Vijayagopal's Home Page

Paluku Rallu

Home
Audio - Ag Univ Lecture
Biodata
My Accomplishments
Telugu Science Primer
Books Published
My story
Telugu Articles - 1
Telugu Articles - 2
Telugu Stories and Articles-3
Marana Tarangam - A collection of Stories
Childrens stories
Poetry
English Collection
Translated Telugu Stories
Kahlil Gibran
Points to ponder Archives
Book Reviews
Science
TV Progs., Scripts

This is an rticle I wrote long back about the changes coming up in the language Telugu. The condition has not changed even now.

భాషలో పలుకురాళ్లు

 

హోటళ్లవారు తమ సైను బోర్డులన్నీ సాధారణంగా ఇంగ్లీషులోనే ప్రదర్శిస్తుంటారు. అక్కడో ఇక్కడో ఒక బోర్డు తెలుగులో కనిపించినా పేరు మాత్రమే ఉంటుంది. వివరాలు ఉండవు. ఆ వివరాలు కూడా తెలుగులో అందించదలుచుకున్న వారు మాత్రం తప్పకుండా తమ అతిథులకు శాఖాహారం పంచి పెడుతుంటారు. ప్రయత్నించి ఆ హోటల్లో తిని చూస్తే అక్కడ కొమ్మలేవీ వడ్డించరు. నిజానికి అక్కడ దొరికేవి అసలు సిసలైన కూరగాయలు మాత్రమే. నాలుగు జిల్లాల మీదుగాపయనించి చూచాను. అన్ని చోట్లా శాఖాహారమే అంటున్నారు. చివరకు ఆదిలాబాదులో ఒక మూలన ఉండే చిన్న భోజనాలయం మీద మాత్రం హిందీలో శాకాహారం పెడతామంటూ ఊరట కలిగించారు. కరీంనగర్ లో పల్లెవారు సైతం అక్కా! ఏం శాకం వండినవు?” అని అడగడం విన్నాను.

సైనుబోర్డులు రాసే వారికి భాష బాగా రానవసరం లేదు. రంగులు పులమడం వస్తే చాలు. అలాగని వారొక్కరే మనకు కొమ్మలు తినబెడుతున్నారనుకుంటే తప్పే. ఇటీవల ఒకానొక తెలుగు దినపత్రికవారి సోమవారం సాహిత్యానుబంధంలో ఉద్రేకంతో వ్యాసం వ్రాసిన ఒక సాహిత్యవేత్తగారు పాఠకులకు శాఖాహారం పంచిపెట్టారు. ఇంతకూ మనం తినేది శాకములనీ కొమ్మలు అనగా శాఖలు కావనీ పెద్దలు అంగీకరిస్తారనుకుంటాను.

భాషలో మార్పులు రావడం, మాటలకు కొత్త అర్థాలు ఏర్పడడం సహజమే. అయితే ఉన్న మాటలనే తప్పుగా ప్రయోగించడం తెలుగువారికీ మధ్యన అలవాటుగా మారింది. ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు. ఈ పొరపాట్లు పాటకజనం నోట పలికితే సానుభూతితో అర్థం చేసుకోవచ్చు. అంతేగానీ, భషాసౌందర్యాన్ని నిలబెట్టవలసిన పత్రికలు, రేడియో, టీవీలు ఇటువంటి తప్పులను తామరతంపరగా ప్రయోగించడం మాత్రం పెద్దలు గమనించవలసిన విషయం.

వర్షాల తరువాత అతిసార వ్యాధి ప్రబలడం మామూలే. అతిసారం అనే ఈ వ్యాధి అమాయకులను పొట్టన బెట్టుకుంటుంది. అతిగా సారం పోవడం వలన కలిగేది అతిసార వ్యాధి. పత్రికల వారు మాత్రం అతిసారకు అయిదుగురు బలి, అతిసారను అరికట్టవలెను మొదలయిన పతాక శీర్షికలను పెట్టి ఈ వ్యాధి పేరులోని సున్నాను మింగేస్తున్నారు. నిజానికి ఈ వ్యాధి నీటి కాలుష్యం వలన వస్తుంది. పత్రికల వారు తయారు చేసిన అతిసారను చూచి, అతిగా సారా తాగుట వలన వస్తుందని సాక్షాత్తు ఒక మంత్రిగారు అనుకుని, ఆ సంగతిని ఒక సభలో చెప్పారట కూడా. రాస్తే అతిసారానికి అని రాయాలిగానీ అతిసార అంటే తప్పుగాదూ?

ప్రసార మాధ్యమాల వారికెవరికీ అంతు చిక్కని రెండు మాటలు నిరసన, ఖండన అనేవి. మంత్రిగారు హింసను ఖండించారు అని నిరాఘాటంగా రాస్తున్నారు, చెపుతున్నారు. ఒక వాదాన్ని కాదని మరో వాదం చేస్తే అది ఖండనఅవుతుంది. తర్కంలో ఖండన, పూర్వపక్షం అని ప్రక్రియలుంటాయి. అదే ఒక విషయం పట్ల తమ అసమ్మతిని, అసంతృప్తిని వ్యక్తం చేసి ఊరుకుంటే దాన్ని నిరసన అంటారు. ఖండన, నిరసనలకు ఇంగ్లీషులో వరుసగా కాంట్రడిక్షన్, కండెమింగ్ అనే మాటలు సమానార్థకాలు. వీటిని కలగలిపి అటు ఇటుగా వాడుతుంటే గజిబిజి పుడుతుంది. ఈ పద్ధతిని నిరసించాలి. హింసను నిరసించగలం. హింసావాదాన్ని ఖండించి శాంతివాదాన్ని ప్రతిపాదించగలం.

వాదం గురించి మరో విచిత్రం. బిజెపి వారి రామరాజ్యవాదాన్ని ఉటంకిస్తూ ఒకప్పుడు ఒక తెలుగు వారపత్రికవారు రామరాష్ట్రవాదన అనే మాటను వాడుకున్నారు. వాదానికి, వాదనకు భేదం ఉంది.  లాయరు గొప్పగా వాదించగలడు, వాదనలో అతడు దిట్ట అంటారు. అలాగే తెలుగులో వాదు అనే మాట కూడా ఒకటి ఉంది. మన దూరదర్శన్ లో మాత్రం మనం అప్పుడప్పుడు వీణావాదన, వయొలిన్ వాదన వింటూ ఉంటాము. హిదీలోని వాదన్ అనే మాటకు తలకట్టు కడితే ఏర్పడిన మాట అది. నిజానికి వీణావాద్యం అనాలేమో. వాద్యం, వాదన ఒకటేనా? కనీసం వాదనం అనాలేమో?

ఇలాంటి మాటలు ఇంకా ఎన్నెన్నో. ఇటీవల రాజధానిలో జరిగిన ప్రధాని గారి బలప్రదర్శన కార్యక్రమం గురించి సంపాదకీయం వ్రాస్తూ ఒక దినపత్రిక సంపాదకులు, త్రివిక్ర పరాక్రమం అని వర్ణించారు. మనకు అవక్ర పరాక్రమం తెలుసును. అలాగే త్రివిక్రముడు కూడా తెలుసును. వామనుడు త్రివిక్రముడయిన సంగతి పురాణాలు చెపుతున్నయి. చిన్నవాడు పెద్దవాడయి, గొప్పదనం చూపించడం ఆ ఘట్టంలోని అంశం. ప్రధాని గురించి అలాంటి వర్ణన చేయదలుచుకుంటే త్రివిక్రమ పరాక్రమం అని ఉండాలి. ఇంతకూ, అక్కడ పరాక్రమం లేనేలేదు. త్రివిక్రమ రూపం మాత్రమే ఉంది. రెంటినీ కలగలిపి సంపాదకుడు గారు, ఒక త్రివిక్ర పరాక్రమం తయారు చేశారు. భాగవతంలో వామనావతార ఘట్టంలో పోతన ఇంతింతై వటుడింతయై అంటూ వర్ణిస్తారు. ఈ పద్యాన్ని ఉదహరించాలని ఒక పత్రికలో వటుడింతై ఇంతై అంతై అంటూ వ్రాసుకున్నారు.

ృద్ధశబ్దం వృద్ధిచెంది, వార్ధక్యం అవుతుంది. అది టెలివిజన్ స్వరూపంలో వ్యర్షకం కూడా అయింది. వృద్ధాప్యం అనే మరో మాట కూడా ఉంది. ఈమాట మెదడులో మెదులుతుండగానేమో, సార్థక్యం అనే మాట మరో దినపత్రికలో కనిపించింది. సార్థకం, సార్థకత ఉన్నాయేమో,కాని సారథక్యం కూడా ఉందా?

భాషలో సౌలభ్యం కోసం దుష్ట సమాసాలు, సులభంగా పలకడం కోసంపదాలలో మార్పులు ఉద్దేశ్యపూర్వకంగా చేస్తే అంగీకరించ వచ్చునేమో. వ్యవసాయశాఖవారు తరుచు విత్తనశుద్ధి చేస్తుంటారు. అతిపెద్ద, అతిచిన్న అనేవి కూడా దుష్టసమాసాలే. ప్రాముఖ్యానికి బదులు ప్రాముఖ్యత చోటుచేసుకుంటుంది. ఇవన్నీ తప్పులని కేవలం ఛాందసులు మాత్రమే అనుకుంటారు గావును.

సరైన అవగాహన లేక కేవలం అందమైన మాటలు రాసుకోవాలనే కోరికతో చేసే కొన్ని ప్రయోగాలు మాత్రం, అసలే అంతంతగా సాగుతున్న భాషను మరో మెట్టు కిందకు దించుతున్నాయి. చేయడం జరిగింది అనవచ్చునా? బడుధాతువును వాడవచ్చునా? అంటూ వారాలపాటు చర్చించే భాషాపండితులు ముందుగా ఇటువంటి స్ఖాలిత్యాలను పట్టించుకుని, పదుగురి ముందూ పెట్టవలసిన అవసరం ఉంది.

భాషాపరిణామం అంటే ఏమిటి అనివారు సూచించడం ఎంతో అవసరం. లేకుంటే పాఠాలు చదువుకుంటున్న యువతకు తప్పుడు పాఠాలే గతి అవుతాయి.

గోపాలం. కె.బి.

11-9-1994

This topic deserves a lot of discussion.