి. పడుతూ లేస్తూ  మేము వానలో పడి బడికి పోవడం, అంతదూరం పోయిన తర్వాత ` ఇవాళ బడిలేదు పొండి ' అని చెప్పడం. రేపు వాన పడుతుందో లేదో చెప్పేవారు కాదు. ఎండలు మాత్రం మొదలయినయంటే నెలల తరబడి అందరినీ `అబ్బా!' అనిపిస్తాయి. ఎండకొడుతుంటే పిల్లలు, ఇంట్లోనో, బడిలోనో నీడపట్టున పడి ఉంటే బాగుంటుంది.  కానీ బడులు నడిపించే వారికి ఈ సంగతి తోచదు లాగుంది.  ఎండలు ముదిరే నాటికి ఒంటి పూట బడులని మొదలు పెడతారు. పొద్దున్న తొందరగ బడికి చేరాలి. అంతవరకు బాగానే ఉంటుంది. సూర్యుడు సరిగ్గా నడినెత్తిన  ఫెళ ఫెళ లాడుతుంటే  ఇంటి గంట కొట్టి ఒంటి గంటకు పిల్లలను రోడ్డు మీదకు  వదిలేస్తారు. దగ్గర్లో ఇల్లుండే వారంతా ఏదో ఓరకంగా  కొంపచేరుకుంటారు.  కానీ మాలాంటి పల్లెరకాలు, బడిలో ఉండి పోవడానికి లేదు. ఇంటిదారి పట్టడానికీ లేదు  కానీ ఆ సంగతి అప్పట్లో ఎప్పుడయినా తోచిందా? లేనే లేదు. వెన్నెలలో చందమామ వెచ్చగ ఉంటది అని హీరోయిన్ పాడుతుంది. మేం మాత్రం ఎండపూట నడుస్తుంటే  చల్లగా ఉంటది అనుకుని బయలుదేరే వాళ్ళము. మనసుకు ఎండలేకున్నా, శరీరానికయితే తప్పదు గదా! ఇంటికి చేరే సరికి కళ్లు చింతనిప్పులయ్యేవి. అమ్మ మజ్జిగవత్తులు  వేసి పడుకోపెట్టేది.

 ఇంటికి చేరే సరికి అని అన్నంత  సులభంగా ఇంటికి చేరడం ఏనాడూ జరిగేది కాదు. దారి పక్కన ఎవరివీ కానీ మామిడి చెట్లుండేవి. వాటికి పిందెలు పట్టినయంటే ఇక రాళ్ళతో వాటిని పడగొట్టడానికి  ప్రయత్నాలు మొదలయ్యేవి. మామిడి కాయలు, ఊరికే  తింటే ఏం బాగని ఉప్పు, మిరపపొడి పొట్లంకట్టుకుని  తెచ్చుకొనే వారూ కొందరుండేవారు.

పల్లెల్లోనూ, పట్నాల్లోనూ నీటికోసం పడుతున్న కటకటలు చూస్తుంటే  ఆ నాటి చెలిమెలు గుర్తొస్తాయి. పల్లెకనబడుతున్న  దూరంలో వాగు ఒకటి ఉండేది. నిజంగా ఇప్పుడది లేనేలేదు.      మాయమయింది. దానికి గుర్తుగా ఒక వంతెన మాత్రం మిగిలింది. అప్పట్లో వాగు బాగుండేది. సంవత్సరంలో చాలా కాలం  పారుతుండేది.  ఎండాకాలంలో ప్రవాహం ఉండేది కాదు. కానీ కష్టపడి ఇసుకలో చలిమె తోడితే  చెలిమిలాగ చల్లగా, స్వచ్ఛంగా నీరు ఊరేది. ఆ నీరు తాగడం ఒక థ్రిల్. నాలుగడుగులు నడిస్తే పల్లె వస్తుంది. అయినా వాగులో నీళ్లు తాగాలె. అదొక సరదా!

 ఎండాకాలం  గానీ, వానాకాలంగానీ  నీళ్ళకు కొదువే లేదు. ఒంటిపూట బడి దినాల్లో సాయంత్రం, సెలవులొచ్చిన తర్వాత రెండు పూటలా ఈతలు కొట్టందే  పిల్లలకు దినం గడిచేది కాదు. ఊరి చుట్టూ చెరువులంతింత బావులు.  ఈతరాని వారికి మునగబెండు, వచ్చిన వారు మునిగి ఈత. ఏదయినా సరే దినంలో సగం ఈతలోనే గడిచేది. బావినిండా తలకాయలే కనిపించేవి.  అంతమందిని చూచింతర్వాత ఈత రాని వారికి గూడా నీళ్ళలో దిగాలనిపించేది. అట్ల దిగి ఎవరో ఒక పిల్లవాడు చచ్చేవాడుకూడా. వారం దినాలవరకు బాయికి సెలవిచ్చినట్లుందేడి. ఆ తర్వాత మామూలే.

అదేం విచిత్రమో గానీ, ఇప్పుడా బావుల్లేవు. వాటిలో నీళ్లూ లేవు.  కరెంటు మోటర్లు పెట్టి భూమి లోతుల నుంచి నీరంతా తోడేసరికి బావులు బట్టపరుచుకుని పండుకునే తీరుకు చేరినయి. మోట మాత్రమే  కొట్టే కాలంలో  నీటి మట్టం ఎప్పుడూ  ఒకంతే ఉండేది.  మోట అవసరం లేకుండానే `కోలు'  కాలువలో  నీరు బాయిలోనుంచి తనంత తానే పంటకు పారేదంటే ఇప్పటి వారికి అర్ధం కూడా కాదేమో. మోటలు మోటు రకమయినయి. మోటర్లు వచ్చినయి. బావులు వొట్టిపోయినయి. ఆ తర్వాత అంటే మోటర్లు  వచ్చిన తర్వాత  కూడా మా జలకాలాటలకు మాత్రం ఢోకా లేదు. నీళ్లు పడేచోట ఒక తొట్టి కట్టేవారు. దానిపేరు హౌజు. దాంట్లో దిగి ఎంతసేపు కూచున్నా, వాగునీటిలో లేదా నది నీటిలో కూచున్నంత సంతోషంగా ఉండేది. నిరుడు కురిసిన హిమసమూహాల్లాగా ఇప్పుడు భూమి మీద నీరు కరువయింది. రెండోపూట స్నానం చేసేందుకు ఒకోసారి నీరు దొరకదు. ఇదేం ఎండాకాలం?

 ఎండాకాలమంటే చల్లదనం కోసం ప్రాణం పరితపించే కాలం. విసనకరల్రు, కుండలు సిద్ధంగా ఉండేవి చల్లదనం పంచడానికి ఈ కాలపు అయిస్ క్రీములు, కూల్ డ్రింకులు వెదికితే దొరికేవి గావు. గగ్గరి గింజలు నీళ్ళలో వేస్తే, సాబుదానా మాదిరి పెద్దవయ్యేవి చక్కెర  నీళ్ళలో ఆ గింజలు కలుపుకుని తాగితే చలువచేస్తుందనే వారు. ఇంత నీళ్ళ మజ్జిగలో ఉప్పు వేసుకుని తాగితే  అంతకన్నా  కూల్డ్రింక్ మరోటి లేదు. మా నాయన గారికి ఈ నాటికీ అభిమాన కూల్డ్రింక్ తమిదెలతో చేసిన పేలపిండి. పిల్లలకు చక్కెరతో కలిపి ఇచ్చేవారు. నాయన మాత్రం ఉప్పు, మజ్జిగ కలిపి తాగుతారు.

మంచి నీళ్ళను చల్లబరచడానికి మా కొక వింత పద్ధతి  ఉండేది. బిందెలకు, కుండలకు తెల్లని గుడ్డచుట్టి, దానిని అస్తమానం తడుపుతూ ఉండేది పెద్దవాళ్లు.  మేంమాత్రం ఒక పెద్ద చెంబు నిండా నీళ్లు పోసి, దానికి ఉత్తరీయం లాంటి గుడ్డ మూతికి గట్టిగా కప్పుకునేలా పెట్టికట్టి తలకిందులు చేసే వాళ్ళము. నీళ్లు కారిపోవు. కానీ గుడ్డమాత్రం తడుస్తూ ఉంటుంది. దాంతో నీళ్లు చల్లనవుతాయి. అన్నిటికన్నా మించిన ట్రిక్కు మరొకటి ఉంది. ఆ చెంబును ఒక గూటానికి వేలాడదీసే వాళ్ళము. నీళ్లు తాగదలుచుకుంటే  గుడ్డ విప్పవలసిన పనేలేదు. కింద నోరుపెట్టి గుడ్డను నొక్కితే చాలు. అందులోంచి వడగట్టినట్టు సన్నటి ధారగా నీరు కారేది. చల్లదనం కన్నాసరదాకు ఇది బాగా పనికి వచ్చేది.

 ఈ నాటి కోలా తరం పిల్లలకు  ఈ సంగతులేమన్నా తెలుసునా? 

Few more aricles in pipeline!