Vijayagopal's Home Page

MaranaTarangam 4 & 5

Home
Audio - Ag Univ Lecture
Biodata
My Accomplishments
Telugu Science Primer
Books Published
My story
Telugu Articles - 1
Telugu Articles - 2
Telugu Stories and Articles-3
Marana Tarangam - A collection of Stories
Childrens stories
Poetry
English Collection
Translated Telugu Stories
Kahlil Gibran
Points to ponder Archives
Book Reviews
Science
TV Progs., Scripts

An african story by Enerico Seruma.

మరణ తరంగం 4

మామూలు మనిషి ప్రమాదానికి గురి అయితే ఆన్ ద స్పాట్ చస్తాడు. అదే, గొప్పవాళ్లు తొంభై తూటాలు దిగినా సాయంత్రం దాకా బతికే ఉంటారు. చావుకు నిర్వచనాలు అలాంటివి. శారీరిక మరణం ఒకటయితే, క్లినికల్ మరణం ఇంకొకటి. అంతిమ ఘడియలను గురించి కవులు, రచయితలు, చిత్రకారులు చాలా కాలం నుండే బాధలు పడుతున్నారు. ఒక్కొక్క మనిషి జీవితంలోనూ ముఖ్యమయిన సంఘటనలు ఎన్నో ఉంటాయి. పెళ్లి, పిల్లలు, అనారోగ్యం, అదృష్టం వగైరా వగైరా. వీటన్నిటిలాగే మరణం కూడానూ. మిగిలిన జీవిత ఘటనల్లోఎంతటి వైవిధ్యం కనబడుతుందో చావులోనూ అంత వైవిధ్యం కనబడుతుంది.

 

అనారోగ్యం బలిసిన తర్వాత వైద్యుడి దగ్గరకు వెళతారు చాలా మంది. కొన్ని సందర్భాలలో అప్పటికే అంతా అయిపోయుంటుంది. కొందరికి పాపం వాళ్ల అంతం గురించి ముందే అర్థమయిపోతుంది. తనవాళ్లు ఎంత చెప్పకూడదని మధనపడుతున్నా అంతా తెలిసి పోతూనే ఉంటుంది. కథలు రాసుకోవడానికి, సినిమాలకూ అది చాలా మంచి సబ్జెక్టు. మనుషుల్ని కదిలించే సెంటిమెంట్లు పుడతాయి, యిలాంటి సందర్భాల్లోంచి.

 

మరణం బాధాకరం అని నమ్మకం. అందుకనే మరణం పట్ల భయం పదింతలవుతుంది. చావుకు సంబంధించిన అనారోగ్యం, యాక్సిడెంటూ బాధాకరాలే గానీ, నిజానికి చావంతటి ప్రశాంత సంఘటన మరొకటి లేదేమో. కూచున్న చోటనే అతిసునాయాసంగా కడ ఊపిరి పీల్చినవారి గురించి ఎన్ని సార్లు వినలేదు. అందుకనే మరణం చివరికి మాత్రం చాలా సులభం అంటారు హార్వర్డ్ ప్రొఫెసర్ ఆల్ఫ్రెడ్ వోర్షెస్టర్. మరణభయమే గాని మరణబాధంటూ ఏదీ లేదంటారాయన. మరణం మనుషుల జీవితాలకు కొత్త అర్థాలనిస్తుంది. గతించనున్న మనిషికి గతించిన జీవితం అంతా పుస్తకంలో పేజీల్లాగ కళ్లముందుకు వస్తుంది. చుట్టూ ఉన్నవాళ్లకు ఆ పరిస్థితులు కొత్త అర్థాలనిస్తాయి.

 

ఎనెరికో సెరుమా సమకాలీన ఆఫ్రికన్ కథాకారుడు. ఆయన రాసిన ఉదయం అన్న కథలో ముఖ్యపాత్ర ఒకకుర్రవాడు. ఆ కుర్రవాడి చిన్నతమ్ముడు పోవడంతో కుటుంబంలో అతని స్థానం ఊహించనంత మారుతుంది. అసలు కథ ఏమిటంటే,

 

ఉదయం

ఎనెరికో సెరుమా (ఆఫ్రికా)

కంపాలా నుండి పన్నెండు మైళ్ల దూరంలో పల్లెటూరు. పేరు బులోబా. అక్కడే మాయిల్లు. మాది అతిసాధారణమయిన మట్టి యిల్లు. చిన్నదనడానికి వీలులేదు. పెద్దదీ కాదు. అమ్మా నాన్నలకు నేనూ, జొనాథన్, అంటే చిన్నతమ్ముడూ ఇద్దరే పిల్లలం. వాడు, అదే, తమ్ముడు, నాకంటే రెండేళ్లు చిన్నవాడు.

 

జొనాథన్ కు అయిదేళ్ల వయసప్పుడు జబ్బు చేసింది. ఎప్పుడూ నులక మంచంలో పడి ఉండేవాడు. వాడికి వారంరోజులుగా ఒకటే జ్వరం. నాకు మాత్రం ఆ ఏడురోజులు ఏడు యుగాలుగా అనిపించాయి. రోజురోజుకు వాడి పరిస్థితి మరింత దిగజారి పోతుంటే, మృత్యువు మా యింటి మీద ఆవరించుకున్నదేమో అనిపించేది.

 

ఆ రోజు నేనింకా అన్నం ముందు అలా కూచోనే ఉన్నాను. వండిన పదార్థాలు అన్నీ ఎక్కడివక్కడే ఉన్నాయి. అమ్మా నాన్నా ఏమీ ముట్టుకోలేదన్నమాట. వాళ్లకు పుట్టని ఆకలి నాకు మాత్రం ఎక్కడినుంచి రావాలి. వాళ్లంతకు ముందే లేచి వెళ్లిపోయారు. వండిన తిండి అంతా నా ముందు వదిలేశారు. అమ్మా నాన్నా తినలేకపోయారు. ఇక నీవే మిగిలింది అని అన్నం నన్ను భయపెడుతున్నట్లనిపించింది. అయినా నాకేం ఫరవాలేదు. ఆకలి కరకరలాడుతోంది. ముద్దమీద ముద్ద మింగుతూనే ఉన్నాను. కానీ గొంతులే అడ్డు పడుతున్నట్లుంది.

 

చివరకు తినడం మానేశాను. గిన్నెలన్నీ సర్దేశాను. మిగిలిన కొంచెం అలమారులో పెట్టేశాను. దేవుడు మేలు చేస్తే రేపు పొద్దున తినవచ్చు అనుకుంటూ. నాన్నావాళ్లు జొనాథన్ తోనే ఉన్నారు. నేను వాడికి గుడ్ నైట్ చెప్పడానికి కూడా పోలేదు. ఎదురుగుండా నాగదిలోకి వెళ్లి పడుకున్నాను. జొనాథన్ దగ్గరికి వెళ్లడం నాకు ఇష్టంలేక కాదు. ధైర్యంలేక. పడక మీద అలా పడుకుని చీకటిలోకి చూస్తూ ఉన్నాను.

 

ఆ చీకట్లో ఎక్కడో మృత్యువు దాక్కొని ఉంది. నాకు అన్నివేపులనుంచి అన్నిరకాలుగానూ, మృత్యువు ఉనికి తెలుస్తూనే ఉంది. అమ్మ నిస్సహాయంగా లోలోపలే ఏడుస్తూ ఉంది. నాన్న తన ఓటమిని భయాన్ని దిగమింగుకోడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. ఈసారి మృత్యువు తన అంతిమ విజయం నిశ్చయం చేసుకుందని అందరికీ తెలుసు. అయినా డాక్టర్లు, మందులు అన్నీ జరగాల్సిందే.

 

నేను ఏ పదిగంటల ప్రాంతంలోనో నిద్రలోకి జారుకున్నట్లున్నాను. మంటల్లో చిక్కుకున్న ఎలకను రక్షించిన గద్దలాగ, ఈ నిద్ర, నన్ను బాధలనుండి తప్పించినట్లుంది. కానీ తెల్లారే సమయానికి గద్దకు ఎలకకు భారమయి పోయింది. మళ్లా ఈ వాస్తవ ప్రపంచంలోకి వస్తున్నాను. సగం నిద్ర సగం మగత. నేనే యింకా గద్దను పట్టుకుని వ్రేలాడాలని ప్రయత్నిస్తున్నాను. కానీ పట్టు దొరకడం లేదు.

 

గద్ద నిర్ణయం నిశ్చయమయిందిగా ఉన్నట్లుంది. నాకు మెలుకువ వచ్చేస్తున్నది. చీకట్లోకి కళ్లు చించుకుని చూడాలని ప్రయత్నిస్తున్నాను. నా భుజం మీద బరువయిన చేయి. నన్నెవరో కుదిపి నిద్రలేపుతున్నారు.

 

బాబూ!” చీకట్లో విచిత్రంగా ఆ గొంతు.  గొంతు నాన్నది. మా నాన్న మా యిద్దరినీ ఎప్పుడూ బాబూ!” అని పిలిచింది లేదు. ఉన్నట్లుండి నాన్నలో ఈ మార్పేమిటి? ఇంత తెల్లవారుఝామునే నన్నెనందుకు లేపుతున్నాడీయన?

బాబూ! లే!” మళ్లీ నాన్న గొంతు.

!” నా జవాబు

లే బాబూ! నువ్వు నాకు కాస్త సాయం చేయాలి!”

తప్పకుండా ఏదో జరిగే ఉంటుంది. నాన్న ఇలా ఏమిటి మాట్లాడడం? నాన్న చాలా దృఢమయిన మనిషి. గొంతు కూడా అలాగే కర్కశం. మాటకూడా కటువే. ఎప్పుడూ ఎవర్నీ ఏదీ అర్థించని మనిషి. అన్నీ తనే సాదించే మనిషి. ఇప్పుడేమిటి మరి యిలా? ఆ గొంతులో వణుకు! నన్ను ఏదో అడుక్కుంటున్నట్లు!

నేను లేచి నిలుచున్నాను. అగ్గిపెట్టె కోసం తడుముతున్నాను. చిన్న బుడ్డీ దీపం వెలిగించాను. వెలుతురు గది నిండా పరుచుకుంది. ఎదురుగుండా నాన్న. ఎంతో మారిపోయిన నాన్న. నలభై ఏళ్ల వయసులో నిండుగా కనిపించే నాన్న ఇప్పుడు మాత్రం దిగులుగా. ఆయన కళ్లలో చెప్పలేని నీడలు కదలాడుతున్నాయి! కానీ ఆ కళ్లు నన్ను తొలిసారిగా చూస్తున్నాయేమోనన్నట్లున్నాయి. నేనింకా బతికే ఉన్నందుకు సంతోషిస్తున్నట్లు కూడా ఉన్నాయి.

 

నా ముఖంలోని భావాలను అర్థం చేసుకున్నట్లున్నాడు. ముఖం అటువేపు తిప్పుకుని బరువైన స్వరంలో – అసహ్యమయిన గొంతుక. నీ తమ్ముడు చనిపోయాడు.... అమ్మను లేపేకన్నా ముందే నాకు కొంచెం సాయం చేయాలి నువ్వు

 

గత వారంరోజులుగా మృత్యువు నీడలో బ్రతుకుతున్నవాళ్లమేనా మేమిద్దరమూ. నిజంగా ఆ ఘడియ వస్తే అంత కదిలి పోతామని నేను మాత్రం ఊహించలేదు. అయినా నా తమ్ముడు చనిపోతే ఎలా? నన్నొంటరిగా వదిలేస్తే, నేనెవరితో ఆడుకోవాలి? ఎలా ఇప్పుడు?

 

అంతా అయిపోయింది. ఆ యింట్లో మేమిద్దరం మగవాళ్లం! అమ్మలేచి ఏడ్చేలోగా, చుట్టుపక్కలవాళ్లందరూ పోగయ్యేలోగా, వాడి శరీరానికి జరగవలసిన తతంగం చూచుకోవడానికి మేమిద్దరం మగవాళ్లం!

 

నేనెంత పెరిగి పోయాను? వయసు వచ్చిన వాళ్లకు కూడా లేని అనుభవం నాకు! నేను వణికి పోతున్నాను. నిలబడడానికి కూడా తోచడంలేదు. అయినా లోపల ఏ మూలనో ఒక మొండితనం. ఒక శక్తి. నేనిప్పుడు దృఢంగా ఉండాలి! నేనింకా చిన్నవాణ్నే. అయినా నాన్నని ఊరడించాలి! ఆయనకు బాసటగా నిలవాలి. ఆశ్చర్యం! నా కళ్లవెంట ఒక కన్నీటి చుక్క కూడా రాలేదు!

 

(స్వాతి మాస పత్రిక, జూన్ 87 లో ప్రచురితం)


మరణం తర్వాత 5

చచ్చిపోవడం అంటే ఎలాగుంటుంది అన్నది ఒక సమస్య అయితే ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది ఇంకొక సమస్య! ఈ పాంచభౌతిక శరీరంతో బాటే అంతా అయిపోతుందా? లేక కథ యింకా కొనసాగుతుందా? ఇవి జవాబు దొరకని ప్రశ్నలు! మనిషి దేహంలోంచి బయటకు వెళ్లిపోతున్న ఆత్మను ఫొటోలు తీశామన్న వాళ్లున్నారు. కానీ ఈ విషయంగా ఖచ్చితంగా చెప్పగల శాస్త్రజ్ఞులు యింకా కనిపించినట్టు లేదు. మరణం తర్వాత ఏం జరుగుతుందన్న విషయానికి మతం కొంతపాటి జవాబులిచ్చినా వాటిని కేవలం గుడ్డి నమ్మకంతో నమ్మవలసిందే. శాస్త్రాధారాలు లేని విషయాలను నమ్మడం ఈ కాలంలో కుదరదేమో. చనిపోయినవారు ఇంకా తమచుట్టూ తిరుగుతున్నారని అంటున్న వాళ్లూ ఉన్నారు. అయినా స్వయంగా అనుభవించని వాళ్లెవరూ ఈ మాట కూడా నమ్మరు!

 

శరీరం నశించి మళ్లీ పంచభూతాల్లో కలిసిన తర్వాత, ఆత్మ యింకా ఉంది అంటే, ఆ వ్యక్తి చర్యలూ, జ్ఞాపకాలూ, ప్రజలమీద, పరిసరాల మీద అతని ప్రభావం మాత్రం మిగిలి ఉన్నాయని, ఒకరకంగా సంతృప్తి పడవచ్చు. ఇలాగని అన్నవారిని నాస్తికులు అనేసెయ్యవలసిన అవసరం ఏమీ లేదు. మనిషి తర్వాత అతని మంచితనమే మిగులుతుందని అందరూ ఒప్పుకుంటారు. చెడ్డతనం కూడా అంతేగదా!

 

ఈజిప్టులో మనిషి శరీరాన్ని కూడా దాచుకున్నారు. ఆత్మను మాత్రమే నమ్మేవారికి పునర్జన్మ, స్వర్గం, నరకం, భూతాలూ, దెయ్యాలూ, ఇతరరూపాలూ కనిపించాయి. మంచిచెడులు మాత్రమే కాకుండా, తను ప్రపంచంలో వదిలిన జ్ఞాపకాలేవయినా సరే, మనిషి ఉనికికి గుర్తింపులే అన్న వాదం కూడా లేకపోలేదు.

 

ఆఫ్రికా తీరప్రాంతంలోని మడగాస్కర్ దీవుల్లో ఒక జానపదగాథ చెప్పుకుంటారు. మనిషి సంతానమే అతని గుర్తుగా మరణానంతంరం మిగులుతుందని ఈ కథ చెపుతుంది. అసలు మానవ ప్రపంచంలోకి మరణమెలా వచ్చిందో ఈ కథ చెపుతుందని మడగాస్కర్ ప్రజలు భావిస్తారు. కథ ఏమిటంటే ------

 

మనిషి మరణాన్ని కోరుకున్నాడు

 

తొలి మానవుల జంట స్వర్గంలో సుఖంగా తిరుగుతున్నారు. పెరుగుతున్నారు. ఒకరోజు వాళ్లకు హఠాత్తుగా దేవుడెదురయ్యాడు. మీరు మనుషులు కాబట్టి, మరి మీరు కలకాలం బ్రతకడానికి వీలులేదు! మీకెలాంటి మరణం కావాలో కోరుకోండి! చంద్రుడులాగానా? లేక చెట్టులాగానా? ఎలాంటి మరణం కోరుకుంటే అదే మీకు ప్రసాదిస్తాను!” అన్నాడు దేవుడు. మనిషి జంటకు ఇదేమీ అర్థం కాలేదు. బిక్కమొహం వేసుకుని ఆ మాటే చెప్పారు దేవుడికి. ఓహో! అదా మీ సమస్య! చంద్రుడయితే తరిగి తరిగి ఒకనాడు మాయమవుతాడు. కానీ తిరిగి తనే పుడతాడు. పెరుగుతాడు. అలా చక్రనేమిక్రమం నడుస్తూ ఉంటుంది. కానీ చెట్టు సంగతి వేరు. విత్తులనూ, పిలకలనూ విడిచి చెట్టు తాను నశిస్తుంది. తన సంతతి మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. అర్థమయిందనుకుంటాను. ఇప్పుడు మీరు నిర్ణయించుకుని మీ కోరిక తెల్పండి!” అన్నాడు దేవుడు.

 

జంట చాలా కాలం పాటే ఆలోచనలూ చర్చలూ కొనసాగించింది. సంతానం అవసరం లేదనుకుంటే, చావు కూడా ఉండదు. కలకాలం బ్రతక వచ్చు. కానీ ఇలా ఒంటరిగా ఎన్నాళ్లు ఎవరి కోసం తాము కృషి చేయాలి? అనుకుని వారు పిల్లలే కావాలని దేవుణ్ణి అడిగారు. తరువాత ఏం జరుగుతుందో తెలిసి కూడా అలా కోరారు. దేవుడు వారి అభీష్టాన్ని అమలులో పెట్టేశాడు.

 

అప్పటినుంచే భూమి మీద మనిషి జీవితం ఇంత చిన్నదిగా అయిపోయింది!

 

(స్వాతి మాస పత్రిక జులై 1987లో ప్రచురితం)

 

 

 

 

మరిన్ని కథలున్నాయి వరుసలో....