Vijayagopal's Home Page

Peruto ennenni pecheelo?

Home
Audio - Ag Univ Lecture
Biodata
My Accomplishments
Telugu Science Primer
Books Published
My story
Telugu Articles - 1
Telugu Articles - 2
Telugu Stories and Articles-3
Marana Tarangam - A collection of Stories
Childrens stories
Poetry
English Collection
Translated Telugu Stories
Kahlil Gibran
Points to ponder Archives
Book Reviews
Science
TV Progs., Scripts

On naming people and problems therein!

పేరుతో ఎన్నెన్ని పేచీలో?

పేరులోననేమి పెన్నిధియున్నది? అని ఆయనెవరో అన్నట్లున్నారు. గులాబీని ఏ పేరుతో పిలిచినా వాసన మారదు అని ఇంగిలీషులో మరెవరో అన్నారు. ఇంతకూ మీ పేరును ఎవరయినా వక్రీకరించి పిలిస్తే ఎలా ఉంటుంది ఆలోచించండి.

 

పేర్లను గురించి చర్చించే శాస్త్రాన్ని ఓనోమాస్టిక్స్ అనీ లేదా ఓనోమాటాలజీ అనీ అంటారు. ఓనమాలు రాని వారికి కూడా పేరుంటుంది. ఓనమాలు వచ్చినవారికి కూడా తమ పేర్లకు అర్థం తెలిసి ఉండదు, కొందరికి. మనకందరికీ పేర్లున్నాయి. ఈ పేర్లు ఎక్కడినుంచి వచ్చాయో ఎప్పుడయినా ఆలోచించారా?

 

మన దేశంలో ముఖ్యంగా దేవతలు, రుషులు, మునులు, ప్రాచీన వ్యక్తుల పేర్లు పెట్టుకోవడం అలవాటు. ఆ తర్వాత నక్షత్రాల పేర్లు. నక్షత్రాల పేర్ల మీదుగానే నెలల పేర్లు కూడా వస్తాయి. శ్రవణం నుంచి శ్రావణం, శ్రావణ్ కుమార్ ఉండవచ్చు. శ్రవణకుమారుడూ ఉండవచ్చు. ఇంగిలీషులోనూ జూన్, జులై అని పేర్లు పెట్టుకుంటారట. నిజానికి అక్కడకూడా వేరే పేర్ల ఆధారంగానే నెలల పేర్లు వచ్చాయి. ఆగస్టస్ పేరు నుంచి ఆగస్టు నెలకు పేరు.

 

ఇక మన దేశంలోనేమి, మరోచోటనయితేనేమి, స్థలాల పేర్లు పెట్టుకోవడం అలవాటు ఉంది. సింహాద్రి, శ్రీశైలము, యాదగిరి మొదలయినవి ఇలాంటి పేర్లే. మహబూబ్ నగరం జిల్లాలో నది మధ్యన (బీచ్ మే) బీచుపల్లి అనేచోట హనుమంతుడి గుడి ఉంది. ఆ ఊరి పేరున బీచుపల్లిరావులుండడం చాలా మందికి తెలియకపోవచ్చు. మనుషులకు స్థలాల పేర్లు, స్థలాలకు మనుషుల పేర్లు, అటుయిటుగా ఉండడం ఇంగ్లీషులోనూ ఉంది. జార్జి పేరున జార్జియా. జార్జియా పేరున జార్జి.

 

నవరత్నాల పేర్లు పెట్టుకోవడం కూడా ప్రపంచమంతటా ఉంది. పడమట రూబీకి ప్రచారం ఎక్కువ. మనదగ్గర మరకతం, నీలం, ముత్యం లాంటి పేర్లకు గిరాకీ ఎక్కువ. ఎందుకోగానీ ఎవరూ పగడం అని పేరు పెట్టుకుననట్టు కనపడదు. పేర్ల విషయానికొస్తే రత్నానికి ఉన్న ప్రచారం వజ్రానికి లేదు. పూల పేర్లు పెట్టుకోవడం కూడా ప్రపంచమంతటాఉంది.

 

మదేశంలోని పేర్లను గమనిస్తే సముద్రం, సాగరం వంటివి, ఆనంద, వివేకం వంటివికొన్ని మంచి అర్థాలు వచ్చే మాటలు పేర్లుగా మారాయని గమనించవచ్చు. పైగా పేర్లను మంచి అర్థాలు తోచే విధంగా ఏర్పాటు చేసుకోవడం మనవారికే చెల్లింది. హర్షవర్ధనుడు, ఆనందవర్ధనుడు, విద్యాసాగరుడు, శాంతిప్రియ, క్రాంతి మొదలయిన పేర్లు ఎంతో అందంగా ఉంటాయి.

 

మనిషికి పేరు పడితే అది పిలుచుకోవడానికి అనుకూలంగా, అందంగా ఉండాలి. విరిచి పిలిచినా అందం చెడగూడదు. తిరుపతి వేంకటేశ్వరుడు వేంకటుడయ్యాడు. వెంకన్న అయ్యాడు. అయినా బాగానే ఉంది.

 

కవిచేత పుట్టి, రవిచేత హెచ్చి మరెవరి చేతనో చచ్చెనని పాటగురించి చెపుతుంటారు. అలాగే తమ భాష గురించి, మాటల అర్థాల గురించి తెలియనివారు పేర్లను నానాహింసలకు గురిచేస్తున్నారు. మహికి ఇంద్రుడు మహేంద్రుడు కావాలి. హలంతభాషలో మహేంద్ర్, అజంతభాషలో మహేంద్ర. ఇవి రెండూ బాగానే ఉన్నాయిగానీ పంజాబీవారి పుణ్యమా అని మహేందర్ అనే కొత్తపేరు పుట్టింది.

ఇంద్రుడిని జయించినవాడు జితేంద్రుడు. అతడు హీరో కావడానికి అవకాశం తక్కువ. అయినా అయ్యాడు. ఈ పేరులో ఔచిత్యం లేదు. ఇంద్రియాలను జయించినవాడు జితేంద్రియుడు. కానీ ఇటువంటిపేరు ఎవరూ పెట్టుకున్న దాఖలా కనిపించదు. మొత్తానికి తెలుగులో జితేందర్, సురేందర్ లాంటి పంజాబీ పేర్లు బాగా పాతుకుపోయినయి.

 

ఈ కాలంలో పేర్లు పొట్టిగా కొత్తగా ఉండాలని కోరికలు ఎక్కువయ్యాయి. వర్ష, మేఘ, రశ్మి, రవి వంటి పేర్లు గుర్తుంచుకోవడానికి సులభంగా ఉంటాయి. ఇంట్లో నలుగురు పిల్లుంటే వారందరికీ ప్రాసకుదిరే పేర్లు పెట్టాలనుకోవడం మరో పద్ధతి, శోభ, ప్రభ వరకు బాగుంది. విభ అంటే ఏమిటో పెద్దలు చెప్పాలి. ఆ తర్వాతి అమ్మాయికి జాభ అనీ రేభ అని పేరు పెడితే పండితులు, పెద్దలు కూడా ముక్కున వేలు వేసుకోవలసిందే. కొత్తపేర్లను తయారు చేయడం పడమటి ప్రపంచంలోనూ ఉంది. ర్యాండీ అనే మాటకు అర్థం లేదు. ఆపిల్ తోట పక్కనుండే ఇంటి వారికి ఆపిల్ బై అని పేరు పెట్టుకున్నారట. అలాగే ఈస్ట్ వుడ్, హిల్, చర్చ్ వంటి పేర్లు వచ్చాయి.

 

మన భాషల్లో కొన్ని రకాల పేర్లు పెట్టుకుంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. అడివమ్మ, అడివయ్య అనే పేర్లున్నాయి. అవి బాగానే ఉన్నాయి. పెంటయ్య కూడా ఉంది. కానీ బండయ్య, కట్టెయ్య ఉన్నట్లు లేదు. వివేక్ అంటే ఫరవా లేదు. కొత్తదనం కోసం అవివేక్ అనీ, విరోధ్ అనీ నిరోధ్ అనీ పేరు పెట్టుకుంటే పిల్లలుగా ఉండగానే వాళ్లు కష్టపడతారు. ఇతర భాషల ప్రభావంతో తెలుగు పేర్లుకూడా పొల్లుతో ముగియడం, తెలియనంతగా అలవాటయింది. అందులో అపాయం లేదు. పరిణామంలో వచ్చే మార్పులవల్ల ఎవరికయినా సదుపాయం ఉంటుందంటే బాగానే ఉంటుంది. కానీ తెలియక తప్పులుచేసి, పిచ్చి అర్థాలు వచ్చేవి, అర్థంలేనివి, మొదలయిన మాటలు వెదికి పిల్లకు పేర్లుగా పెడితే ఎంత చిరాకు. రశ్మి అంటే అర్థం ఉంది. పష్మి అంటే కొత తప్పు. రష్మిత అంటే తప్పున్నర. ఇక జష్మిత అంటే ఏమిటో?

 

శతృఘ్నుడంటే శతృవులను నాశనం చేసేవాడని అర్థం. ఆ మనిషిని ప్రేమగా శత్రూ అని పిలిస్తే, అంతలోనే శతృవయిపోయాడా. అందుకే పేరు పెట్టదలుచుకుంటే, ముందు, ఆ మాట గురించి కొంత చర్చ, అర్థం తెలుసుకోవడం లాంటివి చేయాలేమో. ఇంతకూ గమనించారా నాపేరుకు వ్యాకరణ పరంగా అర్థంలేదని!!

 

గోపాలం కె.బి.

1 మే 2001

 

 

More such articles in the pipeline!