Vijayagopal's Home Page

Maranatarangam 7

Home
Audio - Ag Univ Lecture
Biodata
My Accomplishments
Telugu Science Primer
Books Published
My story
Telugu Articles - 1
Telugu Articles - 2
Telugu Stories and Articles-3
Marana Tarangam - A collection of Stories
Childrens stories
Poetry
English Collection
Translated Telugu Stories
Kahlil Gibran
Points to ponder Archives
Book Reviews
Science
TV Progs., Scripts

A turkish story which will stun you sure!!

మరణ తరంగం 7

మనిషి జీవితంలో జరుపుకునే ప్రతి ముఖ్య సంఘటనకూ కొన్ని పద్ధతులు ఏర్పాటు చేసుకున్నారు. ఇవే ఆచారాలు. ఇద్దరు మనుషులు అంటే ఒక ఆడా, ఒక మగా కలిసి జీవించి సంసారం గడుపుకునేందుకు ప్రారంభం పెళ్లి అన్నారు. ప్రపంచమంతటా ఈ పెళ్లికి రకరకాల పద్ధతులు.

పెళ్లికెన్ని పద్ధతులున్నాయో అంత్యక్రియలకు అంతకన్నా ఎక్కువ పద్ధతులున్నాయి. పద్ధతులులో ఎన్ని భేదాలున్నా, అంత్యక్రియలకు ఉద్దేశ్యం మాత్రం గతించిన వ్యక్తి పట్ల తమకున్న గౌరవాన్ని వెలిబుచ్చడమే. ఒక మనిషి పోయినా మిగతా వాళ్లంతా అతనితో పోలేరు, సర్దుకోవలసిందేనని జ్ఞాపకం చేస్తున్నట్లుంటాయి ఈ పద్ధతులు. రోగి మరణిస్తున్నప్పుడు కూడా, ఏమీ ఫరవా లేదు. ఇలాంటి కేసులు లెక్కలేనన్ని చూచాను అనే డాక్టరులాంటివి ఈ పద్ధతులు.

 చాలా సందర్భాల్లో ఈ ఆచారాలూ, తతంగాలూ, అర్థరహితంగానూ, బాధను మరింత పెంచేవిగానూ కనిపిస్తాయి. సనాతన హిందూ పద్ధతులలో ఈ పరిస్థితి మరింత కొట్టవచ్చినట్లు కనబడుతుంది. చాలా ఆచారాలకు అసలు అర్థమే ఉండదు. రానురాను మార్పుల వల్ల ఇలా రూపం దాల్చినయో, లేక మొదటినుంచి  ఈ అలవాట్లు ఇలాగే ఉండేవో నిజంగా గమనించవలసిన విషయం.

బంధు మిత్రులకు తమతమ దుఃఖాన్ని వ్యక్తం చేసే అవకాశం అంత్యక్రియల్లో సులభంగా దొరుకుతుంది. తరువాత వెళ్లి జ్ఞాపకాల పుట్టను కదిలించడం యిష్టంలేకనే ఆ రోజుల్లోనే పలకరించాలంటారు. ఈ పలకరింపులకు కూడా రకరకాల ఆచారాలు.

సంఘంలో మరణం పట్ల అవగాహన, అంత్యక్రియల పద్ధతుల్లో బాగా వ్యక్తమవుతుంది. మనవాళ్ల ఆత్మశ్రాద్ధం, ఇజిప్షియనుల మమ్మిఫికేషన్ ఇందుకు ఉదాహరణలు.

దుఃఖంలోనూ, అంత్యక్రియల బరువులోనూ మునిగి ఉన్నవారి అవసరాలను బంధువులూ, మిత్రులూ గమనించి ఆదుకోవడం పరిపాటి. సంతాపంలో ఉన్న కుటుంబానికి తిండి సరఫరా చేయడం టర్కీలోనూ ఇతర పరిసర దేశాల్లోనూ ఆచారం. ఇలాంటి ఆచారం కొన్ని పాశ్చాత్యదేశాల్లోనూ ఉంది. ప్రఖ్యాత టర్కిష్ కవి, నాటకకర్తా, కథారచయితా సెవెదత్ కుద్రత్ రాసిన కథకు, ఈ ఆచారమే ఆధరం. కథ ఏమిటో చూద్దాం.....

 

మత్యుభోజనాలు

జనవరి వచ్చింది. వాతావరణమే మారిపోయింది. ఎవరూ అనవసరంగా బయట తిరగడం లేదు. మసీదు ముందూ, చెట్ల కిందా, బజారులో, అంతటా ఖాళీయే. నీళ్ల కొళాయి దగ్గర మాత్రం అప్పుడో యిప్పుడో మనుషులు కనిపిస్తూనే ఉన్నారు. నీళ్లకోసం వెళ్లిన ఒక కుర్రవాడు పరుగెత్తుతూ వచ్చాడు.

దర్శన్ ఆగా చచ్చిపోయాడు!” అదీ వార్త

 

ఆ వీధిలో దర్శన్ ఆగాను తెలియనివారు లేరు. అతనికి యాభయి ఏళ్లు. గట్టి మనిషి. నల్లని గడ్డం. అతను నీళ్లు మోసేవాడు. దాంతో వచ్చింది, పెళ్లామూ, యిద్దరు పిల్లలను పోషించడానికి సరిపోయేది కాదు. అతని వ్యాపారానికి పెట్టుబడి అంతా ఒక కావడి మాత్రమే. ఆ కావడి భుజాన వేసుకుని పొద్దున్నే బయలుదేరేవాడు ఆగా. అతని కేక వీధంతా వినిపించేది. అవసరమున్న వాళ్లు పిలిచి, మాకు రెండు కావళ్లు, మాకు మూడు, అలా ఆర్డర్ చేసేవారు. ఒక కావడి అంటే రెండు కుండల నీళ్లు. రోజంతా ఆగా నీళ్ల కొళాయి గట్టుకు, వీధిలోకి తిరుగుతూనే ఉండేవాడు. ఒక కావడికి మూడణాలు. ఈ లెక్కన తన యింటికి కావలసిన తిండి సంపాదించడం, సూదితో బావి తవ్వుతున్నట్లుండేది అతనికి. అసలు భారమంతా అతని మీదే ఉంటే ఇల్లు నడిచేదే కాదు. అతని పెళ్లాం గుల్నాజ్ కూడా పనిలోకి వెళ్లేది. తను పెద్దపెద్ద వాళ్లింట్లో గుడ్డలుతికేది. ఆ పేరున అక్కడ కాసిని నీళ్లు ఎక్కువ ఖర్చుచేసేది. భర్తకు పని దొరుకుతుందన్న ఆశతో.

 

ఇప్పుడంతా అయిపోయింది. దర్శన్ ఆగా చావుకు కారణం కూడా తెలిసిపోయింది. బరువు కావడి భుజాన ఎత్తుకుని గడ్డకట్టిన మంచుమీద కాలు జారి పడ్డాడు. తల నూతి గోడకు కొట్టుకుంది. అయినా అతనలా పోతాడని ఎవరనుకున్నారు? రాయికన్నా గట్టిగా కనిపించేవాడు. గట్టివాళ్లు కూడా అలా హఠాత్తుగా చచ్చిపోతారు గావును!

 

వార్త విన్న గుల్నాజ్ నిశ్చేష్ట అయింది. తను నీళ్లెక్కువగా చల్లి అందరినీ మోసం చేసింది. అందుకు శిక్షేమో ఇది! అందరూ చూచి చెపుతున్నారు గదా ప్రమాదం జరిగిందని! ప్రమాదం ఎవరికయినా జరగవచ్చు. అందరూ చస్తే ఇలాగే చస్తారా తనవాళ్లకు ఒక్క కావడి తప్ప ఇంకేమీ మిగల్చకుండా?

 

గుల్నాజ్ గతేమిటిప్పుడు? అప్పుడో ఇప్పుడో గుడ్డలుతికితే వచ్చే డబ్బులతో యిద్దరు పిల్లలను పోషించగలుగుతుందా? తను చల్లిన నీళ్లన్నీ తనని వెక్కిరిస్తున్నట్లనిపించింది గుల్నాజ్ కు. ఎంత మార్పు? ఇప్పుడా నీళ్లు ఎన్ని ఉంటేనేం? నీళ్ల మొహం చూడకూడదనుకుంది తను!

 

మరణం సంభవించిన ఇంట్లో వంట గురించి ఆలోచించరు. అలా మూడు రోజులో, నాలుగు రోజులో గడుస్తుంది. మళ్లీ కడుపులో గోకితే పరిస్థితి మామూలవుతుంది. అయితే ముస్లిం సంప్రదాయం ప్రకారం చుట్టు పక్కల వాళ్లు ఆ యింటికి తిండి పంపుతారు. రెండు మూడు రోజులు మాత్రమే. గుల్నాజ్ వాళ్లకు తొలినాటి భోజనం మూల బంగళా నుండి వచ్చింది. ఆ ఇంటాయన రయీస్ పెద్ద వ్యాపారస్థుడు. మైలు దూరం నుంచి చూచినా తెలుస్తుంది అది కలవాళ్ల బంగళా అని. ఆగా పోయినరోజు మధ్యాహ్నం బంగళా పనిమనిషి పెద్ద పళ్లెంలో తినుబండారాలు పట్టుకు వచ్చింది. మాంసం, సేమ్యా, జున్నూ, మిఠాయిలూ అన్నిటితోనూ నిండైన భోజనం.

 

నిజానికి రోజు తిండి గురించి ఆలోచించినవాళ్లే లేరు. కానీ ఇవన్నీ చూచిన తర్వాత అంతా బాగా తిన్నారు. మిగిలింది రాత్రికి కూడా సరిపోయింది. తరువాతి రెండు మూడు రోజులు కూడా అలాగే గడిచాయి. పెద్ద బంగళా నుంచి వచ్చిన భోజనంతో సరితూగకున్నావాళ్ల మామూలు తిండికన్నా బాగానే ఉంది ప్రతిపూటా. ఇలా గడిస్తే జీవితాంతం దుఃఖం భరించవచ్చు. కష్టంలేదు. కానీ యిరుగుపొరుగులు ఎంతకాలం పెడతారు ఇంట్లో బొగ్గులు నిండుకున్నాయని తెలిసిననాడు వాళ్లకు అసలు దుఃఖం తెలిసింది.

 

ఇంకా ఎవరన్నా పెడతారేమోనన్న ఆశమాత్రం చావలేదు. చివరికో రోజున అన్నీ నిండుకున్నాయి. కడుపులో మోకాళ్లు ముడుచుకు పడుకోవలసి వచ్చింది.

 

అమ్మా కడుపులో నొప్పి!” చిన్నవాడు ఏడుపు మొదలుపెట్టాడు. కాస్త ఓపిక పట్టు బాబూ! ఏదో జరగకపోతుందా?” అంది గుల్నాజ్. కడుపులు లోనికి పోయి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి వాళ్లకు. లేచి తిరిగే ఓపిక కూడా లేదు. మాటకూడా పెగలడం లేదు.

 

మర్నాడు గుల్నాజ్ కు కలవచ్చింది. ఎవరో తనను గుడ్డలుతకడానికి పిలిచినట్టు. మళ్లీ జన్మలో నీళ్ల ముఖం చూడననుకున్న గుల్నాజ్ నిజంగానే ఎవరయినా పిలుస్తారేమోనని ఎదురు చూచింది. కానీ అటు పరిస్థితి ఇంకో రకంగా ఉంది. పుట్టెడు దుఃఖంలో మునిగి ఉంది, ఇప్పుడు తను గుడ్డలేం ఉతకగలదు, అయినా తననిప్పుడు పిలవడం అమానుషం అనుకుంటున్నారు ఇళ్లలో వాళ్లు.

 

ఆరోజు ఇంట్లో ఎవరూ లేవనే లేదు. గుల్నాజ్ చిన్నకొడుకు, రొట్టె! రొట్టె! ఎగిరిపోతోంది! పట్టుకోండి! అయ్యో! వేడివేడి రొట్టె!” అంటూ కలవరిస్తున్నాడు. పెద్దవాడికి రొట్టె కాదు. మిఠాయిలు కనిపించాయి. గుల్నాజ్ లోపల లోపలే కుమిలి పోతోంది పిల్లల పరిస్థతికి. బయట ప్రపంచమంతా మామూలుగా నడుస్తోనే ఉంది. అంతా వినిపిస్తూనే ఉంది. అదుగో రొట్టెల బండి చప్పుడు కూడా వినిపిస్తూనే ఉంది. గుల్నాజ్ ఎలాగో ఓపిక చేసుకుని లేచింది. తలుపు దాకా వెళ్లింది. రెండు రొట్టెలు అరువు అడిగి తీసుకుందామనుకుంది. బండి దగ్గరకు వచ్చింది. నిండా రొట్టెలు, తెల్లగా మెరిసిపోతూ. బండి ఇంటి ముందంకు వచ్చింది. గుల్నాజ్ కు మాత్రం గొంతు పెగల్లేదు. ధైర్యం కలగలేదు. తిండి! భగవంతుడిచ్చిన తిండి! ఇంటి ముందునుంచే పోతోంది. తను మాత్రం చేయిజాచి అందుకోలేక పోయింది!

 

తలుపు ధడాల్న వేసి గుల్నాజ్ లోపలికి వచ్చింది. పిల్లలు ఆశగా చూస్తున్నారు. వాళ్లకు తన మొహం చూపించలేక పోయిందా తల్లి. ఆ ఖాళీ చేతులను చూడలేక పిల్లలు కళ్లు మూసుకున్నారు. కాసేపటికి చిన్న కొడుకు కదిలాడు. అమ్మా! నాకేదో అవుతున్నది!” కడుపులో ఏదో కదులుతున్నది!”బాధగా అన్నాడు. అయ్యో నా తండ్రీ! అది ఆకలిరా! పేగులు కదులుతున్నాయేమో?”

 

అమ్మా! నేను చచ్చిపోతున్నాను!” వాడి ఏడుపు.

 

పెద్దవాడు కళ్లు తెరిచి చూచాడు. వాడు కొంచెం నయంగా కనిపిస్తున్నాడు. గుల్నాజ్ పెద్దవాడిని పక్క గదిలోకి తీసుకు పోయింది. బాబూ! బోడో అంగడికి వెళ్లి ఏదన్నా కాస్త సామాను అరువు పట్టుకురా! డబ్బులు నాలుగు రోజుల్లో ఇస్తామని చెప్పు అంది. కుర్రవాడు అంగడికి వెళ్లనయితే వెళ్లాడు. కానీ ఉట్టిచేతులతో తిరిగి వచ్చాడు. కారణం ఎవరికి తెలియదు గనుక? చలికి వణుకుతూ వాడు ఇల్లు చేరుకున్నాడు. ఖాళీ చేతులను చూచిన తల్లి ఏమీ అడగలేక పోయింది.

 

పెద్దవాడు చడీచప్పుడు లేకుండా పడుకున్నాడు. కాసేపటికి గడగడా వణకడం మొదలు పెట్టాడు. వాడికి జ్వరం పట్టుకుంది. కొంచెం సేపటికి జ్వరం పేలిపోవడం మొదలయ్యింది. ఏంచేయాలో తోచక అటూ యిటూ తిరిగింది గుల్నాజ్. కుర్రవాడి జ్వరం రానురాను పెరిగి పోతున్నది, చిన్నవాడికి ఆకలి. కునుకు రావడంలేదు. వాడు అన్నకేసే చూస్తున్నాడు. వణికిపోతున్న తన అన్నకేసి ఇంతలేసి కళ్లతో చూస్తున్నాడు. కాసపటికి వాడు లేచి కూచుని, నెమ్మదిగా తల్లిని అడిగాడు. అమ్మా అన్న చచ్చిపోతాడా?”

 

గుల్నాజ్ వణికి పోయింది. కొడుకు కళ్లలోకే చూస్తూ ఎందుకురా? అలా అడుగుతున్నావ్?’ అంది.

 

వాడు కాసేపు మారు మాట్లాడలేదు. తరువాత తల్లికి చేరువగా జరిగాడు. అన్నకు వినిపించగూడదు అన్నట్లుగా తల్లి చెవిలో గుసగుసలాడాడు. అన్న చచ్చిపోతే మూల బంగళావాళ్లు భోజనం పంపిస్తారు గదూ!......

 

టర్కిష్ కథ

స్వాతి మాసపత్రిక సెప్టెంబర్ 87 లో ప్రచురితం

Three more stories are there in the collection.