Vijayagopal's Home Page

Mandu - Mayalu

Home
Audio - Ag Univ Lecture
Biodata
My Accomplishments
Telugu Science Primer
Books Published
My story
Telugu Articles - 1
Telugu Articles - 2
Telugu Stories and Articles-3
Marana Tarangam - A collection of Stories
Childrens stories
Poetry
English Collection
Translated Telugu Stories
Kahlil Gibran
Points to ponder Archives
Book Reviews
Science
TV Progs., Scripts

On the Placebo Effect!

మందు `మాయ'లు!

`షధం జూహ్నవీ తోయం' అని ఒకమాట ఉంది. గంగనీరే మందు అని అర్థం! `వైద్యో నారాయణో హరిః' అంటే డాక్టరు వల్ల నారాయణ `హరీ' అన్నాడని పెడర్థం! మనదేశంలో పరిశోధనలు చేసే వైద్యులు నిజానికి తక్కువే! అయినా గంగనీరు మందుగా ఇచ్చే పద్ధతి ముందునుంచీ ఉందన్నమాట. ఇంగ్లీషు వైద్యం పరిశోధనల్లో ఒకమందు పనిచేసేదీ, లేనిదీ తెలుసుకోవాలంటే ముందు దాన్ని కొంతమంది మీద ప్రయోగిస్తారు. ఆ ప్రయోగం కొంచెం మిస్టరీ పద్ధతిలో ఉంటుంది. పరీక్షకు వచ్చిన వారిలో కొంతమందికి నిజం మందు ఇస్తారు. కొంతమందికి `ఉత్తుత్తి' మందు ఇస్తారు. దాన్నే ప్లాసిబో అంటారు. అది కూడా రోగలక్షణాలను తగ్గిస్తుంది. దానికన్నా బలంగా పనిచేస్తేనే అసలు మందు అంగడికి అందుతుంది.

ఉత్తుత్తి మందు కూడా పనిచేస్తుందని చాలాకాలం నుంచి తెలుసు. గంగనీరు ఇచ్చి `ఇదే మందు' మందు అంటే  పనిచేసేది మనసులోని భావం. ప్లాసిబో సంగతి కూడా అంతే. అయితే ఇంతకాలం ఈ ప్లాసిబోను ఎవరూ అంతగా పట్టించుకోలేదు. వైద్యరంగంలో ఇప్పటి వరకు జరిగిన పరీక్షలో ప్లాసిబో తీసుకున్న వారందరికీ జబ్బునయమయిన దఖలాలు కూడా ఉన్నాయి. అంటే అటువంటి జబ్బులు నయం కావడానికి కావలసింది మందు కాదుగానీ, ఎవరో తమను పట్టించుకుంటున్నారనీ, తమకు నయం కావాలని ప్రయత్నిస్తున్నారనీ, వారిచ్చిన మందు తమకు తప్పక నయం చేసి తీరుతుందనీ అనుకోవడం అని గదా!

నొప్పి, మానసిక దౌర్బల్యం వంటి వాటికి ఉత్తుత్తి మందులు బాగా పనిచేస్తాయని తెలుసు. రక్తపోటు, రక్తంలో కొలెస్టరాల్ శాతం కణుతులు కూడా ప్లాసిబోలతో తగ్గినట్లు గమనించారు. ఇంత తెలిసినా అది ఎలా జరుగుతున్నదని ఆలోచించడం మాత్రం ఈ మధ్యనే మొదలయింది. ఆ తర్వాత జరిగిన విశ్లేషణలో కొన్ని విషయాలు వెల్లడయ్యాయి. రోగి తనకు జరుగుతున్న వైద్యం పట్ల పెంచుకునే గౌరవం ఒకవేపు, అంతకుముందు మందు తీసుకున్నప్పుడు వారికి నయమయిన తీరు మరోవేపు ఈ విషయంలో ప్రభావం చూపుతాయని తెలిసింది.

శకునం చూడడం మనవారికి బాగా అలవాటుండేది. అనుకున్న పని జరుగుతుందా లేదా తెలియడానికి, కనీసం ఆలోచన కలగడానికి, రెండు వేళ్లకు, అవుతుంది - కాదు అనే లక్షణాలను అంటగట్టి, ఏదో ఒకటి పట్టుకోమని పిల్లలను అడిగేవారు. పిల్లలు అమాయకంగా ఎదో ఒకటి పట్టుకుంటారు. అలాకాక అవుతుందా, కాదా అది అడిగితే ఏమవుతుంది. అయితే మంచిదా? కాకుంటేనో, అనే ప్రశ్న పిల్లల మనసులో పుడుతుంది. అప్పుడు అడిగిన వారికి అనుకూలమయిన జవాబివ్వాలని కూడా అనిపించడం సహజం. విషయం వివరాలు తెలియకపోతే `నాకేం తెలుసు' అనడం చాలా తెలిగల పిల్లల పద్ధతి. అమాయకులయితే మాత్రం పాజిటివ్గా ఉండడం మంచిదనే భావంతో అవుతుందనే చెపుతాడు. అచ్చంగా ఇలాగే తెలిసి ప్లాసిబో పరీక్షలో పాల్గొనే వారంతా, అది పనిచేసిందనే చెబుతారు!

జరిగే వైద్యం అసలయినదయినా, ఉత్తుత్తదయినా దాని గురించి కలిగే భావానికి గట్టి ప్రభావం ఉంటుందని  మనస్తత్వ శాస్త్రవేత్తలంటున్నారు. నొప్పికి మమూలుగా ఇచ్చే ఆస్పిరిన్ కాక, అంత కన్నా బాగా పని చేయగల మరో మందు ఇచ్చామని వైద్యులంటారు. నిజానికి వారికి ఆ రెంటిలో `గట్టిమందు' తిన్నామనుకున్నవారు నొప్పి బాగా తగ్గిందన్నారని  పరిశీలకులు గమనించారు.

వైద్యుని చూడడంతో సగం చికిత్స జరుగుతుందని, ఒక సామెత ఉంది. భయం, భ్రాంతి ఉండే సందర్భాలలో మనసు శక్తికి గొప్ప పాత్ర ఉంటుంది. కరిచింది పాము అవునో కాదో తెలియకుండానే భయంతో ప్రాణం మీదకు తెచ్చుకునే వారి గురించి నిపుణులు చెబుతారు. `ఫలానా' వారిపేరు తలుచుకున్నా, వారిచ్చిన తీర్థం తాగినా, చివరకు వారికి ఫోనులోనయినా సరే విషయం చెప్పినా, ముందు తగ్గేది విష ప్రభావం కాదు, భయం తగ్గుతుంది. ఆ తర్వాత చేసిన ప్రథమ చికిత్స కొంత పనిచేస్తుంది. అందుకే `మంచి డాక్టర్' అనే పద్ధతి తయారయింది. నిజానికి అలోపతీ వైద్యంలో మామూలుగా వచ్చే వ్యాధులకు నూటికి ఎనభై మంది వైద్యుల చికిత్స ఒకేలా ఉంటుంది. వెంట ఉండి, గమనిస్తూ అనుభవం సంపాయించిన కాంపౌండర్లు, డాక్టర్లమంటూ బోర్డు పెట్టడం మనకు తెలియనిదికాదు. వారు చాలామంది బాధలకు ఉపశమనం కలిగించడం కూడా తెలిసిందే.

మందు తాలూకు రుచి, రూపాలకు కూడా ప్రభావం ఉంటుందని మరో పరీక్షలో తేలింది. అంటే మందుచూడడానికీ, మింగడానికి కూడా అసాధారణంగా ఉంటే బాగా పనిచేస్తుందన్న మాట.

          ఇస్తున్న మందువల్ల అవాంఛనీయమయిన లక్షణాలు ఎక్కువగా ఉండేచోట వైద్యులు, మందును, మందులా కనిపించే ప్లాసిబోను మార్చి మార్చి ఇస్తుంటారని, అయినా రోగి కోలుకునే తీరులో తేడా ఉండదని కొందరు నిపుణులు ఈ మధ్యనే వెల్లడించారు.

          అన్నిటికన్నా ముఖ్యమైనది, రోగికీ, వైద్యునికీ మధ్యగల అవగాహన అనిమాత్రం అందరూ అంగీకరిస్తున్నారు. అందుకే ఈ విషయంపై జరుగుతున్న పరిశోధనల్లో కొత్త మార్గాలను అవలంబించాలని భావిస్తున్నారు. చికిత్స కోసం వచ్చినవారికి, నిజంగా ఏ మందూ అవసరంలేదని తెలిసినా, అపాయం లేని బిళ్లేలేవో ఇచ్చిపంపడం డాక్టర్లకు అలవాటే !

          ఆరోగ్యం విషయంలోనే కాదు, అన్ని సంగతుల్లోనూ ప్లాసిబో పద్ధతి ఉంది. తమశక్తి మీద నమ్మకం లేనివారు, ఉద్యోగానికో మరొక సెలెక్షన్కో రెకమెండేషన్ కావాలంటారు `అలాగే చె పుతానులే' అంటాడు అడిగించుకున్న పెద్దమనిషి పని జరుగుతుంది. అది కేవలం అభ్యర్థి శక్తివల్లనే జరిగినా రెకమెండేషన్ వల్లనే జరిగిందేమో అనుకోవడం ఒక రకం  ప్లాసిబో! ఇటువంటి సందర్భాలు జీవితంలో ఇంకా లేవంటారా?

గోపాలం.కె.బి

తేది: 14 మే 2001

 

 

 

I would like to know your reactions please!