Vijayagopal's Home Page

Bharateeyullara! Johar!

Home
Audio - Ag Univ Lecture
Biodata
My Accomplishments
Telugu Science Primer
Books Published
My story
Telugu Articles - 1
Telugu Articles - 2
Telugu Stories and Articles-3
Marana Tarangam - A collection of Stories
Childrens stories
Poetry
English Collection
Translated Telugu Stories
Kahlil Gibran
Points to ponder Archives
Book Reviews
Science
TV Progs., Scripts

On our knowledge of Culture!

భారతీయుల్లారా జోహార్

 

`` అవునూ! ఇవాళ ఏ వారం?'' అని ప్రశ్న అడిగారనుకోండి. చటుక్కున అందరూ ఒకే జవాబు ఇస్తారు. జవాబు ఇచ్చిన  వాళ్ళకు ఆ వారం గురించి గుర్తుపెట్టుకునే కారణాలు వేరయి ఉండొచ్చు.  బడి పిల్లలయితే `నిన్న హాయిగా ఇంట్లోనే  ఉన్నాం. కనుక అది ఆదివారం, ఇవాళ బడికి వెళ్ళక తప్పదు, కనుక ఇది సోమవారం'' అంటారు. ఇవాళ సోమవారం అనగానే అవునా? అని అనుమానంగా  గడియారంలోకి, దినపత్రికపై మూలల్లోకి  చూసేవాళ్లూ లేకపోలేదు. అయినా అందరూ అభిప్రాయభేదం లేకుండా, ఇవాళటి వారం గురించి అంగీకారానికి వస్తారు. ఇక  నెలసంగతి అడిగామనుకుందాం. దాని గురించీ అభిప్రాయభేదాలు ఉండవు. సంవత్సరం గురించి అసలే ఉండవు. అసలింతకూ అభిప్రాయభేదాలుంటే  వారాలు, మాసాలు, సంవత్సరాలు ఏవన్నాఉంటే అవి మన అసలు సిసలయిన భారతీయ, తెలుగు పద్ధతికి సంబంధించినవి. విక్రమసంవత్సరం పద్ధతిలో ఈ ఏడాది సంఖ్య ఎంత? అస్మిన్ వర్తమానిక ప్రభావాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే.... అయ్యా ఇదే సంవత్సరం? ఏ మాసం? నిజమా? అధికమా?

 ఆచార్లు గారు మొన్నీ మధ్య ఒక విషయం చెప్పారు. ``కౌబన్ అని ఒకానొక నక్షత్ర టీ వీ కార్యక్రమం ఉంది. అందులో  ప్రశ్నలు జవాబులుంటాయి. జవాబులివ్వడానికి దేశం నలుమూలల నుంచి ఎంపికయిన  తెలివిగల వారలొస్తారు. ప్రశ్నలడగడానికి నల్లతల, తెల్ల గడ్డం గల ఒక పండిత పుత్రుడయినా బతుకు నటించనేర్చిన పొడుగాటి ఆసామీ ఉంటాడు. ఆయనకు ప్రశ్నలు తెలీవు. జవాబులంత కన్నా తెలీవు. అయినా ప్రశ్నలడుగుతూ ఉంటాడు. అదలా ఉంచితే, ఫలానాక్రికెటర్ చెల్లెలి కూతురు పేరేమిటి అంటే చటుక్కున సమాధానం చెప్పేస్తుంటారు.

 తెలివిగలవారు. హన్నా! ఏం తెలివిది అనిపిస్తుంది. కాదండీ! మొన్నటికి మొన్న ఒకాయన భరతుడి తల్లిపేరేమిటి? అని అడిగితే, ఇప్పుడే చెబుతానని ఎస్. టి.డీ.లో ఇంటికి ఫోన్ చేశాడు.  ఇదెక్కడి అన్యాయమండీ!'' అన్నారు  ఆచార్లుగారు. ఆయన ఛాదస్తుడని వేరే చెప్పాలా?

భరతఖండంబనే ఈ చక్కని పాడి యావు పొదుగులో  ముచ్చటగా మూడే చన్నులున్నాయి. ఒకటి రాజకీయము, రెండు సినిమా, మూడు క్రికెట్ అని వరుసగా వాటికి పేర్లు. సంస్కృతి అని మరోటి ఉండేది. దాన్ని తెల్లవాడో మరొకడో గడుసుగా మాయం చేశాడు. అందుకని మనకు భరతుడు, వాళ్ళ తల్లి వగైరాలు పూర్తిగా ఔటాఫ్ పేషనన్నమాట! ఒక ఇద్దరు భరతులున్నారు. వారిద్దరికీ వేరువేరుగా అమ్మలున్నారు. వారిద్దరి గురించి గొప్పగా చెప్పుకోవలసిన అవసరముంది. ఇత్యాది విషయాలు ఔటాఫ్ క్వెశ్చన్ అని వేరే చెప్పాలా?  ఇది మదీయ సమాధానం.

పెద్దాయనెవరో ఇది వరకే చెప్పాడట ( ఈపెద్ద వాళ్ళెప్పుడూ ఇంతే. మంచి మాటలన్నీ చెప్పేసి, నా వంటి వాళ్లు చెప్పడానికేమీ మిగల్చకుండా చేసేశారు) నటుడు, పాత్రయొక్క రూపాన్ని, స్వభావాన్ని  ప్రతిబింబింపజేయాలి. స్ఫురింపజేయాలి వగైరా వగైరా అని., కానీ ఇప్పుడేమవుతున్నదండీ? రాముడుగా ఒక  తరానికి ఎన్టీయార్, నేటి తరానికి అరుణ్ గోవిల్ గుర్తు కొస్తున్నరు. ఒకానొక పాఠశాల వారి పరీక్ష తర్వాత, ప్రశ్నాప్రతాలతో, జవాబు పొత్తాలను కూడా దొంగతనంగా చూసే భాగ్యంనాకు కలిగింది. అందులో రామాయణం గురించిన ప్రశ్నకి జవాబుగా కాంతారావు రథమునడిపించుచు `` ఏ నిమిషానికి ఏది జరుగునో ' అని పాటపాడును. అంజలి ఏడ్చుచుండును. వగైరా వివరాలు వ్రాశాడొక విద్యార్ధి, ఇప్పుడయితే టీ వీ రామాయణం గురించి  రాస్తున్నారనుకుంటాను. ఇంతకూ చెప్పొచ్చేదేమిటంటే (కామ్రేడ్స్! ఏమీ లేదు! అని మాత్రం కాదు. యమగోలకు క్షమాపణలు) మీరు వర్తమానముననుండుడు. భావిలోకి దూకుడు. కానీ గతమును మరిచిపోకుడు. కుంకుడు, చిక్కుడు, తవుడు, చెవుడు అవటాని!

మనవాళ్ళంతా  ఉట్టి వెధవాయిలోయ్! అని గిర్రడు అదే! ఇజీనారం బాపతు! ఏనాడో తేల్చేశాడు గదా! అలాంటి వారిని మనం గుర్తుంచుకుంటే అయ్యేది చలపతి, తిరుపతి మాత్రమే! కరోడ్పతీ చచ్చినాగాదు! సినేమా వాళ్ళ  పూర్వాపరాలు, క్రికెట్వాళ్ళ పరాక్రమాలు కొంత వరకు  డబ్బులు రాల్చును. రాజకీయుల స్వకీయాలు, పరకీయాలు రాల్చేవి మళ్ళీ దెబ్బలే!

కాబట్టి (లేకపోతే కీ బట్టి, మరేదోబట్టి జస్పాల్భట్టీ తప్ప) మినరల్ వాటర్ ముందు, జనరల్ వాటర్కు వెలలేదు. అలాగే, జనరల్ నాలెడ్జి  యందుగూడా కళలేదు. పెరిగే ప్రయిజు రొక్కం ఒక్క పోచికోలు ప్రశ్నతో ఠపిక్కని నేలమట్టమయే ఈ జనరల్ నాలెడ్జిని, కౌబన్ వంటి కార్యక్రమముల  సిలబస్ నుండి సత్వరమే తొలగింపవలెనని జరూరుగా విన్నపమును, దాఖలు చేయుట అత్వావశ్యకం. కాదంటారా?

 

గోపాలం కె.బి.

 

 

Your opinions please!